జీవించే హక్కుకు ప్రాధాన్యత ఇవ్వండి

స్వాతంత్య్ర భారతదేశంలో ఏ ఇతర సమస్యల కన్నా కూడా భయంకరమైన హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు, పెద్ద సంఖ్యలో కోల్పోయిన ఉద్యోగాలు, ఒక్కసారిగా క్షీణించిన ప్రజల ఆదాయాలు, బాగా పెరిగిన ఆకలి దప్పులు, ఘోరమైన పౌష్టికాహార విధానం లాంటి అనేక సంక్షోభాలతో మెజారిటీగా ఉన్న కష్టజీవులు నేడు భయంతో వణికి పోతున్నారు.
వైఫల్యాలు
మే 13వ తేదీన సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు (పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌) వలస కార్మికులకు గుర్తింపు కార్డుల గురించి ఒత్తిడి చేయకుండా ఉచిత రేషన్‌ సమకూర్చాలని, రోజుకు రెండు పూటలా ఉచిత ఆహారాన్ని అందించడానికి వంటశాలలు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. గత సంవత్సరం మార్చిలో విధించిన జాతీయ లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఈ తీర్పుకు ప్రాధాన్యత ఏర్పడిరది. దేశంలో ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు గుర్తించింది. కానీ ఆ తీర్పు మూడు కారణాల వల్ల ఒక మార్గాన్ని చూపడంలో విఫలమైంది : అది(తీర్పు) ఆ సౌకర్యాన్ని దేశంలో మొత్తంగా విస్తరించలేదు. ప్రభుత్వం అందించే ఉచిత ఆహారం, రేషన్‌తో పాటుగా నగదు బదిలీ కూడా చేసేందుకు ఆ సౌకర్యాన్ని విస్తరించలేదు. ఆ సౌకర్యాన్ని ఒక హక్కుగా పొందడం కన్నా, ఔదార్యంతో ఇస్తే పొందే సహాయంగా మార్చింది. ఆ తీర్పుకు సార్వత్రికంగా జీవించే హక్కును ప్రాతిపదికగా తీసుకొనివుండి వుంటే, ఆ మూడు లోపాలను అధిగమించి ఉండెడిది. కేంద్ర ప్రభుత్వం తన వ్యాక్సిన్‌ పాలసీ ద్వారా జీవించే హక్కును నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నది. ప్రతీ వ్యక్తి తన జీవించే హక్కును రక్షించుకోవడానికి కోవిడ్‌-19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోవడం అవసరం. ప్రతీ ఒక్కరి జీవించే హక్కును ప్రభుత్వం గౌరవించాలి కాబట్టి, వ్యాక్సిన్‌ వేయించుకునే వారి ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వమే అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలి. అది కూడా వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తేనే సాధ్యమవుతుంది. ప్రయివేటు వైద్య విధానం బాగా అమలవుతున్న అమెరికా లాంటి అనేక దేశాల్లో కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్‌లు ఉచితంగానే వేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం 18-45ఏండ్ల మధ్య వయసుల వారు ప్రయివేటు ఆసుపత్రులలో డబ్బు చెల్లించి వ్యాక్సిన్‌ వేయించుకునే ఏర్పాట్లు చేస్తుంది. ఇది కరోనా మహమ్మారిని నిరోధించాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న దారుణమైన, ప్రతికూలమైన వ్యూహం.
ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం యొక్క తీవ్రమైన తప్పిదాల ఫలితమే. ప్రభుత్వం (ఎక్కువ మంది ఉత్పత్తిదారులకు తప్పని సరి లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా) తగినన్ని వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి హామీ ఇవ్వలేదు. సరిపడా వ్యాక్సిన్‌ల సరఫరా కావాలని అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌లను సమకూర్చాల్సిన బాధ్యతా ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వ్యాక్సిన్‌ ధరలలో తారతమ్యం ఉండే విధానాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి, రాష్ట్రాలు ప్రయివేట్‌ క్లీనిక్‌లతో పోటీ పడి వ్యాక్సిన్‌లను కొనే విధంగా ఒత్తిడి చేసి, భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఎక్కువ ధరలు చెల్లించాలని ఒత్తిడి చేసే విధంగా అనుమతించింది. కరోనా రెండవ వేవ్‌లో ప్రభుత్వం ప్రజల జీవితాలు, వారి బాధల గురించి ఆలోచించడంలేదు. ఫలితంగా ప్రజలు తాము జీవనాధారాలను కోల్పోయి భారీగా నష్టపోతున్నారు. కనీసం 90శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తుండగా, వారికి ఏ విధమైన సామాజిక, చట్టపరమైన రక్షణ లేకుండా, గడచిన సంవత్సర కాలంలో విధించిన లాక్‌డౌన్‌లకు వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా నిరాకరించారు. వారిపై అనేక ఆంక్షలు విధించి, ఆర్థిక బాధలకు గురిచేశారు. కానీ అసంఘటితరంగ కార్యకలాపాలపైన ఆధారపడి పని చేస్తున్న ఒక బిలియన్‌ ప్రజల గురించి ఎటువంటి బహిరంగ నిరసనలు వ్యక్తం కాలేదు. విధాన నిర్ణేతలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న వారు వీరిని పూర్తిగా వదిలి వేశారు. ఈ అలక్ష్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రంగానూ, దీర్ఘకాలం పాటు కేవలం చెప్పలేని బాధలు అనుభవిస్తున్న ప్రజల పైన మాత్రమే కాక, దేశంపైన, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ నడిచే మార్గంపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఇటీవల కాలంలో ఒక సమిష్టి సామాజిక సమూహాల నిర్వహణలో ‘హంగర్‌ వాచ్‌’ అని పిలువబడే ఒక అధ్యయనం, గత సంవత్సరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన రెండు నెలల తరువాత కూడా మూడిరట రెండొంతుల కుటుంబాలు లాక్‌డౌన్‌ కంటే ముందు తీసుకున్న ఆహారం కంటే తక్కువే తీసుకున్నారనీ, ఆరోగ్యాన్ని రక్షించే ఆహారంలో కూడా తగ్గుదల ఉందని తేల్చింది. సర్వే చేయబడిన కుటుంబాలలో పావు వంతు కుటుంబాల ఆదాయాలు సగానికి పడిపో యాయి. గ్రామీణ భారతంతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఆకలి ఎక్కువగా ఉందని ఆ సర్వేలో తేలింది. అనాలోచితంగా విధించిన లాక్‌డౌన్‌ల వలన కలిగే పరిణామాలు ఆర్థిక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకుంటాయి.
ఆర్థిక ప్యాకేజీ
ఒక అర్ధశతాబ్ద కాలంలో దేశం పెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే, కరోనా మహమ్మారి వలన కలిగిన ఆరోగ్య, ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు, చెప్పు కోదగిన ఆర్థిక ప్యాకేజీ పొందని అతి కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు జీడీపీలో కేవలం 2.1శాతం వడ్డీలేని ఖర్చును మాత్రమే పెంచింది. ఇది, మొదటి కరోనా వేవ్‌లో నలిగిపోయిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎందుకు ఇంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంది. ఇతర అనేక దేశాల్లో ప్రజలకు ఆదాయాలను సమకూర్చే దిశగా పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు సాధనంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో వెనుకబడిన పనుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంటున్నారు. దానికి బదులుగా ఆమె మిలియన్ల సంఖ్యలో ఉన్న పేద కార్మికులకు నగదును బదిలీ చేసే విధానంపై ఆధారపడి ఉంటే, అది ప్రజలను ఆకలి, నిరుద్యోగంలోకి నెట్టివేయకుండా రక్షించి, వద్ధి రేటును ప్రోత్సహించి ఉండేది. నగదు బదిలీ వలన ప్రజలు దేశీయంగా ఉత్పత్తి చేయబడే సాధారణ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అందువలన ఈ నగదు బదిలీ ద్వారా ప్రజలపై చేసే ఖర్చు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చు (ఒకవేళ ఖర్చు చేసిఉంటే)కన్నా రెట్టింపు ప్రభావాలను చూపించి ఉండెడిది.
ఎక్కువ మొత్తంలో అవసరమైన సరుకులను, ఇప్పటికే పోగుపడిన ఆహార ధాన్యాల నుండే పంపిస్తారు కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఉచిత రేషన్‌, ఉచిత భోజనాల వలన కొంత మేలు జరుగుతున్నప్పటికీ, అవి ఆర్థిక వ్యవస్థపై కొద్దిపాటి విస్తరణా ప్రభావాన్నే చూపుతాయి. అందువల్ల ఉచిత రేషన్‌, ఉచిత భోజనాలను అందించడంతో పాటుగా ప్రజలకు సహాయార్ధంగా నెలకు రూ.7000 నగదును బదిలీ చేసి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జీవించే హక్కుకు ప్రాధాన్యతనిచ్చే చర్యలను చేపట్టాలి. ఆ చర్యలు మాత్రమే నేడు ఆర్థిక స్వస్థతను చేకూర్చే సరైన మార్గాలు. వాటిలో ప్రధానంగా, ఉత్పత్తిని విస్తరించడానికి అనుమతించడం, కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ లను సేకరించి అందరికీ ఉచితంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు రాష్ట్రాలకు వాటిని పంపిణీ చేయడం, అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికీ నెలకు 5కిలోల ఆహార ధాన్యాలను ఆరు నెలల పాటు అందించడం, ప్రతీ కుటుంబానికి, ఏ ఉద్యోగం లేని వారికి నెలకు కనీసం రూ.7000 చొప్పున మూడు నెలల పాటు నగదు బదిలీ చేయడం, ‘ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్మెంట్‌ సర్వీసెస్‌’ తన కార్యక్రమాలను పునరుద్ధరించి, విసృతపరచడానికి తగిన వనరులను పెంచడం.
‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ డిమాండ్‌కు తగిన విధంగా పని రోజులలో, కుటుంబంలో లబ్దిదారుల సంఖ్యలో ఎటువంటి పరిమితులు విధించకుండా అమలుచేయడం,అదే పథకాన్ని దేశంలోని పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన నిరుద్యోగులకు కూడా వర్తింపజేయడం చేయాలి. వీటికి వనరులు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నిస్తారు. పెద్ద ఎత్తున నిరుద్యోగం, ఉపయోగించబడని సామర్థ్యం, ఉపయోగించని ఆహార ధాన్యాల నిల్వల (ప్రస్తుతం సుమారు 80 మిలియన్‌ టన్నులు)తో ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థలో వనరుల సమీకరణ కోసం ఏ ఒక్కరి వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. ద్రవ్యలోటును పెంచడం వలన, అనవసరమైన సంపద అసమానతలు పెంచడం, ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ ద్రవ్య పెట్టుబడిని భయపెట్టడం తప్ప, వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. ఈ రెండిరటినీ అడ్డుకోవాలంటే, సంపద పన్నును(పెద్ద మొత్తంలో లాభాల పన్ను కూడా తగినంత ఉన్నప్పటికీ కూడా) ప్రవేశ పెట్టే మార్గాలను అనుసరించాలి. ఒక్క శాతం కుటుంబాలపై విధించే 1.5శాతం సంపద పన్నుతో, వనరులకు అవసర మైన డబ్బు సరిపోతుంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, అమెరికా కోశాగార కార్యదర్శి జాన్నెట్‌ ఎలెన్‌లు మరింత నూతనత్వంతో కూడిన చర్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన రాజ్యాంగంలోని ‘జీవించే హక్కు’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతత్వం’ అనే మాటలకు ప్రాముఖ్యతను, అర్థాన్నిచ్చే చర్యలను భారతదేశం చేపట్టకుండా తప్పించుకోకూడదు.
‘ద హిందూ’ సౌజన్యంతో..అనువాదం:
-బోడపట్ల రవీందర్‌