గిరిజ‌నుల గోడు వినేదెవ‌రు?

‘’దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు.. ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి’’.

రిజర్వేషన్లు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పాలక వర్గాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనులకు కల్పించిన భూ హక్కు చట్టం నుంచి రిజర్వేషన్ల వరకూ దేని అమలు పైనా ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఎస్టీ రిజర్వేషన్లలో ఇతరులనూ చొప్పించాలని పాలకులు చూస్తుంటే.. కోర్టుల తీర్పులు వాటికి బలాన్నివ్వడం మరింత బాధాకరం. ఉమ్మడి ఏపీలో ఏజెన్సీల్లోని స్కూల్‌ టీచర్ల నియామకాల్లో గిరిజనులకే 100%రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన జీవోను ఏజెన్సీల్లోని ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందనే పేరుతో సుప్రీం కోర్టు రద్దు చేసి ఏడాది కావస్తున్నా, దాని పునరుద్ధరణకు రాష్ట్ర సర్కారు సీరియస్గా ప్రయత్నించకపోవడం దారుణం. మన దేశంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఏవో లొసుగులను అడ్డం పెట్టుకుని ఉల్లంఘిస్తున్నారు. ఏపార్టీ పాలనా పగ్గాలు చేపట్టినా సరే వాటిలో అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలే పెత్తనం చేయడం వల్ల వారికి ఈ రిజర్వేషన్లపై సానుకూల దృక్పథం కొర వడిరది. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులపై సదభిప్రాయం లేకపోవడంతో రాజకీయ అవసరాల కోసం పైపై ప్రచారాలు చేసుకోవడం తప్ప నిజంగా మేలు చేసే ఆలోచన కనిపించడం లేదు.
ఒక వైపే ప్రచారం
మన దేశంలో అధికారంతోపాటు ప్రసార సాధనాలను గుప్పిట పెట్టుకున్న ఉన్నత సామాజిక వర్గాలు పీడిత, బాధిత వర్గాలకు రాజ్యాంగపరంగా కల్పించిన వెసులుబాట్లను ప్రచారం చేసినంతగా వాటి అమల్లో లొసుగులపై చర్చ పెట్టవు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగం గురించి జరిగే ప్రచారం ఆచట్టాన్ని వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నవారి గురించి చెప్పే విషయంలో జరగదు. ఈచట్టానికి అపప్రద తెచ్చిపెట్టడమే వారి ఉద్దేశం కనుక అణచివేతకు గురవుతున్న బాధితులను వదిలేసి, చట్టం దుర్వినియోగం గురించి పెద్దగా చర్చలు పెడుతారు. కానీ ఏ శక్తుల కారణంగా ఇది జరుగుతుందో విశ్లేషించేందుకు మాత్రం మనసు రాదు.
ఏజెన్సీల్లో యువతకు చేదోడైన జీవో అది
బయటి ప్రపంచం పోకడలకు చాలా దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జనం జీవన శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లకు చదువులు, ఇతర మౌలిక సదుపాయాలు నేటికీ అంతంత మాత్రంగానే అందుతున్నాయి. పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్పిటల్స్‌, స్కూళ్లలో పని చేయాలన్నా కూడా ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు అంతగా సుముఖత చూపడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో 1986లో జీవో నంబర్‌ 275 ద్వారా ఉమ్మడి ఏపీలో నాటి సర్కారు ఏజెన్సీల్లో టీచర్‌ ఉద్యోగాలకు గిరిజనులకే 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు, 1998లో సుప్రీం కోర్టు తీర్పుతో ఆ రిజర్వేషన్లు నిలిచిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం మళ్లీ జీవో నంబర్‌ 3ద్వారా మళ్లీ 100శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మళ్లీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులకు అన్యా యం జరుగుతోందంటూ వాదనలు వినిపించారు. అయితే గిరిజన యువతలో చదువుకున్న వాళ్లు తమ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్లుగా ఉద్యోగాలు పొంది తమ తర్వాత జనరేషన్‌ పిల్లలకు చదువులు చెబుతూ వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటు తమ ప్రాంతానికి మేలు చేయడంలో ఈ జీవో చేదోడుగా ఉండేది. గతఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ జీవో అత్యంత వివాదాస్పద ఉత్త ర్వుగా జడ్జిలు పేర్కొన్నారు. జీవో నంబర్‌3 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చారు. అది చెల్లదంటూ తాము ఇచ్చిన ఉత్తర్వును ఉల్లంఘి స్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నియామకాలు, పదోన్నతులు చేపట్టినట్టయితే 1986 నుంచి జరిగిన నియామకాలన్నీ తిరగదోడతామని హెచ్చరించడం బాధాకరం. వాస్తవానికి ఆ జీవో రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 ప్రకారం ఇచ్చారని, ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, దీనిపై జుడిషియల్‌ రివ్యూ చేసే హక్కు కూడా ఉండద ని వాదించి గిరిజన హక్కులను కాపాడ డంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయింది. ఏజెన్సీల్లో ఇతరుల జనాభా ఎట్ల పెరిగింది?
జీవో నంబర్‌ 3ని మొదటి నుంచి వ్యతిరేకి స్తోంది ఏజెన్సీల్లోని గిరిజనేతర వర్గాలే. ఈ జీవో వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. అసలు పరిశీలించాల్సిన విషయం ఏజెన్సీల్లో ఇతర వర్గాల జనాభా ఎలా పెరిగిందన్నది. వాస్తవానికి 1950 నుంచి 80 దశకం వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల జనాభా 90 శాతం ఉంటే 90ల్లోకి వచ్చేసరికి వారు మైనారిటీలుగా మారిపోయారు. మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన భూస్వామ్య, వ్యాపార, గిరిజనేతర వర్గాలు అక్కడి భూమి, ఆర్ధిక వ్యవస్థను తమ గుప్పిట పెట్టుకున్నాయి. జనాభా పరంగానూ మెజారిటీలుగా మారి పోయారు. ఒక్క ఆదిలాబాద్‌ అనే కాకుండా ఏజెన్సీ విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనడానికి లేదు.ఆ భూపరి రక్షణ హక్కు చట్టాలకు సైతం ఈ వర్గాలు తూట్లు పొడిచాయి. రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా సరే గిరిజన చట్టాలను ఆధిపత్య వర్గాలు నీరు గార్చేశాయి. పెసాచట్టం నిబంధనలకు నీళ్లు వదిలి పెట్రోలు పంపులు, కర్మాగారాలు, సినిమా హాళ్లు, పిండి మిల్లులు ధాన్యం మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీలు, మద్యం దుకాణాలు.. ఇలా ఒకటేంటి ఏజెన్సీలో అన్నీ బినామీల పేరుతో నడిపిస్తున్నారు. పేరు గిరిజనులది.. పెత్తనం అగ్రవర్ణాల పెద్దలది. గిరిజనుల వనరులను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేస్తున్నారు. పైగా చట్టానికి తూట్లు పెట్టేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు కాబట్టి చాపకింద నీరులా పనుల్ని చక్కబెడుతున్నారు. కానీ జీవో 3 ద్వారా గిరిజనులకు దక్కే గుప్పెడు ఉద్యోగాలపై గిరిజనేతరులంతా ఏకమై పోరాటం చేయడం ఘోరం.
అడుగడుగునా ఉల్లంఘనలే
నిజానికి బ్రిటిష్‌ కాలం నుంచి ఊపిరి పోసు కున్న ఏజెన్సీ చట్టాలన్నీ గిరిజన తెగలను గిరిజ నేతరులు, మైదాన ప్రాంత దోపిడీ నుంచి రక్షిం చేందుకు ఉద్దేశించినవే. స్వాతంత్య్ర అనం తరం రూపొందిన 1/70చట్టం ఇందులో కీలక మైంది. రాజ్యాంగ పరిధిలో 1/70చట్టాన్ని నిర్వ చించినా జీవో నంబరు 3దాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడేదే తప్ప ఎంతమాత్ర మూ ఆ చట్రానికి బాహ్యంగా లేదు.కానీ1/70లో భాగమైన అన్ని చట్టాలు ఏండ్లకు తరబడి అడు గడుగునా ఉల్లంఘనకు గురవుతూ వచ్చాయి.
రివ్యూ పిటిషన్‌ వేసి వదిలేస్తరా?
ఏజెన్సీలో ఎస్టీల రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్రవర్ణ, బీసీ వర్గాలు మైదాన ప్రాంతం వచ్చేసరికి రెండుగా విడిపోతాయి. గిరిజనుల జీవన విధానమేంటి? వారి వెనుకబాటు ఏంటి? వారికున్న ఆర్థిక వనరులేంటి? ఆహార భద్రత ఎంత? మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే జీవో 3 వారి త్యాగా లకు పెద్ద తులాభారమేం కాదు. గిరిజన సంస్కృతి,సంప్రదాయాలను రక్షించాలన్న ఆశయంతో తెచ్చిన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు కూడా ఏనాడూ వారికి భద్రత కల్పించింది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న జీవో నంబర్‌ 3 విషయంలోనూ తెలంగాణ సర్కారు గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. ఏడాది క్రితం జీవో రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వచ్చింది. అయితే దాని పునరుద్ధరణ కోసం కోర్టులో ఒక రివ్యూ పిటిషన్‌ వేసి గిరిజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని కంటితుడుపుగా ప్రకటన చేయడం మినహా చేసిందేమీ లేదు. దాదాపు ఈఏడాది సమయంలో సీరియస్గా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
గిరిజన భూములు ఆక్రమించేదెవరు?
షెడ్యూల్డ్‌ తరగతులు, ఇతర అటవీ వాసుల (అటవీ హక్కుల చట్టం), 2006 చారిత్రకంగా బాధలు పడ్డ వారి హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించింది. దీనినే అటవీ హక్కుల చట్టం అంటున్నారు. అడవుల్లో ఉంటూ భూముల హక్కుల తిరస్కరణకు గురైనవారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు గిరిజనుల హక్కులను హరించేదిగా ఉంది. ఈ తీర్పువల్ల 16 రాష్ట్రాలలోని 10లక్షలమంది గిరిజనులకు నష్టం కలిగే పరిస్థితి తలెత్తింది. సుప్రీం కోర్టుకు తమ పరిస్థితి ఇంకా నివేదించాల్సిన వారు అనేక మంది ఉన్నారు కనక వీరి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. అటవీ హక్కుల చట్టం న్యాయబద్ధతను ప్రశ్నిస్తూ వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ అన్న స్వచ్ఛంద సంస్థ, ఉద్యోగ విరమణ చేసిన కొందరు అటవీ శాఖ అధికారులు పిటిషన్‌ పెట్టుకున్నందువల్ల ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాము వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అటవీ హక్కుల సం రక్షణ చట్టం కింద కొందరి వాద నను తిరస్కరించడానికి గల ప్రక్రియను వివరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలగజేస్తుంది. సాంప్రదాయికంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న వారిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు ఇలాంటి అర్జీ దాఖలైనప్పుడు సుప్రీం కోర్టు ఉత్తర్వువల్ల 2002,2004 మధ్య అనేకమంది అటవీ వాసులు నిర్వాసితులయ్యారు. ఇది హింసకు, మరణాలకు, నిరసనలకు దాదాపు మూడు లక్షల కుటుంబాలు నిర్వాసితులు కావడానికి దారి తీసింది. తాజా ఉత్తర్వు ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులపట్ల అనుసరిస్తున్న విధానానికి అనువుగానే ఉంది. గిరిజనుల ప్రయోజనాలను ప్రభుత్వ న్యాయవాదులు కనక సమర్థించి ఉంటే ఈ ఉత్తర్వు మరోలా ఉండేది. అడవులు తగ్గిపోవడానికి, అటవీ భూములు ఆక్రమణకు గురికావడానికి గిరిజనులే కారణం అని ఈ పిటిషన్‌లో వాదించారు. గిరిజనులు, అడవుల్లో నివాసం ఉంటున్న వారు అటవీ భూములను ఆక్రమిస్తున్నారన్న వాదన ఎంతవరకు నిలబడగలుగుతుంది? వలసవాద ప్రభుత్వం వారి హక్కులకు భంగం కలిగించింది. అప్పుడు కొన్ని నిబంధనలున్నా గిరిజనులు తమ హక్కులను అనుభవించ గలిగారు. అయితే స్వాతంత్య్రం తర్వాత నూతన అటవీ విధానంవల్ల గిరిజనులకు చాలాకాలంగా ఉన్న హక్కులకు భంగం కలిగింది. దీనికి తోడు దేశంలోని భూభాగంలో మూడిరట ఒక వంతు అడవులు ఉండాలన్న విధానంవల్ల గిరిజనుల హక్కులు హరించుకు పోయాయి. అసలు చెట్లే లేని భూభాగాలు కూడా అటవీ శాఖ అధీనంలోకి వచ్చి ఇవి అమాంతం అటవీ భూములైపోయాయి. అటవీ శాఖ వేలాది కిలోమీటర్ల మేర గిరిజనుల భూములను ఆక్రమించింది. 1980నాటి అటవీ (సంరక్షణ) చట్టం,1972 నాటి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కూడా గిరిజనుల హక్కులకు భంగం కలిగించాయి. అంటే నిజానికి అటవీ భూములను ఆక్రమిస్తున్నది ప్రభుత్వమే. అటవీ భూములు తగ్గిపోవడానికి ప్రధాన బాధ్యత గిరిజనులదా, అడవుల్లో ఉండే వారిదా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గనుల తవ్వకానాకి, పరిశ్రమలు నెలకొల్పడానికి అటవీ భూములను వాడుకున్నారు. గిరిజనులను నిర్వాసితులను చేశారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నప్పటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో బడా కంపెనీలు, బహుళజాతి గుత్త కంపెనీలు గిరిజన ప్రాంతాలలో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి అడవుల్లో తిష్ఠ వేశాయి. కాని అడవులు క్షీణించడానికి నెపం గిరిజనుల మీద తోస్తున్నారు. ప్రైవేటు ప్రయోజనాలకోసం అడవులను కొల్లగొట్టే వారి మీద ఏ నిందా లేదు. అడవుల్లో పర్యావరణాన్ని, వన్య జీవుల్ని నాశనం చేస్తున్నది ఈ కంపెనీలే. అడవులు క్షీణించిపోవడానికి గిరిజనులే కారణం అని వాదిస్తున్నప్పటికీ ఇప్పటికీ దట్టమైన అడవులున్నది గిరిజనులు ఉండే చోటే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం అనుసరిస్తున్న అటవీ పరిరక్షణ విధానాలు సక్రమమైనవేనా అని ఆలొచించాలి.అటవీ శాఖ, అధికారులు, అడవులను పరిరక్షించడానికి పాటుపడ్తున్నామని చెప్పుకునే కులీన, పట్టణ ప్రాంత వాసులు అటవీ హక్కుల చట్టాన్ని వ్యక్తిరేకిస్తూనే ఉన్నారు. ఈ చట్టానికి నిబంధనలు తయారు చేసినప్పటి నుంచీ ఇదే ధోరణి. ఈ చట్టం అమలుపై నిరంతరం విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటవీ భూములపై హక్కులను గుర్తించడం మూడు దశల్లో జరుగుతుంది. గ్రామసభ ఈ హక్కుల పరిరక్షణకు సిఫార్సు చేస్తుంది. ఆ తరవాత ఈ అభ్యర్థన సబ్‌ డివిజన్‌ వ్యవస్థ స్థాయికి వెళ్తుంది. ఆ తరవాత పరిశీలనకోసం జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు. ఇందులో కేవలం అధికారులు మాత్రమే ఉంటారు. ఇందులో అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. హక్కులు కోరే వారి వాదనను తిరస్కరించడం ఎప్పుడూ అందులోని మంచి చెడ్డలపై ఆధారపడుతుందని కాదు. ఈ తిరస్కరణ చాలావరకు ఏకపక్షంగా ఉంటుంది. గ్రామసభ సిఫార్సును వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలు అటవీ భూములను ప్రైవేటు రంగం వారికి, వ్యాపరస్థులకు అప్పగించాలని చూస్తాయి. చిన్నా చితక కారణాల ఆధారంగానే గిరిజనుల హక్కులను తిరస్కరించిన సందర్భాలున్నాయని గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖే అంగీకరించింది. ఈ తిరస్కరణను సవాలు చేస్తూ కోర్టుల్లో దాఖలైన లక్షలాది పిటీషన్లు విచారణకే నోచుకోవడం లేదు. తగిన విధానం అనుసరించకుండా ఎవరినీ నిర్వాసితులను చేయకూడదని అటవీ హక్కుల చట్టంలోని 4 (5) సెక్షన్‌ చెప్తోంది. కానీ అధికారులే దీన్ని ఉల్లంఘిస్తుంటారు. చట్టం నిబంధనలను ఖాతరు చేయకుండా తిరస్కరించిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తిరస్కరిస్తున్న ఉదంతాలెన్నో! నిబంధనల ప్రకారం అయితే క్షేత్ర స్థాయిలో సర్వే చేసి కాని నిర్ణయించకూడదు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరు కూడా ఏ మాత్రం నమ్మకం కలిగించేదిగా లేదు. గిరిజనులకు సంబంధించిన అంశాల మీద న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అవగాహన ఉన్నట్టు లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది. –మన్నారం నాగరాజు