ఆహారం దక్కక ఆకలి కేక

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంపూర్ణ పోషణ పథకం నిర్విర్యమౌతోంది. రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండ లాల పరిధిలోని 8ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో25రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు,కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రి షన్‌ కిట్‌ కింద నెలకు 2కిలోల మల్టీ గ్రెయి న్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకి లో రాగిపిండి,అరకిలో బెల్లం,అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తంరూ.87.12 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఈ పథకం77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47, 287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తు న్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఈ పథకం అరకొరగా కొనసాగుతోంది. పథకానికి సంబంధించిన పోషకాలు అర్హులైన లబ్దిదారులకు అందడం లేదు. కనీసం ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనైనా లబ్దిదారులకు సక్రమంగా అమలు చేసే నాధుడు కరవయ్యారు.

మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల అభివృద్ధిని ఆనాటి ఆంధ్రపాలకుల నుంచి నేటి తెలంగాణ పాలకుల వరకు పట్టించు కునే వారు లేక వారి బతుకులు మారడం లేదు. గిరిజనుల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని అధికారులు ప్రగల్భాలు పలుకుతూ లెక్కల్లో చెపుతున్నా, ఆచరణలో మాత్రం శూన్యంగానే ఉన్నది. కాసిపేట మండలంలో ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్లు , రవాణా సౌకర్యాల్లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. గిరి పుత్రులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. పారిశుధ్యం అధ్వానం ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ గ్రామాల్లో అనేక సమస్యలున్నాయి. గిరిజన గ్రామాలకు కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు పోషకాహారం అందని ద్రాక్షగానే ఉంది. గిరిజనుల పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆదివాసీల పిల్లలు పోషకాహార లోపంతో రోగాల భారిన పడుతున్నారు. మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ నామమాత్రంగానే కొనసాగుతోంది. కొలాంగూడ , లక్ష్మిపూర్‌, తిరుమలాపూర్‌ గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవడంతో పిల్లలు పోషకాహారానికి దూరమై అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని గిరిజన గ్రామాల్లో అధికారింగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి పనిచేసిన దాఖలాలు లేవు. దీంతో గిరిజనుల పిల్లలు గంజి, గట్కలతో కడుపు నింపుకుంటున్నారు.
మౌలిక సదుపాయలు శూన్యం
ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యంలేదు. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే వాగు లు, వంకలు దాటు కుంటూ వెళ్లాల్సిందే. సమస్యలతో సతమతమౌతున్న గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పిం చడంలో ప్రభు త్వం ఏనాడు శ్రద్ధ వహిం చలేదని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాకా లంలో వాగులు పొంగి పోర్లుతుంటే ప్రమాదపు టంచున వాగులో రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక అనారోగ్యంతో ఉన్నవారికి సరైన సమయంలో వైద్యమందక మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి.
పౌష్టికాహారం అందని ద్రాక్షే..
సంపూర్ణ పౌష్ఠికాహారం అందించి మాతా, శిశు మరణాలు రేటు తగ్గించాలన్నది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) లక్ష్యం. కానీ కరోనా కష్టకాలంలో లబ్ధిదారులకు నిర్దేశిత ప్రకారం సంపూర్ణ ఆహారం అంద డం లేదని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలు స్తోంది. గుడ్లు తప్ప, నూనె, పప్పు రెండు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో లబ్ధిదారులకు అరకొర గుడ్లు, పాలు నేరుగా అందించి చేతులు దులుపుకొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు భోజనం చేసి పెట్టాల్సి ఉండగా గత రెండు నెలలుగా కరోనా నేపథ్యంలో నేరుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. కానీ నూనె, పప్పులు ఇవ్వట్లేదు. పాలు కూడా అరకొరగానే ఇస్తున్నారు. అవి కూడా ఒక రకమైన వాసన వస్తోండటంతో తాగలేకపోతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
గర్భిణుల్లో రక్తహీనత
జిల్లాలోని గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులు పౌష్ఠికాహారానికి నోచుకోక పచ్చళ్లు, చారుతో భోజనం చేయాల్సి వస్తోంది. ప్రధానంగా విశాఖ జిల్లా షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన 11 మండలాల్లోని గిరిజన గ్రామాల పిల్లలు బలవర్ధక ఆహారానికి నోచక, వ్యాధినిరోధక శక్తి లేక వ్యాధుల బారిన పడుతున్నారు. వారానికి ఒకసారి సమీపం సంతలకు వెళ్లి కూరగాయలు తెచ్చుకునే కుటుంబాలే అధికం. గర్భిణులు,బాలింతలు నడిచి వెళ్లలేక పచ్చడి,గంజి మెతుకులతో రోజులు గడుపుతున్నారు. ఫలితంగా నెలలు నిండుతున్న వారిలోనూ పిండం సరిగా ఎదగడం లేదు. రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొందరికి హిమోగ్లోబిన్‌ శాతం 6-7 శాతం మాత్రమే ఉంటోంది. బాలింతల్లోనూ పట్టణా లబ్ధిదారుల్లో పరిస్థితి కాస్త పర్వాలేకున్నా.. గిరిజనుల్లో మాత్రం సుమారు 70 శాతం మంది సరైన తిండికి నోచక పిల్లలకూ సరిపడినన్ని పాలివ్వలేని పరిస్థితి దాపురించింది.
గర్భిణులు: 8,430
బాలింతలు: 9,259
0-6 ఏళ్ల పిల్లల సంఖ్య: 69,183
మినీ అంగన్‌వాడీలు: 636
జిల్లాలో అంగన్‌వాడీలు: 1,424
బాధితులు ఇలా..
అతి తీవ్ర పోషణ లోపం ఉన్నవారు (ఎస్‌ఏఎం) 2139,తీవ్ర పోషణ లోపం (ఎంఏఎం) 4,299,అతి తక్కువ బరువు (ఎస్‌యూడబ్ల్యూ) 1,334,పోషకాహార లోపం (ఎంయూడబ్ల్యూ) 6,376 వయసుకు తగిన ఎత్తులేని వారు 696
గిరిజనుల పిల్లల్లో వయసు పెరుగు తున్నప్పటికీ తగిన బరువు ఉండటం లేదు. జిల్లాలోని అన్నీప్రాజెక్టుల పరిధిలో తీవ్ర పౌష్ఠికాహారం లోపంతో బాధపడే వారు వేలాది మంది ఉన్నారు. వీళ్లకు సంపూర్ణ పౌష్ఠికాహారం అందితేనే శరీరం ఎదుగుదల ఉంటుంది. వ్యాధులు దరిచేరవు. ఉన్నతాధికారులు అవసరమైతే పౌష్ఠికాహార కేంద్రాలకు (ఎన్‌ఆర్‌సీ) తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ఉంది.
నెలాఖరుకల్లా సమస్య పరిష్కారం

  • సీతామహాలక్ష్మీ, ఐసీడీఎస్‌ పీడీ
    గత నెలన్నర నుంచి పప్పు, నూనెలు రాష్ట్రస్థాయి నుంచే సరఫరా కాలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. మొన్న నూనె సరఫరా చేశారు. వెంటనే ప్రాజెక్టులకు అందజేశాం. వారు కేంద్రాలకు అందజేస్త్నేన్నారు. పప్పు కూడా ఈ నెల చివరి కల్లా వచ్చే అవకాశం ఉంది.
    పారిశుధ్యం అధ్వానం
    గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం మరీ అధ్వానంగా ఉంది. ప్రతి వర్షకాలం పారిశుధ్యలోపంతో రోగా లు ప్రబలి ప్రజలు మృతిచెందుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో చాలా చోట్ల డ్రెయినేజీలు నిర్మించలేదు. దీంతో పాటు కాలువలో పూడికలు తీయకపోవడంతో కాలువల్లో మురికినీరు నిలిచి, దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా అనేక సమస్యలతో గిరిజన గ్రామాలు సతమతమ వుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
    జి.ఎన్‌.వి.సతీష్‌