ఆదివాసీ సంస్కృతికి అద్దం

తెలుగు సాహితి చరిత్రలో కథాపక్రియ సదా వన్నె తరగని మకుటం లాంటిది,తెలుగు సమా జపు జీవిత చిత్రణ కథల్లో అగుపిస్తుంది. మానవ జీవితాల మనుగడకు అద్దంపట్టే కథా ప్రక్రియనే తన సామాజిక వర్గపు సంస్కృతి సాంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి అందిం చడానికి సాధనంగా చేసుకుంది పాల్వంచకు చెందిన ‘‘పద్దం అనసూయ’’ కోయ సామాజిక వర్గానికి చెందిన సాంప్రదాయాలనే తన కథా వస్తువులుగా తీసుకుని వ్రాసిన ఆమె కథలు, రాశి కన్నా వాసిలో ముందు నిలుస్తాయి. వాస్తవంగా తనకు రచనా రంగంలో అంతగా అనుభవంగానీ, ప్రవేశం కానీ లేవు, అయినా తనలోని భావాలను పదుగురితో పంచు కోవాలనే తపన తనను రచయిత్రిగా తయారు చేసింది. దానికి తోడు తన చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన జానపద కథల ప్రభావం కూడా బాగా పనిచేసింది.తన మాతృభాష అయిన కోయ భాషతోపాటు వృత్తి భాష అయినా తెలుగులో కూడా మనసుతో చదివిన అనసూయ జీవిత లక్ష్యం లిపిలేని తన మాతృభాష కోయ భాషను, తెలుగు లిపి సాయంతో దేశవ్యాప్తం చేయడమే. !! అందులో భాగంగానే తన సామాజిక వర్గపు భాషతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను అక్షరీకరించి భద్రపరిచి భావితరాలకు అందించడమే దీక్షగా పని చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో ఆమె ‘‘చప్పుడు’’ అనే పేరుతో కోయ కథా సంపుటి వెలువరించారు. అంతేగాక తొలి గిరిజన కథారచయత్రిగా కూడా తెలుగు కథ సాహిత్యంలో స్థానం సంపాదించారు. ఈ కథ సంపుటిలో కథలు 2009-2011సంవత్సరాలు మధ్య వ్రాయబడినవి, సాధారణంగా గిరిజన కథలు అనగానే పోరాటాలు,మోసాలు,దగాలు, రాజకీ యాలు,వగైరా వగైరాలు,కథా వస్తువులుగా ఉంటాయి,కానీ ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన కథలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు తమ గిరిజన సామాజిక వర్గ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తే, మరో వైపు తనదైన గిరిజన స్త్రీ మానసిక వేదన లను మిళితం చేసినట్టు కనిపిస్తుంది. అనసూయ స్వతహాగా గిరిజన సామాజిక వర్గంకు చెందినవారు. నిత్యం తన సామాజిక వర్గపు స్త్రీలతో కలిసిమెలిసి జీవించిన వ్యక్తివారి భావాలను అను భవాలను బాధలను దగ్గరగా చూసిన స్వానుభవంగల మనిషి,సాధారణ సమాజపు స్త్రీవాదులచూపుకు, గిరిజన సామాజిక వర్గపు ఈ ఆడ బిడ్డ స్త్రీవా దపు దృష్టికి పూర్తి వైవిధ్యం కనిపి స్తుంది. తెలుగు సాహిత్యపు స్త్రీవాదాన్ని అనసూ య దిగుమతి చేసుకోలేదు కానీ‘‘గిరిజన మహిళల జీవితంలోని కష్టాలు’’అందరికీ తెలియాలి అని మాత్రం పూర్తిగా నమ్మింది. ప్రామాణిక కథా సిద్ధాంతాలు, పత్రికలవారి ‘‘నిర్దేశిత వలయ సూత్రాలు’’ తనకు తెలిసి ఉం డవు దరిమిలా ఆమె కథల్లో సంబంధిత కొలతలు కనిపించక పోవచ్చు,కానీ తనలోని ఆవేదనలను వ్యక్తీకరిం చు కోవడానికి రచయిత్రి పడ్డ శ్రమకు తోడు తనదైన భాష,తనకు మాత్రమే సొంతమైన కథన శైలి, వెరసి పాఠకు లకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ కథల రచన కొనసాగింది. కథలశైలి ఎంత చిత్రమో! వాటి వస్తువు కూడా అంతే విచిత్రం గా ఉంది. ఈ సంపుటిలోని ప్రతి కథకు నేపథ్యం‘‘చావు’’, మనిషికి మరణం ఒక పోరా టం ప్రతి జీవన పోరాటం ఒక విప్లవంఅనే అర్థ సూత్రానికి కట్టుబడి ఈ కథలు రాశారు. కథలోని వస్తువు కన్నా వస్తువుకు నేపథ్యాలైన సంస్కృతి, సంప్ర దాయాల వెంటే ఆమెకథా ప్రయాణం సాగింది. ఈ కథలన్నీ గిరిజనస్త్రీని ముఖ్యపాత్రగా చేశాయి చావు సందర్భంగా బ్రతకు పోరాటం వివరిం చిన కథలు. మరణించిన గిరిజన మహిళల బతు కులను అక్షరీకరించిన ‘సమయ ప్రవా హికలు’ ఈ కథలు.‘కాకమ్మ’కథ మొదలు ‘మూగబోయిన శబ్దం’ వరకు సాగిన ఈ‘‘చప్పుడు’’ కథల పయనంలో పాఠకులకు సరికొత్త అను భూతి సంతృప్తి కలుగుతాయి అనడంలో నిండు నిజం దాగి ఉంది.‘కాకమ్మ’కథలో ప్రధాన పాత్ర ‘కాకమ్మ’ రచయిత్రి జ్ఞాపకాల సాయంతో గిరిజన సమాజం,సంస్కృతి,భాష, కలగలుపుకుని చక్కగా సాగుతుంది.కాకమ్మ వయసు పైబడిన వృద్ధ గిరిజనస్త్రీ,తన చిన్నతనం నుంచి తమ కుటుంబం బాగుకోసం ఎంతోకృషి చేసింది, తనకు తనదైనసంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం.వాటిని పరిరక్షించుకోవడమే తన ధ్యేయం, కానీ తన వారసులు ఆధునికత పేరుతో సంస్కృతి సాంప్రదాయాలు పాటించ కుండా ఎవరిస్వార్థం కోసం వారు కట్టు తప్పి ముందుకు కదిలిపోయిన ప్రతి సంఘటనలు కాకమ్మ మనసును గాయపరుస్తాయి.కూతురు వేరే కులం వ్యక్తినిపెళ్లి చేసుకోవడం,కొడుకు తన పెళ్లి గిరిజన ఆచారం ప్రకారం చేయడం అనాగరికంగా భావించడం, మొదలైన సంఘ టనలతో కలత చెందిన కాకమ్మ చివరికి తన చావునైనా తనవాళ్లు తమపద్ధతిలో చేస్తారో చేయరో అని ఆవేదనపడి తానే తన కర్మకాం డలు గిరిజన సాంప్రదాయం ప్రకారం చేయ డానికి కావలసిన సరుకులు అన్నీ ముందు గానే సమకూర్చుకొని పాత భోషణం పెట్టెలో దాచి దాని తాళం చెవి తన వారికి అందించి, తన ప్రాణం తన ఇంట్లోనే పోవాలనే చివరి కోరికతో కన్నుమూస్తుంది కాకమ్మ. సంస్కృతి సంప్రదా యాల పరిరక్షణలో గిరిజన స్త్రీ పడే ఆవేదనకు ఈ కథ అద్దం పడుతుంది, రెండవ కథ సంపుటి శీర్షికఅయిన ‘చప్పుడు’ కథలో గిరిజన గూడెంకు చెందిన ‘పోతప్ప’ బ్రతుకు తెరువు కోసం భార్య ‘సుంకులు’తోకలిసి పాల్వంచ పట్ట ణం పోయి బ్రతుకు తుంటాడు. పట్టణం పోయిన తమ గిరిజన పద్ధతులు మానుకోలేదు ఆకోయ దంపతులు. దురదృష్టవ శాత్తు పోతప్ప భార్య సుంకులు చనిపోతుంది. ఆమె కర్మకాం డలు గిరిజన ఆచారం ప్రకారం చేయడానికి సిద్ధమే తగిన ఏర్పాట్లు చేసుకుం టాడు.14వ రోజు రాత్రిడోలి వాళ్ళడోలి వాయిద్యాల సాయంతో రాత్రి అంతా శబ్దాలు చేస్తూ ‘పూర్భం’ చెప్పి యాస పోసి చనిపోయిన వ్యక్తి ఆత్మను సాగనంపినప్పుడే గిరిజనుల ఆచార ప్రకారం కర్మ జరిగినట్టు. పోతప్ప తన భార్య కర్మకాండలు చేస్తున్న తీరు ఆడోలు వాయిద్యాల హోరుకు పట్టణంలోని ఆధునిక గిరిజనేతరులు అడ్డు తగలడం వారిని ఎదిరించి సింహంలా ఎదురు తిరిగి తనభార్య కర్మకాండ తమదైన పద్ధతిలో డోలు చప్పుళ్ళతో పోతప్ప పూర్తి చేయడం ఈ కథలో ఇతివృత్తం. ఎంతఎత్తుకు ఎదిగిన మన పూర్వ ఆచారాల పునాదిని వదల కూడదని సత్యాన్ని చాటింది ఈ ‘చప్పుడు’ కథ. స్వార్థం నీడలో ఆధునిక సమాజం ఎంతగా పాడైపోయినా గిరిజన సామాజిక వర్గంలో ఎప్పటికీ ప్రేమలు, ఆత్మీయతలు, ప్రవహిస్తూనే ఉంటాయి అని చాటి చెప్పిన కథ ‘ముసిలి’. తనకోసం మాత్రమే కాదు తన జాతి కోసం, గోత్రంకోసం,ఇంటి కోసం,కాకుండా తన ఊరి బాగు కోసం ఆలోచించి కష్టపడి కన్నుమూసిన ముసిలి చావును ఆఊరి వాళ్ళంతా ఓపండ గల చేయడం ఈ కథలో విశేషం.పరుల కోసం పాటుపడ్డ వారు చనిపోయి కూడా జీవిస్తారు అనే మంచి సందేశం ఇచ్చింది ఈ కథ.గతం వర్తమానాల మధ్య రెండు తరాల,రెండు మతాల,మధ్య ప్రస్తుతం అడవి బిడ్డల ఊగిసలాటను దృశ్యమానం చేసిన చివరి కథ ‘‘మూగబోయిన శబ్దం’’ ఇద్దరు కొడుకులు గల ‘‘పెద్దయ్య’’కు పెద్ద కొడుకు చనిపోవడంతో ఆ కర్మకాండల కోసం గూడెం గూడెం తిరిగి బంధువులకు కబుర్లు చెప్పుకొని అందరినీ పిలుచుకుంటాడు, కానీ మతం మారిన చిన్నకొడుకు తన అన్నకు కర్మకాండ తను మారిన కొత్త మతం ప్రకారం జరిపించడం చూసి ‘శిలువ బరువు’ భారం భరించలేక శోకసముద్రం గుండెల్లో దాచుకున్న పెద్దయ్య మానసిక స్థితి, గిరిజన సంప్రదాయాలను కమ్మేస్తున్న అన్యమత మేఘాలవల్ల పొంచి ఉన్న ప్రమాదపు హెచ్చరికలు రచయిత్రి ఈకథ ద్వారా అందించారు. కథల్లోని వాక్య నిర్మాణం, జాతీయాలు,సామెతలు,పలుకు బళ్ళు,అలం కారాలు,అన్ని అచ్చమైన అడవి బిడ్డల సాంప్ర దాయ వాతావరణంతో చూపించడం రచయి త్రికి అడవిబిడ్డలకు గల అనుబంధాన్ని తేట తెల్లచేస్తుంది. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)