ఆదివాసీల ఆత్మగానం

త్తరాంధ్ర కథకులు,రచయిత,కవి మల్లిపురం జగదీశ్‌ రాసిన కొత్త పుస్తకం‘‘దుర్ల’’ కవితా సంపుటి. ఈకవితా సంపుటిని పరిచయం చేస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి సారిపల్లి నాగరాజు గారు రాసిన సమీక్ష వ్యాసం – ఎడిటర్‌

మల్లిపురం జగదీశ్‌ మాష్టారు దాదాపుగా రెండు దశాబ్దాలు పాటు రాసిన కవితలన్నింటినీ సమూ హంగా చేసి ‘‘దుర్ల’’ పేరుతో ప్రచురిం చారు. తమ జాతి సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ కథలు, కవిత్వం, గేయాలు రాయడమే కాకుండా వారి రచనలకు కూడా ఆ సంప్రదాయాలకు తగినట్టుగానే శీర్షికలు పెట్టారు. గాయం మనిషికి తగిలినా మనసుకు తగిలినా గాయం తాలూకా జ్ఞాపకాలు అలాగే నిలిచిపోతాయి. బాధల ప్రవాహాన్ని అక్షరాలతో వెతికి హృదయాన్ని హత్తుకునేలా అల్లి నప్పుడు ఆ భాధలు గాథలవుతాయి, గీతాల వుతా యి. కవితల వెల్లువవుతాయి. గిరిజనుల బాధలను, కష్టాలను, ఇబ్బందులను అక్షరీకరిస్తున్న కవి మల్లిపు రం జగదీశ్‌. తమ జాతి మూలాలను అలాగే ఒడిసి పట్టుకొని వారి సంస్కృతి, సంప్రదాయాలను, పండగ లను, ఆచార వ్యవహారాలను తమ కవిత్వంలో చూపిస్తూ, తమ జాతికి జరిగే అన్యాయాలపై కవిత్వపు చైతన్య బావుటాను ఎగరవేస్తున్న గిరిపుత్రుడు మల్లిపురం జగదీశ్‌.
తెలుగు కథాసాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఆపాదించుకున్న కథకులు మల్లిపురం జగదీశ్‌. ఈయన కలం నుంచి ‘‘గాయం’’, ‘‘శిలకోల’’, ‘‘గురి’’ అను కథా సంపుటిలు ఇదివరకే తెలుగు పాఠకలోకం ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు ‘‘దుర్ల’’ కవితా సంపుటితో ఆదివాసీ జన జీవితాన్ని, సంప్రదాయాలను, బాధలను, ఇబ్బందులను, వారికి జరుగుతున్న అన్యాయాలను చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు. కథకుడిగా చేయి తిరిగిన జగదీశ్‌గారు ఇప్పుడు కవిత్వంలో కూడా తనదైన ప్రతిభను చూపించారు. ఆదివాసీ సమూహాల మీద జరుగున్న అన్యాయాలకి, ప్రభుత్వం వారి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణికి స్పందించి సందర్భానుసారంగా కవితలు రాసి ‘‘దుర్ల’’గా మన ముందుంచారు. ఆదివాసీ జనుల కష్టాలు,పథకాల పేర జరు గుతున్న మోసం,గిరిజనులకు అందని విద్య, ఆమడ దూరంలో ఉన్న వైద్యం, నరకయాతన పెట్టే రహదారులు మొదలైన గిరిజన సమస్యలు కళ్ళకు కట్టినట్లుగా ఈ కవితా సంపుటి నిండా జగదీశ్‌ గారు ఎత్తి చూపారు. ‘‘దుర్ల’’ కవితా సంపుటి 52 కవితల సమాహారం. ఇందులో ప్రతి కవితా పాఠకుల హృదయాన్ని ద్రవింప జేసి, చదివింపజేస్తుంది. ‘‘దుర్ల’’ సంపుటి కవిత్వంలోనే కాదు, కవితా శీర్షికల్లోనూ ఆ నూతనత్వం పాఠకుడిని పలకరిస్తుంది. శీర్షిక నుండే కవితా వస్తువుకు చెందిన ఆలోచనల్లోకి, సందిగ్ధావస్థల్లోకి, పరిశీలనాతత్వంలోకి, ఉత్సుకతలోకి పాఠకుడు అడుగులు వేస్తాడు. ‘‘పోరు ఎప్పటికీ ఆగదు,మాట్లాడుతాం,తూకం, పాట దారి,కొండ భాష,సృష్టి’’ వంటి శీర్షికల్లో కవి ఏ వస్తువును కవిత్వంగా మలచబోతున్నాడు అన్న ఉద్రిక్తత, సందిగ్ధత పాఠకుడిని సంఘర్షణ లోకి దించుతుంది. కవి తొలి విజయం కవితా శీర్షికల్లోనే పాఠకుడి నాడిని పట్టుకుని కవితలోకి వారి మనసును అంతర్లీనం కావించడం. ఈకవితా సంపుటికి శీర్షికగా నిలిచిన ‘‘దుర్ల’’. కవిత నిండా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, అడవి సౌందర్యం,ఆదివాసీ ఆడపడుచుల థింసా నృత్య సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తా యి. రచయిత తన మూలాలను,జీవితాన్ని ఈ కవిత నిండా చూపించే ప్రయత్నం చేసారు.‘‘పసుపు నీళ్ళ స్నానమాడి గుగ్గిలం ధూపంలోఎజ్జోడి మంత్రాలతో కొత్త కలల బొట్టుపెట్టుకొని కోడిపిల్లను ధరిస్తుంది గొడ్డలమ్మ’’ అని గిరిజన సంస్కృతిని,వారి ఆరాధ్య దైవాన్ని కొనియాడిన పద్ధతిని ఈకవితలోచిత్రీకరించారు. గిరిజను లంతా బృందంగా వెళ్ళి గొడ్డలమ్మ తల్లికి నీరాజనాలు పలికి,థింసా నృత్యాన్ని ఆ తల్లి ఎదుట ప్రదర్శిస్తారు. ఆ సన్నివేశాల న్నింటిని జగదీశ్‌ గారు చాలా చక్కగా‘‘దుర్ల’’ కవితలో చూపించారు.‘‘దుర్ల’’ అంటే అర్థం కంది కొత్తల పండుగలో.. పూజలందుకున్న గొడ్డలమ్మను చుట్టు ప్రక్కల ఊర్లకు ఊరేగిం పుగా తీసుకు పోవడమే ‘‘దుర్ల’’. ఇది ఉత్సవం జరుగుతున్న గ్రామాలన్నీ ఒకేసారి జరుపు కుంటారు. ఒక గ్రామ దుర్ల సమూహం మరొక గ్రామ దుర్ల సమూహానికి ఎదురైనప్పుడు గానీ, కలిసి నపుడుగానీ అక్కడ కలిసి రెండు గొడ్డల మ్మలూ నృత్యం చేస్తాయి. ఒక గ్రామం మరొక గ్రామం తో నేస్తరికం చేయడం దీనిలో ఆం తర్యం. ‘‘దుర్ల’’ ఆదివాసీ సమూహాలలో స్నేహంకి, సౌభ్రాతృత్వంకి,బంధంకి… ప్రతీక. నేటి ప్రపంచీకరణ యుగంలో అడవి,కొండ స్థానాలు ఎలాఉన్నాయో ‘‘తూకం’’ కవితలో చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు.‘‘సంతదారిలో బరువెంతైనా బతుకు తూకంలో కొండెప్పుడూ తేలికే’’ అనే మాటలు పాఠకుల హృదయాన్ని ఆలోచింపజేస్తాయి. ఇది జగదీశ్‌ మాష్టారి దుఃఖం మాత్రమే కాదు యావత్తు ఆదివాసీ సమూహ దుఃఖం.పచ్చని చీరతో నిండుగా ఉన్న అడివితల్లిని విద్వంసం చేస్తున్న ప్పుడు ఉబికిన కన్నీటి దుఃఖం ఇది. కొండపై అంతటి అవ్యా జమైన ప్రేమను కలిగిన కవి మల్లిపురం. అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను తలచుకొని ‘‘ఏవితల్లీ!’’ అనే కవితలో తన మనసులోంచి తన్నుకొస్తున్న బాధను అక్షరాల్లో పొందుపర్చారు.‘‘ఏవి తల్లీ…నాఅడవితల్లీ!! నిన్న మోగిన తుడుం డప్పులూ…? ఏవి తల్లీ…నాకొండ తల్లీ!! నిన్న పాడిన నాసవర గీతాలూ…?ఏవి తల్లీ… నాపోడు తల్లీ!! నిన్న నాటిన నా కలల విత్తు లు…? ఏవి తల్లీ…నాకొండ మల్లీ…!! నిన్న వేసిన ధింసా అడుగులు…?ఏవి తల్లీ… నాజా కర తల్లీ…!! నిన్ను కొలిచే నావారేరి తల్లీ?’’ అంటూ అడివిలోని అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి,సంప్రదాయాలపట్ల ఆవేదనను వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇల్లులు కోల్పోయి, నిర్వాసితులైన ఆదిమ జాతి కన్నీళ్ళును ‘‘ముంపు కన్నీళ్ళు’’ పేరుతో చెప్పుకొచ్చారు..‘‘కట్టండి ప్రాజెక్టులు మా సమా ధుల మీద…మా చితి మంటల మీద… మా గుడిసెల మీద..మునిగిపోతున్న మా బతుకులమీద.. పోలవరం అంటే ప్రోజేక్టుడు కన్నీళ్ళు పోలవరం అంటే ములిగిపోయిన వెల జీవాలు పోలవరం అంటే చెరిగిపోయిన ఆదిమ ఆనవాళ్ళు పోలవరం అంటే మాయమైపోయిన ఒకానొక అరణ్యం’’ అంటూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని గురించి వారికి జరుగుతున్న నష్టాన్ని జగదీశ్‌ మాష్టారు చెప్పారు. తమ రచనలు, గేయాలు ఎప్పుడూ తమ జాతికి దిక్సూచి కావాలనే మనస్తత్వం కలిగిన వారు జగదీశ్‌ మాష్టారు. ఆ క్రమంలోనే ‘‘పాట దారి’’ అనే కవితను రాశారు. ‘‘పాటంటే ఒక ఆయుధం ఒక జీవన నాదం ఒక నిప్పుకణం నా దృష్టంతా రేపటి మీదే పల్లవి పదునైనదైతే చరణాలు వాటంతటవే వేడెక్కుతాయ్‌ పాట దానంతటదే రగులుకుంటుంది..పది మందికి దారి చూపు తుంది’’ అని వారి భవిష్యత్తు ఆలోచన క్రమాన్ని ఈ కవితలో చెప్పారు. మౌనంగా ఉంటే తమ జాతి ప్రజలకి ఎప్పటికైనా రాజ్యం ఏలే సమయం వస్తుంది అది ఎప్పుడో కాదు అతి త్వరలోనే వస్తుంది. తమ హక్కులు తాము అనుభవించే రోజులు దగ్గరగానే ఉన్నాయి అని ‘‘ఎదురు చూపు’’ కవితలో తన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.
‘‘ఏదో ఒక రోజు…నీను కోరిన నా రాజ్జిము ఒస్తాది…నీనుండగానే ఒస్తాది ఆ నా రాజ్జిము సూసె ఎల్తాను అందాకా… ఎంత కష్టమైనా పడతాను గానీ పట్టొగ్గను… ఒగ్గనంతే… ఒగ్గను’’ అని తన ధృడ సంకల్పాన్ని ఈ కవితలో తెలియజెప్పారు. జగదీశ్‌ తన కథలు, కవిత్వం, గేయాల ద్వారా నిరంతరం గిరిజన యువతను చైతన్యపరుస్తునే ఉన్నారు. నిద్రాణమై ఉన్న తమ జాతి జనులను తన రచనల ద్వారా మేల్కొపుతూనే ఉన్నారు. తమ జాతి నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ‘‘జాగో… ఆదివాసీ! జాగో!!’’ కవితలో తన వేదనని, ఆవేదాన్ని వ్యక్తం చేసారు. ‘‘పీక తెగి పడుతున్నా కొండలు తరగనీకు జాగో… ఆదివాసీ! జాగో!! అంటూ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చిన పడినా కొండను ఎవరినీ తాకనివ్వొద్దని గిరిజనులను తన గళంతో,కలంతో మల్లిపురం జగదీశ్‌ గారు హెచ్చరిస్తూ, చైతన్యపరుస్తున్నారు. ‘‘రంగులు మార్చే రాజకీయాల్ని గమనిస్తూ వుండు కొండలు వెనుక పులులూ సింహాలు తిరుగుతున్నాయ్‌ నిన్ను ఉద్దరిస్తాయని రంగుబట్టలేసుకొని నీ భుజమ్మీద చెయ్యేసి నీతోనే అడుగులెస్తుంటాయ్‌ సంక్షేమ పథకాల ప్లకార్డులు పట్టుకుని నీ వెనకే గోతులు తవ్వుతుంటాయ్‌ జాగో.. ఆదివాసీ! జాగో!!’’ అంటూ ఆదివాసీ జనులను తన కవిత్వంతో జాగృతపరుస్తున్నారు. గిరిజనులను అభివృద్ధి పేరట నాగరికులు చేసే మోసాన్ని, రాజకీయ నాయకులు చేసే కుతంత్రాలను ఈ కవితలో జగదీశ్‌ గారు ఎండగట్టారు. గిరిజనులపై అటవీ అధికార్ల దాష్టీకాలు, పోలీసుల బెదిరింపులు నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ సాగుతూనే ఉన్నాయి. వాళ్ళ చేతిల్లో ఆదివాసీలు ఎల్లవేళలా నలిగి పోతూనే ఉన్నారని మల్లిపురం జగదీశ్‌ ‘‘పోరు ఎప్పటికీ ఆగదు’’ అనే కవితలో ఎలుగెత్తి చెప్పారు. ‘‘యుద్ధం తప్పనిసరైనప్పుడు ఆయుధం అనివార్యమవుతుంది..అది ఎండు గడ్డి పరక వ్వచ్చు అక్షరమైనా కావచ్చు’’ అని తన అక్షరాన్ని ఆయుధంగా ప్రకటించి, తన ధిక్కార స్వరాన్ని నాగరిక ప్రపంచానికి వినిపించారు. ఆదివాసీ లపైన జరిగిన దాడులు ఇప్పటివి కాదు అని అవి తరతరాలుగా సాగుతూనే ఉన్నాయని ఈ కవితలో స్పష్టం చేసారు.‘‘వనాలనే కాదు వాసు లనూ నరకడమే ఒకానొక సంస్కృతి నేటిదా? తెగిపడ్డ ఏకలవ్యుని బొటనవేలు చెబుతుంది ఏనాటిదో! రాలిపడ్డ శూర్పనఖ ముక్కు చెవులు చెబుతాయి ఈ దమన కాండ ఎప్పటిదో!’’ అంటూ ఆదివాసీ సముహంపై అనాది నుండి జరుగుతున్న దాడులను కవి ఇప్పటికీ ఖండి స్తూనే ఉన్నారు. ప్రపంచమంతా దినదినాభివృద్ధి చెందుతూ సాంకేతిక పరిజ్ఞానంతో తేజరిల్లు తున్న కాలంలో కూడా కొండాకోనల్లో నివసిస్తూ అడివికే పరిమితమైన తమ జాతి స్థితికి, వారి బతుకుకి అద్దంపట్టే కవిత ‘‘మేము’’… ‘‘ఇప్పటికే నెట్టివేయబడ్డవాళ్ళం..అడుగు తీసి అడుగెయ్యని వాళ్ళం..అడవి నుంచి బయటకు రానివాళ్ళం..కొండాకోనల్లో ఇరికిపోయినవాళ్ళం ఊష్టమొస్తేలి ఎజ్జోడివైపే ఆశగా చూస్తున్న వాళ్ళం..డోలీల్లోనే రాళ్ళదారులు సాగుతూ ఆసుపత్రికి తరతరాల దూరంలో నిలిచిపోయిన వాళ్ళం’’ అని తమ జాతి వారికి ఇంకా సమృ ద్ధిగా చేరువలో వైద్యం అందక చనిపోతున్న గిరిజనులను చూసి చలించిపోతూ ‘‘శిలాక్షరాల దారిలో బిగించిన పిడికిలితో సిద్ధమయ్యాం ఒక వేకువ కోసం!!!’’ అంటూ తన ఆగ్రహాన్నిజగదీశ్‌ వ్యక్తం చేసారు. ఇన్నేళ్ళు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండి అడవికే పరిమితమైన మేము ఇప్పుడు మాట్లాడుతాం..ఎవరికీ భయపడేదే లేదని, ఇప్పుడు మాకు మాట్లాడే సమయం వచ్చిందని మల్లిపురం ‘‘మాట్లాడుతాం’’ కవితలో తన మాటలను తూటాల్లా ఈ కవితలో పొందు పర్చారు.‘‘మౌనం ఇప్పుడు నిషేధం మాట్లాడ్డం తప్పనిసరి ఇప్పుడు మాట్లాడ్డం అంటే ఆయు ధాల్ని సిద్ధం చేయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే నిశ్శబ్ధంగా మాటుకాయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే కొండను మింగేబోతున్నోడి పీకమీద అడుగెయ్యడమే’’ అని తమ జాతి ఆవేదనను తన గళం ద్వారా వినిపిస్తూ.. ‘‘మాట్లాడుతాం! మాట్లాడుతాం! కొండ మీద దీపాలు వెలిగేదాక మాట్లాడుతాం!! మా దీపా లు ఆర్పినోడి దీపం ఆరేదాకా మాట్లాడుతాం!!! అని ఇప్పుడు మీరు కాదు. మేము మాత్రమే మాట్లాడే సమయం. మేమే మాట్లాడుతాం అని తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఈ కవితలో వెల బుచ్చారు.మల్లిపురం జగదీశ్‌ మాష్టారులో ఉత్తరాంధ్ర యాస,వెటకారం,వ్యంగ్యం కలగ లసిన క్రియాశీల కవి. ఆయన వ్యంగ్యానికి నిదర్శనంగా ‘‘తేడా’’ కవిత నిలుస్తుంది.‘‘నీ అక్ష రాలు ఆకలిని చూడ్డానికి వెనకడుగేస్తాయి! నా అక్షరాలు ఆకలి తీర్చడానికి అంబలిని వుడకేస్తుంటాయ్‌!! నీ అక్షరాలు అధికారపు అహంకారాలు నా అక్షరాలు ఆకలి కేకల హాహాకారాలు’’ అంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు అని అన్నవాళ్ళకు ఈ కవిత గొప్ప కనువిప్పు.జగదీశ్‌ గారి భవిష్యత్తు ప్రణాళికకు,వ్యూహాత్మక రచనకు ప్రతీక ‘‘దుర్ల’’ కవితా సంపుటి. కవిగా తాను భవిష్యత్తులో చేయవలసిన పనులు, రచనలు మొదలైన విషయాలు అన్నీ ఇందులో సంపూ ర్ణంగా దర్శనమిస్తాయి.‘‘కలం’’ కవితలో ఆయన తాత్త్వికత కనిపిస్తుంది.‘‘గతం చీకటి వర్తమానం నెత్తురు భవిష్యత్‌ దహనం జ్వలనం నా కర్తవ్యం’’అని తాను నిరంతరం తమ జాతి కోసం వెలిగే దీపమై ఉంటానని, తమ జాతి నిర్మాణానికి నడుం బిగిస్తానని తన రచనల ద్వారా వ్యక్తంచేసారు. ఆదివాసీ సమూహాన్ని తన అక్షరాలతో నిరంతరం ఉత్తేజపరుస్తూనే ఉన్నారు జగదీశ్‌ మాష్టారు. ఆయన లక్ష్యం, గురి ఎప్పుడూ తమ జాతి ప్రజలకు జాగృత పరచడమే. ఆనేపథ్యం లోంచే పుట్టుకు వచ్చిన కవితా సంపుటి ఈ‘‘దుర్ల’’.ఈ సంపుటిలో‘‘సృష్టి’’ కవిత పాఠకుల్ని మరింత ఆకర్షిస్తుంది. ‘‘నా అక్ష రాలు వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు నాఅక్ష రాలు రాత్రికి రంగులద్దే డప్పు వరసలు నా అక్ష రాలు కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు నా అక్షరాలు కొండ దొంగ లపై ఎక్కుపెట్టిన శిలకోల మొనలు నా అక్షరాలు రేపటికి పదును పెట్టే నేటి కవితా పాద పద్యాలు నాకు కవిత్వమంటేఅరణ్యాలను సృష్టించడమే!’’ అంటూ తన కవిత్వం ఎప్పుడూ తమ జాతి జనులను చైతన్య పరచడం కోసమే నిర్మించబడుతుంది అని ఎలుగెత్తి చాటి చెప్పారు. అడవులలో, కొండలలో నివసించే గిరిజనుల బతుకు చిత్రాలను తన కవితలలో జగదీశ్‌ మాష్టారు చూపించారు. గిరిజనుల సంస్కృతిని, అడవి సౌందర్యాన్ని ఒకవైపు చూపిస్తూ, పెత్తందార్లు, పెట్టుబడిదార్లు, షావుకార్లు, నాగరికులు, రాజకీయ నాయకులు వచ్చి గిరిజనుల సంపదను దోచుకుని, కొండను ఆక్రమించుకొని, ఆ కొండకు వాళ్ళని దూరం చేసే దుర్మార్గ సన్నివేశాల్ని మరో వైపు బలంగా చూపించారు. ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని వ్యతిరేకిస్తూ తమ జాతికి జరుగుతున్న అన్యాయాలను అక్షరీకృతం చేస్తున్న పదునైన కలం జగదీష్‌ మాష్టారిది.కవిగా జగదీష్‌ మాష్టారు మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగా మాట్లాడి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు. తమ జాతి హక్కుల కోసం, ప్రగతి కోసం తన రచనలు సాగిస్తాడు.‘‘దుర్ల’’ కవితా సంకల నంలో ప్రతి కవితా సభ్య సమాజానికి ఒక ప్రశ్నే. ప్రతి కవితా చైతన్య గీతమై సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఇంత మంచి కవితా సంక లనాన్ని తను పుట్టి, పెరిగిన‘‘పి.ఆమిటి’’ గ్రామా నికి అంకితం ఇవ్వడం ఆయనలోని కృతజ్ఞతకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అదే గ్రామంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో జాకరమ్మ తల్లి ఎదుట ఎజ్జోడు(పూజారి) మంత్రాల నడుమ గ్రామ ప్రజలందరి మధ్య ఆవిష్కరణ జరిపి తన భక్తిని, విశ్వాసాన్ని నిరుపించుకుని మరో అడుగు ముందుకేసారు. ఈ ‘‘దుర్ల’’ కవితా సంపుటి ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినదే అయినా దాని వెనుక గిరిజనుల అవస్థలు, వారిపై పెత్తందార్లు, షావుకార్ల, రాజకీయ నాయకులు దోపిడిని ఇతర వర్గాలు కూడా గమనించాల్సిన అవసరాన్ని కవి చెప్పకనే చెప్పారు. జగదీశ్‌ కేవలం గిరిజన కవి మాత్రమే కాదు. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వాటిపై ప్రతిస్పందించడమే గాక, వాటికీ అక్షర రూపమిచ్చి సమాజంలోని రుగ్మతులను రూపుమాపాలని తపనపడే కవి మల్లిపురం.- సారిపల్లి నాగరాజు ,8008370326