ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-26 కొత్త జిల్లాలు

పాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన జిల్లాల విభజనలో హేతుబద్ధతలేదు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల విభజన చేయాలి. భౌగోళిక, ప్రాంతీయ సమతూకం పాటించకుండా కేవలం రాజకీయ ప్రయోజ నాలు,స్వార్థంతో విభజన చేపట్టడం సబబు కాదు.రాజకీయ స్వార్థంతో కాకుండా ప్రజల అవసరాల ఆధారంగా జిల్లాల విభజన జరగాల్సిన అవశ్యకత ఉంది.
జిల్లాల విభజనలో హేతుబద్ధత కరువు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్ర పటం మరొకసారి మారి పోతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన వెంటనే దీని పనులు శరవేగంగా సాగుతు న్నాయి. నూతన జిల్లా కేంద్రాలయాల్లో ఆఫీసులు,స్థలాలు,ఉద్యోగుల విభజన వంటి పనులు జరుగుతున్నాయి. ఉగాదినాటికి కొత్త జిల్లాలో పాలన కొనసాగాలని ప్రభుత్వం భావి స్తోంది. జిల్లా కార్యాలయాలు ప్రజల సమీ పానికి వస్తాయనేది చిన్న జిల్లాల ఏర్పాటును సమర్థించుకుంటూ ప్రచారమవు తున్న సిద్ధాం తం. దీనివల్ల పాలనాపరమయిన ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంగీకరిస్తూనే ఈ ఆశయం నెరవేరే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు తీసుకువచ్చిన పరిపాలనలో గుణా త్మక మార్పేమి లేకపోవ డాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు. ఇప్పు డున్న జిల్లాల సరిహ ద్దులు చెరిపేసి ప్రజలకు అనుకూల మయిన కొత్త సరిహద్దులను సృష్టించడం వల్ల పాలన మెరుగుపడుతుందని, ఆయా ప్రాంతాల అభి వృద్ది సుగమం అవు తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఇది కేవలం భ్రమ అని,రాజకీయలబ్ది కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని జిల్లాల ఏర్పాటును చూస్తే అర్థమవుతుందని చాలా మేధావులు, రాజకీయ నాయకులు చెప్పారు.
ప్రజల ముంగిట పాలన
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని పాలనా వికేంద్రీకరణగా,ప్రజల ముంగిటికి పాలన తీసుకెళ్లడంగా,పాలనా సంస్కరణగా ప్రభు త్వాలు పిలుస్తున్నాయి. ప్రజల ముంగిటికి పాలన అనేమాట 1986లో మొదట వినిపిం చింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈ నినాదంతోనే ఒక శతా బ్దానికిపైగా చరిత్ర ఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాహ శీల్దార్‌ పదవికి ఉన్న హోదాను,హంగును తీసే శారు.‘పవర్‌ ఫుల్‌’ తాహశీల్దార్‌ని మండల రెవిన్యూ అధికారిగా మార్చి జనం మధ్యకు తీసుకువచ్చారు. అయితే, తర్వాత సంస్కరణలు ఆగిపోయాయి. జిల్లాను సంస్కరించే పని ఎవరూ చేయలేదు. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన తర్వాత,ఎప్పుడో బ్రిటిష్‌ కాలం లో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరి పేసి చిన్న జిల్లాలను సృష్టించి కలెక్టర్‌ పదవిని కూడా జనం మధ్యకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది.ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీ నం చేసి ముఖ్యమంత్రులను ఇంకా శక్తివం తులను చేస్తుందా అనేది ప్రశ్న.కలెక్టర్‌,ఎస్పీల గ్లామర్‌ తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లా లను సృష్టించడంతో జిల్లా కలెక్టర్‌ అధికార విస్తృతి,దర్పం తగ్గిపోతాయి. కలెక్టర్లు ఇపుడు డివిజన్‌ హెడ్‌ క్వార్టర్‌ కంటే చిన్న ఊర్లలో కూర్చోవలసి వస్తుంది. ఇదే పరిస్థితి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి కూడా ఎదురవు తుంది. ఉదాహరణకు కడప జిల్లాను విడదీసి రాయచోటి జిల్లాను సృష్టించారు. ఇది డివిజినల్‌ హెడ్‌ క్వార్టర్‌ కూడా కాదు. ఇప్పుడు ఈఊరి లో కలెక్టర్‌ ఆఫీస్‌ వస్తుంది. ఎప్పుడో గాని కన్పించని కలెక్టర్‌ని,జిల్లా ఎస్‌పీని ఈఊరి ప్రజ లు రోజూ చూస్తారు. వారితో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఎందరో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆ చిన్న ఊర్లో రోజూ తారసప డతారు. ఇలా కొత్త జిల్లాలు ఒక వినూత్న పాలనానుభవాన్ని తీసుకువస్తున్నాయి. ‘సాధార ణంగా ప్రజల్లో ‘అబ్బో కలెక్టర్‌ ఆఫీస్‌ చాలా దూరం, కలెక్టర్‌ని కలుసుకోవడం చాలా కష్టం,’ అనే భయభావం ఉంటుంది. దీని వల్లే సాధా రణ ప్రజలకు ఈ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ఒక మధ్యవర్తి జోక్యంగాని,రాజకీయ నాయకుడి సాయంగాని అవసరమయింది,ఊరికి దూరం, ఉన్నతాధికారి అంటే ఉన్న భయభావం చిన్న జిల్లాల ఏర్పాటుతో పోయే అవకాశం ఉంది’’ ‘‘అంటే చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పైరవీ కారుల అవసరం తగ్గే వీలుంది. అదే సమ యంలో చిన్న జిల్లాల అధికారులకు పెద్ద జిల్లాల నాటి హుంగు ఆర్భాటాలు తగ్గిపో తాయి. ఇది ఆశించదగ్గ పరిణామం’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్‌ శ్రీనివాసులు అన్నారు. ఇలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన మరొక విశ్రాంత ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు.‘‘1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు9జిల్లాలుండేవి.ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1970 ఫిబ్రవరి 1న గుంటూరు,నెల్లూరు,కర్నూలు జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఆపైన 1979 జూన్‌ 1న విజయ నగరం జిల్లా ఏర్పడిరది. అప్పటి నుంచి ఇప్పటి దాకా జనాభా పెరుగూతూ వచ్చింది. తెలం గాణ నుంచి కొన్ని మండలాలు కలవడంతో తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం పెరిగింది. ఈ కారణాలతో కొత్తగా చిన్న జిల్లాలను సృష్టిం చడం ఒక ఆహ్వానించదగ్గ సంస్కరణ. ముఖ్యం గా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కొంత మేలు జరుగుతుంది’’‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్టణం నుంచి తూర్పుగోదావరి జిల్లా జంగారెడి గూడెందాకా 500 కి.మీ పరిధి గిరిజన ప్రాంతం ఒకే ఎంపీ కింద ఉండేది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రెండు జిల్లాలుగా మార్చారు. జిల్లాల పరిమాణం బాగా కుంచించుకుపోతుంది. ఇదొక మంచి ప్రయోగం’’ అని ప్రొఫెసర్‌ చలం అన్నారు.
చిన్న జిల్లాల పెద్ద ఆశయం నెరువేరుతుందా?
ఆశయపరంగా చిన్న జిల్లాలను సృష్టించడం చాలా మంచి నిర్ణయం అనే విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా అందరిలో ఏకాభిప్రాయం ఉంది. అయితే, ఈ ఆశయం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో నెరవేరుతుందా అనే దాని మీద అందరిలో అనుమానా లున్నాయి. ప్రజలకు పరిపాలన చేరువ కావడం అంటే ఏమిటి?జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని 250 కి.మీ దూరం నుంచి 100కి.మీ దూరా నికి మార్చినందున పరిపాలన దగ్గరవుతుందా? పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి? చిన్న జిల్లా ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ అవుతుందా?ఈ ప్రశ్నలకు ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన తెలంగాణలో సమా ధానం దొరకడం లేదు. రేపు ఆంధ్రలో కూడా ఇదే పరిస్థతి వస్తుంది. జిల్లాలొస్తాయి గాని, ఆశయాలు నెరవేరుతాయన్న గ్యారంటీ లేదు.1986లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ప్రజల వద్దకు పాలన’అని నినాదమీయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పటికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ లేదు. మీ-సేవా కేంద్రాలు, ఇ-సేవా కేంద్రాలు లేవు.ఏదయినా సర్టిఫికేట్‌, రిజస్ట్రేషన్‌, దరఖాస్తు అవసరమయితే, ఎపుడొస్తుందో తెలియని ఆర్టీసీ ఎర్రబస్సును నమ్ముకుని తాలూకా కేంద్రానికి, జిల్లా కేంద్రా నికి వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసి బస్సు అంటే ‘రాదు, తెలియదు, చెప్పలేము’ అని నవ్వులాటగా ఉండే రోజులవి. అపుడు జిల్లా కార్యాలయానికి రావాలంటే చాలా కష్టమయ్యేది. ఇపుడా పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ కార్యాల యాలకు ప్రజలు రానవసరమేలేకుండా ఆన్‌లైన్‌ సేవలు వచ్చాయి. చాలా చోట్ల ప్రజలను కార్యాలయాల్లోకి రానీయడం లేదు. మీ-సేవా కేంద్రాలు వచ్చాయి. ఇ-సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచే దరఖాస్తు చేసు కోవచ్చు. అంతేకాదు, కొన్ని రకాలసేవలను ప్రజలు స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి పొందుతు న్నారు. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ పాఠశా లలు,ఆన్‌లైన్‌ వైద్యం, జూమ్‌ మీటింగులు అందుబాటులోకి వచ్చాయి. అధార్‌ కార్యాల యానికి వెళ్లకుండా ఆధార్‌ కార్డు వస్తున్నది. ఇలాగే ఇన్‌కంటాక్స్‌ ఆఫీస్‌ ముఖం చూడకుండా పాన్‌ కార్డు వస్తూ ఉంది. ఇలాంటపుడు ప్రజలు ఇంకా ప్రభుత్వకార్యాలయాలకు రావడం ఎందుకు? కొత్త జిల్లాలు ఎందుకు? కాకపోతే, ఎప్పుడో ప్రారంభమయిన ఉపప్రాం తీయ జిల్లా డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. భావోద్వేగం సృష్టిస్తున్నాయి. అందువల్ల కొత్త జిల్లా ఏర్పాటు కూడా, కొత్త రాష్ట్రం ఏర్పాటు లాగా రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడయితే, కొత్త జిల్లా ఏర్పాటు కేంద్రంలో ‘రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ’ తీసుకువస్తుంది.ప్రజల భావోద్వేగాలను వాడుకునేందుకు తప్ప కొత్త జిల్లాలు అదనపు ప్రయోజనం తీసుకువచ్చే అవకాశం లేదని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘కొత్త జిల్లాల సృష్టి అవసరమే. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న ఉన్నతాశయం నెరవేర్చే వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌లో ముందు చూపు లేకుండా ప్రారంభించిన అనేక పథకాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపాయి. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బిసి)లను తెరిచారు. మూసే శారు. ఇపుడు ఉద్యోగస్థులకు జీతాలు కూడా చెల్లించే స్థితి లేదు. వాళ్ళకి పిఆర్‌సి అమలుచేయకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దానికి కావలసిన భవనాలు, ఇతర వసతులు సమకూర్చుకు నేందుకు వ్యయం తడిసి మోపెడవుతుంది. ఈ నిధులెక్కడి నుంచి తెస్తారు?’’ ‘‘మొదట ప్రభుత్వం అనవసర వ్యయం తగ్గించి, రాబడి పెంచుకుని,కొత్త జిల్లాల గురించి ఆలోచిం చాల్సి ఉంది. అయితే, జగన్‌ ప్రభుత్వానికి ప్రజాసౌలభ్యం కంటే రాజకీయ సౌలభ్యం ముఖ్యం. ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటించి, అసలు సమస్య నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కొత్త జిల్లాలందుకే తప్ప, పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లడం కాదు’’ అని అంటు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు హేతుబద్ధత లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది పాలన వికేంద్రీకరణ కోసం అని, పరిపాలనను ప్రజలకు చేరువచేయడం అనే ప్రభుత్వం ప్రకటిస్తున్నా, చాలా చోట్లా అది ఆశయాన్ని దెబ్బతీసింది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు కొత్త సమస్య తీసుకువస్తాయని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఇఎఎస్‌ శర్మ అన్నారు. ఆలోచించదగ్గ రెండు అంశాలను ఆయన పేర్కొన్నారు.1) కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కొన్ని గిరిజన గ్రామాలకు జిల్లా హెడ్‌ క్వార్టర్లు దూరమవు తున్నాయి. ఉదాహరణకు, విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు నుండి అరకు కొత్త జిల్లా కేంద్రానికి రావాలంటే అక్కడి గ్రామస్థులు 5 నుండి 7 గంటలు ప్రయాణిం చవలసి ఉంది. దూరాలను తగ్గించకపోగా దాన్ని పెంచే విధంగా ఉండే పునర్వ్యవస్థీకరణ వల్ల ఉపయోగం ఉండదు. 2) కొత్త జిల్లాల కారణంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో హెడ్‌ క్వార్టర్‌ లో జన సాంద్రత పెరగడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున రావడం వలన అక్కడ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు భంగం కలుగు తుంది. అది కాకుండా భూ బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించే ప్రమాదం ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, గిరిజన గ్రామాలకు రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారాలివ్వకుండా కొత్త జిల్లాలను సృష్టించి వికేంద్రీకరణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిం చారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 1986లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకుని, గిరిజనులు అధికంగా నివసిస్తున్న 800కు పైగా గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిం చింది. కేంద్రం ఆ ప్రతిపాదనకు సూత్రప్రా యంగా అనుమతి తెలిపింది. ‘‘మండలాల వారీగా ఆ గ్రామాల లిస్టులను పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి 500కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తెలుగు రాష్ట్రాలు రెండు ఆ విష యంలో కేంద్రానికి ఇంతవరకు జవాబు ఇవ్వ కుండా ఆలస్యం చేస్తూవస్తున్నాయి. దీని వలన గిరిజనులకు అపారమైన నష్టం కలిగింది. ఈ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఉండవలసింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 50శాతం గిరిజన జనాభా ఉన్న మండలాలను షెడ్యూల్‌ 5లో చేర్చాలి. ‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సరవకోట, పాతపట్నం, మెళియపుట్టి మండలాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని గిరిజన జిల్లాలో చేర్చాలి లేదా జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇలాగే,73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అధికారాలను పంచాయతీలకు బదలాయించాలి. ఇదింత వరకు జరగలేదు. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగి తీరాలి. అపుడే కొత్త జిల్లాల ఏర్పాటు ఆశయం నెరవేరుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -జి.ఎన్‌.వి.సతీష్‌