అటవీ సంరక్షణ చట్ట సవరణ అటవీ హక్కుల నిరాకరణ

గుండుగుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళిం చాలంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసుల అటవీ హక్కులను దెబ్బతీసే విధంగా వున్నాయి. ఆది వాసుల అటవీ హక్కులను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం సవరణ చేస్తున్నది.
అడవిలో లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థలు,బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అటవీ చట్టాలు అడ్డంకిగా వున్నాయి. విలువైన సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆటంకంగా వున్న చట్టాలను వారికి అనుకూలంగా సవరించే పని మోడీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. అందుకు కొత్త నియమ నిబంధనలు ప్రతిపాదించారు. అటవీ ప్రాంతంలో లీనియర్‌ ప్రాజెక్టులను (జాతీయ రహదారులు, పైపులైన్లు, ట్రాన్స్‌మిషన్‌…) ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి గిరిజన గ్రామ సభ అనుమతి అక్కర్లేదని 2013లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను 2019లో ఎ.పి హైకోర్టు కొట్టేసింది. గిరిజన గ్రామసభకు వున్న విస్తృత అధికారాన్ని న్యాయ స్థానం గుర్తించడంతో, ముసాయిదా బిల్లులో గ్రామసభను సంప్రదించాలని మాత్రమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పేర్కొంది.అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియో గించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కింది నిబంధనలు పాటిం చాలి.1.ముందుస్తు గ్రామసభ అనుమతి తీసుకోవాలి.2. నిర్వా సితులకు నష్టపరిహారం చెల్లించాలి.3.అడవు లు పెంచడానికి ప్రత్యేక భూమి కేటాయించాలి. ఈ నిబంధనలు కార్పొరేట్‌ శక్తులకు అడ్డుగా వుండడంతో వాటిని సవరించబూనుకుంది. మైనింగ్‌ కోసం ఐదు హెక్టార్ల భూమిని డి-రిజర్వ్‌ చేయడానికి, ఆక్ర మణ భూమిని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సు అవసరమని, 2003లో జారీ చేసిన నియమాలను పక్కనబెట్టి, మోడీ సర్కారు కొత్త నియమాలు తీసుకొస్తోంది. క్లాజ్‌ 9(బి)-1 ప్రకారం గ్రామసభ లేదా హక్కుల పరిష్కార ప్రస్తావన లేదు. క్లాజ్‌ 9(బి)-2 ప్రకారం డి-రిజర్వుడు ఆర్డర్‌ను జారీ చేయడానికి గ్రామసభకు వున్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఆదివాసుల హక్కులు హరించ బడతాయి. అటవీ హక్కుల చట్టానికి తూట్లు తీవ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో అవుట్‌ పోస్టు నిర్మాణానికి అటవీ భూమి వినియోగ పరిమితి విషయంలో ఒక హెక్టార్‌ భూమిని రిజర్వ్‌ ఫారెస్టు భూమి నుండి మినహాయించడం 2005లో ప్రారంభమైంది. ఈ మినహాయింపు క్రమంగా 40 హెక్టార్లకు పెరిగింది. గుండు గుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళించా లంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు.
చట్ట సవరణ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం
ఆదివాసుల సాంప్రదాయ హక్కులతో ముడిపడిన హక్కుల నిర్ధారణ తర్వాతే…అటవీ భూమి మళ్లింపు అనుమతులను పరిశీలించాలని ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మధ్య నడిచిన కేసులో…2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని తీర్పులో స్పష్టం చేసింది. అయినా మోడీ మొండిగా గ్రామసభ, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగ శాసనంగా పేర్కొన్న పీసా చట్టానికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసినా, నూతన అటవీ సంరక్షణ చట్టసవరణలతో రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లుపొడుస్తున్నది. వనరుల నిర్వహణ, హక్కుల నిర్ధారణ, అమలు చేసే అధికారం గ్రామసభలకు ఉంటుందని 2010 లో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. నూతన అటవీ సంరక్షణ చట్ట నియమాల్లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాత్రను కనీసం ప్రస్తావించ లేదంటే ఆదివాసీ లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమవుతుంది. మైనింగ్‌ యేతర పనులకు భూమి వినియోగానికి వంద రోజుల్లో, మైనింగ్‌ కార్యకలాపాలకు 150 రోజుల్లో అటవీ, పర్యావరణ అనుమతి జారీ చేసేలా స్క్రీనింగ్‌ కమిటీకి అధికారం అప్పగిస్తూ నియమాలు రూపొందించారు. రక్షిత అడవుల్లో లినియర్‌ ప్రాజెక్ట్లు నిర్మాణమవుతాయని, భూమిని పూర్తిగా వినియోగించే అవకాశం వుంటుందని పేర్కొంది. అటవీ పెంపకం కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం సరికాదు. క్షీణించిన అటవీ భూమిని ప్లాంటేషన్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీలకు లీజుకిచ్చే అంశంపై గతంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఎస్‌.సి సక్సేనా కమిటీ చాలా విలువైన సూచనలు చేసింది. అడవులు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తాయని నిర్ధారించినా… నేడు ఈ లక్షలాది మంది ప్రజలకు ఏమౌతుందో నిబంధనలలో ప్రస్తావించనేలేదు. జాతీయ మోనెటైజేషన్‌ పథకం అమలు రైల్వే శాఖకు అభయారణ్యాలు, నేషనల్‌ పార్క్‌లలో కొన్ని నిబంధనల నుండి 2009 లోనే మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ, సామాజిక ఆస్తులను ప్రైవేటు, కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికిగాను జాతీయ మోనెటైజేషన్‌ పథకం 2022-2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. రైల్వే శాఖ, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు 18 లక్షల ఎకరాల అటవీ భూమిని మోనెటైజేషన్‌ చేయదగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుంచి మొత్తం మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపులన్నీ, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు కూడా వర్తింపజేయాలని నిబంధనలలో ప్రతిపాదించారు. కేంద్రం ఆధీనంలోని అనేక గనులను మోనెటైజేషన్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు లీజుకిచ్చి రూ.28,747 కోట్లు ఆర్జించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వరంగ గనులను ప్రవేట్‌ పరం చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం పభుత్వ లక్ష్యంగా కనబడుతున్నది. ఇది ఆదివాసుల రాజ్యాంగ హామీలకు పూర్తిగా విరుద్ధం. అంతేగాక ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌, పీసా, సవరించిన వన్య ప్రాణుల రక్షణ చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.-పి. అప్పలనర్స