అటవీహక్కుల చట్టంతోనే… ఆదివాసీలకు భరోసా….!

ఆదివాసీలు, గిరిజనులకు అడవి అమ్మ లాంటిది. వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది అడవే. వారి బతుకుదెరువు మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంది. అటవీ వనరులను వాడుకుంటూ, పోడు భూములను దున్నుకుంటూ బతికేవారే ఎక్కువ. వీరి హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిందే అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ప్రజాస్వామిక విలువలను పాటించడమే. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తేనే ఆదివాసీలు,గిరిజనేతరుల హక్కులను రక్షించగలు గుతాం. అడవుల పరిరక్షణకు, ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించగలుగుతాం.
అన్ని రాజకీయపార్టీలు,ప్రజాసం ఘాలు కలిసికట్టుగా చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అటవీహక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు రైతుల సమస్యలకు పరిష్కారం వెతుకు తామని ప్రకటించింది. ఇదిఆహ్వానించ దగిన పరి ణామం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈచట్టం అమలు బాధ్యతను పూర్తిగా అటవీ శాఖకు అప్పగిం చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికా రులు శాటిలైట్‌ ఫొటోల్లో 2005కు ముందు పోడు భూములు దున్నుకున్నట్టు సాక్ష్యం కనబడకపోతే క్లైమ్‌ ఫారాలను తిరస్కరించే ప్రమాదం కనబడు తోంది. ఈ ప్రమాదం నుంచి పోడు రైతులు రక్షణ పొందాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అర్థం చేసుకోవాలి.
హక్కును కోల్పోయిన ఆదివాసీలు
అడవులను చట్టబద్ధంగా గుర్తించి, ప్రభుత్వ అధీ నంలోకి తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలకు, ఆడవు ల్లో నివసించే ఇతర సమూహాలకు జరిగిన అన్యా యాలను సరిదిద్దడానికే అటవీ హక్కుల చట్టం వచ్చింది. బ్రిటిష్‌ పాలకులు అడవులను హస్తగతం చేసుకున్న నాటికే.. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనే తరులు నివసిస్తున్నారు. అటవీ వనరులను వీరంతా ఉపయోగించుకునే వారు. దానికి తోడు అడవుల్లోనే పోడు చేసుకొని బతుకుదెరువు పొందేవారు. అడవి వారికి ఇల్లు, జీవిక. ఎప్పుడైతే ఈ అడవుల చుట్టూ గీత గీసి వాటిని తమసొంత ఆస్తిగా బ్రిటిష్‌ పాల కులు,స్థానిక సంస్థానాధీశులు ప్రకటించారో.. అక్కడ నివసించే ఆదివాసీలు, గిరిజనేతరులు అప్ప టి వరకు తాము అనుభవించిన వనరులపై కలిగి ఉన్న సంప్రదాయక హక్కులను కోల్పోయారు. హక్కులను కాపాడేందుకే కుమ్రం భీం పోరాటం ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీల హక్కులను కాపాడటం కోసమే కుమ్రంభీం పోరాటం చేశారు. 1940దశకంలో నిజాం ప్రభుత్వం అడవుల సం రక్షణ పేరుతో చట్టం ప్రకారం అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. అందువల్ల అడవుల్లో నివ సించే ఆదివాసీలు,గిరిజనేతరులు ఆక్రమణదారు లుగా మారిపోయారు. అడవుల్లో దున్నుకోవటానికి గాని, అటవీ ఉత్పత్తులను అనుభవించడానికి గాని వారికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు,ఉపయోగించినందు కు వారిపై అటవీశాఖ శిక్షలు వేయడం ప్రారంభిం చింది. అలా అడవులను తమ ఇల్లుగా భావించిన ఆదివాసీలు,గిరిజనేతరులను రాష్ట్ర ప్రభుత్వం చొరబాటుదారులుగా చూడటం మొదలైంది. దాని ఫలితంగా ఆదివాసీలు తమ బతుకుదెరువు కోల్పో యారు. తమ హక్కుల సాధన కోసం కుమ్రం భీం నేతృత్వంలో పోరాడారు. అప్పటి నుంచి ఆదివాసీలు పోయిన తమ హక్కుల సాధన కోసం ప్రతి ప్రభు త్వాన్ని అడుగుతూనే ఉన్నారు.
ఇది భూమి పంపిణీ చట్టం కాదు
చివరికి 2004లో అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సంప్రదాయకంగా ఆదివాసీలు అనుభ విస్తున్న హక్కులను గుర్తించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో వచ్చిందే అటవీ హక్కుల చట్టం. ఇది భూమి పంపిణీ కోసం ఏర్పడిన చట్టం కాదు. ఆదివాసీల, ఇతర అటవీ సమూహాల సంప్రదాయక హక్కుల పరిరక్షణ కోసం వచ్చింది. ఆహక్కులను గుర్తించడానికి కూడా ఇది వరకటి చట్టాల మాదిరి గా కాకుండా చాలా వినూత్నమైన పద్ధతు లను తీసుకొచ్చింది. హక్కుల గుర్తింపు ప్రక్రియలో ప్రజ లకు విస్తృత భాగస్వామ్యం కల్పించింది. ఇవన్నీ అర్థమైతే తప్ప ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని గమనించాలి. అందుకే ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
అనుభవిస్తున్న భూమికి పట్టాలు
ఈచట్టం మిగతా భూమి పంపిణీ చట్టా లు, ఉత్తర్వుల కన్నా భిన్న మైనది. ఆచట్టాల ప్రకా రం ప్రభుత్వ మిగులు భూమి ఉంటే, అధికారులు సర్వే చేసి అలాంటి భూమిని పంపిణీ చేయవచ్చు. భూమి పంపిణీకి ఒకగరిష్ట పరిమితి ఉన్నది. అంత కు మించి ఇవ్వరాదు. ఈ చట్టాలతో పోలిస్తే అటవీ హక్కుల చట్టానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం భూమిని పంచదు. అడవుల్లో ఆదివాసీలు,గిరిజనేతరులు అనుభవిస్తున్న హక్కు లను గుర్తిస్తుంది. 10ఎకరాల లోపు ఎంత భూమి అనుభవిస్తే అంత భూమికి పట్టా ఇవ్వాలి. పోడు రైతుల యాజమాన్యపు హక్కులను నిర్ధారించేది గ్రామసభ ద్వారా ప్రజలేనని తెలుసుకోవాలి. దరఖా స్తులు తీసుకునేది, క్లెయిములను పరిశీలించేది గ్రామ సభ నియమించిన అటవీ హక్కుల కమిటీ అని గుర్తు పెట్టుకోవాలి.
రాజకీయ జోక్యం తగదు
చట్టం అమలులో ఎమ్మెల్యేలకు పాత్ర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు మీడి యాలో వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజలకు, పోడు రైతులకు నష్టం చేసే విషయం. గ్రామసభ పనిలో కానీ,క్లెయిమ్‌ ఫారాల పైన నిర్ణయాల్లో కానీ రాజకీ య జోక్యం ఉండరాదు. సబ్‌-డివిజన్‌, జిల్లా కమి టీల నిర్మాణం జరగాలి. అన్ని నిర్ణయాలు కమిటీ ల్లోనే తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో మానిటరింగ్‌ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీ అటవీ హక్కుల చట్టం అమలును పర్య వేక్షించాలి. గిరిజన సంక్షేమ శాఖను నోడల్‌ ఏజెన్సీ గా నియమించాలి. అన్ని శాఖల మధ్య సమన్వయం చేసే బాధ్యత గిరిజన సంక్షేమ శాఖకు ఇవ్వాలి. కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చట్టం అమలు కావడం కష్టంగా మారుతుంది.
చట్టాన్ని అర్థం చేసుకోవాలె
అటవీ హక్కుల చట్టం అమలు చేయా లంటే ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకొని పాటించడం చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చట్టం అమలులో మార్గదర్శిగా, గ్రామసభ ద్వారా తన పాత్రను పోషించాలి. ప్రజల నిర్ణయశక్తిపైన గౌరవం లేకపోతే ప్రభుత్వ యం త్రాంగం చట్టాన్ని అర్థంచేసుకొని అమలు చేయ లేదు. అవినీతికి తావివ్వకుండా, రాజకీయ జోక్యం లేకుండా,పారదర్శకంగా,ప్రజాస్వామికంగా వ్యవ హరిస్తేనే అడవులను కాపాడవచ్చు. ఆదివాసీల, గిరిజనేతరుల హక్కులను రక్షించవచ్చు. అడవుల పరిరక్షణకు,ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వైరుధ్యాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించ వచ్చు. చివరగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేయడమంటే ప్రజా స్వామిక విలువలను పాటించడమే. ఈ స్పృహతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ప్రతి పౌరుడు కోరుకోవాలి. అలావ్యవహరించేటట్టు ప్రతి ప్రజా స్వామికవాది తమ వంతు ప్రయత్నం చేయాలి.
గ్రామ సభకే సకల అధికారాలు
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసే అధికారం గ్రామసభకే ఉన్నదని ప్రభుత్వం గుర్తిం చాలి. గ్రామ సభ తన తరఫున తాను నిర్వర్తించ వలసిన పనులను చేయడానికి అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. అటవీ హక్కుల కమిటీ సాక్ష్యాలను పరిశీలిస్తుంది. భూమి సరిహద్దులను రెవెన్యూ,అటవీశాఖలతో కలిసి నిర్ధారిస్తుంది. అటవీ హక్కుల కమిటీ నివేదికపై తుది నిర్ణయం గ్రామసభదే. గ్రామసభను పని చేయనివ్వక పోతే చట్టం అమలులో అటవీశాఖ పెత్తనం మాత్రమే కొనసాగుతుంది.
శాటిలైట్‌ ఫొటోలు ప్రామాణికం కాదు
భూమిని అనుభవిస్తున్నట్టు సాక్ష్యంగా పూర్తిగా శాటిలైట్‌ ఫొటోల మీద మాత్రమే ఆధార పడటానికి వీలు లేదు. చట్టానికి సంబంధించిన నియమాల్లో 14రకాల సాక్ష్యాలను పేర్కొన్నారు. అందులో ఏ రెండు ఉన్నా చాలునని నియమాలు చెపుతున్నాయి.నిజానికి శాటిలైట్‌ ఫొటోలను ప్రామా ణికంగా తీసుకోరాదని గతంలో గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఆదివాసీలు
అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీ లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూములు,సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాల కులు.. వారిని ఇంకింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం,పంటలు ధ్వంసం చేయ డం,నివాసాలు ఖాళీ చేయిస్తూ..వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడు తున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆది వాసీల హక్కులను కాపాడాలి. ప్రపంచవ్యాప్తంగా 90దేశాల్లో దాదాపు 40కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడువేలకు పైగా భాషలు,5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నా యి. ప్రకృతితో పెనవేసుకున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంత ర్భాగం. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు తీవ్ర సమ స్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధారం. ఐక్యరాజ్య సమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి. కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయి లో కాపాడటం లేదు. అభివృద్ధి, ఇతర అవసరాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పోవడం వల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి,విద్య, ఆర్థిక అవసరాల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికి కనీస పౌర సేవలు అందడం లేదు. ఇండి యాలో 2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8.6శాతం అంటే 10.42కోట్ల ఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం,వేట,అటవీ ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనక బడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతా ల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు,విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు.
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభు త్వం1/70 పీసా చట్టం చేసింది. ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసులకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం 1967 ప్రకారం.. సెక్షన్‌ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..2005 డిసెంబర్‌ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13 డిసెంబర్‌ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమి స్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆ తేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికా రం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది. అటవీ హక్కులు పొందాలంటే 13 డిసెంబర్‌ 2005 నాటికి భూమి ఆక్రమణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ,ప్రభుత్వ రికార్డులు గానీ,ఏదైనా సెటిల్‌మెంట్‌,మ్యాపు,గూగుల్‌ మ్యాపు, వర్కింగ్‌ ప్లానులు,అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాం టిది ఆధారాలుగా చెల్లుతాయి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు,ఇంటి పన్నురసీదు,ఇంటి నివాస సర్టిఫికెట్‌, కోర్టు ఆర్డర్‌,సర్వే రిపోర్టు,సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్‌మెంట్‌ ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005-06 ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆప్రకారం రాష్ట్రంలో 1.78లక్షల ఎకరాలు లబ్ధి దారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయకుండా పక్కనపెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్‌ఆర్‌ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆది వాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్నభూమిపై ప్రభు త్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికారులు,ప్రభుత్వం ఆదివాసీల పోడు భూము లపై యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఆ పేద బతుకులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్‌ఆఫీసర్ల కాళ్లు మొక్కుతు న్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుంటున్నారన్న నెపంతో గిరిజనుల మీద కేసులు పెడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌, మహబూ బ్‌నగర్‌,వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.ఆఫీసర్ల వేధింపులు తట్టు కోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుం టు న్నారు.2011జనాభా లెక్కలప్రకారం తెలంగాణ లో 31లక్షల75వేలమంది ఆదివాసీలుఉన్నారు. ఆదివాసీల్లో ఉప తెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుం చితే..వారి వనరులు దోచుకోవడం,ఆవాసాలను, భూములను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.240కోట్లతో మొక్క లకు శ్రీకారం చుట్టింది.ఈలక్ష్యం మంచిదే అయి నా.. ఈ హరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు. కందకాలు తీస్తు న్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమో దయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహి ళలు,వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు.గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికా రులు దాడులు చేశారు. సిర్పూర్‌కాగజ్‌ నగర్‌ టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీచట్టాలు నిర్వీర్యం అవు తున్నాయి. పోలీసులు, కోర్టుల గురించి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వందలాది ఎక రాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పారు. ఇంత వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆది వాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు, ధరణి వెబ్‌ సైట్‌లో నిషేధిత జాబితాలో ఉన్న28 లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదం టే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజనులు మరో జల్‌,జంగల్‌,జమీన్‌ పోరాటానికి సిద్ధమ వుతారు.
– వ్యాసకర్త : రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ లోక్‌ సత్తా పార్టీ.