అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా..!

‘‘ రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి పభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల,మత,ప్రాంతము,లింగం,శారీరక మానసిక బలహీనత, సైన్యవర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి’’ – జి.ఎన్‌.వి.సతీష్‌

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింప చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షికఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతి పాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15,16లను అనుసరించి సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా అనేక కులాలు తమకూ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ, మరికొన్ని కులాలు తమ రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు ఇలా చాలా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్ర కేబినెట్‌ ఆమోదం రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్‌ నిజంగానే అన్నారా? రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు దేశంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం షెడ్యూల్డ్‌ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 7.5శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు 27శాతం మొత్తంగా 49.5శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్ట్‌ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అధిగమించి కేంద్రం ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందనేది కీలకంగా మారింది.
అమలు ఎలా :
ఇప్పటికే వివిధ వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలలో కోత విధించి 50 శాతం మించకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేక సుప్రీం తీర్పును అధిగమించి రిజర్వేషన్లను 60 శాతానికి తీసుకెళ్తారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే మొదట ఆర్టికల్‌ 15, 16లను సవరించాల్సి ఉంటుందని పొలిటికల్‌ సైన్స్‌ నిపుణులు ప్రొఫెసర్‌ ప్రభాకర్‌ రెడ్డి భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని తెలిపారు. ‘’ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచరాదని ఇచ్చిన సుప్రీం తీర్పును అధిగమించేందుకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్డ్‌లో చేర్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి’’ అని ఆయన వివరించారు.
రాజ్యాంగ సరవణ ఎలా ?
రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తేనే కేంద్రం తీసుకొచ్చే బిల్లు చట్టంగా మారుతుంది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో సంఖ్యాబలం ఉండటంతో రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది.
9వ షెడ్యూల్‌ ఏమిటి?
1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌ తీసుకొచ్చారు. కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసే చట్టాలను ఈ షెడ్యూల్‌లో చేర్చడానికి అవకాశం కల్పించారు. అంటే ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానిని న్యాయ సమీక్ష నుంచి మినహాయించే అవకాశం కల్పించారు. అందుకే తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఈ షెడ్యూల్‌ కిందకు తీసుకొచ్చి రక్షణ కల్పించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. అయితే, సుప్రీం కోర్టు గతంలో అనేక సార్లు 9వ షెడ్యూల్‌ను కూడా న్యాయసమీక్ష పరిధిలోకి తేవాలని పేర్కొంది. మౌలిక సూత్రాలకు భంగకరమని భావిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలనూ సమీక్షిస్తామని పలు కేసుల విచారణంలో సుప్రీం పేర్కొంది. ఐఆర్‌ కోయెల్‌హో వర్సెస్‌ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ నేత ృత్వంలోని ధర్మాసనం 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకతీతం కాదని స్పష్టం చేసింది. ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే సమీక్షించవచ్చని పేర్కొంది. కేశవానంద భారతి వెర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ కేరళ కేసులో ‘’ 1950 నుంచి 1973 వరకు 9 వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందని, దీని తర్వాత చేర్చినా ఏ చట్టమైన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలపై …. ఎవరేమంటున్నారు?
‘సమానత్వ భావన సాకారం అవుతుంది’
రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ భావన సాకారం కావాలంటే కాలానుగుణంగా రిజర్వేషన్లను మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిభాగం అధిపతి వేంకటేశ్వర్లు చెప్పారు. ‘కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మొదట ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ తర్వాత 1990లలో బీసీలకు రిజర్వేష్లను వర్తింప చేశారు. కాలానుగుణంగా రిజర్వేష్లను కూడా మారాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సమానత్వం అనే భావన నిజం అవుతుంది’ అని ఆయన అన్నారు.
మాకు దక్కేదేమీ లేదు’
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల కాపులకు దక్కేదేమీ లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడూతూ, ‘కాపులను బీసీల జాబితాలో చేర్చి 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర నిర్ణయం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. అగ్రకుల రిజర్వేషన్ల జాబితాలో కాపులను చేర్చితే వచ్చే ఉపయోగమూ లేదు ‘ అని పేర్కొన్నారు. అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
‘’సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యాంగం చెబుతుంటే కేంద్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం సరికాదు. సుప్రీం కోర్ట్‌ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉల్లఘించి కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. అణగారిన వర్గాల రిజర్వేషన్లను సవరించడం ద్వారా రిజర్వేషన్లను బలహీనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇది చరిత్రాత్మక నిర్ణయం
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.‘ఈ నిర్ణయం వంద శాతం అమలవుతుందని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశంలో ఉన్న కోట్లాది మంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుంది. సామాజిక వివక్షే కాదు, ఆర్థిక వెనకబాటును ప్రాతిపాదికను తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లతో పాటతు జాతీయ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రిజర్వేషన్ల ఉద్యమాలు బలహీన పడతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎందుకు.. ఎలా?
దేశంలో రిజర్వేషన్లపై పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నాయి? అనేవి ఆసక్తికర పరిణామాలు.
రాజ్యాంగం ఏం చెప్పింది?
అంటరానితనం కారణంగా అనాదిగా నిరాదరణకు, వివక్షకు గురవుతున్న ఎస్సీ,ఎస్టీ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు?
అణగారిన వర్గాలుగా భారత ప్రభుత్వం గుర్తించి, నిర్దేశించిన షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ల వారికి రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకూ బీసీ(ఎం/ఈ) కింద రిజర్వేషన్లు ఇచ్చారు. భారత రాజ్యాంగం, చట్టాలు, స్థానిక నియమ నిబంధనలు ప్రాతిపదికగా ఇవి అమల్లోకి వచ్చాయి.
స్వాతంత్య్రానికి పూర్వం ఎలా ఉండేది?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌ ఇండియాలో కూడా కొన్ని కులాలు, వర్గాలకు కోటా విధానం ఉండేది. కొల్హాపూర్‌ సంస్థానాధీశుడు సాహూ బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1902లో ఇది అమల్లోకి వచ్చింది. 1932లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటీష్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ‘కమ్యూనల్‌ అవార్డ్‌’ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యురోపియన్లు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక కోటా ప్రాతినిధ్యం కల్పించారు. దీన్ని గాంధీజీ వ్యతిరేకించగా.. అంబేడ్కర్‌ సమర్థించారు.
స్వాతంత్య్రానంతరం ఏం జరిగింది?
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దేశ స్వాతంత్య్రానంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత ప్రభుత్వం 1950లోనే కార్యాచరణ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన.. విద్యాసంస్థల్లో 20 శాతం సీట్లను ప్రత్యేకించాలని విద్యా మంత్రిత్వశాఖ అప్పట్లోనే ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగం, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలతో పాటు, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఖాళీలను జనాభా ప్రాతిపదికన రిజర్వ్‌చేశారు.
మండల్‌ కమిషన్‌ ఎందుకొచ్చింది?
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడం కోసం 1979 జనవరి 1వ తేదీన అప్పటి మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్‌ నేత ృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఓబీసీల జన సంఖ్య ఎంత అన్న గణాంకాలు అప్పటికి కమిషన్‌ వద్ద లేవు. దాంతో అది 1931 నాటి జనాభా లెక్కల్ని వినియోగించుకుని వారి జనాభా 52 శాతంగా నిర్ధారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని సేవలు, సంస్థల ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సుచేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇదే రిజర్వేషన్ల అమలుకూ మార్పులు చేయాలని సూచించింది. దీనివల్ల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 49.5%కి చేరుకున్నాయి. మండల్‌ సిఫార్సుల్ని అమలుచేస్తామని 1990లో వి.పి.సింగ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి. అప్పటికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా.. ఆ తర్వాత రిజర్వేషన్ల అమలు మొదలైంది.
రిజర్వేషన్ల ఉద్దేశం?
అనాదిగా కుల వివక్ష, అసమానతలు, అవమానాల్ని ఎదుర్కొంటున్న వర్గాల వారికి తగిన న్యాయం చేయడం కోసం, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల వ్యవస్థ మొగ్గతొడిగింది. అణగారిన వర్గాల విద్య, సామాజిక స్థితిగతుల్ని పెంపొందించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య చేపట్టారు.
ఎక్కడెక్కడ?
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, వివిధ చట్టసభల్లో సీట్లకు రిజర్వేషన్లు కల్పించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు 1992లో తేల్చిచెప్పింది. అలా దాటితే.. రాజ్యాంగం ప్రస్తావించిన సమానత్వ హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని వ్యాఖ్యానించింది.
మారుతున్న ఆలోచనలు
ా వివక్ష నుంచి ఆర్థికానికి: రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక ‘వివక్ష’, ‘నిరాదరణ’లకు విరుగుడుగా ముందుకు తెచ్చారనీ, కానీ కొంతకాలంగా ఈ రిజర్వేషన్లకు వివక్షను (డిస్క్రిమినేషన్‌) ప్రాతిపదికగా కాకుండా వెనకబాటుతనానికి (డిప్రైవేషన్‌) విరుగుడుగా చూడటం ఆరంభమవుతోందన్న వాదన వినపడుతోంది. పేదరికమన్నది రకరకాల వివక్షలకు దారితీసే మాట వాస్తవమే అయినా.. ఆ పేదరిక నిర్మూలనకు కేవలం వ్యవస్థాత్మకమైన రిజర్వేషన్లనే పరిష్కారంగా చూడలేమనీ, లేదా ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన విధానాలకూ ఇది ప్రత్యామ్నాయం కాదని పలువురు వాదిస్తున్నారు. వివక్షనూ, ఆర్థిక వెనకబాటునూ ఒక గాటన కట్టకూడదన్నది వీరి సిఫార్సు.
ా మినహాయింపు నుంచి విస్తరణకు: రిజర్వేషన్లన్నవి వాస్తవానికి ప్రాథమిక హక్కు అయిన ‘సమానత్వ హక్కు’కు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా ఆరంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు చిరకాలంగా ఎదుర్కొంటున్న సామాజిక వివక్షలను సరిదిద్దేందుకు, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల విధానాన్ని ‘సమానత్వ హక్కు’కు ఒక మినహాయింపుగా ప్రతిపాదించారనీ, కానీ క్రమేపీ ఇది విస్తరణకు దారితీస్తోందని అంటున్నారు. దీన్ని ప్రత్యేక మినహాయింపుగా కాకుండా వెనకబాటుతనానికి విరుగుడుగా చూడటం వల్లే వివిధ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల కోసం ఆరాటపడుతున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎంత శాతం?
రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినటికీ..కొన్ని రాష్ట్రాలు స్థానిక జనాభాను దృష్టిలో ఉంచుకుని అంతకుమించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. కొన్నింటిపై కోర్టులు స్టే ఇచ్చాయి.్చ హరియాణా70శాతం : ఎస్సీ20శాతం, బీసీ ఏ16శాతం,బీసీ బీ11శాతం,ప్రత్యేక వెనుకబడిన తరగతులు 10శాతం, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు 10శాతం, వికలాంగులు3శాతం ్చ తమిళనాడు69శాతం : ఎస్సీ18శాతం, ఎస్టీలు27శాతం, ఏబీసీలు22శాతం ్చ రాజస్థాన్‌54శాతం : ఎస్సీలు16శాతం, ఎస్టీలు12శాతం, ఏబీసీలు26శాతం
్చ ఆంధ్రప్రదేశ్‌50శాతం :బీసీలు 29శాతం, ఎస్సీలుI15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్లు అమలు) ్చ తెలంగాణ50శాతం : బీసీలు 28శాతం, ఎస్సీలు15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్ల అమలు)
్చ ఈశాన్య రాష్ట్రాలు(అరుణచల్‌ ప్రదేశ్‌,మేఘాలయ, నాగాలాండ్‌,మిజోరం)(ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ రిజర్వేషన్లు`80శాతం, ఇతరులకు 20శాతం
రిజర్వేషన్లు కల్పించవచ్చు :
ప్రజాభ్యున్నతి దృష్ట్యా కోటా ఇవ్వొచ్చు.. సమానత్వం ప్రాతిపదిక కావాలి.. విస్పష్టంగా చెప్పిన రాజ్యాంగం. రాజ్యాంగ స్ఫూర్తి సమానత్వమేనని, ఏ వర్గానికైనా అవకాశాల్లో ప్రాతినిధ్యం తగ్గిందని పార్లమెంటు నిరభ్యంతరంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అధికరణాలు 15, 16 ఈ విషయాన్ని విపులీకరించాయి.
ఆర్టికల్‌ 15 : (1) మతం, జాతి, కులం, ప్రాంతం, స్త్రీ-పురుష ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపరాదు (2) మతం, జాతి, కులం, లింగ, ప్రాంత ప్రాతిపదికన ప్రజలను హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి ప్రవేశాన్ని అడ్డుకోరాదు. వారిని భారంగా చూడరాదు. ఆంక్షలు పెట్టరాదు. ఊరిలో అందరూ ఉపయోగించే బావులు, చెరువులు, స్నాన ఘట్టాలు, ప్రజా వినోద, విలాస ప్రాంతాల్లోకి అనుమతిని నిషేధించరాదు. (3)ఈ ఆర్డికల్‌లోని అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రభుత్వం మహిళలు, పిల్లలకు పత్య్రేక సదుపాయాలు కల్పించవచ్చు. (4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల లేదా ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొనే ఏ చర్యనైనా ఈ అధికరణ అడ్డుకోరాదు. అంటే ఆయా వర్గాల అభివ ృద్ధి నిమిత్తం ఏచర్యనైనా ప్రభుత్వం చేపట్టవచ్చు. ఆర్టికల్‌ 29 (2)కు కూడా ఇదే వర్తిస్తుంది.
ఆర్టికల్‌ 16 : దీని ప్రకారం ఉద్యోగావకాశాల్లో సమానత్వం పాటించాలి. (1) ప్రభుత్వం చేసే ఏ నియామకంలోనైనా లేక ఉపాధి కల్పనలోనైనా సమాన అవకా శాలు కల్పించాలి.(2) మతం, జాతి, కులం, వర్గం, లైంగిక, ప్రాంతీయ, నివాస ప్రాతిపదికన ఏ వ్యక్తికీ ఉపాధి కల్పనలో వివక్ష చూపరాదు.(3) ఏవర్గానికైనా ఉద్యోగావకాశాల కల్పించాలని పార్లమెంటు భావిస్తే ఈ అధికరణ అడ్డుకాబోదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేక స్థానిక సంస్థలు…ఎక్కడైనా ఏ వర్గానికైనా ఉపాధి కల్పనకు ఇది అడ్డంకి కాదు. (4) ప్రభుత్వ విభాగాల్లో వెనుకబడ్డ వర్గాలకు నియామకాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ప్రభుత్వం భావించినపుడు నియామకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. దానికి ఈ అధికరణ అడ్డుకాదు.
వెనుకబాటుతనం సామాజికమా? ఆర్థికమా? :
రిజర్వేషన్లు సామాజికంగా వెనకబడ్డ వర్గాలకు కల్పించాలా లేక ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకా? అన్న చర్చ దాదాపు 70 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 1948లో రాజ్యాంగసభలో దీనిపై ఆసక్తికర చర్చే జరిగింది. అసలు వెనకబడ్డ (బ్యాక్‌వర్డ్‌) అనే పదాన్ని ఎలా నిర్వచించాలి? అన్న అంశంపైనే గంటన్నరకు పైగా చర్చ జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడా వెనకబడ్డ అన్న పదాన్నే నిర్వచించలేదని హెచ్‌.ఎన్‌.కుంజ్రూ అసంత ృప్తి వ్యక్తం చేశారు. దీనిపై టీటీ కృష్ణమాచారి లేచి ‘ఈ పదం అస్పష్టం, సందిగ్ధం. దీనికి రక రకాల వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. పుట్టుకతో వెనకబాటుతనమా, సామాజికంగానా, ఆర్థికంగానా, నిరక్షరాస్యత వల్లా… ఇలా దేనికని వెనకబాటుతనం?’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకొన్న కేఎం మున్షీ స్పందిస్తూ ‘‘ఇది అసలు కులానికి చెందినది కాదు.. వర్గానికి చెందినది. కాబట్టి షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు అనకుండా వెనకబడ్డ వర్గాలు అని సంబోధించాలి. అప్పుడు అధికరణం 16(4)లో పేర్కొన్న దానికి సరైన అర్థం, సార్థకత వస్తాయి’’ అన్నారు. దీనికి అంబేడ్కర్‌ సమాధానమిస్తూ ‘ఉదాహరణకు నిర్దిష్ట పోస్టుల్లో ఓ వర్గానికి లేదా అన్ని వెనకబడ్డ వర్గాలకీ కలుపుకొని 70 శాతం రిజర్వేషన్లు ఇస్తే..జనరల్‌ కేటగిరీలో మిగిలేది 30 శాతమే. ఇది సమానత్వం కిందకు వస్తుందా? అందువల్ల మనం సమానత్వపు హక్కు కల్పించాలి. ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం దొరకని కొన్ని కులాలకు అవకాశాలూ కల్పించాలి. ఏప్రాతిపదికన..? అవి సామాజికంగా, సాంస్క ృతికంగా వెనుకబడి ఉన్నవి. బ్యాక్‌వర్డ్‌ పదాన్ని వాడితే అది అధికరణం మొత్తాన్ని తినేస్తుంది. రిజర్వేషన్లు పరిమితిని మించి ఇస్తే అది మంచిదా కాదా.. అన్నది న్యాయవ్యవస్థే తీర్పిస్తుంది’’ అన్నారు.