ఆ చట్టాలతో ఆదివాసులకు అన్యాయం

వ్యవసాయం నేడు ఆదివాసి జీవనా ధారాలలో అతి ముఖ్యమైన భాగమైంది. ప్రకృతి తో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధా నాలపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు మార్కె ట్‌ ప్రేరేపిత పంటల వైపు ఆకర్షితుల వుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి చర్చించుకునే ముందు ఆదివాసీల రక్షణ కోసం తెచ్చిన చట్టాలకు సంబంధించి జరిగిన ఉల్లం ఘనలను పరిశీలించటం అవసరం. భారత రాజ్యాంగంలోని 244వ అధికరణంలోని ఐదవ షెడ్యూల్‌ను‘రాజ్యాంగంలోరాజ్యాంగం’గా వర్ణిస్తుం టారు. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించిన ప్రాంతం లో ఆదివాసులు గిరిజనేతరుల నుంచి,వడ్డీ వ్యా పారం నుంచి దోపిడీకి గురి కాకూడదని, ఆదివా సి జ్ఞానం,సంస్కృతి,పాలనావ్యవస్థలపై ఆధార పడి అభివృద్ధి పథకాలు ఉండాలని,షెడ్యూల్‌ ప్రాంత సంరక్షకులుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరి స్తారని,రాష్ట్ర, కేంద్రప్రభుత్వ చట్టాలు ఐదో షెడ్యూ ల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే అమలు జరపా లని భారత రాజ్యాంగం నిర్దేశించింది.చట్టాల రూపకల్పనలో రాజ్యాంగంలోని సమానత్వపు హ క్కు ఆర్టికల్‌ 14,ఎలాంటి వివక్షకు గురికా కుండా కాపాడే ఆర్టికల్‌ 15(4), ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధిని ఆకాంక్షించే ఆర్టికల్‌19(1)(జి), గౌర వంతో జీవించే హక్కు ఆర్టికల్‌ 21లను పరిగ ణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో భూములు లీజుకు తీసుకోవడానికి కాని, కొనడానికి కాని, అమ్మే హక్కు కాని లేవని భూపరాయీకరణ నిరోధక చట్టం 1/70స్పష్టం చేస్తోంది.ప్రతి ఆది వాసి సమూహానికి తమగ్రామ పరిధిలోని సహజ వనరులను పాలించే శక్తి గ్రామసభలకు ఉందని స్పష్టం చేసిన పీసాచట్టం 1996లో వచ్చింది. గ్రామంలో జరిగే ఎలాంటి అభివృద్ధి పథకానికైనా గ్రామసభల అనుమతి కావాలి. వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేయటంలో గ్రామసభలకు అధికారం ఉంది. అలాగే తమ గ్రామ సంప్రదాయ సరిహ ద్దులలోని సహజ వనరుల (లఘు ఖనిజాలు, చిన్న నీటి వనరులతో సహా) నిర్వహణ, రక్షణ, యాజమాన్యం,వినియోగంలో గ్రామసభలకే అధి కారం ఉందని ఈ చట్టం చెబుతున్నది. గుర్తించిన అటవీ భూములలో డిసెంబర్‌ 2005కన్నా ముందునుంచి నివసిస్తున్న,సాగుచేస్తున్న ఆదివా సులకు,అడవిపై ఆధారపడి జీవిస్తున్న వారికి, ఆవాసాలు ఏర్పరచుకున్న పివిటిజిలకు ఉన్న హక్కులు గుర్తించి, దఖలు చేయాలని పేర్కొం టున్న అటవీహక్కుల గుర్తింపు చట్టం 2006లో అమలులోకి వచ్చింది. వ్యక్తిగత హక్కులు, అటవీ వనరులపై సామూహిక హక్కులు, ఆవాసాలపై పివిటిజిలకు హక్కులు, వాటి నిర్వహణ, యాజ మాన్యం, వినియోగం గ్రామసభ అధీనంలో ఉంటాయని ఈ చట్టం చెబుతున్నది. భూములు, అటవీ భూములను ఇతర ప్రాజెక్టులకు మరలించా లన్నా గ్రామసభల అనుమతి తప్పనిసరి అని ఈ చట్టాలు చెబుతున్నాయి. ఇంత పకడ్బందీగా రాజ్యాంగ రక్షణలతో ఉన్నా షెడ్యూల్‌ ప్రాంతం లోని ఈ అంశాలను కొత్త వ్యవసాయ చట్టాలు పట్టించుకున్నాయా? ఈ కొత్త చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినవి కాబట్టి వీటి ప్రభావం షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఎలా ఉంటుందో పరిశీలించటం అవసరం.గత 30 సంవత్సరా లుగా ఆదివాసులు తిండి కొరకు ఎంతో కొంత పంటలు పండిరచుకుంటున్నారు.మార్కెట్‌ డిమాం డ్లకు అనుగుణంగా వాణిజ్య పంటలను పండిరచే రైతులుగా వాళ్లు మార్కెట్‌ చట్రంలో ఇరుక్కు న్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేది లేదా వాతావరణ మార్పు లకు పరిష్కారం అనే కర్బన ఉద్గారాల అమ్మకాల మార్కెట్‌ కూడా అంతర్జాతీయంగా 2000 సంవ త్సరం నుంచి మొదలైంది. ఉదాహరణకు బయో డీజిల్‌ తోటల పెంపకం చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లా పవర్‌గూడా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుతో ప్రపంచ బ్యాంకు కర్బన వ్యాపార ఒప్పందాలను 2003లో చేసుకోవటం గమనార్హం. భూమినీరు,అడవి, గాలి వ్యాపారానికి సరుకులుగా మారుతున్న క్రమం మనం గమనిస్తున్నాం.ఈ మధ్య రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడి పంటలు,ఫలసాయాల సేకర ణ,శుద్ధి,ప్యాకింగ్‌,అమ్మకాలు జరుగుతు న్నాయి. ఆదివాసి ప్రాంతాలలో ప్రభుత్వం ఇటీవల సేంద్రి య పద్ధతిలో ఆహారపంటల ఉత్పత్తిని జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రారంభిం చింది. మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా వాణి జ్య పంటలైనా,సేంద్రియ పంటలైనా పండిరచే రైతులుగా ఆదివాసీలు మారుతున్న పరిణామం ఇది. పెట్టుబడిదారీ విధానాలు ఆదివాసి జీవితా లను సంక్షోభాలకు గురిచేస్తుంటే మరో పక్కన ప్రాజెక్టులు,గనులు,పరిశ్రమలు,అభయార ణ్యాలు, జాతీయ పార్కులు,హైవేలతో ఆదివాసులు నిరం తరం నిర్వాసితులు అవుతున్నారు. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల వల్ల ఎగుమతుల మార్కెట్‌పై దృష్టి ఉంది కనుక ఎగుమతుల పంటల ఉత్పత్తి కోసం ఆదివాసీ ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగింది. ఆయిల్‌పామ్‌ చెట్లను ఉద్యానవనాల నుంచి తోటల పెంపకం కేటగిరికి మార్చి పెద్ద ఎత్తున ప్రైవేట్‌ పెట్టుబడులు వచ్చేలా చేయడానికి ప్రయ త్నాలు ప్రారంభమయ్యాయి. భూములను లీజుకు తీసుకునే చట్టాలు తెమ్మని కంపెనీలు ప్రతిపాదిస్తు న్నాయి. అటవీ వనరుల నిర్వహణలో కూడా కర్బన, కలప వ్యాపారం,టూరిజంల కోసం ప్రైవే ట్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్‌ పెట్టుబడులకు భూమి, సహజ వనరులు,కూలీలు కావాలి, రైతులు హక్కు దారులుగా ఉంటారేమో కానీ భూమిపై పంటల నిర్ణయం మాత్రం వ్యాపారులు లేదా కంపెనీల చేతిలో ఉంటుంది. ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాల సవరణ కోసం గత పదేళ్లుగా షెడ్యూ ల్‌ ప్రాంతాల్లో ఎన్నో ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలు భూములు, అటవీ వనరులు, సహజవనరులకు సంబంధించి పెట్టుబడుల ప్రవేశాన్ని మరింత సుగమం చేస్తాయి. గతమూడు దశాబ్దాలలో వ్యవస్థీకృతం చేసిన పథకాలు, విధానాలు వీటికి అండగా ఉంటాయి.
కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలు, ప్రధానంగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌ యార్డులలో లేదా వాటి బయట నియంత్రణ లేని మార్కెట్లను అమలుచేస్తాయి. 5 ఎకరాల లోపు ఉన్న ఆదివాసులు ఒక్కొక్కరుగా వ్యవసాయం చేయటం వృథా అని గ్రూపులుగా చేసే విధంగా ఒప్పందాలు జరుగుతాయి. ఈ పంటలకు కావాల్సిన పెట్టుబడులు కూడా ముందే కుదుర్చుకున్న ధరల ఒప్పందాల రూపంలో అందిస్తూ ఆదివాసి రైతులను కాంట్రాక్ట్‌ వ్యవ సాయంలోకి దించుతారు.కాంట్రాక్ట్‌ వ్యవసా యంలో ఒప్పందం కుదుర్చుకున్న పంటల సాగుకు చిన్న నీటివనరులపై ఒత్తిడి పెరుగుతుంది. కంపె నీలు,అగ్రిబిజినెస్‌ కార్పొరేషన్లు గ్రామంలో ఉన్న గ్రూపులు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణలు లేవు కనుక పాన్‌కార్డు ఉన్న వ్యక్తి, సంఘం,కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పడ్డ గ్రూపులు డైరెక్టుగా కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్‌ వ్యాపారం చేసుకోవచ్చు.ఆహార పదార్థాలు అనగా వరి, గోధుమ,జొన్న,చిరుధాన్యాలు, పప్పులు, నూనెగిం జలు, కూరగాయలు, పళ్ళు, మసాలా దినుసులు, కోళ్ళు,గొర్రెలు,మేకలు,పాలఉత్పత్తులు సహజ రూపంలో లేదా శుద్ధి చేసిన రూపంలో సేకరించి పాన్‌కార్డు కలిగిన వారు ఎలక్ట్రానిక్‌ వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్లు చెప్పిన ధరకు ఆదివాసులు అమ్ముకోవాలి.నియంత్రణ లేని వ్యాపార లావా దేవీల వేదికలు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గ్రూపుల ద్వారా,సంఘాల ద్వారా జరిగే ప్రమాదంఉన్నది. ప్రజల ఆకలిని తీర్చే, పోషకాహారాన్నిచ్చే సహజ వనరులు,వాటి ఉత్పత్తులు పోటీ మార్కెట్లో వ్యా పార వాణిజ్య సరుకులుగా మారతాయి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో భూముల విషయంలో చట్టాలు ఇంకా పకడ్బందీగా ఉన్నాయి కనుక భూములు లీజుకు తీసుకోవడం లేదా కొనడానికి బదులు కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని తేలికగా చేసుకునే అవకాశా లున్నాయి. స్థానిక సంతల నిర్వహణ, వాటిపై యాజమాన్యం పీసా చట్టం ప్రకారం గ్రామసభ లదే. ఉత్పత్తుల కోసం పెట్టుబడులు, సేకరణ, కొనుగోలు, ఎలక్ట్రానిక్‌ వ్యాపారమైనా, గ్రూపుల ద్వారా జరిగినా గ్రామసభ అనుమతి కావాలి. ఈకొత్త చట్టాలలో గ్రామసభల అంశ మే లేదు కనుక అవి నిర్వీర్యం అవుతాయి. జిసిసి లాంటి సంస్థలు కార్పొరేట్‌ ఆధిపత్యం క్రిందికి వస్తాయి. కాంట్రాక్ట్‌ వ్యవసాయపు ఒప్పందాలు చేసుకున్న వారితో లేదా ఉత్పత్తుల అమ్మకం విషయంలో ఆదివాసులకు,ఇతర వ్యక్తులకు, గ్రూపులకు, కంపెనీలకు మధ్య వివాదాలు తలెత్తితే గ్రామ సభలో తీర్మానం చేసుకునే అధికారం పీసా చట్టం ద్వారా ఇప్పటివరకు ఉండేది. లేదా వివాదాలతో ఆదివాసుల ఆత్మగౌరవం దెబ్బతి న్నా, వారు మానసిక,భౌతిక హింసకు గురై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంకింద క్రిమినల్‌ కోర్టుకు వెళ్ళి న్యాయం అడగొచ్చు.కాని ఈ కొత్త వ్యవసాయ చట్టాలలో ఆర్డీవో స్థాయిలో సంప్ర దింపుల కమిటీకి వెళ్ళి వివాదాలు విన్నవించు కోవాలి. బలమైన మార్కెట్‌ శక్తుల ముందు నిలబడి ఆదివా సులు తమ వివాదాలను ఆర్డీవో స్థాయి అధికారితో పరిష్కరించుకుంటారని ఊహించటం అర్థం లేనిది. గ్రామసభల శక్తిసా మర్థ్యాలను, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పూర్తిగా ఈకొత్త చట్టాలు పక్కదోవ పట్టిస్తున్నాయి. ప్రజల అవసరా లకు కావలసిన ఆహార పదార్థాలు, నిల్వలు అందు బాటులో ఉండాలని,ధరల నియంత్రణ ఉం డాలని 1955లో తెచ్చిన నిత్యావసర సరుకుల చట్టం పేర్కొంటోంది. దీనిద్వారానే ప్రజా పంపి ణీ వ్యవస్థ నడుస్తోంది.ఇప్పుడు ఆ చట్టానికి చేసిన సవరణతో ధాన్యాలు,పప్పులు,నూనె,నూనె గింజ లు,బంగాళాదుంపలు,ఉల్లిపాయలను నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వ రేటు ప్రకారం సంతలలో లేదా ప్రజాపంపిణీ వ్యవస్థలలో కొనుక్కునే ఆదివాసులు ఇక పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి వాటిని కొనుక్కుని విని యోగించే పరిస్థితి ఏర్పడుతుంది. నియంత్రణ లేదు కాబట్టి ఈఆహార పదార్థాలను ప్రైవేట్‌ మార్కెట్‌ చెప్పే రేటుకే కొనాల్సి ఉంటుంది. ఆహార భద్రత చేకూర్చే ప్రజాపంపిణీ వ్యవస్థలు నాశనమవుతాయి. రేషన్‌ షాపులపై ఆదివాసీల రోజువారి జీవితం ఆధారపడేలా ఈ 30 సంవ త్సరాలలో జరిగిన తంతు మనం ఇంతకు ముం దే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సవరణ చట్టంతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారం 42శాతం మంది ఆదివాసీ పిల్లలుబరువు తక్కువగా పెరుగు తున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల వయ సున్న ఆదివాసీ మహిళలు రక్తహీనతతో జీవిస్తు న్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థనే వీరికి ఇప్పటివరకు ఎంతో కొంత అండగా ఉంది.ఈ సవరణ చట్టం తో మార్కెట్‌ చెప్పే రేటుకు కొనలేక ఆదివాసీలు అత్యంత పేదరికంలోకి కూరుకుపోతారు. ఆది వాసీల స్వయంసమృద్ధి జీవన విధానం, రాజ్యాం గ రక్షణలు,స్వయంపాలనా చట్టాలు బలహీనమవు తాయి. కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా షెడ్యూల్డ్‌ ప్రాంతం విచ్ఛిన్నమై, పరాధీనమైపోతుంది.
సీసాలో ‘పీసా’ పాతర
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా స్థానిక సంస్థలకు అధికారాలను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం 73,74రాజ్యాంగ సవరణలను చేసింది.వీటిలో భాగంగా భూరియా కమిటీ సిఫా రసుల మేరకు 1996 లో పార్లమెంట్లో 40 వ చట్టం ద్వారా ‘పీసా’ అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి 1994 పంచాయితీరాజ్‌ చట్టంలో మార్పులు చేశారు. 1998లోచట్టం 7ద్వారా రాష్ట్ర చట్టంలో కేంద్ర చట్టాన్ని పొందు పరచారు. చట్టం అమలు చేయ డానికి విధివిధానాలను 2011మార్చి 24న జీవో నంబర్‌ 66ను రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ జారీ చేసింది.ఏజెన్సీ ప్రాంతంలో మద్యం దుకాణాలు ప్రారంభించడానికి ‘పీసా’ చట్టం ప్రకారం గ్రామ సభల అనుమతి అవసరం. గతంలో విడుదల చేసిన జీవో నంబర్‌ 66 ప్రకారం ఏజెన్సీ గ్రామా ల్లో గ్రామసభలు నిర్వహించడానికి మొత్తం ఓటర్లలో మూడవ వంతు మంది హాజరైతేనే కోరం పూర్తయినట్టు. ఏ4మద్యం దుకాణాల కోసం నిర్వహిస్తున్న గ్రామసభలకు ఆదివాసీలు తక్కువ సంఖ్యలో హాజరు కావడంతో అవి తరచుగా వాయిదా పడతున్నాయి. ప్రభుత్వ ఆదా యానికి ఇది గండి కొడుతోంది. దీనితో ఆదివా సీల విస్తృతాభిప్రాయానికి గండి కొడుతూ కేవలం కొద్ది మందితో గ్రామసభ ఆమోదం పొందేలా కోరం నిబంధనలను మార్చి వేశారు. ఈ మేరకు 2019 అక్టోబర్‌ 10న పంచాయతీరాజ్‌ శాఖ జీవో 54జారీ చేసింది.దీనిప్రకారం 500 మంది ఆదివాసీ ఓటర్లుండే గ్రామంలో కేవలం 50 మంది (10 శాతం) గ్రామసభకు హాజరైతే కోరం సరిపోతుంది.501 నుంచి1,000 మంది ఉంటే 75 మంది,1,001నుంచి3,000 మంది ఉంటే 150 మంది,3,001నుంచి5,000మందికి 200,5,001 నుంచి10,000వరకూ 300 మంది,10 వేలకు పైగా ఓటర్లు ఉంటే 400 మంది హాజరైతే కోరం పూర్తయినట్టే.
పీసా చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే మరో అంశం కూడా ఈ జీవోలో పొందు పరచారు. కోరం లేక గ్రామసభ వాయిదా పడితే వాయిదా పడిన రెండు గంటల వ్యవధి లోనే మళ్ళీ గ్రామ సభ నిర్వహిస్తారు. రెండవసారి కోరం లేకున్నా, ఎవరూ హాజరు కాకున్నా తీర్మా నం ఆమోదం పొందినట్టు థృవీకరిస్తారు. ఈ రెండు నిబంధన లతో ఏజెన్సీగ్రామసభలు పూర్తిగా అస్థిత్వం కోల్పో యినట్టే.54జీవోను కనీసం ప్రభుత్వ జీవోల వెబ్‌ సైట్లో కూడా పెట్టకపోగా వివిధ శాఖలకు, ఐటీడీ ఏలకు,పంచాయితీరాజ్‌ సంస్థలకు పంప లేదు.
జీవో చట్టబద్దతపై చర్చ
అదివాసీల అభిప్రాయాలు తెలుసుకోకుండా పీసా చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా జారీ చేసిన 54జీవో చట్టబద్దతపై సర్వత్రా చర్చ జరుగు తోంది. 2018లోచట్టం5ద్వారా అమల్లోకి వచ్చి న కొత్త పంచాయితీరాజ్‌ చట్టంలో పీసా నిబం ధనలను చేర్చినప్పటికీ ఈచట్టం అమలు చేయ డానికి పూర్తి స్థాయిలో విధివిధానాలను (గైడ్‌ లైన్స్‌) ఇప్పటి వరకూ రూపొందించలేదు. 1998 లో సవరించిన పంచాయితీరాజ్‌ చట్టం ప్రకారం పీసా నిబంధనలను జీవో 66ద్వారా అమల్లోకి తెచ్చారు. కొత్తచట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇదే జీవోను అమలు చేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి రావడంతో పాత జీవో చెల్లదని వారంటున్నారు. ఇది చెల్లక పోతే ఈ జీవోలో కోరం కోసం సవరణలు చేస్తూ జారీ చేసిన కొత్త జీవో 54 మనుగడ కూడా ప్రశ్నార్థకం కానుంది. ఈ జీవోకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరస్తున్నాయి.
నిబంధనలకు పాతర
గోదావరి చెంతనే గ్రామాలున్నా ట్రక్కు ఇసుక కావాలంటే ఒక యజ్ఞం చేయాల్సిందే. గిరిజనులు ఇల్లు కట్టుకోడానికి,మిర్చి కల్లాల్లోకి ఇసుక కావా లంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. స్థానిక అధికారుల నుండి ఐటిడిఎ అధికారుల వరకు అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఇసుక తోలుతే కేసుల వరకు వెళ్ళాల్సిందే. అలాంటిది మండలంలోని గుండాల ఇసుక రాంపులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తూ పక్క రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.ఈ ఇసుక ర్యాంపు పెద్దలకు కాసుల పంటగా మారింది. లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను పక్క రాష్రాలకు తరలిస్తూ ప్రజా సంపదను దోచుకుంటున్నారు.దీనిపై ప్రశ్ని స్తే అనుమతులున్నాయని నిర్వాహకులు చెబుతు న్నారు. అనుమ తుల విషయం పక్కనపెడితే, ఇక్కడ ఇసుక అమ్మ కం కూడా ప్రభుత్వ నిబంధ నలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌ వేబిల్‌తో ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమ రవాణా చేస్తు న్నారని పలువురు విమర్శిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 20నుంచి 30వరకు లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
గిరిజన చట్టాలు బేఖాతరు…
ఏజెన్సీలో ఎటువంటి ఖనిజ సంపద తవ్వకాలు చేయాలన్నా 1/70,పీసా చట్టాల ప్రకారం గ్రామ సభ నిర్వహించి స్థానిక పంచాయతీ అను మతి పొందాల్సి ఉంది. గ్రామసభ ఆమోదం లేకుండా ఏ అధికారికీ ఖనిజ సంపద తవ్వకాలకు అనుమ తులు ఇచ్చే అధికారం లేదు. అసలు గ్రామసభే నిర్వహించలేదని, ఇక్కడ ఇసుక తవ్వకాలకు తమ పంచాయతీ నుంచి ఎటువంటి ఆమోదం తెలియ జేయలేదని స్థానిక పంచాయతీ నాయకులు చెబు తున్నారు.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏజెన్సీ లో స్థానిక గిరిజన సొసైటీలకు మాత్రమే క్వారీ నిర్వహించే అధికారం ఉంది. అది కూడా మను షులతో మాత్రమే తవ్వకాలు చేయాలి. నిబం ధనలు ప్రకారం ఏజెన్సీలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వ ర్యంలో ఇసుక ర్యాంపు నిర్వహణ చేయడానికి వీల్లేకపోగా, ఇక్కడ గిరిజనేతరులు, అందులోనూ స్థానికేతరులు జెసిబిలతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను, గిరిజన చట్టాలనుతుంగలో తొక్కి గుండాల ఇసుక ర్యాంపుకు అనుమతులు ఎలా ఇచ్చారని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల చట్టాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న గుండాల ఇసుక ర్యాంప్‌ను మూసివేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. నిర్వాహ కులు,అధికారులపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలి. (రచయిత : సామాజిక కార్యకర్త)

పాఠశాలల్లో సంస్కరణలు నష్టదాయకం

పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌…పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచేదానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్కరణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతున్నది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
సమాజ పరివర్తనకు, దారిద్య్ర నిర్మూలనకు, ఆకలిని అంతం చేయడానికి ఒక విప్లవాత్మక సాధనం విద్య. పాలో ఫ్రీర్‌ అనే విద్యావేత్త విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ…మనిషి వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి సామర్ధ్యాలను పెంచే సాధనం విద్య అన్నారు. అయితే విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెడుతూ…ఈ సంస్కరణలన్నీ మన పిల్లలను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికని నమ్మబలు కుతున్నది. కానీ ఇవి మన చిన్నారులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తయారు చేయడం సంగతి అటుంచి వారిని విద్యకే దూరం చేసేలా వుండడం విచారకరం. ఎన్‌.ఇ.పి-2020 అమలు పేరుతో మూడు కిలోమీటర్లలోపు వున్న పాఠశాలలను విలీనం చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనలతో దానిని ఒక కిలోమీటర్‌కు కుదించి అమలు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ‘మా ఊరు బడి మా ఊరిలోనే ఉండాలి’ అని చేసిన తీవ్రమైన ఆందోళనలు, ఎమ్మెల్సీల బస్సు యాత్రలు, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం మొదట ప్రకటించిన అన్ని స్కూళ్లను విలీనం చేయలేకపోయింది. 5,400 ప్రాథమిక పాఠశాలలు, 600 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఇప్పటికే ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్న 8000 పాఠశాలలతో పాటు మరో 4000 పాఠశాలలు ఏకో పాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విభజించిన తర్వాత ఒకటి రెండు తరగతులు మిగిలి ఉన్న ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా వుంది. ఇక్కడ 10 లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులు, ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో…పాఠశాలకు ఉండవలసిన హంగు, ఆర్భాటాలను కోల్పోయి…సహజ మరణం పొందే బడులుగా మారాయి. దీనితో ఆ పాఠశాలలో మిగిలిన విద్యార్థులు చదువు మానేయడం లేదా ప్రైవేటు పాఠశాలలకు తరలిపోవడం తప్ప మరో దిక్కు లేని వారిగా మిగిలిపోయారు. తీరా ఇప్పుడు విలీనం తర్వాత మిగిలిన ఒకటి రెండు తరగతులలో పది లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియ మించడానికి రూపొందించిన జీవో-117 నిబంధనలు ఉపాధ్యాయుల కుదింపే లక్ష్యంగా ఉన్నాయి. దీనితో 37 వేల యస్‌.జి.టి పోస్టులు, 18 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కనుమరుగు అయ్యాయి. ఉపాధ్యాయులను కుదించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడం ఎలా సాధ్యమో పాలకులే చెప్పాలి. ఈ విలీన ప్రక్రియ వలన అందుబాటులో ఉన్న స్కూలు నుండి దూరంగా ఉన్న స్కూలుకు విద్యార్థులను బలవంతంగా తరలించడం వలన విద్యార్థులు చదువు మధ్యలోనే బడి మానేస్తారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీనితో అందరికీ విద్య అందించాలనే రాజ్యాంగ లక్ష్యం నెరవేరదు. ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఆర్టికల్‌ 21-ఏ ని ఉల్లంఘించడమే అవుతుంది. విలీనం అనంతరం రేషనలైజేషన్‌ కోసం జీవో-117 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని ప్రాథమిక పాఠశాలలో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలలో 1:45, ఉన్నత పాఠశాలలో 1:53గా నిర్ణయించారు. ఇది విద్యా హక్కు చట్టం-2009 నిబంధన లకు విరుద్ధంగా ఉంది. విద్యాహక్కు చట్టం-2009లో ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35, ఉన్నత పాఠశాలలో 1:45 ఉండాలని సూచించారు. కానీ దీనికి భిన్నంగా ఉపాధ్యా యుల కుదింపే లక్ష్యంగా జరిగింది. ఇది విద్యార్థుల అభ్యసనా ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు అదనపు భారం మోపడంతో ఆనందకరమైన బోధనా అభ్యసన భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సాకుగా చూపుతున్న ఎన్‌.ఇ.పి-2020లో కూడా 5ం3ం3ం4 అనేది అభ్యసనా దశలుగానే ప్రకటించింది తప్ప దీనికోసం భౌతికపరమైన విభజన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. అందువలన ఈ విలీన ప్రక్రియ రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 21-ఎ, విద్యాహక్కు చట్టం-2009, ఎన్‌.ఇ.పి-2020 లను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల విద్యా వ్యవస్థలు, చివరికి ఎన్‌.ఇ.పి-2020 కూడా బోధనా భాషగా మాతభాషను ఒకటి నుండి ఐదు తరగతుల వరకు, అవసరమైతే ఎనిమిదో తరగతి వరకు కొనసాగించడం ద్వారానే పిల్లలలో భావనలు, అభివృద్ధి అర్థవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాయి. ఇంగ్లీష్‌ భాష నేర్చుకోవడానికి బోధనా భాష ఆటంకం కాదని విద్యావేత్తలు చెప్తున్నారు. కానీ అశాస్త్రీయ పద్ధతిలో బోధనా భాషగా ఇంగ్లీషును ప్రవేశపెట్టి పిల్లలను బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియంలోకి నెట్టడం పిల్లల హక్కులను కాలరాయడమే. కనీసం ఏ భాషలో చదువుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికి ఇవ్వకపోవడం పిల్లలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగానే పరిగణించాలి. దీనితో పిల్లలు ఇంటి భాషకు, బోధనా భాషకు మధ్య సమన్వయం చేసుకోలేక భావనలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులకు గురవుతుంటే భవిష్యత్తులో ఏ విధంగా విజయవంతం అవుతారో ఏలిన వారికే తెలియాలి. దీనికి భిన్నంగా ప్రైవేటు వ్యవస్థలో కూడా మాతృభాషలో బోధనను తప్పనిసరి చేయడం ద్వారానే పిల్లల జ్ఞానాభివృద్ధి, జ్ఞానతష్ణను తీర్చగలం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను కేంద్ర జాబితా నుండి ఉమ్మడి జాబితా లోకి మార్చడం జరిగింది. ఆ యా రాష్ట్రాలలో ఉన్న భౌతిక పరిస్థితులు భౌతిక వనరుల ఆధారంగా విద్యలో కావలసిన మార్పులు, చేర్పులు చేసుకునే అధికారం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. 2019లో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను నిరాకరిస్తూ అన్ని వ్యవస్థలను కేంద్రీకృతం చేస్తుంది. దానిలో భాగంగానే విద్యా రంగంలో కూడా నీట్‌-2020, ఎన్‌.ఇ.పి-2020, సిలబస్‌లో చరిత్రను మార్చడం వంటివి చేస్తున్నది. అన్ని రాష్ట్రాలు సిబిఎస్‌ఇ ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్రాలలో ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి కరికులం, బోధనా పద్ధతులను తయారు చేస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా కరికులం, బోధనా పద్ధతుల్ని ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి నిర్ణ యిస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రలో మన రాష్ట్ర సంబంధిత అంశాలు ఉండే అవకాశం ఉండదు. అందువలన దీనిని ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి పరిధిలోనే ఉంచి సి.బి.ఎస్‌.ఇ లోని మంచి అంశాలను స్వీకరించవచ్చు. విద్యా వ్యవస్థలో అద్భుత ఫలితాలు సాధించిన ఢల్లీి ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న సి.బి.ఎస్‌.ఇ, ఐ.సి.ఎస్‌.ఇ బోర్డులతో పాటు డి.బి.ఎస్‌.ఇ ని ప్రారంభించి దాని అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. దీనికి భిన్నంగా సిబిఎస్‌ఇని ప్రవేశపెట్టి ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి ని నిర్వీర్యం చేయడమనేది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం. విద్యాబోధనలో టెక్నాలజీని మిళితం చేయడాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఉపాధ్యాయుల బోధనకు బైజూస్‌ ప్రత్యామ్నాయం కాదు. కరోనా కాలంలో ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధనకు డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రత్యామ్నాయం కాదని అందరికీ అనుభవం అయింది. దీనికి భిన్నంగా మంచి ఉపాధ్యాయులను గుర్తించి వారితో డిజిటల్‌ కంటెంట్‌ రూపొందించుకుంటే అది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి ఉండేది.
పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌…పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచే దానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్క రణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతోంది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్కూళ్ల విలీనం పేరుతో గందరగోళం సృష్టించడంతో, ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు స్కూళ్లకు ఈ సంవత్సరం లక్షల్లో పిల్లలు తరలి వెళ్లారు. విద్యార్థులలో పఠన సామర్థ్యాలు, గణిత సామర్థ్యాలు 2012 ముందు నాటి స్థితికి పడిపోయాయని ‘అసర్‌ రిపోర్టు-2022’ తెలియజేస్తున్నది. ఏకపక్షంగా అమలు చేసిన సంస్కరణలతో విద్యార్థుల చదువు గందం గోళంలో పడిరది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం…ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఆలోచించాలి. లేని పక్షంలో విద్యా రంగంలో సానుకూల ఫలితాల కోసం ప్రజలే పోరు బాట పడతారు.
సమైక్యతా సాధనంగా విద్య..
స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది.1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమా నంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10ం2ం3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటీష్‌ పాలనలోని పరిమి తులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యారంగం పరిస్థితిని పరిశీలించి సరైన దిశా నిర్దేశాలు చేయటానికి విశేష కృషి చేశారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు నియమించారు. తొలి ఐదేళ్ళ కాలంలోనే యుజిసి, ఐసిసిఆర్‌, ఎఐసిటియు, సిఐఎన్‌ఆర్‌, తదితర అత్యున్నత సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థను, సంగీత, సాహిత్య, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేశారు. దేశం గర్వించే విద్యాశాఖామాత్యులుగానే కాక బహుముఖ ప్రజ్ఞానా శాలిగా, సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడిగా, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా మౌలానా ఆజాద్‌ స్వతంత్ర భారత నిర్మాతల్లో ప్రము ఖులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు మరణానం తరం 1992లో ‘’భారతరత్న’’ బిరుదునిచ్చి గౌరవించారు.
ఆయన చనిపోయి 57 సంవత్సరాలు గడిరచింది. కానీ ఆయన తలపెట్టిన విద్యావిధానం ఇంకా అసమగ్రంగా, అనేక మందికి అందకుండా నిరాశా నిస్పృహలతో నిట్టూరుస్తోంది. జాతీయ సగటు అక్షరాస్యత 73.9 శాతంగానే ఉండిపోవటంతో ఏడు సంవత్సరాలు పైబడిన జనాభాలో 28.7 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరా స్యుల్లో 37 శాతం మంది మన దేశంలోనే ఉండడం పాలకుల అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం. కనీసం 14 ఏళ్ళ ప్రా యం వరకైనా బాలబాలికలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలనే మౌలానా ఆకాంక్షకు అనుగుణంగా ఎట్టకేలకు విద్యా హక్కు చట్టం వచ్చినా కేంద్రంలోని కాంగ్రెస్‌, బిజెపి పార్టీల పాలనా వైఫల్యాలతో అది కాగితాలకే పరిమితమయింది. పాఠ శాలల్లో చేరిన విద్యార్థులలో సగం మంది 8వ తరగతి కూడా చ దవకుండా మధ్యలోనే మానేస్తుండడంతో పాఠశాల విద్యా సా ్థయికి చేరుకోలేక పోతున్నారు. నిరక్షరాస్యుల్లో, మధ్యలోనే బడి మానేస్తున్న వారిలో అధికులు దళితులు, గిరిజనులు, మైనార్టీలే.
పాఠశాల విద్యను గట్టెక్కిన వారిలో కూడా అందరూ పై చదువులకు పోవటం లేదు. 15-18 సంవత్సరాల వయస్కుల్లో 22 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరుతు న్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ జనాభాల్లో గ్రాడ్యుయేట్లు 4.5శాతం మందే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెక్కిరిస్తు న్నాయి. ఇక నాణ్యత విషయంలోనూ నాసికరమే. ప్రథమ్‌ సంస్థ ప్రకటిం చిన వార్షిక విద్యాస్థాయి-2014 నివేదిక ప్రకారం 5వ తరగతి విద్యార్థుల్లో సగం మంది, 8వ తరగతి విద్యార్థుల్లో నాల్గవ వం తు మంది రెండవ తరగతి తెలుగు వాచకాన్ని కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. అంతేకాదు 3వ తరగతి గణి తంలోని కూడిక లు, తీసివేతలు, భాగహారాలు కూడా చేయలేక పోతున్నారని తేల్చింది. నిర్ణీత విద్యా ప్రమాణా లు లేకపోవడం అనేది పాఠశాలల స్థాయికే పరిమితంకాక అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ అర్హత కలిగిన వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు సరి పడిన సామర్థ్యం ఉంటు న్నట్లు పారిశ్రామిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యున్నత ప్రమా ణాలు గల 200 విశ్వ విద్యాలయాల్లో భారతదేశానికి చెందినవి ఒక్కటి కూడా లేదు.వివిధ దేశాల్లోని విద్యార్థుల స్థాయినీ బేరీజువేసే అంతర్జాతీయ సంస్థ (పిఐఎస్‌ఐ) జాబితా నుంచి భారతదేశం ఆరేళ్ల క్రితమే తప్పుకున్నది. ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపో తున్నందున మన దేశంలో విద్యా సంస్థల ప్రమాణాలను కొలిచే వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభు త్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నది. అమెరి కాలోని సిలికాన్‌ వ్యాలీలోని సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో అత్యధికులు భారతీయులేనని, దేశ దేశాల్లో మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఒరిగేదే ముంది. ‘’ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత’’ అన్నట్లుగా ఉంది.కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంలో ప్రతికూల పరిణామాలు పెరిగి పోతున్నాయి. సమాజాభివృద్ధికి తోడ్పడే శాస్త్ర సాంకేతిక రంగాలను విస్మరిస్తూ మూఢ విశ్వా సాలను ప్రచారంలోకి తెస్తున్నారు. పదమూ డేళ్ళ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోప ణలతో మూ డేళ్ళ నుంచి జైలులో ఉంటున్న ఆశారాం బాపు జీవిత కథను ఆదర్శ పురుషుల జాబితాలో భాగంగా రాజస్థాన్‌లో ఉపవాచ కంగా ఉపయోగిస్తున్నారు. అదే పుస్తకాన్ని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 10వ తగరతి విద్యార్థులకూ పంచిపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల ప్రార్థనా సమయంలో సూర్యనమస్కా రాలు చేయిస్తు న్నారు. ఆ విధంగా చేయని మహా రాష్ట్రలోని ఒక టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ పొందాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బడిపిల్లల మధ్యా హ్న భోజన పథకంలో కోడిగుడ్డును నిషేధించింది. చీర, జాకెట్‌ మాత్రమే ధరించాలని గుజరాత్‌ ప్రభుత్వం మహిళా టీచర్ల వస్త్రధారణపై ఆంక్షలు విధించింది. ఈ విధంగా విద్యా రంగంలో హిందూత్వ ఎజెండాను జొప్పిస్తూ దళితులూ, క్రిష్టియన్‌లు, ముస్లిం విద్యార్థులు, టీచర్లను లొంగదీసుకొనేందుకు హిందూ త్వ చర్యలు చాపకింద నీరులా అల్లుకుంటున్నాయి.
నూతన విద్యావిధానం-2015 పేరుతో కేంద్ర విద్యాశాఖ చేస్తున్న బూటకపు సంప్రదింపుల తతంగం మరింత ఆందోళన కరంగా ఉంది. ఉన్నత, సాంకేతిక విద్యలతోపాటు పాఠశాల విద్యను కూడా పబ్లిక్‌-ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌కు ఎగదోస్తు న్నది. విదేశీ విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకూ భారతీయ విద్యార్థులను బలిచేసే వినాశకర బిల్లులతో ఎదురుచూస్తోంది. విద్యారంగం నుంచి ప్రభుత్వాలను తప్పించేందుకు ఎన్నికల కమిషన్‌ లాంటి స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయా లనే ప్రతిపాదనను ‘’శిక్షా సంస్కృతి ఉత్థాన్‌ న్యాస్‌’’ (ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ) అనే సంస్థతో ముందుకు తెస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో విద్యకు నిధులను భారీగా కోతకోయటం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత దివాళా తీసే పరిస్థితి తయారైంది. ప్రయివేట్‌ విద్యావ్యాపారం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. విద్యారంగంలో ప్రబలిపోతున్న మతోన్మాద ఎజెండాతో, ప్రయివేట్‌రంగంలోని విద్యావకాశాలతో అనైక్యతా పరిణా మాలు ప్రబలే అవకాశం ఉంది. హిందూత్వ పాఠాలతో మతాల మధ్య విభజనకు దారితీస్తుంది. ప్రయివేట్‌ కార్పొరేట్‌ కాలేజీల్లో సంపన్నులు, పై కులాల పిల్లలు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, గిరిజనులు, బిసిల పిల్లలే మిగిలిపోవటం విద్యారంగంలో ఆధునిక అంటరానితనంగా తేలిపోతోంది. ఈ రెండు పరిణామాలతో భావిభారత పౌరుల్లో సమైక్యతా భావజాలాన్ని ప్రోది చేయాల్సిన విద్యా విధానమే విచ్ఛిన్నకర శక్తిగా మారే ప్రమాదం పొంచివున్నది. అది మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆకాంక్షలకు అపచారం చేసినట్లు కాగలదు. కనుక భారతీయుల సమైక్యతా సాధనంగా విద్యను వికసింపజేస్తేనే తొలి విద్యామంత్రికి నిండు నివాళి అర్పించినట్లు అవుతుంది. అందుకు అనువైన విద్యావిధానం కోసం ప్రత్యేక కృషి జరగాల్సిన అవసరం ఉన్నది. -(వ్యాసకర్త ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు)/ వ్యాసకర్త యుటిఎఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి,
-(జి.వెంకటేశ్వరరావు)

కామారం కలాల శోధన కోయతూర్‌ ఆఫ్‌ కామారం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ‘‘బీర్సా ముండా యూత్‌ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం’’ ‘‘ఇండిజినెస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ డా. అమ్మిన శ్రీనివాసరాజు
నేటి ఆధునిక కాలంలో అడవి బిడ్డల్లో పొడచూస్తున్న మార్పుల తీరు తెన్నులు గమనిస్తుంటే, అక్షరాల ఆనందదాయకంగా ఉంది. ఆదివాసీలు తమ చరిత్రను, తమ అస్తిత్వాన్ని, మూలాలను, తామే స్వయంగా నిర్మాణం చేసుకుంటున్న శుభతరుణం ఇది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పరిధిలోగల ‘‘సమ్మక్క సారక్క తాడ్వాయి’’ మండలంలోని గిరిజన గ్రామం కామారంకు చెందిన విద్యావంతులైన గిరిజన యువత ఏర్పాటు చేసుకున్న ‘‘బీర్సా ముండా యూత్‌ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం.
‘‘ఇండిజినెస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ ఇది విషయపరంగాను అలంకరణ పరంగాను ఎంతో ఆకర్షణీయంగా అందంగా విలువైనదిగా ఉంది ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని ‘‘గిరిజన ఎన్సైక్లోపీడియా’’ అని కూడా అభివర్ణించవచ్చు.
296 కమ్మలతో అచ్చంగా 64 అంశాలను సచిత్రంగా అనుభవసారంతో అందించిన ఈ వ్యాసావళిలోని ప్రతి వ్యాసం ఒక ఆణిము త్యం లాంటిదే..!! ఆదివాసి జనజాతి అన్న, వారి ఆచారసాంప్రదాయాలు అన్న,అవి అతి ప్రాచీనమైనవి అనే భావన ప్రతి ఒక్కరిలో నాటుపోయి ఉంది.కానీ అది సరైనది కాదు అనే భావన కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. దీనిలో ఆదివాసీలకు సంబంధించిన సమస్త అంశాలు పరిశోధనాత్మకంగా వివరించబడ్డాయి.వస్త్రధారణ,అలంకరణ, పండుగలు,గట్టు- గోత్రాలు,పెళ్లి, చావు,వేట, భాష, ఆహార సేకరణ,ఆటలు- పాటలు, వ్యవసాయ విధానం,పశువుల జంతువుల పెంపకం,తదితర విషయాల గురించిన సంపూర్ణ సచిత్ర విషయాలు సహేతుకంగా ఇందులో మనం చదవచ్చు.సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే ఏదో ఒక అంశం మాత్రమే తీసుకుని దానిని పరిశోధించి ఫలితాలు రాస్తారు కానీ ఈబీర్సా ముండా యూత్‌ వారు సుమారు 200 విషయాలు ఎంచుకొని వృక్ష- జంతు శాస్త్ర, గణిత -భౌతిక శాస్త్ర, చరిత్ర, పురావస్తు, ఆంత్రఫాలజీ, వంటి అంశాలను కలగలిపి అధ్యయనం చేసి పరిశోధన చేయటం సాహసంతో కూడిన గొప్ప విషయం.
దీనిలో ప్రధానంగా ‘‘ఇండిజినెస్‌’’ (స్థానిక ప్రజల ఆలోచనలు ఆచరణ) జ్ఞానంపై ఎక్కువ విశ్లేషణ చేసి గిరిజన ప్రాకృతిక వైవిధ్య ఫలితమైన జ్ఞానాన్ని విపులంగా చిత్రించారు, ఇందులోని శోధన అంతా గిరిజన జీవనం ప్రాకృతిక జ్ఞానం కేంద్రంగా కొనసాగింది. ఆదివాసుల నాగరికతకు సంబంధించిన పరికరాలను వివరించడమే కాక వాటి యొక్క శాస్త్రీయ విశ్లేషణ కూడా చేయడం ఇందులో ఒక విశిష్టత, ఎడ్ల బండి మొదలు నాగలి , ముల్లుకర్ర, గొర్రు, బొనగ, తూతకొమ్ము, ఒడిసెల, గినుగు, బరిశ, ఇసుర్రాయి, రోలు, తదితర వస్తువుల నిర్మాణం ఉపయోగంతో పాటు వాటిలో గల శాస్త్రీయ విశ్లేషణలు కూలంకషంగా చేశారు.
వీటిలో ‘‘తూత కొమ్ము’’ గురించిన విశ్లేషణ గమనిద్దాం… అడవి దున్నల కొమ్ములను గిరిజనులు అడవుల నుంచి సేకరించి క్రమ పద్ధతిలో మొన భాగాన్ని, తొలగించి లోపల భాగం శుభ్రం చేస్తారు, పై భాగంలో నులుపుగా ఉండటానికి నూనె పూస్తారు, బోలుగా ఉన్న కొమ్ము మొన భాగం నుండి గాలిని ఊదటంతో భీకరమైన శబ్దం వస్తుంది,
ఈ ‘‘త్షుత కొమ్ము’’ గిరిజనులకు హెచ్చరిక చేసే సైరన్‌ లాంటిది, పశువులను మేత కోసం వదలడానికి, అడవుల్లో అవి మేత మేసే సమయంలో క్రూర మృగాల బారి నుంచి కాపాడటానికి, మందల నుంచి తప్పిపోయిన పశువులు తిరిగి మందలోకి రావడం కోసం, ఈ ‘‘తూతకొమ్ము’’ను ఉపయోగిస్తారు. అలాగే గిరిజన గ్రామాల్లో ఈ తూతకొమ్ము ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది, ముఖ్యంగా గ్రామ దేవతల జాతరలు పండుగల వేళ ఆయా దేవర్ల ఆగమనానికి గుర్తుగా తూతకొమ్ము ఊది జనాలను జాగృతం చేస్తారు. ఈ దూత కొమ్ముకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ చేస్తూ దీని జ్ఞానం నుంచే నేటి ఆధునిక సౌండ్‌ సిస్టమ్స్‌ వచ్చాయని భావించవచ్చు అంటూ…అడవిలో జంతువులు పక్షులు ఆరుపులను బట్టి గుంపులు గుంపులుగా జీవిస్తాయి,వాటి క్రమం నుంచే జ్ఞానం తెలుసుకుని తూతకొమ్ము శబ్దంతో ఆదివాసీలందరూ ఏకమవడం నిజంగా ప్రకృతి నేర్పిన జ్ఞానం అంటారు ఈ పరిశోధకరచయితలు,ఇదే క్రమంలో వడిసెల, గినుగు, విల్లు, తదితర ఉపకరణాల గురించిన విశ్లేషణలు ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఇందులో చదవచ్చు.
కోయవారు పూర్వకాలం నుంచి కాలాన్ని కొలవడానికి కార్తెలను ఎలా ఉపయోగించారో చెబుతూ కార్తెల పేర్లకు గల జానపద కథనాలు, వాటితో ముడిపడి ఉన్న సామెతలు, కూడా ఇందులో పేర్కొనడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అలాగే ఆయా కార్తెల సందర్భంగా గిరిజనులు చేసుకునే పండుగల వివరాలు సైతం చెప్పడం జరిగింది.అడవిలోనే మృగాలు దాంపత్య జీవనం కోసం కలుసుకునే సందర్భంలో భీకరంగా అరుస్తాయి.ఆసందర్భంలో వచ్చే కార్తె కనుక దీనిని ‘‘మృగశిర కార్తె’’ అంటారు, ఎండలు తగ్గి వానలు రాకకు అనుకూలత చెందెసమయంలో ఈ కార్తె వస్తుంది.వర్షం లేకపోయినా భూమి చల్లగా ఉంటుంది. ఈ కార్తెలోనే భూమిలో విత్తనాలు వేస్తే పాడైపోకుండా సక్రమంగా మొలుస్తాయి అని వారి నమ్మకం, ఇలా కార్తెలను లెక్కించడం, కాలాన్ని విభజించడం, భూములు కొలవడం, తదితర విషయాల గురించి పరిశీలిస్తే ఈ ఆదివాసులకు, అక్షరజ్ఞానం అంతగా లేకపో యినా ప్రకృతిని అంచనా వేయడంలో వారు చక్కని పరిజ్ఞానం కలిగి ఉంటారు అనే నిజం నమ్మి తీరాల్సిందే.!! ఈ పుస్తకంలో సాధార ణమైన గిరిజన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఉమ్మడి జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, ఆటలు, పాటలు, వ్యవసాయం, జంతువుల పెంపకం, గురించిన సాధారణ విషయాల గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా సహేతుకంగా వివరించడమే కాక శివుని చారిత్రక నేపథ్యం, సింధు నాగరికత కోయ నాగరికత, కోయ సిద్ధాంతం ప్రత్యేకత, కోయ తూర్‌, గోండ్వానా ధర్మచక్రాల గురించిన విశ్లేషణలతో పాటు, గొంతెమ్మ మడుగు పురాతన చిహ్నాలు – ఒక అధ్యయనం, వంటి వినూత్న విషయాల గురించిన వివరాలు చెప్పడం దీనిలో ఒక ప్రత్యేకత.
ఆదివాసి జాతి సంరక్షణ కోసం తమ అస్తిత్వాన్ని తామే వ్రాసుకోవడం ఒక కోణం, అయితే గిరిజనులకు గల పరిశీలన దృష్టి, ప్రకృతిని అంచనా వేయడంలో వారికి గల ప్రత్యేకతలు, కూలంకషంగా ఈ క్షేత్ర పరిశీలన తాలూకు పరిశోధన అధ్యయన గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఎంతో అవసరమైన గిరిజన విజ్ఞానం తాలూకు సైద్ధాంతిక పరమైన విషయ సేకరణలో కామారం బిర్సా ముండా యువజన ఉద్యోగ సంఘాల వారు చేసిన ఈ అక్షర కృషి ఎంతో శ్లాఘనీయం, భావి పరిశోధనలకు ఇది ఒక ‘‘నీటి చెలెమె’’లా, దోహదపడగదు, ఈ అద్బు Ûత అక్షర కృషికి సారథ్యం వహించిన గిరిజన పరిశోధక విద్యార్థి ‘‘మైపతి అరుణ్‌ కుమార్‌’’ ఎంతో అభినందనీయుడు.గిరిజన సంస్కృతి సైద్దాంతిక గ్రంథాలకు తలమాని కంగా నిలిచే ఈ సచిత్ర పుస్తకం ప్రతి పరిశోధక విద్యార్థి అధ్యయనకర్త, విధిగా చదవాల్సినది.

అడవులు..చట్టాలు..గిరిజనుల మనుగడ

అటవీ చట్టానికి తెచ్చిన సవరణ తో అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్లు యథేచ్ఛగా ఏ ప్రాజెక్టునైనా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టవచ్చు. 1980 అటవీ చట్టంలో అటవీ భూములను ఇతర అవసరాల కోసం విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, బాక్సైట్‌ తవ్వకాలు లాంటివి గ్రామ సభలు లేకుండా చేపట్టటం కుదరదు. గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఈ తాజా చట్ట సవరణ ద్వారా గ్రామ సభల అవసరాన్ని రద్దు చేస్తోంది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు అడవుల్లో యథే చ్ఛగా ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తే గిరిజనులు తమ భూముల్నుండి గెంటి వేయబడతారు.
అడవుల పరిరక్షణ చట్టం-1980కి బిజెపి ప్రభుత్వం 2023 మార్చి 29న సవరణ ప్రతిపాదించింది. ఇది అమలైతే అడవుల రక్షణే కాదు, గిరిజనుల మనుగడే ప్రమాదంలో పడు తుంది. అటవీ భూములను ఆఖరుకి గిరిజనుల స్వాధీనంలో వున్న భూములను ఇతర అవసరాల కోసమని (విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, పర్యాట కం పేరుతో) ప్రాజెక్టులకు మళ్లించడానికి వీలు కల్పించారు.
అడవులపై చట్టాలు – చరిత్ర
బ్రిటీషువారు మొదట 1865లోనే అడవులపై చట్టం తెచ్చారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పడిరది.దీన్ని మరింత కఠినతరం చేస్తూ 18 78లో మరోచట్టం చేశారు.పై రెండు చట్టా లను, ఇతర కొన్నికొత్త నిబంధనలను చేర్చి కొన్ని ముఖ్య మైన ప్రతిపాదనలతో 1927లో మరో చట్టం చేశారు.తద్వారా ప్రభుత్వానికి అడవులపై హక్కు లు దఖలు పరిచారు. 1927లో రూపొందిన అటవీచట్టం అడవులలో నివశించే గిరిజనుల జీవనం,వారి హక్కుల గురించి ఒక్కమాట పేర్కొ నలేదు. వారి ఇళ్లకు, భూములకు, ఇతర అటవీ ఉప ఉత్పత్తుల మీద హక్కులకు ఈచట్టంలో చట్టపరమైన హక్కులు గుర్తించలేదు.పైగా ఈ చట్టం ద్వారా రూపొందిన విధానాలు అడవుల్లో కలప సేకరణపై ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి.కలప తరలింపుపై అనేక నిబం ధనలు రూపొందించారు. అడవి, కలప, ఉప ఉత్పత్తులు మొదలగునవి పరిశ్రమల అభివృద్ధికి, పరిసరాల్లోని ప్రజల జీవనానికి అత్యంత ప్రాధా న్యత కలిగిన ఆరోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం అంతకు ముందు చట్టాల కంటే మరింత పకడ్బం దీగా అటవీ ఉత్పత్తులను కంట్రోల్‌ చేసే చట్టంగా ఇది రూపొందింది. మొట్టమొదటి చట్టంలో (1865) అటవీ భూములన్నీ ప్రభుత్వ స్వాధీనం అయితే,1927చట్టంలో అడవుల్లో ఉత్పత్తి అయ్యే కలప ఇతర ఉత్పత్తులు అన్నీ బ్రిటీషు ప్రభుత్వ కంట్రోల్లోకి తేబడ్డాయి. ఈ కలపతోనే బ్రిటీషు ప్రభుత్వం ఇంగ్లండ్‌లో ఓడల నిర్మాణం చేపట్టిం ది. రైల్వే స్లీపర్లు (దుంగలు కొయ్యలతో) రైలు పట్టాలు నిర్మించింది. తమ వ్యాపారానికి రైల్వే లైన్లు, ఓడలు అవసరం అయిన తరుణంలో అడ వుల సంపదపై పూర్తి పట్టు సాధించిన చట్టంగా 1927చట్టం అమలులోకి వచ్చింది. ఈ కాలం లోనే మన అడవులు భారీ స్థాయిలో ధ్వంసం

అయ్యాయి. బ్రిటీషు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఒక మంచి ఆదాయ వనరుగా రూపొందించింది. 1865 చట్టం బ్రిటీషు ప్రభు త్వానికి దట్టంగా చెట్లున్న ప్రాంతాన్ని అడవిగా ప్రకటించే అధికారం ఇస్తే, 1927 చట్టం అటవీ సంపద వలస రాజ్యం పూర్తిగా కొల్లగొట్టేదానికి అవకాశం ఇచ్చింది. భూముల్లో ప్రవేశించినా, కలపను తరలించినా అపరాధపు పన్ను వసూలు కు,చివరకు జైలు శిక్షలు విధించడానికి ఈ చట్టం బ్రిటీషు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. మిలి యన్ల కొద్దీ ప్రజలు అడవులలోనూ,అటవీ పరిస రాలలోనూ నివశిస్తున్నా వారికి ఏవిధమైన చట్ట బద్ధమైన హక్కులు లేకుండా పోయాయి. 1880 జనాభా లెక్కల ప్రకారం గిరిజనుల జనాభా 70 మిలియన్లని (7కోట్లు) అంచనా వేయబడిరది. కానీ అటవీ అధికారులకు అటు అడవుల మీద, ఇటు అడవులలో నివశించే గిరిజనుల మీద మితిమీరిన అధికారాలు దఖలు పర్చబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2023చట్ట సవరణ ద్వారా 1927చట్టం లాంటి విధానాల వైపు పరుగులు పెడుతోంది.
బ్రిటీషు ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో పాలనా యంత్రాగాన్ని వినియోగించి అడవులపై ఆధారపడిన గిరిజనుల కమ్యూనిటీల మీద, వారి జీవనంపైన విపరీతమైన ఆంక్షలు విధించింది. ఆహారం,వంట చెరుకు,మందులు,ఉప ఉత్పత్తుల వినియోగానికి ఈ ఆంక్షలు పెట్టారు. వాస్తవంగా అడవులలో నివశించే గిరిజనుల, వారి కమ్యూని టీల విధానాలతోనే అభివృద్ధి చెందుతూ వచ్చిన అడవుల పరిరక్షణ పరిణామాన్ని బ్రిటీషు చట్టాలు దెబ్బకొట్టాయి.
తాజా సవరణ చట్టం
ఇప్పుడు 2023 మార్చి 29న అటవీ చట్టానికి తెచ్చిన సవరణతో అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్లు యథేచ్ఛగా ఏప్రాజెక్టునైనా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టవచ్చు. 1980 అటవీ చట్టంలో అటవీ భూములను ఇతర అవసరాల కోసం విద్యుత్‌ ప్రాజెక్టులు,మైనింగ్‌,బాక్సైట్‌ తవ్వ కాలు లాంటివి గ్రామ సభలు లేకుండా చేపట్ట టం కుదరదు. గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఈతాజా చట్టసవరణ ద్వారా గ్రామ సభల అవసరాన్ని రద్దుచేస్తోంది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు అడవుల్లో యథేచ్ఛగా ప్రాజె క్టుల పేరుతో ప్రవేశిస్తే గిరిజనులు తమ భూము ల్నుండి గెంటి వేయబడతారు. ఈ సవరణ మూలంగా కార్పొరేట్లు అడవుల్ని వాణిజ్యపరంగా వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రయివేటుతోటల పెంపకం,కాఫీ తోటలు పేరు తో దట్టమైన అడవుల్ని ధ్వంసం చేయడానికి వీలు కల్గుతుంది. స్వాతంత్య్రం వచ్చాక అడవుల పరిరక్షణతో పాటు – అడవుల్లో నివసించే వారికి వారి హక్కులను చట్టబద్ధం చేస్తూ చర్యలు చేపట్టబడ్డాయి. గిరిజనుల భూములు అన్యాక్రాం తం కాకుండా రక్షణగా ఎన్నో చర్యలు వచ్చాయి. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గిరిజనుల రక్షణ కు ఉద్దేశించి పరిపాలనాపరంగా కూడా కొన్ని చర్యలు చేపట్టబడ్డాయి.
రక్షణగా చర్యలు
అడవుల్లో బ్రిటీషు పాలకులు గిరిజనుల జీవనానికి ప్రమాదం తెచ్చినప్పుడు 1922 లోనే అల్లూరి సీతారామరాజు ప్రతిఘటన ప్రారంభించాడు.1924లో రామరాజు కాల్చి వేయబడేవరకు అడవుల్లో గిరిజనుల హక్కుల రక్షణ కొరకు ఎన్నో ప్రతిఘటనలు జరిగాయి. ఇదే తీరులో అదిలాబాద్‌ అడవుల్లో గిరిజనుల కోసం కొమరం భీమ్‌ పోరాడారు. దేశంలో ఇతర ప్రాంతాల్లోను అడవుల మీద బ్రిటీషువారి దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వందలాది తిరుగు బాట్లు జరిగాయి. ఈఉద్యమాల ఫలితంగా దేశా నికి స్వాతంత్య్రం రాగానే అనేక రక్షణా చర్యలు తీసుకోబడ్డాయి. కేవలం విద్య ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు ప్రకటించడమే కాదు, అటవీ ప్రాంతా ల్లో గిరిజనుల స్వాధీనంలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా రెవిన్యూ చట్టాలలో రక్షణలు కల్పించారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే గిరిజన ప్రాంతాల పరిపాలనలోనూ గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి రాజకీయం గానూ చర్యలు తీసుకున్నారు. 1/70 రెగ్యులేషన్స్‌ జీవో నెం-3లాంటివి కొన్ని అంశాల్లో గిరిజ నులకు రక్షణగా నిలిచాయి.అటవీ హక్కుల చట్ట మూ వచ్చింది. అయితే ఇప్పుడు మార్చి 29న ప్రకటించిన సవరణ ప్రకారం ప్రాజెక్టులు చేపట్ట డానికి గ్రామసభలు అనుమతులు అవసరం లేద ని చెప్పడమే గాదు టూరిజం, మైనింగ్‌ ఇతర ప్రాజెక్టుల చర్యలు కాంట్రాక్టర్లు, కార్పోరేట్లు అడ వుల్ని కొల్లగొట్టడానికి అవకాశం ఇస్తోంది. పార్ల మెంటులో ప్రకటించిన వివరాలను బట్టి 2008-09 నాటికే 2.53 లక్షల హెక్టార్ల అడవి ఇతర ప్రాజెక్టుల కోసం మళ్లించబడిరది. ఈ నాటి సవరణతో అడవులు ఎక్కువగా ధ్వంసంగా వడానికే అవకాశం ఇస్తుంది.
భూస్వాధీనం – హక్కులు
మైదాన ప్రాంతాల్లోనైనా ఏదయినా ప్రాజెక్టు చేపట్టేటప్పుడు భూములు కోల్పోయిన వారు దాని ప్రభావంతో జీవనాధారం కోల్పో వడాన్ని అంచనా కట్టాలి.అలాగే పర్యావరణ రక్షణకు జరిగే నష్టాలను అంచనా కట్టాలి. ఇది ఇప్పటికే 1980 అటవీ చట్టంలో రక్షణగా ఉన్న అంశం. ఇప్పుడు ఈచట్ట సవరణలో ఈ నిబంధ నకు మినహాయింపు ఇచ్చారు. ఏతరహా ప్రాజె క్టులకు అడవుల్లో నిబంధనలు సడలించవచ్చో ఒక జాబితా ప్రకటించారు. విద్యుత్‌, మైనింగ్‌, టూరిజం లాంటి అంశాల్ని లిస్టులో పేర్కొన్న అనంతరం అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అడవులు కేంద్రం అవుతాయి. గిరిజనుల జీవనాధారం ప్రశ్నార్ధకం అవుతుంది.ఈ చట్ట సవరణ అడవిని పునర్‌ నిర్వచనం చేస్తోంది. అడవిలో నివశించే గిరిజనులకున్న హక్కుల్ని విస్మరిస్తోంది.బ్రిటీషువారి 1927 చట్టంలో గిరిజ నుల జీవన హక్కులు గుర్తించబడలేదు. అటవీ పరిరక్షణ, పర్యావరణం గురించి ఒక్కమాట కూడా అందులో లేదు. అడవుల్లో చేపట్టే ప్రాజె క్టుల వల్ల భూహక్కులు కోల్పోయే బాధితుల ప్రస్తా వనే ఇందులో లేదు.అడవుల రక్షణకోసం ఇప్పటికే రిజర్వు ఫారెస్టు దాని సమీపంలోని 100 కిలో మీటర్ల వరకు కొన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం లేకుండా షరతులు విధించబడ్డాయి, ఇప్పుడు వీటన్నింటనీ తొలగించారు. అడవుల్లో చెట్లు నరికిన చోట మళ్లీ చెట్టు నాటాలన్న నిబం ధనకు సడలింపు ప్రకటించారు. అడవుల్లో జంతు వుల వేట సఫారీ సాగించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రయివేటు పెట్టుబడికి ప్రోత్సాహం పేరుతో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, గనుల తవ్వ కాలు అనుమతి ఇవ్వబడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్ట సవరణ అడవుల్ని ప్రైవేటీక రించడానికి అవకాశం ఇస్తుంది. కొంత భాగం భూముల్లో కలప పెంచడానికి కార్పొరేట్లకు అవకాశం ఇస్తుందని బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంలో పత్రికలలో వ్యాఖ్యానాలు వచ్చాయి. అందువల్ల అటు పర్యావరణం, ఇటు గిరిజనుల మనుగడ ఈ సవరణతో ప్రమాదంలో పడుతుంది.బ్రిటీషువారు రాక ముందు అడవుల మీద,అందులో నివశించే గిరిజనుల జీవనం మీద రాజులు, రాజ్యాలు చొరబాటుగాని,జోక్యం గాని లేదు. అడవుల్లో నివశించే గిరిజన తెగలు తమ జీవనం అడవుల మీద ఆధారపడి వుంది గనుక వాటిని కాపాడ్డానికి కొన్నికట్టుబాట్లు,రక్షణ చర్యలు చేపట్టి కాపాడారు. వేట సైతం దట్టమైన అడవుల మీద ఆధారపడి వుంది గనుక దట్టమైన అడవుల్ని కాపాడటం తమ బాధ్యతగా గుర్తించి వ్యవహరిం చారు.అందువల్లే అడవులు దేశంలో ప్రజల సంపదగా చరిత్రకారులు పేర్కొన్నారు. అడవుల మనుగడ, గిరిజనుల జీవనం పెనవేసుకున్న అంశాలుగా పేర్కొని 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అది పూర్తిగా రద్దవుతుంది.ప్రజా ప్రతిఘటనే మార్గం.
అటవీ హక్కుల చట్టం ఆదివాసీల జీవితాలను మెరుగుపరిచిందా?
శతాబ్దాలుగా మధ్య భారతదేశంలోని ఆదివాసీలకు అడవి ముఖ్యమైన జీవనాధారంగా ఉంది. ఆహారం,పశుగ్రాసం మరియు ఇంధ నంతో పాటు,ఔషధం,నిర్మాణవస్తువులు, వ్యవ సాయ పనిముట్ల తయారీకి సంబంధించిన వస్తువులు మొదలైన వాటికి కూడా అడవి మూలం. ఈ ఆధారపడటం వల్ల ఆదివాసీలు తమ నివాస ప్రాంతాలలో అడవిని మరియు దాని జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నారు. వలస రాజ్యాల కాలంలో కలప డిమాండ్‌ను తీర్చడానికి రాష్ట్రం అడవిపై సంపూర్ణ నియంత్రణను పొంది నప్పుడు పరిస్థితి మారిపోయింది.భారతీయ అటవీ చట్టం,1927 అటువంటి నియంత్రణ కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించింది. కలప ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి ఇతర కలపేతర జాతులకు హానికరం అని నిరూపించబడిరది, ఇది క్రమంగా అడవి నుండి అదృశ్యం కావడం ప్రారంభించింది.ఈ పరిస్థితి స్వాతంత్య్రానంతరం కొనసాగింది మరియు ఫలితంగా, ప్రధానంగా అటవీ వనరులపై ఆధారపడిన ఆదివాసీల జీవి తం మరింత దుర్బలంగా మారింది. ఈ అన్యా యాన్నిరద్దు చేయడానికి, అటవీ-నివాస వర్గాలకు వారి జీవనోపాధిని పొందేందుకు అటవీ నిర్వ హణ హక్కులు మరియు భూమిని అందించడానికి భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 ని తీసుకు వచ్చింది. అయితే అప్పటికే ఆదివాసీల పరిస్థితి మరింత దిగజారింది. – (పి.మధు/గునపర్తి సైమన్‌)

ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు

భారత రాజ్యాంగం, దాని మౌలిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటి సమాజంలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా భారతజాతిలో సామాజిక చైతన్యం, రాజ్యాంగ అధ్యయనం అన్ని వర్గాల ప్రజలకు అనివార్యంగా ఏర్పడిరది. రెండు దశాబ్దా లకుపైగా జరిగిన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం ఎందరో మహనీయుల ఆత్మత్యాగాల ఫలితంగా మనదేశ దాస్యశృంఖాలాలకు విముక్తి లభించింది. స్వతంత్య్ర భారత తొలినాటి నేతలు పేదరికాన్ని మరియు దాని కవలలైన ఆకలి, అనారోగ్యం రూపుమాపి పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనానికి బాటలు వేస్తామనే ప్రతిజ్ఞలతో పాలన ఆరంభించారు. మనదేశ ప్రజల జీవితాన్ని క్రమ బద్ధంగా నిర్వహించు కొనుటకు ఏర్పడ్డదే రాజ్యాం గం. మనదేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దానిలోని ప్రధానాంశాలైన,శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల వ్యవస్థీకరణ, అధికా రాలు, విధులు, పౌరుల హక్కులు, బాధ్య తలు, ఆదేశసూత్రాలు మొదలగునవన్ని పొందు పరుచు కున్న నిబంధనావళే రాజ్యాంగం. మన దేశానికి రాజ్యాంగమే మూలస్తంబం.
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చెప్పినట్లు గా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తు లు,సంపద,రాజకీయాలు,విద్య,వివాహం, హిందూమతాన్ని ప్రజాస్వామ్యీ కరించాలి. ఇదే బహుజన ప్రజాస్వామిక విప్లవం.ఆవిప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. వాటిని సమగ్రం గా సాధించడమనేది బహుజ నుల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంది. మన సమాజంలో మనుషులందరూ సమానమే అన్న భావన ఏనాడూ లేదు. వర్ణవ్యవస్థ, కుల వ్యవస్థ మను షుల్లో హెచ్చుతగ్గులు సృష్టించి స్థిర పరిచాయి. భారత రాజ్యాంగం ప్రప్రథమంగా అందుకు భిన్నంగా మనుషులందరూ సమాన మేనని గుర్తించింది. ఈ దృష్ట్యా భారత రాజ్యాంగ విప్లవ స్వభావం గురించి చర్చజరగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.ఈ చర్చకు అగ్రశ్రేణి మార్క్సిస్టు మేధావి అయిన ప్రభాత్‌ పట్నాయక్‌ మన రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలను పునాదిగా చేసుకోవలసి ఉంది.‘భారతీయ సామా జిక చరిత్ర వ్యవస్థీకృత అసమానతలతో నిండి పోయి ఉంది. మన రాజ్యాంగం ప్రజలకు సార్వ త్రిక ఓటుహక్కు కల్పించడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని ఆమోదించింది. కాబట్టి రాజకీయ సమానత్వం ద్వారా సామాజిక, ఆర్థిక రంగాలలో సమానత్వాన్ని తీసుకురావాల’న్న డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ భారత రాజ్యాంగానికి విప్లవ స్వభావం ఉందని ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు.ఈ విప్లవ స్వభావానికి రెండు రకాల రాజ్యాంగ ఉద్యమాలు పునాదిగా ఉన్నా యని ఆయన అన్నారు. మొదటిది బ్రిటిష్‌ వలస పాలన వ్యతిరేక ఉద్యమం కాగా రెండోది పూలే నుంచి అంబేడ్కర్‌ దాకా సాగిన సామాజిక విముక్తి ఉద్యమాలని ఆయన తెలిపారు. వైపరీత్యమే మంటే ఈ దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా భారత రాజ్యాంగ ఆవిర్భా వాన్ని దీర్ఘకాలిక విప్లవంగా గుర్తించడం లేదు. అందుకే అవి జనతా ప్రజాతంత్ర, సోషలిస్టు విప్లవ కార్యక్రమా లను ప్రకటించుకుని పనిచేస్తు న్నాయి. అన్ని కమ్యూనిస్టు పార్టీలు భారత రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగమని దాన్ని కూల్చి వేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్నాయి.మరి ఆపార్టీల వారే ఇటీవలి కాలంలో రాజ్యాంగ పరి రక్షణ కోసం పిలుపులు ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగం విష యంలో వారిఅంచనాలు సరైనవి కావని స్పష్ట మయింది. మన రాజ్యాంగం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వాన్ని సాధించేం దుకు సామాజికన్యాయాన్ని లక్ష్యంగా ప్రకటించు కున్నది. దీనికి సంబంధించే రాజ్యాంగంలో అనేక అధికరణలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులేనని 14వ అధికరణం ప్రకటించింది. మతం,జాతి,కులం,లింగం,ప్రాంతాన్ని బట్టి వివక్ష పాటించడాన్ని 15వ అధికరణం నిషేధించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకా శాలు కల్పించాలని అధికరణం 16 నిర్దేశించింది. 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధిం చింది. 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛను, 21వ అధికరణం పౌరరక్షణ, వ్యక్తిగతస్వేచ్ఛను కల్పించాయి. వెట్టిచాకిరిని 23వ అధికరణం రద్దు చేసింది.14ఏళ్ల లోపు పిల్లలచేత ప్రమాదకర పనులు చేయించరాదని 24వ అధికరణం స్పష్టం చేసింది. సమాజంలో ఆర్థిక,రాజకీయ,సామా జిక న్యాయాన్ని సమృద్ధపరిచేందుకు ప్రభుత్వం పాటుపడాలని అధికరణం 38 పేర్కొంది. అలాగే స్త్రీపురుషులిరువురికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పిల్లలు దోపిడీకి గురికాకుండా ఆరోగ్యంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాలని ప్రకటించింది. ప్రతి పౌరుడూ సమానావకాశాలు పొందటానికి న్యాయవ్యవస్థ పనిచేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అధికరణం 39(ఎ) ఆదేశించింది. ముఖ్యంగా 46వ అధికరణం బలహీన తరగతులకు చెందిన వారి పిల్లలు విద్యాపరంగా, ఆర్థికపరంగా ఎదిగేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులను అన్ని రకాల అన్యాయాలు, దోపిడీ నుంచి రక్షిం చాలి. ప్రజలందరికీ పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ బాధ్యత అని 40వఅధికరణం చెప్పింది. ఇంకా ఎన్నో అధిక రణాలు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్ట వలసిన చర్యల గురించి వివరించాయి.
అందుకనే ‘భారత రాజ్యాంగం ప్రథ మంగా ఒక సామాజిక పత్రం’ అని గ్రాన్‌ విల్లి ఆస్టిన్‌ వ్యాఖ్యానించాడు. భారత రాజ్యాంగంలోని అత్యధిక అధికరణాలు సామాజిక న్యాయ లక్ష్యా లను సాధించడానికి లేదా సామాజిక విప్లవ ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన పరిస్థితు లను స్థాపించడం కోసమే నేరుగా ఉద్దేశించినవి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మొత్తం రాజ్యాంగం జాతీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుని సామాజిక న్యాయాన్ని సాధించడానికి మూడవ భాగంలోని ఆర్టికల్స్‌ కృషి చేస్తున్నాయి. ప్రాథమిక హక్కులు, రాజ్య విధానపు ఆదేశికసూత్రాలు ఈ లక్ష్యం వైపుగా పయనించడానికి ఉద్దేశించినవి. రాజ్యాంగంలోని 3,4వ భాగాలు అతి ముఖ్యమైన వని ఆస్టిన్‌ అంటాడు. అయితే ఇంతటి విప్లవ స్వభావం కలిగిన రాజ్యాంగాన్ని అటు కమ్యూనిస్టు శ్రేణులు ఇటు బహుజన శ్రేణులు కూడా సరిగా గుర్తించలేకపోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా బలహీన వర్గాలవారు చట్టసభలలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చు. అందుకోసం తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్ర రాజకీ యాలు చేయాలి. తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా దామాషా ఎన్ని కల పద్ధతిని వారు డిమాండ్‌ చేయవచ్చు.
ఇవాళ దేశంలో ప్రభుత్వరంగ సంస్థ లను పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారు. సంక్షేమ వ్యయా లపై కూడా ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయి. ఈ పరిణామాలను‘సామాజిక ప్రతీఘాత విప్ల వం’గా ప్రభాత్‌ పట్నాయక్‌ విశ్లేషించారు.ఈ ప్రతీఘాత విప్లవం ప్రధానంగా దళితులు, మైనారి టీలు, మహిళలను కేంద్రంగా చేసుకుని కొనసాగు తోందని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితు లలో అణగారిన కులాలు, తరగతులు రక్షణ పొందాలంటే వారి ప్రాతినిధ్యం పెరగాలి. అంటే శాసనాలు చేసే రాజకీయ అధికారం ఉన్నప్పుడే ప్రస్తుత పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు 15శాతంగా ఉన్న అగ్రకులాలు రాజకీయాలలో 66.5శాతం, వాణిజ్య వ్యాపార రంగాల్లో 97శాతం,ఉపాధి 87శాతం వాటాలు పొందడం అనేది ప్రజా స్వామ్య సూత్రానికి విరుద్ధం. డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పినట్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తులు,సంపద, రాజకీయాలు, విద్య, వివాహం,హిందూమతాన్ని ప్రజాస్వామ్యీ కరిం చాలి.దీన్నే బహుజన ప్రజాస్వామిక విప్లవం అని అంటున్నాను. ఈ విప్లవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రారంభమైంది.ఈవిప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. ఆ సమున్నత లక్ష్యాలను సమగ్రంగా సాధించడమనేది బహుజనుల రాజకీయ చైతన్యం పై ఆధారపడి ఉంది.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి…
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 74 ఏళ్లు.ఈ సందర్భంగా దేశవ్యా ప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటు న్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్‌ 26) భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిం ది. అందుకే ప్రతి ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్‌ 26ను నేషనల్‌ లా డే..లేదా ..సంవిధాన్‌ దివస్‌ గానూ పిలుస్తారు.1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను,7ఉప కమిటీలను ఏర్పాటు చేసింది.వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటిని 1947ఆగస్టు 29న బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్‌ 11సార్లు సమావేశమైంది. ముసాయిదా తయారీలో భాగంగా అంబేద్కర్‌ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు.మొత్తంగా రెండేళ్ల 11నెలల18 రోజులపాటు కష్టించి..సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ,ఇంగ్లీష్‌లో కాపీలను తయారు చేసింది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115రోజులు చర్చించి.. 2వేల 473 సవరణలతో1949 నవంబర్‌ 26న ఆమోదిం చారు. యేటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వం జరుపుకోవాలని 2015,నవంబర్‌ 19న భారతప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్‌ 125 వ జయంతి వేడుకలను సందర్భంగా ముంబైలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. అంబే ద్కర్‌కు నివాళిగా రాజ్యాంగ దినోత్సవం జరుపు తున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగ దినో త్సవం పబ్లిక్‌ హాలిడే కాదు. కానీప్రభుత్వ విభాగా ల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుం టున్నా..ఈసారి వేడుకలకు మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్ల మెంటులో ఘనంగా వేడుకలు నిర్వహించ నున్నారు.
భారత రాజ్యాంగం అమలు
1947 ఆగస్టు 15న భారత స్వాతం త్య్రం తర్వాత పీల్చిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాణం కోసం చాలా కసరత్తులు జరిగాయి. ఎన్నో వ్యయప్ర యాసలకు ఓర్చి 2సంవత్సరాల 11నెలల 18 రోజులు కష్టపడి అంబేడ్కర్‌ సారథ్యంలో కమిటీ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది. అనేక మేథోమధనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించారు. 1949 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. రెండు నెలలు తర్వాత 1950 జనవరి 26నభారతదేశ మ్నెదటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటిం చారు. ఆరోజు నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ దినోత్సవం
2015లో అంబేద్కర్‌ 125వ జయం తి సందర్భంగా నవంబర్‌ 26న రాజ్యాంగ దినో త్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయిం చింది.ఈ మేరకు నవంబరు19న కేంద్ర ప్రభు త్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుకుంటున్నాం.
రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ?
రాజ్యాంగం అనగా ప్రభుత్వం యొక్క విధానం.ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు,ఆదేశికసూత్రాలు, రాజ్యాం గపరమైన విధులు విధానాలూ పొందు పరచబడి వుంటాయి.ప్రతి దేశానికి ప్రభుత్వ మనేది సర్వ సాధారణం.ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అను నది అతి ముఖ్యమైంది.ప్రభుత్వం అనునది శరీర మైతే,రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభు త్వాలకు దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాం గం.
ఎందుకు జరుపుకొంటారు?
1949 నవంబర్‌ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడినా…రాజ్యాంగ దినోత్సవం నిర్వహిం చలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్‌ 19న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశం. ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండా లి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభు త్వానికి కరదీపిక వంటిది.ఆ దీపస్తంభపు వెలుగు ల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతివైపు అడుగులు వేయాలి.అందుకనే రాజ్యాం గానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనదేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచిం చాయి. అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం.దీనికి కారణం..దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదీవాసీలు,దళితులు, అణగా రిన, పీడనకుగురైన వర్గాలు తదితరులున్నారు.వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్‌లాంటిదే. ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగసభ డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సారధిగా డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటైంది. రాజ్యాం గ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంత గానో శ్రమించారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతి బింభించాలన్నది ఆయన ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపం చంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26,1950 నుంచి రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహి స్తున్నాం.భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. రాజ్యాం గాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరి పాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాం గం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
రాజ్యాంగంపైనా దాడి!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది.రాజ్యాంగంలోని ప్రాథ మిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్య వాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారు స్తూ రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు విఘాతం కలిగిస్తున్నది.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో గణతంత్ర దినోత్సవం సందర్భం గా దిన పత్రికలకు విడుదల చేసిన రాజ్యాంగ పీఠిక చిత్రం ప్రకటనలో ‘లౌకిక,సామ్యవాద’ అనే పదాలను తొలగించింది.ఈఅంశమై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆ పదాల కత్తిరింపును ఉపసంహరించుకున్నది. 2021, డిసెంబర్‌ 3న‘రాజ్యాంగ సవరణ-2021’ పేరిట రాజ్యాంగ పీఠికకు ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపైనా తీవ్ర నిరసనలు రావ డంతో పక్కనపెట్టింది.ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక వ్యాజ్యంలో తీర్పు చెప్తూ లౌకిక తత్వం భారత రాజ్యాంగంలో ఇమిడి ఉన్న అంతర్బా Ûగమని సర్వోన్నత న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొన్నది.దీన్నిబట్టి రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలను తొలగించడమంటే,రాజ్యాంగంపై దాడి గానే భావించాలి.
గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వా నికి జరిగిన వ్యాజ్యంలో ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడం’ అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు ఉన్న అధికారాల గురించి చెప్పిన అధికరణ-368కి ఉన్న స్థితిపై కీలక వ్యాఖ్య చేశారు. ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని అధికరణ-368 పార్లమెంట్‌కు దత్తం చేయలేదు. ఈ రకమైన అధికారాలు 245, 246, 248 అధికరణల నుంచి వచ్చాయని, ఆ అధికర ణలు పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారానికే పరిమితమయ్యాయని తెలిపారు. అధికరణం 13 (2)లో చెప్పిన ప్రకారం..వాటిని చట్టాలుగానే భావించాలన్నారు.ఈఅధికరణం ప్రకారం రాజ్యం చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుకూ లంగా ఉండాలి. ఆచట్టాలు రాజ్యాంగంతో పొందిక లేని మేరకు రద్దవుతాయి.ఈ తీర్పులో అత్యధిక న్యాయ మూర్తులు రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని పేర్కొన్నారు. కేరళకు చెందిన మఠాధిపతి కేశవానంద భారతి అప్పీలుపై జరిగిన విచారణలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే పదం సర్వోన్నత న్యాయస్థానంలో అత్యధిక న్యాయమూర్తులు తొలిసారిగా పేర్కొ న్నారు.13 మంది సర్వోన్నత న్యాయమూర్తు ల్లో 9 మంది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదన్నారు. ఈ ‘మౌలిక స్వరూపం’ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా, అంతర్లీనంగా ఉందనే అంశాన్ని మొదట 1973లో జరిగిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటినుంచీ రాజ్యాంగానికి భాష్యం చెప్పడానికి, పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలను సమీక్షించే మధ్యవర్తిగానూ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగుతున్నది.కానీ నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధిం చిన అంశాలన్నింటా జోక్యం చేసుకొని రాష్ట్రాల నడ్డి విరుస్తున్నది.జీఎస్టీ రూపం లో రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరును సొంతం చేసుకొని, ఇవ్వాల్సిన నిధులు తొక్కిపెట్టి, వాటిని తమ రాజకీ య ప్రయోజనాల కోసం వాడు కుంటున్నది.
జాతీయ అర్హత పరీక్ష (నీట్‌), ప్రణా ళికా సంఘంరద్దు జాతీయ అభివృద్ధి మం డలి రద్దు,వంటి అనేక రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడి,తానే పెత్తనం చెలాయి స్తున్నది. కరోనా వల్ల ప్రజానీకం ఓపక్క అల్లాడు తుంటే,ఇదే అదనుగా అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసింది కేంద్ర ప్రభు త్వం.విద్యా సంస్కర ణలు,కార్మిక,విద్యుత్‌ సంస్కర ణల బిల్లు వంటివి ఇందుకు ఉదాహరణ. పాఠ్య పుస్తకాల నిండా మత అంశాలు చొప్పించి, లౌకిక వాదానికి గండి కొడుతున్నారు కేంద్ర పాలకులు. ముఖ్యంగా, జీఎస్టీతో పాటు,3వ్యవసాయ నల్లచట్టాలు చేయ డం రాష్ట్రాలహక్కులు హరించడంలో ప్రధాన మైంది. ఇక రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వానికి వ్యతిరేకంగా, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతరా జ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవు తున్నది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక, సామాజిక న్యాయాన్ని పూర్తిగా వదిలివేశారు. ఎక్కువ లాభాలతో నడిచే ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు వంటి అనేక సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు చేపట్టారు. పన్నుల మోత ప్రజానీకానికి పెను భారంగా మారింది. కార్మికులు, పేదలు, బడుగు బలహీనవర్గాలు, అసంఘటిత రంగ కార్మికుల బతుకులు దుర్భ రంగా మారే స్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ గుజరాతీ, మార్వాడీ సంస్కృతీ నిల యంగా మార్చే చర్యలు చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. హిందీని బలవం తంగా రుద్దడంతో పాటు, ఏ రాష్ట్రంలోనూ ఆ రాష్ట్ర ప్రజల భాషలో న్యాయపాలనా వ్యవహా రాలు జరగకుండా అడ్డుపడి ఇంకా స్వాతంత్య్రం రానట్టుగా, బానిసత్వంలో ఉంచుతూ, ప్రజల ఆహారాన్ని కూడా నియంత్రించబూనడం వంటి చర్యలకు పూనుకున్నది.భిన్న సంస్కృతులు,భాషలు, ఆరాధనా పద్ధతులున్న భారత ఉపఖండంలో నిజమైన ఐక్యతాభావం పెంపొందాలంటే, రాజ్యా ంగస్ఫూర్తితో రాష్ట్రాల హక్కులు, ప్రత్యేకతలను గౌరవించే ప్రజాస్వామిక పాలన రావాల్సిన అవ సరం ఎంతైనా ఉన్నది.-(డాక్టర్‌ పట్టా వెంకటేశ్వర్లు/అనిసెట్టి సాయికుమార్‌)

ఇటుకల బట్టీల్లో వెట్టి చాకరి

ఇటుకల బట్టీల్లో కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోగా, కనీస సౌకర్యాలు కూడా యజమానులు కల్పించడం లేదు. బట్టీల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. పగల నకా, రాత్రనకా ఇటుకలు తయారు చేయిస్తున్న యజమా నులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వ హణకు మైనింగ్‌, కార్మికశాఖల నుంచి అనుమతులు తీసుకో వలసి ఉన్నా ఆ నిబంధనలేవీ అమలు కావడం లేదు. అధికా రులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండ టం అనుమానాలకు తావిస్తోంది. కార్మికశాఖ నిబంధనల మేరకు దినసరి కూలీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిరుపేదలైన కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదు.

ఇటుకల బట్టీల యజమానులు సిండికేటుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పును రూ.15 వేల నుంచి 20వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని చెరువుల్లో నుంచి అక్రమంగా తరలిస్తూ తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఆర్జిస్తు న్నారు.అక్రమంగా చెరువుల మట్టి,నీరు వినియోగిస్తు ఇటుకలను మాత్రం అధిక ధరలకు అమ్ముతున్నారు. ట్రాక్టర్‌ యజమానులను మచ్చిక చేసుకొని వారికి కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. బట్టీల్లో పనిచేసే కూలీలకు మాత్రం అరకొరగా వేతనాలు చెల్లిస్తున్నారు. వెయ్యి ఇటుకలకు రూ.900చెల్లిస్తున్నారు. ఇద్దరు మనుషులు ఒక రోజులో వెయ్యి ఇటుకలు మాత్రమే చేయగలుగుతారు. రోజు వారీ అడ్డా కూలీకి మగవారికి రూ.800,ఆడ వారికి రూ.600లు ఉంది. ఇటుక బట్టీల్లో పని చేసే కూలీలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ఇటుకల బట్టీల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన కూలీలు పని చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలు,జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి ఇటుకల బట్టీల్లో కూలీలుగా చేరుతున్నారు. అలా వచ్చిన వారు ఇటుకల బట్టీల వద్దనే తాత్కాలిక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అక్కడ వారికి కనీస ఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం లేదు. ఇటుకల బట్టీలు ఊళ్లకు దూరంగా వాగులు,చెరువుల సమీపంలో ఉండగా అక్కడే కుటుంబాలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.అనారోగ్యం తలె త్తితో వైద్య సదుపాయం కూడా అందు బాటులో లేదు. అత్య వసర సమయాల్లో ఆర్‌ఎంపీలను పిలిపిస్తూ చికిత్స చేయిస్తు న్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వాగులు, చెరువుల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. కూరగాయలు, రేషన్‌ సామగ్రి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థి తులు ఉన్నాయి. తేళ్లు, విష సర్పాల మధ్య జీవనం గడపాల్సి వస్తోంది.
చిన్నారుల పరిస్థితి దయనీయం
ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీల పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. పాఠశాలలు అందుబాటులో లేక వారు చదువుకొనే అవకా శాలు లేవు. దీంతో తల్లిదండ్రులతోపాటే ఇటుకల బట్టీల్లో తిరుగుతున్నారు. ఏడెనిమిది సంవత్సరాల పైబడి వయస్సు పిల్లలు తల్లిదండ్రులతోపాటు కూలీలుగా పని చేస్తున్నారు. ఇక్కడ బాలకార్మిక చట్టం అమలు కావడం లేదు. పిల్లలు అనారోగ్యానికి గురైనా ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర ఆనారోగ్యానికి గురైన ఓమూడేళ్ల చిన్నారి ఇటుకల బట్టీలోనే మృతి చెందడం విషాదాన్ని నింపింది. అలా తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న కూలీలు చాలీచాలని వేతనాలు,అరకొర వసతుల నడుమ ఇటుకల బట్టీల్లో పనిచేస్తూ దుర్భర జీవనం గడుపుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు
మహా విశాఖపట్నం వంటి మహానగరాల్లో భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో చుట్టుపక్కల పల్లెల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చాలా వరకు అనుమతులు లేకుండానే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. హుజూరాబాద్‌ మండలంలోని దాదాపుగా 50కి పైగానే ఇటుక బట్టీలు ఉన్నాయి. విశాఖ ఉమ్మడి జిల్లాలోని పద్మనాభం, భీమిలి, ఆనందపురం, అనకాపల్లి, పాయకరావుపేట, రావికమతం,బుచ్చియ్యపేట తదితర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణకు చెందిన వ్యాపా రులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్‌,ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.
అనుమతులు లేకుండానే ఏర్పాట్లు
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అను మతులు తప్పకుండా తీసుకోవాలి, కానీ కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా నిబంధ నలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయా లంటే నాలా సుంకం చెల్లించాలి. కానీ రైతు లకు డబ్బు ఎర చూపి నాలా సుంకం చెల్లించ కుండానే వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టా న్ని ఉల్లంఘించి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీకి వినియో గిస్తున్నారు.
ప్రధాన రహదారుల వెంట బట్టీలు
పద్మనాభం,అనకాపల్లి,భీమిలి,ఆనందపురం మండలంలో రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం, ఇటుకు బట్టీల నుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా యని ఆందోళన చెందుతున్నారు.
బట్టీల్లో బాల్యం
ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతుండగా ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూర మవుతున్నాయి.చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు ఇటుకలు మోస్తూ బట్టీల్లోనే మగ్గిపోతున్నారు. చాలిచాలనీ జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను యాజమానులు దోచుకోవడంతో పాటు చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తు న్నారు. ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖ సిబ్బందితో చేపట్టిన సర్వేలో ఎక్కువ మంది బడికి వెళ్లకుండా బట్టీల్లోనే పనులు చేస్తూ కనిపించడంతో వారిని దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో కూడా చాలా వరకు బట్టీల్లో పని చేస్తున్న చిన్నారులను గుర్తించారు. ఇదిలా ఉంటే ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఊరికి దూరంగా ఉండ డంతో పాటు రహదారులకు దూరంగా ఉండి వాహనదారులకు ఆ బట్టీల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సింది పోయి రోడ్డు పక్కనే బట్టీలను నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగజే స్తున్నారు. మరోపక్క బట్టీల్లో పనిచేసే కార్మి కులకు కల్పించాల్సిన వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడమే కాదు.ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అయినా కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌,ఒడిశా నుంచి కార్మికులను తీసుకు వస్తుంటారు. ఇందులో బాల కార్మికులే ఎక్కు వగా ఉండడం గమ నార్హం. ప్రతి ఇటుక బట్టీ వ్యాపారి వద్ద సుమారు నలుగురు నుంచి ఐదు గురు వరకు బాల కార్మికులు పని చేస్తుంటారు.
ముందుస్తు ఒప్పందాలతో వెట్టిచాకిరి
జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇందులో పని చేయడానికి బట్టీల యజమానులు ఒరిస్సా,చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు కుటుంబాలతో సహ వచ్చి ఇటుక బట్టీల్లో పని చేస్తుంటారు. ఇటుక బట్టీల యాజమాన్యం ఆయా రాష్ట్రాలకు వెళ్లి కూలీలకు అడ్వాన్స్‌ చెల్లించి పనికి తీసు కోచ్చుకుంటారు. ఇదే అదునుతో విద్యాహక్కు, కార్మిక, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలు స్తోంది. రోజుకు 8 గంటలు పని చేయాలనే నిబంధన ఉన్నా రాత్రింబవళ్లు పని చేయించు కుంటున్నారు. ఒప్పందం ప్రకారం కార్మికులకు వాయిదాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వాయిదాల్లో వారు ఎలాంటి అనారోగ్యా నికి గురైనా, ప్రాణాలుపోయినా యజమానులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం సైతం అందించకపోగా వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లోనే కోతపెడుతున్నారు. బీమా సౌకర్యం కల్పించడం లేదు. ఊరు కాని ఊరు కావడం, బట్టీలు దాటి బయటకు వెళ్లే దారి కనిపించకపోవడంతో తమపై దౌర్జ న్యాలు, వేధింపులు జరుగుతున్నా ఎవరికి చెప్పుకోలేని దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఓ కార్మికునికి సైతం ఇదే తరహాలో బట్టి నిర్వాహకులు వేధిం పులకు గురిచేయడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో విద్యాహక్కు చట్టంకు తూట్లు పొడుస్తూ చిన్నా రులతో పని చేయించుకోవడమే కాకుండా నిబంధనలను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
అనారోగ్యం బారిన
ఇటుక బట్టీలు జనావాసాలకు సమీపంగా వెలుస్తుండడంతో ఇటుకలను కాల్చినప్పుడు వచ్చేపొగ వల్ల కార్మికులతో పాటు, వాటి సమీప గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవు తున్నారు. ఇటుకల నుంచి వచ్చే పొగను పీల్చ డం వల్ల చాలా మంది అస్తమా, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారని తెలు స్తోంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య పరీక్షలు ప్రతీనెల చేయించాల్సి ఉండగా అది ఎక్కడా కానరావడం లేదు. ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జనావాసాలకు దగ్గర గా ఇటుక బట్టీలు వెలుస్తున్నా అనుమతి లేకుండా నడుస్తున్న కార్మికశాఖ,స్థానిక రెవె న్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసు కోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తూతూ మంత్రంగా తనిఖీలు
బడీడు పిల్లలు బడుల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో 6-14 సంవత్సరాల వరకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలుచేస్తుంటే వాటిని అమలు పరుచడంలో అధికారులు మాత్రం విఫలమవుతున్నారు.కార్మిక, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు బట్టీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు పలు సందర్భాల్లో తనిఖీలు చేపడుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీ ఏటా ఆపరేషన్‌ స్మైల్‌ పేరుతో చిన్నారు లను గుర్తించడం సంబంధిత ఇటుక బట్టీల నిర్వాహకులకు చిన్నపాటి జరిమానాలు విధించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం, కఠిన చర్యలు చేపట్టక పోవడంతోనే బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు చేపట్టిన బడి బయట పిల్లల సర్వేలో జిల్లాలోనే బట్టీల వద్దనే చిన్నారులు పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రులతో కలిసి పనులు చేయడం గుర్తించారంటే ఏ స్థాయిలో ఇతర విభాగాల పనితీరు ఉందో అర్థం చేసుకోవచ్చు.
బట్టీ కార్మికులకు భద్రత కరవు
బతుకు భారమై పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుండి తెలంగాణకు తరలి వస్తున్న కార్మికుల దైనందిన జీవితం దుర్భరంగా ఉంది. ఒడిషా కార్మికులపై ఇటుక బట్టీ యజమానుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో ఇటుక బట్టీల్లో దాదాపు 11వేల మంది ఒడిషా వలస కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వీరికి కనీస వసతులు లేవు. పలువురు పనిభారం ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నారు. కూలీ చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని కొట్టి మరీ పని చేయిస్తుండటం విషాదం. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం జిల్లాలోని పెద్దపల్లిలో కూలీ గర్భవతి నూర్జాజాహ్రాను బట్టీలోని గుమస్తా కొట్టిన దెబ్బలకు మరణించడంతో మరోసారి ఒడిషా కార్మికుల దుర్భర జీవితం తెరపైకి వచ్చింది. 2014లో చొప్పదండి పట్టణ శివారులోని ఇటుక బట్టీలో ముగ్గురు యువతులపై యజమాని లైంగిక దాడులకు పాల్పడ్డ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరవకముందే మరో దారుణం పెద్దపల్లిలో జరగటం ఒడిషా కార్మికుల జీవన పోరాటం ఎంతటి దుర్భ రంగా ఉందో అర్థం అవుతుంది. ఒడిషా సర్దార్లు ఎక్కువ కమీషన్లకు కక్కుర్తిపడి కార్మికులను నమ్మించి బట్టీల యజమానులకు తక్కువ కూలీతో అప్పగిస్తున్నారు. తెలం గాణలో పనిచేసే వారికి రోజు కూలీ 2వం దల రూపాయలకు పైగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన ఒడిషా కూలీలు మాత్రం శ్రమదోపిడీకి గురౌతున్నారు. రోజంతా పనిచేస్తే కనీసం 30రూపాయలైనా ఇవ్వడం లేదు. యజమానులు ఇరుకు గదుల్లో కార్మికు లను బంధించడం, వేతనం ఇవ్వకపోవడం, చిన్న పిల్లలతో పనులు చేయించడం, లైంగిక దాడులులాంటివి దారుణ అకృత్యాలు జరిగినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మరోప్రక్క కూలీల పనికి అంతుపొంతన లేదు. కార్మిక చట్టం ప్రకారం రోజుకు 8గంటల పని చేయాలన్న నిబంధనలు ఇక్కడ అసలే ఉండవు. ప్రధానంగా భవన నిర్మాణరంగం, కంపెనీలు, ప్రయివేట్‌ ఏజెన్సీలు, నాపరాతి గనుల్లో నేటికీ వెట్టి కొనసాగుతోంది. వారిని ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు శూన్యం. ఉద్యోగ భద్రత కరువు, వేధింపులు తప్పడం లేదు. చివరకు తమ సమస్యలు చెప్పుకు నేందుకు సంఘాలనూ ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకుండా కొన్ని కంపెనీలు నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాయి. సమస్యల కోసమే కాదు.. సంఘాల కోసమూ సమ్మెలు చేయాల్సిన దుస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. సంఘాలు పెడితే పనిలో నుంచి తొలగించే పరిస్థితిని ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి.
అందులో ప్రధానమైంది అసంఘటిత రంగం. ఈ కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. దుర్భరస్థితిలో కార్మికుల జీవితాలు కొనసాగు తున్నాయి. అసంఘటిత కార్మికులకు రంగారెడ్డి జిల్లా నిలయంగా మారింది. తాండూరు ప్రాంతం నాపరాతి గనులు పాలిషింగ్‌ యూనిట్లు సుద్ధగనులకు నిలయమైతే, తూర్పు రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే వసల కార్మికులకు నిలయం.భవననిర్మాణరంగం,ఆటో,ఇటుకల బట్టీలు, క్రషర్లు, కంపనీల్లో రోజువారి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కార్మికుల సంఖ్య లెక్కేలేదు. ఫలితంగా ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మి కులు వలసొచ్చి జీవనం గడుపుతున్నారు. మరో పక్క సిమెంట్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసంఘటిత కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వీరి జీవితాలకు భద్రత కరువైంది. ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. నాపరాతి గనుల్లో ఉపాధి పొందుతూ జీవితాలను గడుపుతున్న కార్మికుల స్థితిగతులు తెలుసుకునే అధికారులు, ప్రభుత్వా ధినేతలు కరువయ్యారు. కనీసం నివసించేం దుకు కావాల్సిన వసతులు కల్పించడంలో యజమానులు పట్టించుకోరు. ప్రాణాలకు ప్రమాదకరమైన స్థితి ఉన్నచోటే కార్మికులు జీవిస్తున్నారు. గుడారాలే నివాస కేంద్రాలు. లోతైన గనుల్లో నాపరాతి తవ్వకాలను చేపడు తున్నారు. అనేక సందర్భాలలో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు గాలిలో కలిసిన సందర్భాలనేకం. కరన్‌కోట్‌, ఓగ్గిపూర్‌, మల్క పూర్‌,బషీరాబాద్‌ మండలాల్లో నవల్గా, కొర్విచేడ్‌, మాసాన్‌పల్లి, జీవన్గి, బషీరాబాద్‌ గ్రామాలలో నాపరాతి గనులున్నాయి. పెద్దేముల్‌ మండలంలో నాగులపల్లి, పెద్దేముల్‌, మారేపల్లి గ్రామాల్లో సుద్ధ గనులున్నాయి. ఈ సుద్ధ గనులకు సమీపంలోనే చిన్నచిన్న కర్మాగారాలు నెలకొల్పారు. క్రషర్లూ ఉన్నాయి. మరోవైపు తాండూరు మండలంలోనే పెద్దపెద్ద సిమెంట్‌ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం లో వివిధ కర్మాగారాలు ఉన్నందు వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి వందలాదిగా కార్మికులు వలసొచ్చి తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా తాండూరు పట్టణంలోని చుట్టూరా పాలిషింగ్‌ యూనిట్లూ వెలిశాయి. సుమారు 500 పాలిష్‌ యూనిట్లలో 3వేలకు పైగానే కార్మికులు రాత్రీపగలు పనిచేస్తున్నారు. వీరి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వలస కార్మికులతో యజమా నులు వెట్టిచాకిరీ చేయించుకోవడంలో తమ దైన పద్ధతిని కొనసాగిస్తున్నారు. కార్మికులకు ముందస్తుగానే వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం ఒకవేళ కార్మికుడు అనారోగ్యానికి గురై పనిచేయని పరిస్థితి ఉంటే కార్మికులను చితకబాది బలవంతంగా పనిచేయించుకునే దుస్థితి. సుద్ధగనుల్లో పొద్దంతా కష్టపడి సుద్ధను తవ్వినప్పటికీ వారికి తగిన కూలీ పడడం లేదు. ఇలా అసంఘటిత కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. మరోవైపు కార్మికశాఖ పనితీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. ప్రభుత్వా లకు అసంఘటిత కార్మికులన్నా, వారి జీవిత లన్నా ఏ మాత్రం పట్టడం లేదు. కానీ కార్మి కుల ఓట్లతోనే అధికారం చేపట్టిన పాలకులూ వారి సంక్షేమం గురించి మరిచారు. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలో ఇటుకల బట్టీల్లో మగ్గుతున్న కార్మి కులూ ఉంటే, మేడ్చల్‌, శామీర్‌పేట, హయ త్‌నగర్‌,కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో వంద లాదిగా వలిసిన మైనింగ్‌, కంకర మిషన్లు, క్రషర్లలో తమ జీవితాలను కోల్పోతున్నారు. వీరికి క్రషర్లలోపడి కార్మికులు మృతిచెందిన వారికి ఇఎస్‌ఐ,పిఎఫ్‌ వంటివి వర్తించవు. -గునపర్తి సైమన్‌

మారని ఆదివాసీల బతుకులు

స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఆదివాసీల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. కిలో మీటర్ల మేర కాలినడకన, గుర్రాలపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రులకు డోలీల్లోనే తరలించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో తొమ్మిదిన్నర లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. వారిలో ఏడు లక్షల మంది గిరిజనులు పాడేరు ఏజెన్సీలో, మిలిగిన రెండున్నర లక్షల మంది రంప ఏజెన్సీలో ఉన్నారు. ప్రాంతాలు వేరైనా వారందరిదీ ఒకే రకమైన వేదన బతుకులే కావడం గమనార్హం.
రవాణా వ్యవస్థల్లో ఎంతో మార్పు చోటు చేసుకున్న ఈ రోజుల్లో సైతం ఆదివాసులు రోగులను డోలీల్లో మోయడం, తమ ప్రయా ణాలకు గుర్రాలను వినియోగిస్తుండడం గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ దుస్థితికి అద్దంపడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సగానికిపైగా గిరిజన పల్లెలకు కనీస రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి. ఏజెన్సీలో మారు మూల పల్లెలు అధికంగా ఉన్న ముంచంగి పుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింత పల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో వందలాది గ్రామాలకు చెందిన ఆదివాసులు ఇప్పటికీ గుర్రాలపైనే రాకపోకలు సాగిస్తు న్నారు. గుర్రాలను కొనుక్కోలేని పేద గిరిజనులు కాలినడకనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో మండల కేంద్రాలు, కాస్త రోడ్డు పక్కన గ్రామాలకు మాత్రమే రోడ్డు, రవాణా సదుపాయాలున్నాయి.
అందనంత దూరంలో ప్రాథమిక వైద్యం
జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఉన్న ఏడు లక్షల మంది గిరిజనులకు వైద్య సేవలు అందిం చేందుకు ఏజెన్సీ వ్యాప్తంగా 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాడేరులో రెండు వందల పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయలో వంద పడకల ఏరియా ఆస్పత్రి,చింతపల్లిలో 50, ముంచంగిపుట్టులో 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు,గిరిజన పల్లెలో 202 ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామానికి ఒకరు చొప్పున 3,800 మంది ఆశ కార్యకర్తలు న్నారు. కానీ నేటికీ గిరిజనులకు సాధారణ జ్వరం వ చ్చినా సకాలంలో వైద్యం అందని దుస్థితి కొనసాగుతోంది. గిరిజనుల వైద్యంపై సర్కారు నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం అలసత్వంతో వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. ఏజెన్సీ 11మండలాల్లో ఉన్న ఆస్పత్రులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ పీవో,డీఎంహెచ్‌వో,ఏడీఎంహెచ్‌వో వంటి అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. క్షేత్ర స్థాయిలో వైద్యసేవలు అందించే ఆశ కార్య కర్తల వ్యవస్థను పటిష్ఠం చేయకపోవడం, పారా మెడికల్‌ సిబ్బందిపై పర్యవేక్షణ లేమి కారణంగా గిరిజనులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.
పల్లెల్లో కానరాని మౌలిక సదుపాయాలు
ఆదివాసీలు జీవించే పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు సైతం లేని దుస్థితి నెలకొంది. రోడ్డు, రవాణా,తాగునీరు,విద్య,విద్యుత్‌ వంటి సదుపాయాలు సంపూర్ణంగా లేని పరిస్థితి. ప్రధానంగా తాగునీటి సదుపాయాలు అధ్వా నంగా ఉండడంతోనే గిరిజనులు తరచూ వ్యాధుల బారినపడుతున్నారని తెలిసినా పాలకులు రక్షిత తాగునీటి సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టడడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో భౌగోళిక మార్పుల కారణంగా అధిక సంఖ్యలో గ్రామాల్లోని బోర్లు, బావులు, గ్రావెటీ నీటి పథకాలు అడుగంటి ఇంకిపోతున్నాయి. దీంతో గతి లేక అందు బాటులో ఉన్న ఊటగెడ్డల్లో నీటిపైనే ఆధారపడుతున్నారు. సాంకేతికతను వినియో గించి గిరిజనులకు అవసరమైన రక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కనీసం పంచాయతీ కేంద్రాల్లోనైనా రక్షిత తాగునీటిని అందించేందుకు కృషి చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. అలాగే రోడ్డు, రవాణా విషయాలకు వస్తే మరింత దారుణ మైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేటికీ ఏజెన్సీలో వందల సంఖ్యలోని పల్లెలకు రోడ్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించని దుస్థితి నెలకొంది. దీంతో గిరిజనులు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక విద్య విషయానికి వస్తే అంతా మేడిపండు చందంగానే ఉంది. ఏజెన్సీలో నేటికీ పదుల సంఖ్యలోని బడులకు భవనాలను లేని పరిస్థితి నెలకొనగా, ఉన్న పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే వాదన వినిపిస్తున్నది. ప్రధానంగా డీఈవో, ఏజెన్సీ డీఈవో కార్యాలయాల్లోనే ఇప్పటికీ అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన విద్యా భివృద్ధి మేడిపండు చందంగా ఉందనే విమర్శలున్నాయి.
వ్యవ‘సాయం’ కరువు
గిరిజనుల జీవనాధారమైన వ్యవసాయంపై పాలకుల నిర్లక్ష్యం చెప్పలేనిది. ఏజెన్సీలో దాదాపు 80 శాతం మంది భూమిపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, ఆ స్థాయిలో గిరిజన రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదు. లోకమంతా వ్యవసాయ రంగంలో దూసుకువెళుతుంటే గిరి రైతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగానే ఉన్నారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలమైనప్పటికీ, కేవలం ప్రభుత్వాల ప్రోత్సాహం లేని కారణంగా ఊహించిన స్థాయిలో వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల గురించి మన్యంలో మాట్లాడుకోవడానికే అవకా?శం లేని పరిస్థితి. దీంతో గిరిజనుల జీవితాల్లో ఆశించిన స్థాయిలో వెలుగులు ప్రసరించడం లేదనేది పలువురి వాదన. గిరిజనాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేనంత కాలం ఎన్ని ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నా… తమ బతుకుల్లో మార్పురాదని ఆదివాసీలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో 95 వేల జనాభా గల 320 గిరిజన గ్రామాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు. విద్య, వైద్యం,రవాణా సౌకర్యం, రక్షిత మంచి నీరు అందని ద్రాక్షే. సుదీర్ఘ ప్రాంతాల నుండి గెడ్డల్లో ఊటనీళ్లు, డోలిమోతలు తప్పడం లేదు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చడంలో పాలకవర్గాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలోని మూడు వందల పైచిలుకు గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్‌లో చేర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వీటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్పిస్తామని అధికార పార్టీ తియ్యనిమాటలు చెప్పిందేగానీ..అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. గిరిజన సలహా మండలి (ట్క్రెబల్‌ ఎడ్వయిజరీ కమిటీ) 112 గిరిజన గ్రామాలకు పరిమితం చేస్తూ ఏడాది క్రితం తీర్మానం చేసింది. దీనిపై గిరిజన, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగడంతో మరల తహసీల్దార్లతో క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంటామని పాలకులు చెప్పారు. ఇది కూడా ఏడాదికాలంగా నానుతుందే తప్ప అమలుకు నోచుకోలేదు. వందశాతం గిరిజన పంచాయతీలు ఉంటేనే ప్రతిపాదనలు పంపిస్తామని, గిరిజనేతరులతో కలిసి ఉన్న గ్రామాలను పంపించేదిలేదని తహసీల్దార్లు తెగేసి చెబుతున్నారు. నిజానికి శివారు గిరిజన గ్రామాల్లో వందశాతం గిరిజనులు నివసిస్తున్నారు. దీనిని ఇప్పుడు గుర్తించకపోతే తీవ్రనష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే 1956,1976లో రెండుసార్లు రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్లో విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదేవిధంగా చేస్తే గిరిజనులు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శివారు గిరిజన గ్రామాన్ని గుర్తించి తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని, తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి%ౌౌ%రాష్ట్రపతి ఆమోదం ద్వారా గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మాయ మాటలు చెప్పడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చక పోవడంతో ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. 1/70 భూబదలా యింపు చట్టం వర్తించడం లేదు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న పాలకులు గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
గిరిజన బతుకులు నేటికీ చికట్లోనే..
గిరిజనులు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు పత్రికలకే పరిమితం తప్ప ఆచరణ సాధ్యం కావడం లేదు. ఏటా గిరిజనులు అభివృద్ధికి కోట్లాది రూపాయిలు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ నేటికీ గిరిజనులు బతుకులు మారని గ్రామాలు అనేకం వున్నాయని చెప్పకతప్పదు. అందులో భాగంగా ఉత్తరావల్లి పంచాయతీ మధురా గ్రామం గదబపేట అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో పూర్వం నుండి 10 కుటుంబాలు కొండలు, తోటలు మధ్య అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. వారి బతుకులు దయనీయంగా వుండటంతో పాటు అగమ్యగోచరంగా వున్నాయని చెప్పకతప్పదు. నిన్నమొన్నటి వరకు తోటలు మధ్యలో పూరిపాకల్లో తలదాచుకునేవారు. అయితే ఇటీవల కాలంలో నాలుగు ఇళ్లులు ప్రభుత్వం మంజూరు చేయగా, పునాదులు ప్రాప్తికి మూడు ఇళ్లకు బిల్లులు అందగా ఒక ఇంటికి ప్రభుత్వం బిల్లులు మంజూరుచేసిన దాఖాలాలులేవు అయితే గిరిజనులు బతుకులు చూసిన ప్రతీ ఒక్కరికీ గుండె చలించక తప్పదు.గ్రామంలో మినీవాటర్‌ ట్యాంక్‌ వున్నప్పటికీ రెండు నెలలకోసారినీరు సరఫరా కావడంతో కిలో మీటరు దూరంలో వున్న బావికి వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీరు కోసం గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. అలాగే వీధి దీపాలు గత కొన్ని నెలలుగా వెలగక పోవడంతో అంధకారంలోనే కాలాన్ని గడుపుతున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గ్రామం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో వున్న రెండు విద్యుత్‌ స్థంభాలకు రెండు బల్బులు వేయటానికి నెలలుగడపటం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పకతప్పదు.
అనుకోని రీతిలో అనారోగ్యం సంబవించినా, 108కి ఫోన్‌ ద్వారా సమాచారం అందినప్నటికీ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవసరం వచ్చినా మూడు కిలోమీటర్లు దూరంలో వున్న ఉత్తరావల్లి వెళ్లాల్సిందే. రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగానే వుంది. ఈ పది కుటుంబాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా పింఛన్లు, రేషన్‌ బియ్యం, అడవినుండి తెచ్చిన కట్టెలను అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతదారుణంగా గిరిజనులు బతుకున్నప్పటి కీ పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గిరిజనులు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు
ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. విశాఖలోని గిరిజనుల కష్టాలు వర్ణణాతీతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆనారోగ్య సమస్యలు వస్తే.. అంబులెన్స్‌ వెళ్లే పరిస్థితి కూడా లేదు. –(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

విశాఖ ఓ అద్భుత నగరం

విశాఖ అద్భుతమైన నగరం..సిటీ ఆఫ్‌ డెస్టినీ..(గమ్య నగరం)గా విశాఖనగరం దూసుకుపోతుంది..భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఎంతోమంది వైద్య ప్రముఖలను దేశానికి అంది స్తోంది..పూర్వవిద్యార్థులురూ.50కోట్లతో క్యాబ్‌(సెంచినరీ అలుమ్ని బిల్డింగ్‌)నిర్మించడం అభినందనీయం.ఇదే స్పూర్తి మున్ముందు కొనసాగాలి. వేలాది మంది వైద్యులను అందించిన ఆంధ్ర మెడికల్‌ కళాశాల మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలి.వైద్య సేవల కోసం ప్రజలు ఆసుపత్రికి రాకుండా..సంపూర్ణ వైద్యాన్నందించే కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని భారత దేశ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ఆకాంక్షిస్తూ వైద్య విద్యార్థులకు పిలుపు నిచ్చారు.ఏఎంసీ శతాబ్ది వేడుకల్లో పాల్గోనేందుకు విశాఖ తొలిసారిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సహజ అందాల విశాఖను కొనియాడారు. అక్టోబర్‌ 28న విశాఖ ఏయూ కాన్వొకేషన్‌ సెంటర్‌లో జరిగిన సమావేశంలో మాట్లా డారు. విశాఖతోపాటు ఆంధ్రవైద్య కళాశాలపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఇదే సమయంలో పాల్గొన్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ ఏఎంసీకి అనుబంధంగా ఉన్న అసుపత్రుల ద్వారా రోజుకు రెండువేలమందికి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. విశాఖనగరాన్ని దేశంలోనే కీలక గమ్యస్థానంగా మారుస్తున్న కొన్ని ప్రధాన సంస్థలు ఆత్మనిర్భర్‌ భారత దార్మనికతకు దోహదం చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర వైద్య కళాశాల మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షించారు. తర్వాత ఎఎంసీ కళాశాలకు చేరుకున్న ఉపరాష్ట్ర పతి,గవర్నర్‌ ఆవరణంలో మొక్కలునాటి నీళ్లుపోశారు.అనంతరం శతాబ్ది వేడుకలు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్‌నుఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.తర్వాత రూ.20కోట్లతో నిర్మించనున్న క్లినికల్‌ అండ్‌ బయోమెడికల్‌ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి బృంద చిత్రం దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి విశాఖ చరిత్రను ఆసక్తిగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కళా శాల ప్రస్థానం,పూర్వవిద్యార్థుల చేయూత, క్యాబ్‌ ప్రాజెక్టు వివరాలను క్యాబ్‌ చైర్మన్‌ డాక్టర్‌. టి.రవి రాజు ఉపరాష్ట్రపతి,గవర్నర్‌ దృష్టికితీసు కెళ్లా రు.ఈపర్యటన కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర ఐటి,పరిశ్రమలశాఖమంత్రి గుడి వాడ అమర్‌నాథ్‌,జిల్లా ఇన్ఛార్జి,రాష్ట్ర వైద్యఆరోగ్య, శాఖమంత్రి విడదల రజని,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్‌ జె.నివాస్‌, జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లి ఖార్జున,జివిఎంసి కమిషనర్‌ సాయి కాంత్‌వర్మ, సెంటినరీ సెలబ్రేషన్స్‌ కమిటీఅధ్యక్షులు డా.టి.రవి రాజు,ఎ.ఎం.సికళాశాల ప్రిన్సిపాల్‌ డా.బుచ్చి రాజు, కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.పి.అశోక్‌ కుమార్‌, పలువురు జిల్లా వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.-జిఎన్‌వి సతీష్‌

ఆంధ్ర వైద్య కళాశాలకు వందేళ్లు

‘తెలుగు వారి కోసం ఏర్పాటైన వైద్య కళాశాల’ వందేళ్ల కిందట తెలుగువారి కోసం ప్రత్యేకం గా ఒక వైద్య కళాశాల ఉండాలంటూ అప్పటి మద్రాస్‌ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు చేసిన విన్నపాలతో 1920లో తెలుగువారి కోసం మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అంతకు ముందు వరకు తెలుగు ప్రాంతాల్లో మద్రాస్‌ స్టాన్లీ మెడికల్‌ కాలేజ్‌ అనుబంధంగా లైసెన్సీయేట్‌ మెడికల్‌ సర్టిఫికేట్‌ అనే కోర్సులు మాత్రమే ఉండేవి. వాటిని మెడికల్‌ స్కూల్స్‌ అనే వారు.‘‘1902లో విశాఖలో మద్రాసు ప్రభు త్వం ప్రారంభించిన మెడికల్‌ స్కూల్‌కు కొంత కాలంతర్వాత గోడె సంస్థాన జమీందార్లు సొంత భవనం నిర్మించి ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని కారణాలు వల్ల ఎటువంటి కార్యకలాపాలు జరగక పోవడంతో దానిని…దానిని తాత్కాలిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. కొంత కాలానికి కొత్త సివిల్‌ హాస్పిటల్‌ భవనం నిర్మాణం కావడంతో,ఈ తాత్కాలిక ఆరోగ్య కేంద్ర భవనంలోనే 32 మంది విద్యార్థులతో 1923 జూలై 19న మెడికల్‌ కళాశాలను అప్పటి మద్రాసు స్థానిక సంస్థల మంత్రి పానుగంటి రామఅయ్యంగర్‌ ప్రారంభించారు. ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌ గా లెప్టినెంట్‌ కర్నల్‌ ఫెడ్రిక్‌ జాస్పర్‌ అండ్రూసన్‌ పని చేశారు’’ అని విశాఖకు చెందిన చరిత్రకారులు ఎడ్వర్డ్‌ విజ్జేశ్వరం పాల్‌ చెప్పారు.మద్రాసు యూని వర్సిటీకి అనుబంధంగా పని చేసిన ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగపటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు. అప్పట్లో విశాఖపట్నాన్ని ఆంగ్లేయులు వైజాగపటం అని పిలిచేవారు.1926లో ఆంధ్ర యూని వర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాల గా మారింది. ఆ సమయంలో వైస్‌ ఛాన్స లర్‌గా ఉన్న సీఆర్‌ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్‌ ప్రభుత్వాన్ని కోరడంతో,1940లో పేరు మారుస్తూ గెజిట్‌ విడుదల చేశారు. ఆ తర్వా త నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌గానే ప్రసిద్ధి చెందింది.32 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ మెడికల్‌ కళాశాల…ప్రస్తుతం ఏటా 250 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి చేరిందని ఏఎంసీ పూర్వ విద్యార్థి, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌ అన్నారు.
‘మహిళల దరఖాస్తులు తిరస్కరించేవారు’
అనాటమీ, ఫిజియాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ విభాగాలతో ప్రారంభమైన ఈ కళా శాలలో తొలి సంవత్సరం 50మంది విద్యా ర్థులకు అవకాశం కల్పిస్తే…32 మందే ప్రవే శాలు పొందారు. ఇందులో తెలుగు జిల్లాలకు చెందిన విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రవేశాలు పొందిన వారిలో తొలి ఏడాది 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏఎంసీ రికార్డులు చెప్తున్నాయి.రెండో ఏడాది ఒక మహిళ దరఖాస్తు చేసుకున్నారు. కానీ విమెన్‌ కోసం ప్రత్యేక గదులు, బాత్రూం వంటి సదుపాయాలు లేకపోవడంతో ఆమె దరఖా స్తును తిరస్కరించారు.ఆ తర్వాత కూడా సౌకర్యాల లేమి కారణంగా ఇక్కడ మహి ళలకు ప్రవేశాలు కల్పించేవారు కాదని పూర్వ విద్యార్థిని డాక్టర్‌ రాధ కుమారి తెలిపారు. 1942లో 175 మందికి సరిపడే విధంగా విద్యార్థినుల కోసం విమెన్‌ హాస్టల్‌ని నిర్మిం చారు. ప్రస్తుతం ఇక్కడ ఏటా ప్రవేశాలు పొందుతున్న వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా ఉంటారని ఏఎంసీ పూర్వ విద్యార్థిని, అనాటమీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్‌ సురేఖ తెలిపారు. 202 మందికి సరిపోయే విధంగా మెన్స్‌ హాస్టల్స్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ‘‘నేను కళాశాలలో చదువుకున్న విద్యార్థినినే. నాలాగే ఇక్కడ చాలా మంది పూర్వ విద్యార్థు లే ఉద్యోగులుగా కూడా ఉన్నాం.వందేళ్ల ఉత్స వాలు జరుపుకుంటున్న ఈ కళాశాలలో వైద్య రంగంలో ఎంతో పేరుపొందిన కాకర్ల సుబ్బా రావు,ఉలిమిరి రామ లింగస్వామి,శ్రీపాద పినాకపాణి,డాక్టర్‌ వ్యాఘ్రేశ్వరుడు,డాక్టర్‌ బ్రహ్మయ్యశాస్త్రి,డాక్టర్‌ రాజారామ్మెహన రెడ్డి,డాక్టర్‌ రామలింగస్వామి వంటి వైద్యులు చదువుకున్న చోటే మేం చదువుకోవడం… ఇక్కడే ఉద్యోగాలు పొందడం, ఇప్పుడు వందేళ్ల సంబరాల్లో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’అని సురేఖ చెప్పారు. పినాకపాణి వంటి వారు వైద్యం లోనే కాకుండా సంగీతంలో కూడా నిష్ణాతు లుగా పేరు పొందారు. అనటమీ,బయో కెమిస్ట్రీ, కార్డి యాలజీ…ఇలా 34విభాగాల్లో ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రస్తుతం వైద్య విద్యను అంది స్తోంది.‘ఏఎంసీలో సీటు వస్తే గర్వపడతారు’ దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలలో ఏఎంసీ ఒకటి.అలాగే దీనికి ఉన్న చరిత్ర, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపం చం నలుమూలలా వైద్యరంగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందడం వంటి అంశాలు వైద్య విద్యని అభ్యసించాలనుకునే వారిని ఆకర్షిస్తుం టాయి. దాంతో వారంతా ఇక్కడే సీటు పొం దాలని కోరుకుంటారు. ఇక్కడ సీటు పొందిం తే అది చాలా గర్వంగా చెప్పుకుంటారు అని ప్రస్తుతం ఆంధ్ర మెడికల్‌ కళాశాల విద్యార్థి నిగా ఉన్న జనిషా అన్నారు.‘‘నాకు ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో సీటు రావడంతో మా కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని అందరికి గర్వంగా చెప్పుకున్నారు. మేం చదువుకునే రోజుల్లోనే ఏఎంసీలోనే చదవాలనే అనుకునే వాళ్లం. వందేళ్ల చరిత్ర ఉన్న కళాశాలలో మేం చదువుకున్నమంటే అదొక గొప్ప విష యంగా అనిపిస్తుంది.’’ అని జనిషా చెప్పారు. ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరుందని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు చెప్పారు. అందుకే దేశంలోని అని రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందాలని తాపత్రయపడతారని తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు,తమిళనాడు, కేరళ,రాజస్థాన్‌ ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా అందరూ విద్యార్థులు ఇక్కడే చదవాలని పోటి పడుతుండటమే ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ విశిష్టతను చెప్తుందన్నారు.
‘ప్రారంభంలో 32, 2017 నాటికి 250’
ప్రారంభంలో మెడికల్‌ స్కూల్‌ భవనంలో ప్రారంభమైన వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధన ఆసుపత్రులు వచ్చాయి. తొలి రోజుల్లో ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రి (కేజీహెచ్‌)గా మారింది.132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్‌ ప్రస్తుతం1600 పడకల ఆసుపత్రి స్థాయికి ఎదిగింది. అలాగే విశాఖ లో ఉన్న విక్టోరియా ఆసుపత్రి, మానసిక ఆరోగ్య వైద్యశాల, ఛాతి అంటువ్యాధుల ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి,ఈఎన్టీ ఆసుపత్రి వంటివి ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధ బోధనాసుపత్రులుగా వచ్చాయి. వీటన్నింటిలో 2500వరకు పడకలుఉన్నాయి. 1923లో 32 మంది విద్యార్థులతో ప్రారం భమైన వైద్య కళాశాల,1990 సమ యానికి 150 మందికి,2017నాటికి 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి పెరిగింది. ఇక్కడ అనాటమీ,ఫిజి యాలజీ,ఫార్మకాలజీ,వంటి విభాగాల్లో పురాతన మ్యూజియాలు ఉన్నాయి.అవయవ దానం చేయాలంటూ ఏఎంసీ చాలా కాలంగా ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమాలు విస్తృతంగా చేస్తోంది.
పూర్వ విద్యార్థుల ‘వందేళ్ల’ కానుక
తొలి రోజుల్లో పెద్ద సౌకర్యాలు కూడా ఉం డేవి కాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. 1938 సమయంలో రూ.3 రూపాయలు హాస్టల్‌ అద్దె ఉండేదని, అలాగే మెస్‌ ఛార్జీలు నెలకు రూ.18ఉండేవని తమకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు చెప్పేవారని డాక్టర్‌ రవి రాజ్‌ అన్నారు. తాము చదువుకునే సమ యానికి హాస్టల్‌ వసతి వంటివి ఏర్పాడ్డాయని, ఇక్కడ చదువుకుని వైద్యరంగంలో ఎదిగిన తాము చదువుకున్న కళాశాలకు వందేళ్లు నిండుతున్న సందర్భంగా ఒక భవనాన్ని నిర్మించి ఆంధ్ర మెడికల్‌ కాలేజికు బహుమ తిగా అందించబోతున్నామని ఆయన చెప్పారు. ‘‘1.2 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక భవనాన్ని నిర్మించి అందులో స్టూడెంట్‌ సెంటర్‌, లెక్చర్‌ హాల్‌, లెబ్రరీ, రీడిరగ్‌ రూం, రీక్రియేషన్‌ రూం, ఇండోర్‌ గేమ్స్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ. 45 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలుగా వేసుకుని నిర్మిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ పూర్వ విద్యార్థులు తమ కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో వందేళ్ల సందర్భంగా ఈ భవనాన్ని నిర్మించి, కళాశాలకు అందిస్తాం. అలాగే దీని మెయింటెనెన్స్‌ ఖర్చులను పూర్వ విద్యార్థుల సంఘమే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని డాక్టర్‌ రవిరాజ్‌ చెప్పారు. ఆంధ్ర వైద్య కళాశాల గొప్పదనాన్ని చాటి చెప్పేలా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థిని, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రాధ కుమారి చెప్పారు. పూర్వ విద్యార్థులు నిర్మించే భవనంలో ఏడాది పొడవునా విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. (బీబీసీ సౌజన్యంతో..)

విద్యార్థుల చూపు ఉన్నత విద్య వైపు

విద్యారంగంపై ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాడు- నేడు మొదలుకొని విదేశీ విద్యాదీవెన వరకు తెచ్చిన పథకాలు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేశాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాస్‌ ఎన్‌ రోల్‌ మెంట్‌ రేషియో(జీఈఆర్‌) గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉన్నత విద్యలో దాదాపు 12.5 శాతం చేరికలు అదనంగా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పలు చర్యలు చేపడుతుం డటంతో అక్షరాస్యతలో దేశ సగటును మించి ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటును నమోదు చేసింది.
విద్యారంగంలో ఏపీకి అరుదైన స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో 2020-21లో 19,87,618 మంది ఉన్నత విద్యాభ్యాసం కోసం కళా శాలల్లో తమ పేర్లు నమోదు చేసుకు న్నారు. 2014-15లో 17,67,086 మంది మాత్రమే ఉన్నత విద్యనభ్యసించగా, 2020- 21 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ఏపీలో ఉన్నత విద్య గురించి ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్‌ సర్కార్‌ రాజ్యసభలో సమాధానమిస్తూ ఏపీలో విద్యారంగం ప్రగతిపథంలో ఉందని వివరించారు.
దేశవ్యాప్తంగా మహిళలే ముందంజలో
2022లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధారంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యలో నమోదు 12.5% పెరిగిందని మంత్రి సూచించారు. ఇంకా, సర్వే ప్రకారం, %Aూ%లో ఉన్నత విద్యలో మహిళల నమోదు 2014-15లో 7,73,650 నుండి 2020-21లో 9,31,553కి పెరిగింది, ఇది 20.4% పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య మొదటిసారిగా నాలుగు కోట్ల మార్కును దాటిందని మరియు 2014లో 3.42 కోట్ల నుండి 2020-21లో దాదాపు 4.14కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, 2014-15లో1.57 కోట్లుగా ఉన్న మహిళా నమోదులు 2020-21లో 2.01కోట్లకు పెరిగాయి.
నూతన కళాశాలల పెరుగుదలకు తోడ్పాటు
జాతీయ స్థాయిలో, షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 46.06 లక్షల నుండి 2020-21లో 58.94 లక్షలకు పెరిగిందని, ఇది 28% పెరిగిందని సర్వేలో తేలింది. దేశంలో ఎస్టీ (షెడ్యూల్డ్‌ ట్రైబ్‌) విద్యార్థుల నమోదు కూడా 2014-15లో 16.40 లక్షల నుండి 47% పెరిగి 24.12 లక్షలకు చేరుకుంది. దేశంలో ఇతర వెనుక బడిన కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 1.13 కోట్ల నుండి 1.48 కోట్లకు పెరిగింది, ఇది 32% పెరుగుదలను సూచిస్తుంది. 2014-15 మరియు 2020-21 మధ్య దేశంలో 353 విశ్వవిద్యాలయాలు మరియు 5,298 కళాశాలలు అదనంగా పెరిగాయి.
కళాశాలల రీ మోడలింగ్‌ తోనే సాథ్యం..!
రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ పథకం (రాసు) కింద, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలు మరియు ఆశావహ జిల్లాలు వంటి అన్‌సర్వ్‌డ్‌ మరియు అండర్‌సర్వ్‌డ్‌ ఏరియాల్లో 130 మోడల్‌ డిగ్రీ కాలేజీల స్థాపనకు కేంద్ర మద్దతును ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.రాసు ద్వారా, కళాశాలలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు, ఎంపిక చేసిన స్వయంప్రతిపత్త కళాశాలల్లో నాణ్యత మరియు శ్రేష్ఠతను పెంపొందించడం మరియు ఇప్పటికే ఉన్న డిగ్రీ కళాశాలలను మోడల్‌ డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడం వంటి సేవలందించని మరియు తక్కువ సేవలం దించే ప్రాంతాలలో ఉన్నత విద్యను మెరుగు పరచడానికి కూడా కేంద్ర మద్దతు అందించ బడుతుంది.
విద్యా రంగంలో నవశకం
విద్యా రంగాన్ని సమూలంగా మార్చేం దుకు కమిషన్ల ఏర్పాటురాష్ట్ర విద్యారంగంలో నవశకం ఆరంభమైంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం నాంది పలికింది.ఇందుకు సంబంధించి చరిత్రాత్మ కమైన రెండు కీలకబిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు..ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీంతో ఇంత కాలం విద్యార్థులు,తల్లిదండ్రులను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్‌,కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది.ఎన్నికలకు ముందు తనసుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రం లోని విద్యారంగ పరిస్థితిని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి చలించిన ముఖ్యమంత్రి ఈ రెండు బిల్లులకు రూపకల్పన చేసి,తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేశారు.
ఎల్‌కేజీ మొదలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువుల వరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్తులు సైతం అమ్ముకోవడమే కాకుండా ఆచదువులు పూర్తయ్యేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేయడంతో పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సైతం విద్య పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిం చడంతో పాటు ఇష్టానుసారం ఫీజులు దండుకొనే స్వేచ్ఛను సైతం ఇచ్చేసింది. కనీస సదుపాయాలు, బోధకులు లేకుండానే కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పిల్లలను జైళ్ల వంటి హాస్టళ్లలో ఉంచి వారిపై విపరీతమైన ఒత్తిడి పెడుతూ వారి బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. సరైన బోధన లేకుండా బట్టీ పద్ధతులను పాటిస్తూ విద్యార్థులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి.
రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు
పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్య వేక్షణ కమిషన్‌ బిల్లులు ఆమోదం పొంద డంతో ఇకపై రాష్ట్రంలో విద్యా రంగ రూపు రేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలే ప్రామాణికం గా విద్యా రంగం పయనిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు లు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా పలు వురు అభివర్ణిస్తున్నారు. ఈ కమిషన్లకు ప్రభు త్వం అనేక అధికారాలు కల్పించింది. ఫీజులు, ప్రమాణాలు, విద్యార్థులు.. టీచర్ల సంక్షేమం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ కమిషన్లు విద్యారం గాన్ని పర్యవేక్షిస్తాయి. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఛైర్మన్లుగా ఉండడంతో పాటు ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనుండడంతో విద్యారం గం పగడ్బందీగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటికి సివిల్‌ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్‌ పరిశీలి స్తుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. నిబంధనలు అసలు పాటిం చని సంస్థల గుర్తింపు రద్దుకు కూడా చేసే అధికారం ఉంటుంది.సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారిం చే అధికారం కమిషన్‌కు ఉంటుంది.ఇంటర్‌లో దోపిడీకి బ్రేకులు.ప్రస్తుతం పాఠశాల విద్య ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియెట్‌ విద్య మరో ఎత్తు. రెండేళ్ల ఈ కోర్సు పేరిట ప్రవేట్‌, కార్పొరేట్‌ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నా యి. ఇప్పుడీ కోర్సును ఉన్నత విద్యా నియం త్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్‌ కాలేజీలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా యాజ మాన్యాల ఇష్టానుసారం అయ్యింది. అలాగే ప్రైవేటు వర్సిటీలు కూడా ఈ రాష్ట్రంతో, ప్రభుత్వంతో సంబంధం లేనట్లు ఇష్టాను సారంగా ఫీజులు, ప్రవేశాలను కొనసాగిస్తు న్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది.ప్రవేశాలు,బోధన, పరీక్షలు,పరిశోధన,బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాల పరిశీలన. జూనియర్‌,డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలపై చర్యలకు కమిష న్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం కమిషన్‌కు ఉంది. నిబంధనలు పాటించని ఉన్నత విద్యా సంస్థలకు పెనాల్టీల విధింపు అధికారం ఉంది. నిబందనలు ఉల్లంఘించే సంస్థల గుర్తింపు రద్దుకు వర్సిటీలను ఆదేశించే అధికారం. చైర్మన్‌, సభ్యులపై లేదా కమిషన ్‌పై న్యాయపరమైన కేసులు దాఖలు చేసేందుకు వీలులేదు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నడిచే విద్యా సంస్థలను మూత వేసే అధికారం ఉంటుంది. పెనాల్టీలను విధిస్తుంది. వాటిని కట్టకుంటే వాటి నిధులను, లేదా స్థలాలను స్వాధీనం చేసుకొనే అధికారం కూడా ఉంది. కాగా, కమిషన్‌ నిర్ణయాలను పరిశీలించే, సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.- జీఎన్‌వి సతీష్‌

1 2