స్వర్ణయుగ చక్రవర్తి

‘‘స్వర్ణయుగ చక్రవర్తి (ఏకపాత్రాభినయం) ఆంధ్ర ` తెలంగాణ రాష్ట్రాలలో ప్రప్రధమంగా ఏకపాత్రకు విద్యార్థుల విభాగంలో 14 నవంబరు 2018లో 30మంది విద్యార్ధు లచే ప్రదర్శించినందుకు గాను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.’’

నరసనాయకునికి,నాగాంబకు జన్మించిన వారి ఆలనా పాలనములు అంతంతమాత్రమే. నేను విద్యాప్రియుడిని, వీరుడను, లలితకళాభిమానిని, విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగ కర్తను చక్రవర్తిని ఔతానని ఏనాడూ వూహించలేదు. ఊహించని ఊహకందని ఎన్నో మలుపులు నా జీవితంలో కలిగాయంటే అవి విధివిలాసమే. తిమ్మరుసు మహామంత్రి నా యందు కనబరచిన వాత్సల్యము ఇంత అని చెప్పలేని, మాటలకు అందని అనిర్వచనీయమైన బంధము. రాజన్న కృష్ణదేవరాయలు, మంత్రి అన్నచో తిమ్మరుసు అన్నంతగా పెనవైచుకున్నది మా బంధము. తండ్రి దగ్గరలేని చనువు అప్పాజీవద్ద పొందిన ధన్యజీవి నేనే.
అప్పాజీ పర్యవేక్షణలో పదునారేండ్ల వయస్సు నిండుసరికే సమస్తాయుధ యుద్ధ విద్యాకౌ శలము, వ్యూహ నిర్మాణము,ప్రత్యర్థి వ్యూహచ్చేదనము,దుర్గరక్షణ,తదాక్రమణ మొదలగు సకల యుధ్ధ విద్యలయందు ఆరితేరాను. గుర్రపు స్వారి,కత్తిసాములో మల్ల యుద్ధములో ప్రత్యేక మెళకువలు నేర్పించాడు అప్పాజీ! సద్గుణ సంపన్నునిగా అప్పాజీ నన్ను తీర్చిదిద్దాడు. ప్రజలకందరికీ ప్రీతిపాత్రుడన య్యేలా చేశాడు. నా పినతల్లి తిప్పాంబికకు మాత్రము నా ఈ ఎదుగుదల మాత్సర్య మనస్కురాల్ని చేసింది. నాపై అసూయ ద్వేషములు పెరిగాయి. తన కుమారుని పై ఆతని పట్టాభిషేకముపై వాత్సల్యము దినదిన ప్రవర్థమానమయ్యెను. తిప్పాంబ కుటిల ప్రవర్తన ఎరిగి యున్న అప్పాజీ నన్ను కంటికి రెప్పలా వెన్నంటి యుండి కాపాడారు. లేకున్నచో పినతల్లి యిచ్చిన విషప్రసాదము తిని ఏనాడో ఈ దేహమును చాలించి యుండెడివాడను. విరూపాక్షస్వామి ఆశీస్సులతో అప్పాజీ రాజనీత్నిత,అండదండలతో బతికి బట్టకట్ట గలిగాను. నాఅన్నగారు వీరనరసింహరాయల వారి ఆగ్రహమునకు నా నేత్రములు రెండు ఏనాడో కోల్పోవలసినవాడిని. అప్పాజీ తన్నననేత్రముతో నా నేత్రములు పోకుండ కాపాడగలిగాడు. అప్పాజీయే లేకున్న అష్టదిగ్గజకవులెక్కడ? ఈ సాహితీసమరాంగణ బిరుదాంకితుడెక్కడ?
అవును. అపాజీ సాక్షాత్తు దైవస్వరూపుడు. లేకున్న భూత భవిష్యత్‌ వర్తమానములు ఆతని మస్థిష్కములో గురితప్పక ఏలగోచరించును? చిన్ననాట అన్నపానాదులకు అల్లలాడిన ఆ కర్మయోగి అలసిసొలసి సొమ్మసిల్లి పడిపోగా ఆ అరణ్యములో ఆతనికి నీరెండపడకుండ నాగుపాము పడగవిప్పి ఆమహనీయుని శిరస్సున ఛత్రమువలే నిలచునా? దైవస్వరూపుడో దైవానుగ్రహస్వరూపుడో ఐన అప్పాజీ అడుగుజాడలో నడచినందుననే నేను తెలుగు సామ్రాజ్యమును అందునా హిందూ సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యముగా ఏలగల్గి యుండెడివాడనా?
కుమార వీరశ్యామల రాయుడు,ఆర్వీటిశ్రీ రంగ రాజు,ఆకువీటి యిమ్మరాజు,పిమ్మసాని రామలింగ భూపతి,నంద్యాల నాపరాజుల ముందు సలకము తిమ్మయ గారు ఆరోపించిన ఆరోపణలు కారుకూతలను అప్పాజీ సభా ప్రాంగణములో నోరు మెదపక ఎదుటివారి నోరెట్లు నొక్కెచో ….ఆ….అదికదా ప్రతివారు నేర్వదగిన రాజనీత్నిత, నిష్కళంక దేశభక్తి. రామలింగ భూపతి శ్రీ రంగరాయార్యన్య సామంతుల ఎదుట నన్ను నిలిపి…..
వీరులు,శూరులు,చతురంగబల ససైన్యా ధిపతులు, రాజులు, అందరూ కొలువుదీరి యున్నపుడు ఈ రత్నసింహాసనమును అధిష్టించు అధికారము ఈ యువకిశోరం రాయలుకు గాక మరెవ్వరికి కలదు? అని ప్రశ్నించుట ఎవరికి సాధ్యము? పట్టాభిషేక మునకు ముందు సభాభవన అంతర్గృ హములోనికి నన్ను పిలువుకొని వెళ్ళి ఏకాన్తముగ రా నాయనా! అని చేరబిలిచి చెంపపై పెట్టుపెట్టిన ఆ చెంపదెబ్బ ఎట్లు మరతును? ‘‘వత్సా! ఈ క్షణముతో నీపై నాయధికారము ముగియుచున్నది. ఇక నీవు రాజువు. నేను నీ కింకరుడను. అధికారము మహామోహస్థానము. నీ తీర్పునకు తిరుగుండదు. నాఈ చెంపదెబ్బ నీకెంతటి వేదన కల్గించినదో ్నప్తియందుంచుకొని అపరాధులను శిక్షించుయెడ మనస్సెట్లుం డవలెనో నీ మనస్సున నాటుకొనుటకే నిరపరాధివగు నిన్నిట్లు బాధించితిని’’ అని పలికిన అమృతపుపలుకుల మర్మము రాజనీతి ఎట్లుమరతును? నూటయేబది సంవత్సరములకు ముందే స్థాపింపబడిన విజయనగర సామ్రాజ్య మును హిందూ సామ్రాజ్యముగా తీర్చిదిద్దాను. తూర్పున కటకము వరకు తెలుగువారి యధికా రము విస్తరింపజేశాను. దక్షిణమున సేతువు వరకు నాయ్నాకు తిరుగులేదు. పశ్చిమమున బీజాపురమే నా రాజ్యసరిహద్దు. తురుష్కులకు మనమన్న సింహస్వప్నము.ఉత్కళులు విధేయు లుగా నిలిచిరి. చోళులు,పాండ్యులు నామ మాత్రావశిష్ఠులు. పొట్నూరు,సింహాచల మందలి దిగ్విజయస్తంభములు చారిత్రక సత్యములకు తార్కాణములు. నాయేలుబడిలో రక్షణలో ప్రజలకు యుద్ధభయము గాని,చోరభయము గానీ లేకుండా నిశ్చింతగా జీవించునట్లు చేయ గల్గితిని. పాడిపంటలు ద్విగుణములు, త్రిగుణములుగా వృద్ధి చెందినవి. అందుకే విజయనగర వీధులలో వాణిజ్యము మూడు పువ్వులు ఆరుకాలుగా వర్ధిల్లుచున్నది. లేకున్న రత్నములు,మణులు,మాణిక్యములు, వజ్రవైఢూర్యములు పురవీధులలో ఆరుబయట రాసులుపోసి అమ్మగలరా? కత్తికేకాక ఘంటమునకూ పదునుపెట్టి భువన విజయసాహితీ సభయందు ఎన్నెన్నో సాహిత్య కుసుమాలు విరగబూయునట్లు చేయగల్గితిని. ఆ కావ్యసంపద, కవులు నభూతో నభవిష్యత్తి అన్నట్లు వేయిసంవత్సరములైననూ తరగని సాహిత్యసంపద ఉద్భవించినది కదా! ఒకపక్క సాహిత్యము, మరొకపక్క సంగీతము, ఇంకొకపక్క రాజకీయముల….అష్టావధానము చేయుచునే ఆముక్తమాల్యద గ్రంథము పూర్తి చేయగల్గితిని. దేశభాషలందు తెలుగులెస్స కాకున్న నా ఈ బృహద్గ్రంధము రచియింపబడియుండెడిదా? విజయపరంపరలతో నేను కట్టించిన దేవాలయప్రాంగణములు, ఆకాశహర్మ్యములైన గాలిగోపురములు కూలిన కూలుగాక నా విజయపరంపరలతో నెలకొల్పిన విజయస్తంభాలు పవిత్రతుంగభద్రమ్మ తరంగాలలో తళతళలాడుచున్న విఠలాలయ గోపురకాంతి దీప్తులు, గగనమును తాకునట్లు మెరుపుతీగల మాపుచేసిన ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు,సహృదయలోకమునకు సుధాధారవలె,పానీయములుగా పెదవికం దించిన భువనవిజయ కవితా గోష్టులు తలచితలచి తెలుగువాడు తన్మయుడు కాకుండునా?పెద్దనగారి మనుచరిత్ర, తిమ్మనగారి పారిజాతాపహరణము, తెనాలి రామలింగని పాండురంగ మహత్మ్యము….. ఒకటేమిటి…..
మున్ముందు నా ఈ సామ్రాజ్యమేమగునో? మరల శత్రురాజులు పుంజుకొనిన- రాజుల మధ్య ఐక్యత లోపించిన -ఆంధ్ర సామ్రాజ్య మందలి విజయస్తంభములను వారు విరుగగొట్టిన గొట్టునేమో! విఠలాలయ, దేవాలయ ప్రాంగణములు చెల్లాచెదురు చేసిన చేయునేమో! ఆకాశహర్మ్యములుగా నే నిర్మించిన గాలిగోపురములు కూలిన కూలుగాక. ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు అంతమొనర్చిన ఒనర్చునేమో! కానీ నా భువనవిజయ ప్రాభవమును యిసుమంతయు కదల్చలేరు. భువనవిజయమనగానే అపజయమెట్టిదో ఎరుగని ఆంధ్రజాతి పౌరుషప్రతాపములు ్నప్తికి రాగలవు. సాహితీ సదస్సుచే సాధించిన విజయములు ఆంధ్రజాతి మరువదు. సంస్కృతభాష నుండి సాగిన అనువాద ప్రక్రియకు అడ్డుకట్టవైచి ప్రబంధ ప్రక్రియకు నాందీ పలికి పరిపుష్టి గూర్చి వయసుతోపాటు పొంగివచ్చు అవయవ సౌష్టవముల దర్పముతో మంత్రముగ్ధులను చేయు ప్రబంధసుందరి అష్టాదశ వర్ణనాలంకృత కాంతులతో సాహిత్యమున్నంత కాలము నిలిచియుండును కదా!
తెలుగదేలయన్న దేశంబు తెలుగు
దేశభాశలందు తెలుగులెస్స
శ్రీ గోమఠం రంగా చార్యులు