సెకండ్ వేవ్..కరోనా చెబుతున్న నిజం
కరోనా సృష్టిస్తున్న విలయానికి నేడు పేదోడికి అరవై గజాల ఇంటి స్థలం కాదు, స్మశానంలో ఆరడుగుల నేల ఓకలగా మారింది. దేశంలో రెండోదశ కరోనా వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తున్నది….. ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. అదే సందర్భంలో మన ప్రభుత్వ పెద్దల పగటి వేషాలనూ,ప్రచార వ్యామోహా లనూ,ఉత్తరకుమార ప్రగల్భాలనూ పట్టి చూపిస్తున్నది.‘వట్టి మాటలు కట్టిపెట్టోరు గట్టిమేల్ తలపెట్టవోరు’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఇప్పుడు గట్టిమేలును కట్టిపెట్టి వట్టిమాటలు పలుకుతున్న పాలక నేతల బండారాన్ని నిట్ట నిలువునా బట్టబయలు చేస్తున్నది కరోనా.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు,వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులు ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కోవిడ్‌పై పోరు సాగిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ముందుండి సేవలందిస్తున్నారు. అయితే.. కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడుతున్న క్రమంలో వైద్యు లు కూడా ఈమహమ్మారి కాటుకు బలవు తున్నారు. కరోనా కారణంగా గతేడాది దేశ వ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పో యారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడిర చింది. సెకండ్ వేవ్‌లోనూ ఈమహమ్మారి వైద్యులపై పంజా విసురుతోందని పేర్కొంది.అయితే.. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క రోజులో 50 మంది వైద్యులు మరణించారని మెడికల్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు భారత వైద్య సంఘం వెల్లడిరచింది.
కరోనా సెకండ్ వేవ్ లక్షణాలేంటో తెలుసా?
భారతదేశంలో కోవిడ్-19తీవ్రంగా చాలా మం దిని ప్రభావితం చేస్తోంది. మొదటి వచ్చిన వైరస్‌తో పోల్చుకుంటే ఈవైరస్ చాలా ప్రమాదమని నిపు ణులు కూడా చెబుతున్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్స్ కూడా మనం చూస్తు న్నాం. అనుకోని లక్షణాలు కూడా చాలా మందిలో వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం,కొద్దిగా జ్వరం ఉండడం,దగ్గు,తలనొప్పి,ఒళ్లునొప్పులు,గొంతు బాగా లేకపోవడం,రుచి తెలియక పోవడం,వాసన తెలియకపోవడం,నాసల్ కాంజిషన్,నీరసం, అల సట వంటి లక్షణాలు కన బడుతున్నాయి.
శ్వాస ఆడకపోవడం
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం చాలా మందిలో కనుగొనడం జరిగింది. చాలా మంది కరోనా బారిన పడిన వాళ్ళు శ్వాస సంబం ధిత సమస్యలకు గురవుతున్నారు. నిజంగా దీని వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. ఒక పక్క చూస్తే అక్సిజన్ కొరత కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. దీంతో నిజంగా ఈ సమస్య నుండి బయట పడటం కష్టమని అనిపిస్తోంది. అలాగే శ్వాస అందకపోవడంతో పాటు గుండెల్లో గట్టిగా పట్టేసినట్టు వంటివి కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.దీనితో ఊపిరితిత్తుల సమస్యలు కూడా అధికమవుతున్నాయని రోగులు అంటు న్నారు.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి ముఖ్యంగా అరుగుదల,నోరు,ఫుడ్ పైప్, కడుపు నొప్పి, పెద్ద పేగులో ఇబ్బందులు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం మరియు పూర్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడం లాంటివి వస్తున్నాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.
వినబడక పోవడం
కొంతమందిలో వినబడడం లేదట. కొంత మందికి అసలు వినబడకపోవడం మరికొందరిలో కొద్దిగా మాత్రమే వినపడడం లాంటి సమస్యలు వస్తున్నాయి. కరోనా వైరస్ సోకిన మొదటి వారంలో ఈలక్ష ణాలు చూడొచ్చు. ఆతర్వాత ఇన్ఫెక్షన్ని బట్టి ఈ సమస్య ఎదురవుతోంది. ఇలా ఈ లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
చాలా నీరసంగా ఉండడం
కరోనా వైరస్ బారిన పడిన వారిలో నీరసం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అదే విధంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం లాంటివి కనబడుతున్నాయి. ఇవి కూడా కరోనా వైరస్ సోకినట్లు లక్షణాలు అని గుర్తించాలి.
కళ్లు ఎర్రబడటం
కరోనా వైరస్ సోకిన వాళ్లలో కళ్లు ఎర్రబడటం, వాపు ఉండడం లాంటి లక్షణాలు కూడా కనబడు తున్నాయి. కళ్ళు దురద పెట్టడం, ఎర్రగా అయి పోవడం, కళ్ళల్లో నుండి నీరు కారడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అంటున్నారు. అయితే ఈ రెండిటికీ మధ్య కనెక్షన్ ఏమిటి అనేది చూస్తే… మామూలుగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారాకానీ డ్రాప్లెట్స్‌ద్వారాకానీ ఎవరైనా మాట్లా డినా,తుమ్మినా,దగ్గినావ్యాపిస్తుంది అని తెలుసు. అయితే ఇన్ఫెక్షన్ ఎవరికైనా సోకితే వాళ్ళు చేతులు కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయని అదే విధంగా ముక్కు నోరు కూడా ఇన్ఫెక్ట్ అవుతాయని అంటున్నారు. కాబట్టి కళ్ళల్లో ఇరిటేషన్, ఐసెన్సిటివిటీ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
నోరు ఆరిపోవడం
నోరు ఎక్కువగా ఆరి పోవడం లాంటివి కూడా కరోనా కి కొత్త లక్షణాలు అని చెప్తున్నారు. జీర్ణానికి నోరు సహాయ పడుతుంది అదే విధంగా పళ్ళు కూడా జీర్ణానికి అవసరం. అయితే ఒక వేళ కనుక సరైన సలైవా ప్రొడ్యూస్ అవ్వక పోతే అప్పుడు నోరు ఆరి పోతుంది దీని కారణంగా పంటి సమస్యలు మరియు దంతాల సమస్యలు వస్తాయి.
కరోనా వైరస్ సోకిన వాళ్ళకి నోరు ఆరి పోవడం కూడా కొత్త లక్షణంగా గుర్తించారు. అది మ్యూకస్ లైనింగ్ ఏర్పాటు చేస్తుంది దీని కారణంగా ఇది ప్రొడ్యూస్ అవ్వదు దీంతో నోరు ఆరిపోతు ఉం టుంది. గొంతు కూడా ఆరిపోయినట్లు ఉంటుంది కాబట్టి కరోనాకి ఇవి కూడా కొత్త లక్షణాలను గుర్తించాలి.కరోనా వైరస్ సోకిన వాళ్ళల్లో డయేరియా సమస్య కూడా వేధిస్తోంది. ఇది ఒకటి నుంచి 14రోజుల వరకు ఉంటుంది. అజీర్తి సమ స్యల కారణంగా డయేరియా సమస్య కూడా రావచ్చు. కాబట్టి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో డయేరియా వస్తుంది గుర్తించండి.
తల నొప్పి
తలనొప్పి కూడా కరోనా వైరస్ వచ్చినట్టు లక్షణం. మామూలుగా వచ్చే తల నొప్పి కంటే ఇది ఎక్కువ సేపు ఉంటుంది. కరోనా వైరస్ వచ్చిన వాళ్లకి తల నొప్పి కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు గుర్తిం చారు. కరోనా వైరస్ వచ్చిన వాళ్లకి చర్మ సమస్యలు కూడా ఉంటున్నట్లు గుర్తించారు.
యువతనూ వదలట్లే
మంచి ఆరోగ్యంతో ఉన్నవారు,యువకులకూ కరోనా సోకడం సెకండ్ వేవ్ లో ఎక్కువగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారినీ కరోనా వదలట్లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త మ్యూటెంట్ల మీద వ్యాక్సిన్లు అంతగా పని చేయక పోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా సరే టీకా వేయించుకోవాలని డాక్టర్లు సూచి స్తున్నారు. దీని వల్ల వైరల్ లోడ్ తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతు న్నారు. దీంతోపాటు మాస్కులను కట్టుకుంటూ.. చేతులను, ముట్టుకున్న వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని సలహాలు ఇస్తున్నారు.
పాలకుల అస్త్రసన్యాసం – ప్రజలకు ప్రాణసంకటం
దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వ్యాప్తి గురించి ఆందోళనకరమైన వార్తలు వినపడుతున్నాయి. ఆదివారం ప్రధాన పత్రికలన్నీ కనీసం నాలుగు పేజీలకు తక్కువగాకుండా కోవిడ్ వ్యాప్తి గురించిన వార్తలు ప్రచురించాయి. శనివారం సాయంత్రం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య అవసరాలకు వినియోగించే ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా గురించి సమీక్షించినట్టు టీవీలు వార్త ప్రసారం చేశాయి. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రులు తమవద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలు కరిగిపోయాయనీ, రోగులు వేరే ఆస్పత్రుల్లో భర్తీ కావాలని హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ లేనందున అత్యవసర లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వంకూడా 15రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్ నియంత్రణ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయా రాష్ట్ర హైకోర్టులు చివాట్లుపెట్టాయి. కోవిడ్ కారణంగా ఎంతమంది చనిపోతున్నారో వివరాలు కూడా ఇవ్వకుండా మూకుమ్మడి దహన సంస్కారాలు స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసితో సహా ఉత్తరప్రదేశ్ అంతటా నిత్యకృత్యంగా మారాయి. స్మశానాల్లో శవాలు కాల్చే స్థలం లేక వచ్చిన శవాలను కుప్పలు పోసి కాలుస్తున్న వీడియోలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. అయినా గత ఏడాది ఇదే సమయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు నిర్వహించిన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఇప్పుడేమి చేస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. పోయిన ఏడాది కనీసం వందకుపైగా జీఓలు, సర్కులర్లు జారీ చేసిన కేంద్ర హౌంశాఖ చేష్టలుడిగి చూస్తోంది. ప్రధానంగా దేశంలో వాక్సిన్ కొరతకు మూడు కారణాలున్నాయి. గతంలోనే ఫైజర్, స్పుత్నిక్‌లు తమ వాక్సిన్ భారతదేశంలో సరఫరా చేయటానికి వీలుగా అత్యవసర అనుమతులు కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అప్పటికే భారత్ బయోటెక్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కేంద్రం దేశంలోకి మరే ఇతర వాక్సిన్ దిగుమతి కానీయకుండా అడ్డుకుంది. ఇది మొదటి కారణం. కేంద్రం రూపొందించిన వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక రెండో కారణం. ఈ ప్రణాళికకు మూడు లక్ష్యాలున్నాయి. మొదటిది దేశంలో కోవిడ్ నియంత్రణ, రెండోది విదేశాలకు ఎగుమతి. ఈ రెండూ మౌలిక లక్ష్యాలు. ఈ రెండిరటి పర్యవసానంగా విదేశాలకు వ్యాక్సిన్ అవసరాలు తీర్చటం ద్వారా దౌత్య సంబంధాల్లో పై చేయి సాధించాలన్నది మూడో లక్ష్యంగా ఉంది. సోకాల్డ్ సంపన్న దేశాలు దీనికి భిన్నంగా ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా, రష్యాలు ముందుగా తమ దేశంలోని పౌరులందరికీ కావల్సినంత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వ్యవహరించాయి. మచ్చుకు ఓ ఉదాహరణ. దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని, పార్లమెంట్ మద్దతు ప్రకటించాయి. నాలుగు నెల్ల తర్వాత భారతదేశం నుంచి కోవ్యాక్సిన్ దిగుమతి చేసుకున్న కెనడా ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల తన వైఖరిని మార్చుకుంది. దీన్నే దౌత్య విజయంగా బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తూ సంబరం చేసుకున్నాయి. విదేశాల్లో అమ్ముకోవటానికి భారత్ బయోటెక్‌కు అనుమతించేందుకు వీలుగా దేశంలో వ్యాక్సిన్ వితరణ కార్యక్రమాన్ని దశలవారీ కార్యక్రమంగా మార్చారు. తొలుత మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య మూడు వారాల వ్యవధి అని నిర్ణయించారు. కానీ కావల్సినంత వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవటంతో ఈ వ్యవధికి పెంచారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలలిగిన దేశమని గొప్పలు చెప్పుకుంటూనే దేశంలో యువతకు వ్యాక్సిన్ అందించే విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వ్యాక్సిన్ కొరత ఏ స్థాయిలో ఉందంటే ఒక్క శనివారం నాడు తెలంగాణలో లక్షన్నర డోసుల అవసరం ఉంటే కేవలం ఐదువేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అందువలన వ్యాక్సిన్ వితరణ కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ వైద్యశాఖాధికారులు ప్రకటించారు. మార్చి 24 నాటికి భారతదేశం విదేశాలకు ఆరు కోట్ల డోసులు ఎగుమతి చేస్తే స్వదేశంలో ప్రజలకు ఇచ్చింది మాత్రం ఐదు కోట్ల డోసులే. అంటే దేశంలో ప్రజల ప్రాణరక్షణ కంటటే విదేశీ వ్యాపారమే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన పనైంది. కూతవేటు దూరంలో వ్యాక్సిన్ తయారవుతున్న తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన రాష్ట్రాల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజల ప్రాణ రక్షణ కంటే విదేశాల్లో మోడీ ఫ్లెక్సీలు కట్టించుకోవటానికి వ్యాక్సిన్ ఎగుమతి చేసిన ఫలితమే నేడు దేశంలో వ్యాక్సిన్ కొరత ప్రదాదకర స్థాయికి చేరింది. చివరి కారణం వ్యాక్సిన్ తయారీ పూర్తిగా ప్రైయివేటు రంగానికి వదిలేయటం. దేశంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు నాలుగు. చెన్నైలోని కింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, బీసీజీ వ్యాక్సిన్ లాబ్‌లు, కసౌలిలోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కూనూర్‌లోని పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కేంద్రం అనుసరిస్తూ వచ్చిన ప్రయివేటీకరణ విధానాలతో ఈ సంస్థలు మూతపడ్డాయి. 2012లో ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా మూడు సంస్థలు పున్ణప్రా రంభించినా వాటిని పని చేయించటానికి కావల్సినన్ని నిధులు కేంద్రం సమకూర్చక పోవటంతో కుదేలయ్యాయి. కానీ కోవాక్సిన్ తయారు చేయటానికి ప్రయివేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో సమకూర్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీ వంటి ప్రాణరక్షణ సేవలను సైతం ప్రయివేటీకరించటం నేటి వ్యాక్సిన్ కొరతకు మూడో కారణం. ఇక ఆక్సిజన్ కొరత గురించి. కేంద్రం శాసనసభ ఎన్నికల పర్వంలోనో పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చే పనిలోనో లేక గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు తనవంతు సహకారాన్ని అందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను గోవా గవర్నర్‌గా నియించే పనిలోనో తీరుబడిలేనంతగా తలమునకలై ఉంది. దాంతో దేశాన్ని చట్టుముడుతున్న కోవిడ్ రెండో ఉప్పెన ప్రభుత్వం కంటికి కనిపించలేదు. కేవలం 150కోట్ల రూపాయల ఖర్చయ్యే ఆక్సిజన్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి కావల్సిన టెండర్లు పిలవటానికి అమాత్యులు ఆర్నెల్ల పాటు ఫైలు నడిపారంటే ఇక్కడ ప్లాంట్ నిర్మాణం లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది. మార్చి 24, 2020న ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ దేశాన్ని లాక్డౌన్లోకి నెట్టిన కేంద్రం గత సంవత్సరం అక్టోబరు 21వరకూ కోవిడ్ చికిత్సకు కీలకమైన ఆక్సిజన్ సరఫరా మీద దృష్టి పెట్టలేదు. టెండర్లు ప్రకటించిన తర్వాత కూడా కాంట్రాక్టు ఖరారు చేసి ప్లాంట్ నిర్మాణం మొదలు పెట్టలేదు. ఈ వైఫల్యాలన్నీ కప్పిపెట్టుకోవటానికి ఓ వంద ఆక్సిజన్ తయారీ ప్లాంట్లకు అనుమతిస్తున్నట్టు ప్రధాని గత వారం ప్రకటించారు. గత ఏడాదే దేశంలో వైద్య సేవలకుపయోగించే ఆక్సిజన్ తయారీ కొరతను గమనించిన ప్రభుత్వం రెండో ఉప్పెన సమయానికి కూడా తగినంత ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేసుకనేందుకు ప్రయత్నం చేయకపోవటం క్షమించరాని నిర్లక్ష్యం. కోవిడ్ నియంత్రణలో పాలకుల అస్త్ర సన్యాసం కారణంగా భారతదేశం కోవిడ్ నియంత్రణలో ఘోరంగా విఫలం కావటం ఓవైపు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంటే మరోవైపున ప్రజలకు ప్రాణగండంగా మారింది.- సైమన్ గునపర్తి