సుప్రీం పీఠంపై తెలుగు తేజం

‘‘ తెలుగువాంతా గర్విస్తున్న సందర్బమిది. ఐదున్నర దశాబ్దాల తర్వాత తెలుగు బిడ్డ దేశంలోనే అత్యున్నతమైన పీఠాన్ని ఆథిరోహిస్తున్నారు.జస్టీస్‌ ఎస్వీ రమణ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడంతో సామాన్యులంతా తమ ఇంట్లోని వ్యక్తికే ఈ గౌరవం దక్కినంతగా ఆనందిస్తున్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి స్వయకృషితో ఎదిగిన ఆయన ప్రస్థానం అందరకీ ఆదర్శం. చిన్నతనంలో కాలినడకన బడికి వెళ్లి చదువుకున్న వ్యక్తి…ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే తన లక్ష్యం దిశగా సాగిపోయిన తీరు స్పూర్తిదాయకం. తెలుగు రాష్ట్రాలు పొంగిపోతున్న వేళ ఆయన సొంతూళ్ళో సంబరాలు మిన్నంటుతున్నాయి. .. కష్టాలకు ఎదురీది అత్యున్నత న్యాయస్థాన పీఠానికి జస్టిస్‌ ఎస్వీ రమణ..ఎదిగారు.’’


కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగారు! గుంటూరులో చదువుకున్నారు! న్యాయవాదిగా ఎదిగారు. న్యాయమూర్తిగా ప్రస్థానించారు. ఇప్పుడు…భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనే… జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ! అందరికీ… జస్టిస్‌ ఎన్వీ రమణగా సుపరిచితుడు! సాధారణ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన రమణ… ఇప్పుడు భారత చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణగా మారారు. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు… గణపతిరావు, సరోజనీ దేవి. స్వగ్రామం..కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో గణపతిరావు కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడిరది. స్వగ్రామంలో ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. బాల్యంలో కష్టాలు ఎదురైనప్పటికీ రమణ పట్టుదలతో కష్టపడి చదువుకున్నారు. కంచికచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. గుంటూరు జిల్లా ధరణికోట (అమరావతి) ఆర్‌వీవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
యువరానర్‌ అంటూ…
రమణ 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ ఏరాసు అయ్యపురెడ్డి వద్ద తొలినాళ్లలో జూనియర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ‘పిల్‌’ రమణగా పేరు తెచ్చుకోవడం విశేషం. ప్రజా సమస్యలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపించారు. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్‌లోనూ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండిరగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్‌ అడ్వొకేట్‌గా వ్యవహరించారు. రాజ్యాంగం, క్రిమినల్‌, సర్వీస్‌, ఎన్నికలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. రమణ ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.
న్యాయమూర్తిగా…
న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్న జస్టిస్‌ రమణ తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్‌ 27న రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. సుమారు 13 ఏళ్లపాటు హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రమణ వేల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ జుడీషి యల్‌ అకాడమీ చైర్మన్‌గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.
ఏపీ నుంచి ఢల్లీికి…
జస్టిస్‌ రమణ 2013 సెప్టెంబరు 2న ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. ఆ తదుపరి ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు… భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సౌమ్యుడిగా పేరుపొందిన జస్టిస్‌ రమణ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యే క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి అత్యున్నత స్థానాన్ని అధిష్టిస్తున్నారు.
దేశ విదేశాలకు…
జస్టిస్‌ రమణ మహిళా సాధికారత, పర్యావరణం, జుడీషియల్‌ యాక్టివిజమ్‌, జెండర్‌ జస్టిస్‌, సబ్‌-ఆర్డినేట్‌ కోర్టుల పాత్ర, మానవ హక్కులు, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. బ్రిటన్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి న్యాయవ్యవస్థ తీరును పరిశీలించారు. అమెరికాలో న్యాయపాలనపై అధ్యయనం చేశారు. పేద ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావాలని, వారికి ఉచిత న్యాయసేవలు లభించాలని ఆయన కోరుకుంటారు. న్యాయసేవల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రమణ వేలాది మంది పేద ప్రజల కేసులు ఉచితంగా పరిష్కారం అయ్యేలా చూశారు. దేశంలో కోర్టులను ఆధునికీక రించాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇద్దరూ.. ఇద్దరే..! ఒకరు న్యాయశాస్త్రాన్ని ఔపోసన పెడితే, ఇంకొకరు వైద్యశాస్త్రం లోతులను తరచిచూసినవారు. వారే జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ యార్లగడ్డ నాయుడమ్మ. వీరిద్దరూ వియ్యంకులు. అవిభక్త కవలల శస్త్ర చికిత్సలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్‌ నాయుడమ్మ పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన కుమారుడు రితేశ్‌తో జస్టిస్‌ రమణ కుమార్తె భువనకు వివాహం జరిగింది.
లాయర్‌ కావాలనుకోలేదు…
న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠానికి ఎదిగిన జస్టిస్‌ రమణ నిజానికి న్యాయవాది కావాలని భావించలేదు. యాదృచ్ఛికంగానే ఆయన ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన కుటుంబం లోనూ ఎవరూ న్యాయవాదులు లేరు. విద్యార్థి దశలో చురుకుగా వ్యవహరిస్తూ, సామాజిక అభ్యుదయం కోసం పలు పోరాటాలు చేశారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. ఒక దశలో తాను అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక సందర్భంలో చెప్పారు.
సుప్రీంకోర్టుకు కొత్త సారథి- తీవ్ర సవాళ్లు
సీనియర్‌ పాత్రీకేయులు,సాహితీవేత్త ప్రముఖ రచయిత తెలకపల్లిరవిగారి తెలియసిన మరికొన్ని వివరాలు ఇలాఉన్నాయి. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2013లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్‌ రమణ అంతకుముందు ఉమ్మడి ఎ.పి హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన ఆయన సి.జె గా ఏప్రిల్‌ 24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ పదహారు నెలల పాటు పదవిలో వుంటారు. ఏప్రిల్‌ 23న సిజెఐ గా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ బాబ్డే సీనియారిటీ ప్రకారమే 48వ న్యాయమూర్తిగా ఆయన పేరును సిఫార్సు చేశారు. సుప్రీం న్యాయమూర్తులలో అత్యంత సీనియర్‌ను నియమించడం సంప్రదాయమైనా సరే నెల రోజుల ముందుగా తన తదుపరి సి.జె పేరు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ఏ కారణం చేతనైనా సీనియార్టీ ప్రకారం వున్నవారిని నియమించలేని పరిస్థితి వస్తే ముందే చర్చ చేయవలసి వుంటుంది. జస్టిస్‌ రమణపై ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ కొన్ని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ ఆయన నియమాకం తథ్యమని ముందే స్పష్టమైంది. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీ పైన, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్నను సుప్రీంకు తీసుకు వస్తే 2027లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారనే అంశం పైన చర్చ జరిగింది తప్ప తదుపరి సిజెఐ గురించి కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు కనిపించదు.
ఆరోపణల తోసివేత
జస్టిస్‌ రమణ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు అదే సమయంలో ఆయనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపణలను తోసిపుచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల వాదోపవాదాలు న్యాయవర్గాల నుంచి వినిపించాయి. ఈ ఆరోపణల విచారణకు సంబంధించి కొన్ని కథనాలు రాగా అంతర్గత విచారణ విషయాలు ఎప్పుడూ బహిరంగ పర్చబోమని వాటిని తోసిపుచ్చింది. అంతిమంగా ఆ ఆరోపణలలో పసలేదని తోసిపుచ్చినట్టు ప్రకటించింది. విచారణ ప్రక్రియ జరిపి తిరస్కరించడం పారదర్శకత లేదనే విమర్శకు సమాధానంగా భావించాల్సి వుంటుంది. అయితే ఆ ఆరోపణలను విచారించింది ఎవరు, ఏం తేల్చారనేది బయిటపెట్టి వుండాల్సిందని సీనియర్‌ న్యాయవాదులు కొందరు రాశారు. ఏమైనా అది ముగిసిన అధ్యాయం.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి నియమితులవటం ఇది రెండవ సారి. గతంలో ఎ.పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేసిన జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966-67 మధ్య సి.జె గా పనిచేశారు. 1993-94లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వెంకటాచలయ్య కూడా ఇప్పటి ఎ.పి లోని లేపాక్షిలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అది అప్పుడు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రంలో భాగంగా వుండేది. మానేపల్లి నారాయణరావు వెంకటాచలయ్య అన్న ఆయన పేరు కూడా అచ్చం తెలుగు వారి పేరే అయినా చదువు కర్ణాటకలో సాగింది. ఈ మధ్య కాలంలో తెలుగువారు అనేకులు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా పని చేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి స్థానం దాకా పయనించే అవకాశం జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకే దక్కింది. ఆయన పదవీ కాలం కూడా సాపేక్షంగా చాలా మంది సి.జె ల కన్నా అధికంగా వుంటుంది.
సుప్రీం ప్రతిష్టపై నీలినీడలు
చాలా దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తమైనా సుప్రీం కోర్టు ప్రతిష్ట అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తులుగా ఎస్‌.ఎ.బాబ్డే, అంతకు ముందు రంజన్‌ గొగోరుల హయాంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఒత్తిళ్లకు లోబడిపోయిందనే ఆరోపణ బలపడిరది. వరుసగా ఇచ్చిన తీర్పులు మోడీ సర్కారుకు సంతోషం కలిగించాయి. సిజెఐ గా రంజన్‌ గొగోరు అయోధ్య, రాఫెల్‌ తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వం పొంది విమర్శలు మూట కట్టుకున్నారు. ఇక 2019 నవంబరులో ఎస్‌.ఎ బాబ్డే ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు కీలకమైన ఎన్నో కేసులు న్యాయస్థానం ముందు అపరిష్కృతంగా వుండిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి మూడు ముక్కలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం నిరంకుశ చర్యను సవాలు చేస్తూ వంద పిటిషన్లు దాఖలయ్యాయి. కాని వాటిపై పూర్తి విచారణ జరగనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పైనా పిటిషన్లు వచ్చాయి. ఢల్లీితో సహా దేశవ్యాపితంగా నిరననలు సాగాయి. ముఖ్యంగా ఢల్లీిలో కుట్రపూరితంగా మత కలహాలు రగిలించి యువతను విద్యార్థులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం లోనూ దాడులు జరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లోకి గ్యాంగులు చొరబడి దౌర్జన్యం చేశారు. ఇవన్నీ కళ్ల ఎదురుగా జరుగుతున్నా పలుసార్లు కేసులు వస్తున్నా సుప్రీంకోర్టు న్యాయం చేసేందుకు చొరవ తీసుకోలేదు. హత్రాస్‌ అత్యాచారం ఘటనలో అన్యాయంగా అరెస్టు చేయబడిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ కేసు వస్తే విచారించి మీడియా స్వేచ్ఛను కాపాడకపోగా ఇలాంటి కేసులు హైకోర్టుకే వెళ్లేలా తాను చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునే విషయంలోనూ భారత దేశ సంప్రదాయం, రాజ్యాంగ విలువలు, అంతర్జాతీయ సూత్రాలను బేఖాతరు చేస్తూ జోక్యానికి నిరాకరించింది.
వివాదగ్రస్తమైన తీరు
ఇంతకంటే తీవ్రమైన విషయం ఎన్నికల బాండ్లకు సంబంధించిన కేసును పూర్తిగా పక్కన పెట్టేయడం. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆ బాండ్లపై స్టే విధించాలంటూ పిటిషన్లు వస్తూనే వున్నాయి. ఇవి ఎప్పటినుంచో వున్నాయనీ, ఈ విధమైన అభ్యర్థనలను ఇదివరకటి నుంచి వస్తున్నాయంటూ ప్రతిసారి సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిని పక్కన పెడుతూ వచ్చింది. వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన వ్యాజ్యాల విషయంలోనూ ఇదే విధమైన స్పందనా రాహిత్యం తాండవించింది. వారికోసం ఏం చేయాలనేది ప్రభుత్వానికే బాగా తెలుసంటూ కేసును చాలా కాలం సాగదీశారు. వలస కార్మికులకు తిండి పెడుతున్నప్పుడు మళ్లీ ఆర్థిక సహాయం దేనికని ఆఖరుకు సి.జె బాబ్డే స్వయంగా ప్రశ్నించారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు సంబంధించిన పలు కేసుల్లో సుప్రీం కోర్టు అమితాసక్తి ప్రదర్శించింది. ఢల్లీిలో రైతుల ఆందోళనను పరిష్కరించాలనే కేసు లోనూ ఒక కంటితుడుపు కమిటీని వేసి కాలయాపన చేసింది. ఆ కమిటీ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తులతో నిండి వుండటం, ఒకరు ముందే నిరాకరించడం దాన్ని మరింత పలచన చేసింది. తీరా ఆ కమిటీ సిఫార్సులు వచ్చి చాలా కాలం గడిచినా ఎలాంటి సానుకూల చర్యలు ఆదేశించింది మాత్రం లేదు. ప్రజల పేదల హక్కులను కాపాడ్డంలో ఈ విధంగా వ్యవహరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కార కేసుల పేరిట మాత్రం ఎంతో సమయం వెచ్చించింది. అయోధ్య కేసులో 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రాతిపదికగా చెప్పిన న్యాయస్థానం ఆ చట్టాన్నే సవాలు చేసే పిటిషన్‌ను అనుమతించడం మరో వైపరీత్యం. ఆ వెంటనే కాశీ, మధుర క్షేత్రాలలో వివాదాలను స్థానిక న్యాయస్థానాలు చేపట్టాయి.
న్యాయమూర్తుల నియామకం స్తంభన
కరోనా కారణంగా ఈ కాలంలో వర్చువల్‌ విచారణ పద్ధతి గొప్ప మార్పుగా చెబుతున్నా వాస్తవంలో అనేక కేసులు విచారణకు నోచుకోకుండానే పోయాయి. కేవలం 25 శాతం మాత్రమే విచారణ జరిగాయి. ఈ పరిస్థితి అనివార్యమైందనుకుంటే ఒక తీరు గాని ఇందుకు సి.జె బాబ్డేను పొగడ్తల్లో ముంచెత్తడం విచిత్రం. ఇప్పటికి వచ్చిన తీర్పులపైనే ఇంత అసంతృప్తి వుండగా కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కోర్టు చర్చలు సాగిస్తున్నది. వాటి పాత్రపై న్యాయమూర్తులకే స్పష్టత వున్నట్టు లేదు. ఈ మొత్తం కాలంలో సుప్రీం కోర్టుకు ఒక్క న్యాయమూర్తిని కూడా అదనంగా నియమించలేకపోవడం పెద్ద లోపం. హైకోర్టుల్లోనూ 400 పైనే ఖాళీలున్నా కొలీజియం, కేంద్రం పరస్పరం బాధ్యతను నెట్టివేసుకుంటూ కాలం గడిపాయి. పదవీ విరమణకు ముందు రోజు సి.జె బాబ్డేతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 224(ఎ) అధికరణాన్ని దాదాపు 60 ఏళ్ల తర్వాత పునరుద్ధరించి, రిటైర్డు జడ్జిలను హైకోర్టులకు నియమించవచ్చునని ఆనుమతినిచ్చింది. క్రమబద్దమైన నియామకాలు పూర్తిచేయకపోగా ఈ విధంగా విచక్షణతో కూడిన నియామకాలు చేస్తే మళ్లీ అదెక్కడికి దారి తీస్తుందోననే సందేహాలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. మాజీ సీనియర్‌ న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా వంటి వారు ప్రధాని మోడీని అదేపనిగా పొగిడి తరించడం, రంజన్‌ గొగోరు రాజ్యసభకు వెళ్లడం ఆ సందేహాలను పెంచింది. తాజా మాజీ సి.జె బాబ్డే కూడా బహురంగాలలో ఆసక్తి వున్నవారు గనక పదవీ విరమణ తర్వాత ఏదైనా చేయవచ్చునని ప్రస్తుత సిజెఐ ఎన్‌.వి.రమణ వీడ్కోలు ప్రసంగంలో చెప్పడంలోనూ సంకేతాలున్నాయి.
భవిష్యత్‌ గమనం?
సిజెఐ గా ఎన్‌.వి రమణ పదవీ కాలం సాపేక్షంగా చాలా మంది కన్నా కొంచెం ఎక్కువగానే వుంటుంది. రాజకీయ నాయకులపై, ప్రజా ప్రతినిధులపై కేసులసు వేగంగా పరిష్కరించాలన్నది గతంలో జస్టిస్‌ రమణ తీసుకున్న కీలక నిర్ణయం. పేదలకు కూడా న్యాయ సహాయం సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ సిఫార్సుకు ముందు రోజు ఆయన చేసిన ప్రసంగం. నదీ జలాల వివాదాలు రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా ఆయన తీర్పులను ప్రస్తావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకే నదీ జల వివాదాలు ఒకవైపు రాష్ట్రాల హక్కులపై కేంద్రం తీవ్ర దాడి మరోవైపు సాగుతున్న ఈ కాలంలో మరి ఆయన తీర్పుల పరంగానూ న్యాయ వ్యవస్థ నిర్వహణ పరంగానూ ఎలాంటి అడుగులు పడేది చూడవలసిందే. చట్టం వ్యవస్థపై ఆధారపడిరదే గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదన్న కారల్‌మార్క్స్‌ మాట ప్రకారం వ్యక్తులను బట్టి మౌలిక మార్పులకు పెద్ద అవకాశం వుండకపోయినా న్యాయమూర్తులు చేయగలిగింది చాలానే వుంటుంది. మసకబారిన సుప్రీం ప్రతిష్ట రీత్యా కొత్త సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ఏం చేస్తారనేది రేపటి నుంచే చూడొచ్చు.
-సైమన్‌ గునపర్తి