సరికొత్త నవయుగం..యువతతోనే సాధ్యం
ఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టనికోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన దేశానికి ఇదే అతిపెద్ద వనరు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంతా యువతపైనే’ అని స్వామి వివేకానంద అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి.
మానవ సమాజం నిరంతరం ప్రవహించే జీవనది. ఆదిమవ్యవస్థ నుంచి ఆధునిక సోషలిస్టు సమాజం వరకూ వివిధ దశలుగా సాగుతూనే వుంది. వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, మానవుడు కొనసాగుతూనే వుంటాడు. మానవజాతికి సుదీర్ఘ చరిత్ర వుంది. పుట్టింది మొదలు చనిపోయే వరకూ మనిషి నిరంతరం పరిణామం చెందుతూనే వుంటాడు. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య మార్పు జరుగుతూ వుంటుంది. ముందు తరాలకన్నా తర్వాతి తరాలు మరొక అడుగు ముందుకేస్తుంటాయి. ఈ క్రమంలో పాత విలువలు, సాంప్రదా యాలను దాటుకొని, కొత్తదనం వైపు యువత పరుగులు పెడుతుంది. ఈ మార్పు కాల ప్రవాహంలో ఒక భాగం. ఏ విలువా స్థిరంగా పాతుకొని వుండదు. అయితే, ఈ మార్పును అర్థం చేసుకోవడానికి చారిత్రక పరిశీలన, శాస్త్రీయ దృష్టి, సామాజిక దృక్పథం అవసరం. సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మనిషి జీవితం ఐదు దశలుగా సాగుతుంది. ఆ ఐదు దశల్లో అంత్యంత విలువైనది యవ్వనదశ. 15-35 ఏళ్ల మధ్య వయస్సుగల వారిని యువజనులుగా పరిగణిస్తారు. ఇది చురుగ్గా,సృజనాత్మకంగా వుండే దశ.వర్గ,వర్ణ,లింగ భేదం లేకుండా, పేదలు, ధనవంతులన్న తేడా లేకుండా వీరందరూ ఒక సాంఘిక సమూహం. ఇంటిలోనైనా, వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం.సందడికైనా,సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగ. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగ.ఎక్కడైనా,ఎప్పుడైనా దేన్నయినా శోధించి..సాధించి, అధిగమించి.. అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యమూ,సహకారమూ, లక్ష్యమూ జోడిరచగలిగితే- ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.అదేసమయంలో అలా ‘పట్టించుకోనివ్వని’ విధంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలూ స్వారీ చేస్తుంటాయి. ‘ఇవాళ్టి యువతను బట్టే.. రేపటి భవిష్యత్తు ఉంటుంది’ అంటారు విల్లీ స్టార్గెల్. ‘నేటి బాలలే రేపటి పౌరులు’గా, దేశభవితకు పునాదిరాళ్లుగా ఎదగాలంటే ఎలాంటి యువతరం ఈ దేశానికి అవసరం? నేటి యువతరం ఎలా ఎదుగుతోంది? అన్నది పరిశీలించాల్సిన అవసరం వుంది.
మనం ఎక్కడున్నాం.. అంటే?..
చరిత్రలో అయినా, సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయ వంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం. అందుకనే వందేళ్ల క్రితం వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొలిపే ఉద్యమం చేపట్టాడు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించ వొచ్చని స్పష్టం చేశాడు. ‘ప్రశ్న ఆయుధం కావాలి. ప్రతి దానికీ తలూపటం కాదు, తర్కించాలి. హేతు బద్ధంగా లేని దేనినీ నమ్మక్కర్లేదు’ అని చాటిచెప్పాడు. కానీ, ఇన్నేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూస్తే.. మనం ఎక్కడ ఉన్నాం? ప్రపంచ దేశాలన్నింటి కన్నా అత్యధిక యువ జనాభా వున్న దేశం భారత్. ప్రపంచంలో 180 కోట్ల యువజనులు ఉంటే- అందులో 28 శాతం మన యువతే! మన దేశంలో ఇప్పుడు సగటు వయసు 29 ఏళ్లు. అంటే భారత్ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. మరి వుండాల్సినంత ఉత్తేజంతో.. ఉత్సాహాలతో మన యువతరం ఉందా? అంటే ప్రశ్నార్థకమే. అధికారిక లెక్క ప్రకారం- దేశంలోని 30 శాతం మంది యువతకు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ లేదు. ఈ విషయంలో మనం శ్రీలంక, నేపాల్ కన్నా వెనకబడి వున్నాం. సంఖ్య రీత్యా ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో వున్న మనం.. ఆ యువశక్తిని పనికి ఉపయోగించుకోవటంలో 103వ స్థానం. యువతరం అంటే కేవలం ఓట్లు కాదు, వనరులు కూడా. ఫలితమూ, ప్రయోజనమూ, ఉత్పాదకత ఉన్న రంగాల్లో యువత నిమగమై ఉండాలన్న మన స్వాతం త్య్రోద్యమ స్ఫూర్తి.. ఆచరణలో అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చదువులు, సాంకేతికత పెరిగేకొద్దీ ఉత్పాదక రంగాల్లో యువత భాగస్వాములు కావాలి. కానీ, నేడు అందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకొని అజ్ఞానపు సామ్రాజ్యం పెచ్చరిల్లుతోంది. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై..’ విలసిల్లాలని అభిలషించిన గురజాడ వంటి మహాకవుల మాట ఇప్పుడు..కుల,మత,ప్రాంత విభేదాల దొంతర్ల మోతలో పొల్లుపోతోంది. యువశక్తి దేశ సర్వతోముఖాభివృద్ధికి, శాస్త్రీయ పురోగమ నానికి, సమభావన, సౌభ్రాతృత్వం విలసిల్లే దిశగా దోహదపడాలి.‘ఓ తరం గొప్పదవు తుంది. అది మీ తరమే కావొచ్చు. మీ గొప్ప దనాన్ని వికసింపనివ్వండి’ అంటారు నెల్సన్ మండేలా. నవీన పథంలోకి దేశాన్ని మళ్లిం చటానికి ఉపయోగపడాలి. అది ఈ తరమే కావొచ్చు.
ఉపాధి.. ఉద్యమాలు..
యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి రథ చక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమౌతుందన్నది నిష్టురసత్యం. దేశంలో దాదాపు 16శాతం నిరుద్యోగం ఉంది. సామర్థ్యం ఉన్నప్పటికీ చదువుకు తగ్గ ఉద్యోగాలులేక నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. పెద్దపెద్ద ప్యాకేజీల గురిం చి వార్తలు వస్తున్నా.. నిజానికి అలాంటి వేత నాలు పొందుతున్న వారి సంఖ్య మూడు శాతానికి మించిలేదు. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న సాఫ్ట్‌వేర్ వంటి రంగా ల్లో పనిఒత్తిడి, పనిగంటలు దారుణంగా ఉం టున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో, వచ్చే వేతనంలో ఎంత కోత పడుతుందో అర్థంకాక సీనియర్లను సైతం భయం వెంటాడు తోంది. ఇలాంటి సమస్యలపై 150ఏళ్ల క్రితమే సాధారణ కార్మికులు సంఘటితమై పోరాడారు. చాలా సదుపాయాలు సాధించు కున్నారు. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను రాజ్యం నియంతృత్వంగా అణచివేస్తోంది. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ మరింత పెరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికా, ఫ్రాన్స్,ఐరోపా దేశాల్లోని యువత తమ హక్కుల కోసం రోడ్లమీదకి వస్తున్నారు. నిరస నల ప్రవాహమవుతున్నారు. ‘యువతరం శిరమెత్తితే..నవతరం గళమిప్పితే/ లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా?’ అన్న కవి ఆశాభావం వృథా పోకుండా.. మన దేశం లోనూ నిరుద్యోగ యువత గళం విప్పాలి. దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి.
పెరుగుతున్న అసంతృప్తి
దేశ ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాల.. దశ, దిశలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. అటువంటి యువతను మతోన్మాదం వైపు, కులోన్మాదం వైపు.. ఉగ్రవాదం వైపు నడిపిస్తూ.. తప్పుడు వాగ్దానాలతో పాలక వర్గాలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. యువతరం శక్తిసామ ర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యువతరంలో పెరుగుతోన్న అసంతృప్తిని ఇటీవల ఒక మీడియా రిపోర్ట్ తెరపైకి తెచ్చింది.‘రాబోయే రోజుల్లో/ నెలల్లో పెద్ద ఎత్తున వచ్చే తిరుగుబాట్లలో మీరు చురుగ్గా పాల్గొంటారా..?’అనే ప్రశ్నను 35 దేశాల్లోని 18-34ఏళ్ల మధ్య వయస్కులైన సుమారు 5,80,000 మందిని అడిగితే.. ‘పాల్గొంటాం..!’ అని సగం మందికి పైగా చెప్పారట. దీన్నిబట్టి యువతలో ఎంత అసంతృప్తి దాగుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు మన దేశమేమీ అతీతం కాదు. చదవడానికి సీట్లు రాక,చేయడానికి ఉద్యోగం లేక రగిలిపోతున్న యువతరం పాలకవర్గాల కుటిలనీతిని గుర్తించాలి. ‘క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటారు గుర్రం జాషువ. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. యువశక్తి దేశాభ్యుదయానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. దేశం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భగత్‌సింగ్ లాంటి మహనీయుల త్యాగాలను అందుకోవాలి. స్వాతంత్య్రం కోసం వారు చిందించిన నెత్తుటి ధారలను గుండెలకు అదుముకోవాలి. మనకు కావాల్సింది కేవలం రాజకీయ స్వాతంత్య్రమే కాదు.. కోట్లాది భారతీయులు కలలుగన్న ఆర్థిక స్వాతంత్య్రం కూడా. కుల మతాల వివక్షలేని సామాజిక న్యాయం కావాలి. రైతన్నలు పస్తులుండని స్వర్ణయుగం రావాలి. వరకట్న దురాచారం, లైంగిక దాడులు, అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని సమసమాజం కావాలి. అలాంటి మరో ప్రపంచం.. సరికొత్త నవయుగం..యువతతోనే సాధ్యం.
పొంతనలేని మాటలు, చేతలు..
ఎన్నికల హామీలు, రాజకీయ పార్టీల ప్రచారాలలోని వాస్తవాలను యువత అవగతం చేసుకోవాలి. పొంతలేని, ఆచరణ సాధ్యంకాని వారి మాటలు, చేతలను అర్థం చేసుకోవాలి. వాస్తవాలను బేరీజు వేసుకోవాలి. మతము-కార్పొరేట్ల కలయిక దేశానికి హాని కరం. వారే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తు న్నారు. వీరి కబంధ హస్తాల్లో చిక్కుకొని దళిత, గిరిజన బలహీన వర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ వర్గాలకు చెందాల్సిన దేశ సంపదను, ప్రకృతి వనరులను ఒకరిద్దరికే దోచిపెడుతున్నారు. యువశక్తిని నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయాలంటే విముఖత చూపేలా వారిని దూరం పెట్టేస్తున్నారు. మాకెందుకొచ్చిన రాజకీయాలు అని యువత అనుకోవడం వల్లనే అనర్హులు, సంఘవ్యతిరేక శక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. దేశాన్ని ప్రజలను దోచుకుంటున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను సమూలంగా నాశనం చేస్తున్నారు. అవినీతి భ్రష్ట రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే.. యువత రాజకీయా ల్లోకి రావాలి. రాజకీయాలకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నవ యవ్వనంతో తొణికిసలాడే సరికొత్త భారతాన్ని ఆవిష్కరించే శక్తి యువతరానికే వుంది. ఆ దిశగా యువతరం తమ మేధకు పదునుపెట్టాలి.
యువరక్తం.. కవితత్వం..
యువరక్తానికి.. విప్లవానికి, కవిత్వానికి.. గట్టి సంబంధం ఉంది. భగత్‌సింగ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, రుద్రమదేవి, రaాన్సీ లక్ష్మీబాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటివారు యువకులుగా వున్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని భగత్‌సింగ్ నినదించింది, దేశాన్ని కదిలిం చింది 23 ఏళ్ల యువకుడిగా ఉన్న ప్పుడే. అల్లూరి సీతారామరాజు ‘వందేమాతరం’ అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించింది 24 ఏళ్ల వయస్సుకే.‘శీతకాలం కోత పెట్టగ/ కొరడు కట్టీ/ ఆకలేసీ కేకలేశానే’ అనే కవితతో శ్రీశ్రీ ‘జయభేరి’ మోగించింది 23 ఏళ్ల వయస్సులోనే. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నా.. ఒక్క మంచి కవితా రాయలేదే’ అని మహాకవి జాన్‌మిల్టన్ మధనపడిరదీ లేలేత ప్రాయం లోనే. సాహిత్యంలో ‘సర్రియలిజం’ ప్రక్రియను ప్రవేశపెట్టిన రaంరaామారుత ఫ్రెంచ్ కవి ఆర్థర్ రాంబో తన టీనేజ్‌లోనే రాయవలసిం దంతా రాసేసి,20వ ఏట రిటైర్ అయి పోయాడు. 80ఏళ్ల వయస్సులో అమెరికా వెళ్ళిన ఇంగ్లీష్ కవి విలియమ్ వర్డ్స్‌వర్త్.. తన పద్యాలు చదువుతున్న కుర్రాళ్లను ఆపి, ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు.నా తొలిరోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అని సూచించాడట. టి.ఎస్. ఇలియట్ తన మాస్టర్ పీస్ అయిన ‘దివేస్ట్ ల్యాండ్’ ను, జాన్‌కీట్స్ తన అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసేశారు. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితి’నని శ్రీనాథుడే స్వయంగా రాసు కున్నాడు. ‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. దానికి కారణం యవ్వనంలో ఉండే దూకుడు,నిలదీత,ఆగ్రహం, తిరుగుబాటు- కవికి భావోద్వేగాల ఆవేశాన్నిస్తాయి. కవిత్వం నీటిబుగ్గలా ఉబుకుతుంది. ఆ స్వచ్ఛత దానికి సజీవత్వాన్నిస్తుంది.తెలుగులో భావ, అభ్యుద య, విప్లవ కవులు,ఆ తర్వాత స్త్రీవాద,దళిత, మైనారిటీ, బహుజన కవులంతా దాదాపుగా అయితే ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనప్రాయంలో ఉన్నప్పుడో రాసినవే ఎక్కువ.
పెరుగుతున్న నిరుద్యోగం..
నిరుద్యోగ యువత రోజురోజుకు పెరుగుతోంది. ఉపాధి కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది. మోడీ చెప్పిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. నల్లధనం బయటకు రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదు. విభజన హామీలు అమలు కాలేదు. కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు నిర్మించి వుంటే ఈపాటికి వేలమందికి ఉపాధి లభించి వుండేది. ఉద్యోగాల గురించి అడిగితే బజ్జీలు, పకోడీలు అమ్ముకోండంటూ అమిత్ షా యువతకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏ దేశంలోనైనా యువత యొక్క శక్తి సామర్థ్యాలు సక్రమంగా సరైన మార్గంలో ఉపయోగించుకుంటేనే ఆ దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది. గత 77ఏళ్ల స్వాతం త్య్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయి. దేశంలో గత 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. సిఎంఐఇ చెబుతున్న లెక్కల ప్రకారం..ఐదు కోట్ల మందికి తక్షణమే ఉపాధి కల్పించాలి. లేదంటే దేశం తీవ్ర సంక్షోభంలో పడుతుం దని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగింది. చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదు. ఇంజనీరింగ్ చదివిన వారిలో కేవలం 15 శాతం మందికి మాత్రమే వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తున్నాయి. పిహెచ్ డి, పీజీలు, బిటెక్ చదివినవారు ఉపాధి కోసం చిన్నచిన్న ఉద్యోగాలు చేసు కోవాల్సి వస్తోంది. మరికొందరు ఆటోలు నడుపుకునే పరిస్థితికి నెట్టబడ్డారు. ఇంకొం దరు నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్‌కు, నేరాలకు బానిసలవుతున్నారు. దేశానికి బలీయమైన శక్తిగా రూపొందాల్సిన యువతను ప్రభుత్వాలు నేరస్తులుగా,ఉగ్రవాదులుగా మారుస్తున్నది. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని, భవితకు బాటలు వేసుకునే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసలై పెడదోవ పడితే భవితకే నష్టం. వీరిలో కొందరు యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చు కొని కష్టపడుతున్నారు. మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు,సెల్‌ఫోన్లు,సోషల్ మీడియా,మద్యం,డ్రగ్స్ వంటి అలవాట్లకు బానిసలై విలువైన జీవితాన్ని పాడు చేసుకుం టున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసంప్రయత్నిస్తున్నారు.
ప్రకటనల ప్రభావం..
ఈ ఆధునిక యుగంలో వివిధ మాధ్యమాలో వస్తున్న ప్రకటనలు ముఖ్యంగా యువతను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఆయా ప్రకటన లలో కనిపించే సెలబ్రిటీలను గుడ్డిగా అనుకరిస్తూ తమ ఆరాధ్యదైవంగా అనుసరి స్తారు. ఈ సెలబ్రిటీల హెయిర్ స్టైల్ ఎలా వుంటుంది,వారు ఏ బ్రాండ్ దుస్తులు ధరిస్తా రు, ఏ బ్రాండ్ ఫెర్ఫ్యూమ్స్ వాడతారో.. వాటి నే తామూ వాడాలని కోరుకుంటారు. దీని కారణంగా మధ్యతరగతి ఆర్థిక సంక్షోభానికి గురవుతుంది. ప్రతి ఒక్కరూ వారు కోరుకునే అన్ని విలాసాలను కొనుగోలు చేయలేరు. కానీ, బ్రాండెడ్ బట్టలు, సౌకర్యాలను పొందాలన్న కోరిక యువతలో ఒత్తిడిని పెంచుతోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా..ఈ ఒత్తిడి వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే విధంగా వారిని ప్రేరేపిస్తుంది. వివిధ ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల ద్వారా ఆకర్షితులవు తున్నందున కొన్నిసార్లు ఈ యువత తమకు అక్కరలేని వస్తువులనూ పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు ఉద్యుక్తులవుతారు. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు ఇలాంటి అనేక వ్యూహాలను అనుసరిస్తుంటారు. యువత తమ తొందర పాటుతోనో, ఆయావస్తువులపై వున్న మోజు తోనో కంపెనీల వ్యూహంలో చిక్కుకుంటు న్నారు. వీటితో పాటు సినిమాలు, డ్రగ్స్ కూడా యువతపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. నేటి యువత తమ ఆలోచనా శక్తికి పదును పెట్టాలి. వీటి నుంచి బయటపడాలి.
సమానత్వం దిశగా..
స్త్రీ-పురుష సమానత్వం సాధించే దిశగా గతంలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈపాటి మార్పు. ఈ ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుంది. కట్నాలు తీసుకోని యువకులు ఈ మధ్య కాలంలో చాలా పెరిగారు. కానీ, ఆ సంఖ్య ఇప్పటికీ అత్యల్పమే. దీనిపట్ల యువతలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుంది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, వ్యవహరించడం బాగా పెరగాలి. కానీ, ఈ కాలంలో సైన్స్‌ని, చాదస్తాన్ని కలగలిపి మాట్లాడేవారు పెరిగారు. మనం గొప్పవాళ్లం అని చెప్పుకోవడానికి మన గతమంతా ఘనమైనదేనని జబ్బలు చరుచుకోవడం మంచిది కాదు. తార్కిక దృష్టితో చూస్తే.. మంచి చెడ్డలు రెండూ విడివిడిగా బోధపడ తాయి. గతంలో మంచి కొంచెమేనని, రానున్నది మంచికాలనమని వందేళ్లనాడే ఉద్ఘాటించాడు మహాకవి గురజాడ. వాస్తు, జ్యోతిష్యం వంటివి ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో ప్రజలకు కొంత ఉపయోగడ్డ మాట నిజమే. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతకు మించి అభివృద్ధి చెందింది. ఇంకా వాటిని పట్టుకొని వేలాడ్డంలో ఔచిత్యం లేదు. కొందరు పాత నమ్మకాల్లో ఏదో అంతరార్థం వుందంటూ.. సైన్సుని గుప్పించి చెబుతూ వుంటారు కుహనావాదులు.
నాడే అధికం..
ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా, అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా చెప్పబడుతోన్న మనదేశంలోని చట్టసభల్లో వారికెంత ప్రాధాన్యతనిస్తున్నామో ఆలోచిం చాల్సిన తరుణం ఇది. 2011జనాభా లెక్కల ప్రకారం..66% జనాభా 35ఏళ్లలోపు వారే ఉన్నారు. లోక్‌సభలో ఈ యువతరం శాతాన్ని చూస్తే నిరాశే కలుగుతుంది. మొత్తం 545 మంది సభ్యులున్న ప్రస్తుత 17వ లోక్‌సభలో 35 ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 21 మాత్రమే. పేదరికం విలయ తాండవం చేస్తున్న..అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఏర్పడిన తొలి లోక్‌సభ (1952)లో యువ సభ్యుల సంఖ్య 82. ఇప్పటివరకు ఆ రికార్డు అలాగే వుంది. భారత్ ప్రపంచ యువ దేశంగా ఆవిర్భవిం చిన ఈ సమయంలోనే..35 ఏళ్లలోపు సభ్యుల సంఖ్య ఎన్నడూ లేనంతగా 21కి పడిపో యింది. తొలి లోక్‌సభలో సభ్యుల సగటు వయసు 46.5 కాగా, ప్రస్తుత లోక్‌సభలో సగటు వయసు 55 ఏళ్లు. అయితే, మహిళల వాటా పెరిగింది. యువతరం పెరగకున్నా సభలో మహిళల వాటా పెరగడం సంతోషిం చాల్సిన అంశం. తొలి సభలో 22 మంది (4.41%) మహిళా ఎంపీలుండగా..ప్రస్తుత సభలో వారి సంఖ్య 78 (14.36%)గా ఉంది. ఇంత మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏ సభలోనూ లేరు. అయితే, మహిళలు బయటకు రావడానికి అనేక ఆంక్షలున్న రోజుల్లో రాజకీయాల్లోకి ఆమాత్రమైనా వచ్చారంటే.. ఆ సంఖ్య తక్కువేమీ కాదు.
సమాజ సేవలో ….
లే.. మేలుకో.. లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకు అన్నారు స్వామి వివేకానంద. వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నాడాయన. జాతి నిర్మాణ క్రతువులో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం. దేశ సంపదను పెంచి పోషించే చోదక శక్తి యువతే. మేము సైతం సమా జానికి సేవ చేయాలనే భావన యువతలో అధికమవుతున్నది. కొంతమంది ఇప్పటికే వివిధ సంఘాలు స్థాపించి, లేదా గ్రామాల్లో ఒక్కటిగా అయి తమ సమీపంలో ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సరదాలు.. షాపింగ్ సినిమా.. యువత అంటే ఇంతేనా? కాదు.. అంతకుమించి అని నిరూపి స్తున్నారు ఈ యువకులు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించి పెద్ద మనసు చాటు కుంటున్నారు. మానవత్వం మురిసేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.– (రాజాబాబు కంచర్ల)