సరళీకృత ఆర్ధిక విధానాలపై ఎగిసిన కెరటం!
పద్దెనిమిదోసారి! ఇరవైకోట్లమంది! సరళీకృత ఆర్థిక విధా నాలపై ఉప్పెనలా ఎగిసిపడ్డారు. అనేక రాష్ట్రాలలో లక్షల్లో ప్రైవేటు పారిశ్రామిక వాడల కార్మికుల సమ్మెతో పారిశ్రామిక వాడలు బోసి పోయినాయి. ఇటీవలి కాలంలో పెరిగిన మిలిటెన్సీతో లాంగ్‌మార్చ్‌లు జరుపుతున్న రైతన్నలు వ్యవసాయ కార్మికుల్తో కల్సి అనేక రాష్ట్రాల్లో గ్రామసీమలు బంద్ పెట్టారు. గతంలో జరిగిన ఏసమ్మెలకన్నా ఈ 18వ సమ్మెలో అనేక కీలక రంగాలు మూతబడ్డాయి. అనేక రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి, దాని రవాణా దెబ్బతిన్నది. 70-75 శాతం బొగ్గు పరిశ్రమలో సమ్మె జరిగింది. 30లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు కార్మికులు సుమారు3.5 కోట్ల మందిపాల్గొన్నారు. కేరళ,బీహార్, ఒడిసా, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలు ఈకార్మికుల సమ్మెతో సంపూర్ణంగా బంద్ కాగా బెంగాల్లో 80శాతం జయప్రద మైంది. కర్నాటక,పంజాబ్,మహారాష్ట్ర,జార్ఖాండ్లలో అనేక జిల్లాల్లో ట్రాన్స్పోర్ట్ సమ్మె పెద్ద ప్రభావం చూపింది. పోర్టులలో సమ్మె పాక్షికంగా జరిగింది. కానీ హమాలీల సమ్మెతో పారదీప్, ట్యూటికోరిన్, కోల్‌కతా, కొచ్చిన్, హాల్దియా విశాఖల్లో సరుకు రవాణా నిలిచిపోయింది. విశాఖ, సేలం, భద్రావతి ఉక్కు కర్మాగారాల్లో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. రూర్కెలాస్టీల్ ప్లాంట్ శాశ్వత కార్మికులు సమ్మె చేసి, గేట్ల వద్ద పికెటింగ్ చేశారు. సుమారు కోటి మంది స్కీం వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ నాడీ మండలం స్తంభించింది. ఇన్సూరెన్స్ సేవలు పూర్తిగా నిలిచిపోగా, రిజర్వుబ్యాంకుతోపాటు లక్షలాది గ్రామీణ బ్యాం కులు, సహకార బ్యాంకులు,నాబార్డ్,అనేక జాతీయ బ్యాంకులు సంపూర్ణంగా మూతబడ్డాయి. 13 లక్షల మంది పోస్టల్, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లు సంపూర్ణంగా నిలిచిపోగా ఆడిట్ అండ్ అకౌంట్స్, సివిల్ అకౌంట్స్,అటామిక్ ఎనర్జీవంటి మరో30శాఖల్లో సమ్మె జరిగింది. అసంఘటితరంగాలైన నిర్మాణ కార్మికులు, హమాలీలు మొదలగు వారు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.
8వతేదీ21.33 లక్షల మంది, 9వ తేది 19 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్ చుట్టూ వున్న సంగారెడ్డి, మేడ్చెల్, రంగారెడ్డి, భువనగిరి జిల్లాలలోని పారిశ్రామిక వాడలు పెద్దఎత్తున మూతబడ్డాయి. క్ఱెసీఆర్ ఎన్నిమంత్రాలు పెట్టినా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నిజామాబాద్,ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం (14జిల్లాల్లో) అంగన్వాడీ, ఆషా వర్కర్లు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రమంతా మధ్యాహ్న భోజన మహిళలు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగం లో సమ్మె బలహీనంగా జరిగింది. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మి కులు 3 వేల మంది సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణిలో 41శాతం మంది, బీడీఎల్‌లో 40శాతం మంది మొదటిరోజు సమ్మెలో పాల్గొన్నారు. బీడీకార్మికులు సంపూర్ణంగా రెండు రోజులూ సమ్మెలో వున్నారు. ఈరెండు రోజుల సమ్మెట్రేడ్ యూనియన్ల బలంతో పాటు బలహీనతలనూ, ఐక్యట్రేడ్ యూనియన్ ఉద్యమ లోపాలను బహిర్గతం చేసింది. ఆత్మవిమర్శనా పూర్వకంగా వాటిని అన్ని స్థాయిల్లో పరిశీలిం చుకోవాలి. రాష్ట్రంలో ఈసమ్మెకు ఒక పరిమితి ఉంది. ఈసారి సమ్మె ఏర్పాట్లకు సరిగ్గా నెల రోజులు మాత్రమే మిగిలింది. రెండు రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం సాగిన ఎన్నికల పోరాటం మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుతో కొన్ని సంఘాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏమైనా, అన్నిస్థాయిల్లోని సీఐటీయూ కార్యకర్తలు ఈఅతిపెద్ద వర్గ పోరాటంలో శక్తి వంచన లేకుండాకృషి చేశారు. తగుసమయం ఉండి ఉంటే సంస్థల్లో కృషిని మరింత సమగ్రంగా ప్లాన్ చేసి వుంటే ఇంకా మెరుగ్గా సమ్మె రాష్ట్రంలో జరిగి వుండేది.
ఈ సమ్మె ఒకసైద్ధాంతిక పోరాటం
ఏదో ఒక సమ్మె పిలుపు వచ్చింది, దాన్ని జయప్రదం చేయడానికి కృషి చేయాలన్న దృక్పథం మాత్రమే కలిగి ఉండటం తప్పు కొన్ని సంఘాల్లోకన్పడుతోంది. ఇది నయాఉదారవాద విధానా లపై ఎక్కుపెట్టిన ‘పాశుపతాస్త్రం’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ ఆర్థిక విధానాలపై అమీతుమీ తేల్చుకునే ప్రయత్నం. ఒకరకంగా చెప్పాలంటే ఇదిఅంబానీ, అదానీల అనుకూల విధానాలను భౌతి కంగానే కాక, సైద్ధాంతికంగా కూడా ఎదుద్కొనే ప్రయత్నం. మన ప్రభుత్వ రంగ పరిశ్రమలను అక్షరాల తినేస్తున్న బహుళజాతి కంపెనీ లపై దండెత్తిన పోరాటం. 70వ దశకంలో ఇందిరాగాంధీ బిహెచ్‌ఇ ఎల్ పై ఉసికొల్పిన సీమెన్స్ నుండి తాజాగా మోడీ ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ను మింగేస్తున్న రాఫెల్ వరకు ఈ కోవలోవే. డీపీపీ పేర (డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ) డిఫెన్స్ రంగంలోకి అడ్డగోలుగా ప్రైవేటు వారిని అనుమతిస్తున్నారు. ఇది బీఈఎల్, బీడీఎల్, మిధానీ వంటి పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడ్తున్నది. మోడీ ప్రభుత్వ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ట రాఫెల్ ఒప్పందం. ఇది హిందూస్థాన్ ఎయిరో నాటిక్స్‌ను ముంచుతుందని దేశమంతా గగ్గోలు పెడ్తున్నది. ఇంతకుముందే చెప్పినట్టు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద యుద్ధ పరికరాల తయారీకి 200 లైసెన్స్‌లు ప్రైవేటు వారికి కట్ట బెట్టింది మోడీ సర్కార్. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్ఏఎల్ను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను, బీడీఎల్‌ను ఎండబెట్టి ప్రైవేటు వారికి ఆర్డర్స్ ఇవ్వడమే మేక్ ఇన్ ఇండియా నేమో! ఇది బీఈఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను, డీఆర్డీఓను ముంచుతున్నది. ఈ విషయాలు మన ట్రేడ్ యూనియన్ కార్యకర్తల రోజువారి పనిలో అంతర్భాగంగా వున్నాయా? లేదా? పరిశీలించుకోవాలి. అంటే కార్మి కుల కొచ్చే సమస్యలు-ప్రమోషన్స్, ఇన్సెంటివ్‌లు రావడం/ రాకపో వడం వంటి వాటి వెనుక ప్రభుత్వ విధానాల లోతు పాతులు కార్మికుల ముందుచగల్గుతున్నారా?లేదా?అనేది ముఖ్యమైన విషయం. దీన్లో కీలకమైనది పెరుగుతున్న కాంట్రాక్టీకరణను అడ్డుకునేందుకు లేదా ఆ కాంట్రాక్టు కార్మికుల బాగోగులపై ప్రభుత్వరంగ యూనియన్లు ఏమేరకు, ఎటువంటి కృషి చేస్తున్నాయనేది కూడా మరో కీలక విషయం. ‘ఎవడెటుపోతే నాకేం?!చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష!’ అనేది సంస్కరణ వాద సంఘాల వాదన. ఈజబ్బు వదిలించకుండా కార్మిక వర్గం విప్లవకర పాత్ర పోషించజాలదు. ప్రభుత్వ విధానాలను అర్ధం చేసుకోవడం,వాటిని రోజు వారి కార్మికుల సమస్యలతో లింక్ చేయడం ప్రైవేటు రంగమైనా, స్కీంవర్కర్ల ఉద్యమమైనా,ఆటో,హమాలీ,భవన నిర్మాణరంగమైనా,అన్నింటికీ వర్తించేదే!
సంస్కరణ వాదం నుంచి బయట పడాలి
అది1998 ఏప్రిల్‌లో విద్యుత్ రంగంలోని 1104 ఆఫీసు లో1104 కార్యకర్తలకు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూని యన్ కార్యకర్తలకు విద్యుత్‌రంగ ఆఫీసర్ల కాన్ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ అశోక్‌రావు ఏపీ విద్యుత్ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిం చండని చేసిన ఉద్భోదలో భాగం. ‘మేంసమ్మె చేస్తే ఆగుతుందా’ అన్న చొప్పదంటు ప్రశ్నలకు ‘కనీసం స్పీడ్ బ్రేకర్లు పెట్టగలిగితే ప్రభు త్వాల వేగాన్ని తగ్గించగలుగుతార’ని అశోక్ రావు గారు వివరించారు. 2000 సంపప ఆగస్టు టారిఫ్ వ్యతిరేక ఉద్యమం ప్రపంచ బ్యాంకు ఎజెండానే ధ్వంసం చేసింది. డిస్కాంల ప్రైవేటీకరణకు పెట్టిన ముహూ ర్తాలు నాశనం అయ్యాయి. ఇరవయ్యేళ్ళు గడిచినా డిస్కాంల ప్రైవేటీక రణకు ఏప్రభుత్వమూ సాహసం చేయట్లేదు అటు ఆంధ్రలో,ఇటు తెలంగాణాలో. ఇదికార్మికుల,సామాన్య ప్రజలవిజయం.1978లో జనతాపార్టీ ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాల బిల్లు తెచ్చినప్పుడు సమైక్య ప్రతిఘటనతో తిప్పికొట్టింది కార్మికవర్గమే. 1988లో మళ్ళీ రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఒకప్రయత్నం చేస్తే ప్రతిఘటించింది కార్మిక వర్గమే. 1991లో పీవీ – మన్మోహన్‌ల శకం ప్రారంభమైనప్పట్నించీ కార్మిక చట్టాల సవరణకు పెట్టుబడిదారుల మార్గం సుగమం చేసేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నది కార్మికవర్గమే. ఈపాతికేండ్లలో ఈవిధానాలు ముదిరిపాకానపడ్డాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. గత రెండేండ్లలో రైతాంగ ప్రతిఘటన పెరిగింది. నీటి సరఫరాకోసం,విద్యుత్‌ఛార్జీలు తగ్గించడం కోసం రాజస్థాన్ రైతాం గం, పంటరుణాలరద్దు, గిట్టుబాటుధర కోసం మధ్యప్రదేశ్ రైతాంగం, భూములను గుంజుకుని తమని నిర్వాసితులను చేయొద్దనీ, గిరిజన రైతాంగానికి పట్టాలివ్వాలనీ మహారాష్ట్ర రైతాంగం పెద్దపెద్ద ఆందోళ నలు చేసింది. ఆయా రాష్ట్రాల పాలక బీజేపీ ప్రభుత్వాల కూల్చివేతలో ముఖ్య భూమిక పోషించింది.
ఇవన్నీ సరళీకృత ఆర్థికవిధానాలకు బ్రేకు వేయడమే కదా. మనంబ్రేకులేస్తూంటే వాళ్ళు ‘వాషింగ్టన్ కన్సెన్సస్’ (వాషింగ్టన్ ఏకాభిప్రాయం) అంటున్నారు. అంటే పార్టీలు మారినా, నాయకులు మారినా అవే విధానాలు కొనసాగుతున్నాయి. అందుకే ‘ప్రజల జీవన విధానానికీ, జీవితాలకూ సంబంధించిన అంశాలపై వారిని సమీకరించాలి. వారికి ప్రధాన శత్రువులెవరో అర్ధం చేయిం చడమే మన ముందున్న కర్తవ్యం. అది మాత్రమే ఉదారవాద విధా నాలను వెనక్కితిప్పికొట్టగలదు. మనం మూలలపై గురి ఎక్కుపెట్టాలి. అప్రధాన విషయాలను పట్టించుకోవద్దు. అప్పుడు మాత్రమే పెట్టుబడి దార్ల, భూస్వాముల, వారి రాజకీయ ప్రతినిధుల నుండి దృష్టి మరల్చ కుండా చేయగలం. ప్రజల్ని వర్గేతర సమస్యలవైపు వెళ్ళకుండా చూడ గలం’ అని రాశారు. 18 దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలు ఐక్యంగా నడిపిన సీఐటీయూ అనుభవముంది. ప్రభుత్వాలు మారుతున్నా అవే సరళీక ృత ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయన్న సీఐటీయూ 14వ అఖిల భారత మహాసభ (కన్నూర్) విశ్లేషణ ఉంది. కార్మికవర్గానికి, సామాన్య ప్రజలకు విధ్వంసకరమైన విధానాలను మోసుకొచ్చినా ఆపలేకపోయామన్న బాధఉంది. కార్మికుల సమస్యలకు మూల కారణా లను, వాటి వెనుకున్న రాజకీయాలను అర్ధం చేయించడంలో విఫల మౌతున్నామన్న ఆత్మవిమర్శ ఉంది.
‘ ’కార్మికోద్యమంలో ఈఅనైక్యత ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. సంస్కరణవాద సంఘాల విషపూరితప్రచారం, ప్రభావాల వల్లనే ఇది ప్రాప్తించింది. ఇది భారతకార్మికవర్గం యొక్క వర్గచైతన్యాన్ని తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. దీనివల్ల కార్మికుల వర్గ చైతన్యం మసకబారి పోయింది. ఫలితంగా వర్గశత్రువులపై చేయాల్సిన నిర్ణయాత్మక పోరాటం పలచబడిరది. కార్మికవర్గం యొక్క ప్రజాతంత్ర బాధ్యతలను, ముఖ్యంగా రైతాంగం యెడల తన బాధ్యతలను అర్ధం చేసుకోకుండా అడ్డుకున్నది. కార్మికోద్యమం సంకుచిత, ఆర్థికవాదంతో నిండిపోయి నా ఫ్యాక్టరీ, నారంగం అన్న మనస్తత్వం పెరిగింది’’-1971 సెప్టెం బర్ ‘వర్కింగ్‌క్లాస్’ పత్రిక సంపాదకీయంలోఈ హెచ్చరిక చేశారు. సమాజమార్పు కోసం కృషి చేసే బాధ్యత కార్మికో ద్యమ కార్యకర్తలది. దానికి అడ్డుగా నిలిచిన సరళీకృత ఆర్థిక విధానా లను ఓడిరచడం ప్రతికార్మికవర్గం బాధ్యత. – ఆర్.సుధాభాస్కర్