సమక్క సారలమ్మ పూర్వ చరిత్ర
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు కారకులైన సమ్మక్క సారక్కలు గిరిజన వీర వనితలుగా పూజలు అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే! కానీ వారి పుట్టుక జీవనం మనుగడకు సంబంధించిన చారిత్రక ఆధారాలు శూన్యం. కేవలం పుక్కిట పురాణంలా, జానపదుల శైలిలో మౌఖిక సాహిత్యమై గిరిజనుల శాసనాలుగా చెప్పబడే ‘‘పడిగె కథలు’’ ద్వారా మాత్రమే మనకు సమ్మక్క సారక్కల సమాచారం అరకొరగా లభ్యం అవుతుంది. ఇలాంటి సందీప్తి సమయంలో మేడారం గ్రామంకు సమీపానగల కామారం గిరిజన గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పరిశోధక విద్యార్థి బీరసం ఉండాల యూత్ నిర్వాకుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నిత్యసంచారి అయినా మైపతి అరుణ్ కుమార్ రాసిన ‘‘సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర’’ పుస్తకం, అరుణ్ తనదైన పరిశోధకుశ శైలిలో తన క్షేత్ర పర్యటల ద్వారా స్థానిక పెద్దల ద్వారా తెలుసుకున్న విలువైన చారిత్రక సమాచారాల సమ్మేళనంగా దీన్ని వ్రాశాడు.ఈ క్షేత్ర పర్యటనల సమాహారం గతంలో గల సమ్మక్క చరిత్రకు నూతనత్వం ఆపాదిస్తుంది, ఇక ఈ పూర్వ చరిత్ర విశేషాల్లోకివెళితే……!! ఇప్పటివరకు మనకు తెలిసిన సమ్మక్క సారక్క కథకు పూర్తి భిన్నంగా వాస్తవానికి కాస్త చేరువులో చెప్పబడిరది ఈ పూర్వ చరిత్ర, పరిశోధకరచయిత మైపతి అరుణ్ కుమార్ ఈ చరిత్ర వివరణ కోసం కేవలం ‘‘పడిగలు’’ మీదే ఆధారపడకుండా దానికి ఆధారంగా స్థానికులచే చెప్పబడే వ్యక్తులు, నివసించే ప్రాంతాలకు, వెళ్లి అక్కడి వారి అనుభవాలు సేకరించి ఈ కథనానికి మరింత ప్రామాణికత చేకూర్చారు. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ రాష్ట్ర పరిధిలో గల బీజాపూర్ జిల్లాలోని అత్యంత దట్టమైన అడవిలో గల కాన్కనార్ గిరిజన గ్రామం వెళ్లి అక్కడి గ్రామస్తులను, పూజారులను సంప్రదించి సమ్మక్క వంశ పూర్వ చరిత్రను తెలుసుకు న్నారు మైపతి అరుణ్ పరిశోధక బృందం. ఈ క్రమంలో గోండ్వాన రాజ్య విస్తరణలో గిరిజనుల పాత్ర చెబుతూ సింధు నాగరి కతకు పూర్వమే గోండ్వానా రాజ్య నాగరికత వెళ్లి విరిసిందని పడగలపై గల అనేక ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశారు అరుణ్. ‘‘సమ్మక్క’’ కోయత్తూర్ సమాజంలో ఐదవ గట్టుకు చెందిన ‘‘రాయి బండాని రాజు ‘‘ వంశానికి చెందిన ఆడబిడ్డగా ‘‘బాండానిరాజు’’ పడిగలోని చిత్రలిపి విశ్లేషణ ద్వారా వివరించారు, ‘‘రాయి బండాన్నిరాజు’’కు చందంబోయి రాలు, కనకంబోయి రాలు,అని ఇద్దరు భార్యలు. గోండ్వాన రాజ్యపు రాజైన ‘‘బేరంబోయిన రాజు’’కు ఏడుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, ఆఇద్దరు కూతుళ్లే చందం బోయిరాలు,కనకం బోయిరాలు,వీరు ఇద్దరు ఇష్టపడి రాయి బండాన్ని రాజును పెళ్ళాడ తారు,కానీ పెద్ద భార్యకు సంతానం కలగలేదు శివపార్వతులను పూజించగా వారి వరప్ర సాదంగా అడవిలో మాఘ పౌర్ణమి రోజున బండాని రాజుకు అతని పెద్ద భార్య చందం బోయిరాలకు కంక వనములో ఒక పసిపాప కనిపిస్తుంది అది శివపార్వతుల ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువస్తారు ఆ పాపే సమ్మక్క. అంతకుముందే గర్భవతి అయిన చిన్న భార్య కనకం బోయిన రాలు, రెండు రోజుల తర్వాత ఆడపిల్లను ప్రసవిస్తుంది ఆమెకు నాగులమ్మ అనే పేరు పెట్టుకుంటారు. ఐదవ గట్టుకు చెందిన ‘‘బండాని’’ వంశములో తొలిచూరు ఆడబిడ్డ సమ్మక్క, కోయ సాంప్రదాయం ప్రకారం మొదటి ఆడబిడ్డను వేల్పుగా కొలుస్తారు అందుకే సమ్మక్క ఇలవేల్పుగా దేవర అయింది. సమ్మక్క- నాగులమ్మలు పెరిగి పెద్దయ్యాక అదే గోండ్వాన రాజ్యంలో గల బీజాపూర్ దగ్గరి కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగవ గట్టువాడైన ‘‘పగిడిద్ద రాజు’’కు పెద్ద కూతురైన సమ్మక్క నిచ్చి పెళ్లి నిశ్చయించుకుంటాడు రాయిబండని రాజు, తన ఇద్దరు భార్యలు, చిన్న కూతురు నాగులమ్మతో కలిసి అతడిని చూసి వచ్చి నిర్ణయం చెప్తాడు సమ్మక్కకు. కానీ చెల్లెలు మాయమాటలు నమ్మి పగిడిద్ద రాజు వికార రూపం కలవాడు అనుకోని ఆ పెళ్ళికి ఇష్టపడదు సమ్మక్క. ఆడిన మాట తప్పకుండా అన్న ముహూర్తానికి తన చిన్న కూతురు నాగులమ్మ తో పైడిద్దరాజు పెళ్లి నిశ్చయించి మాఘ పౌర్ణమి ముందే తన కుటుంబం చుట్టాలతో కలిసి వెళ్లి..నాటి మధ్యప్రదేశ్ లోని కొత్తపల్లి గ్రామ సమీపాన గల ‘‘పాలెం’’ గ్రామంలో మండపం కట్టించి పెళ్లికి ఏర్పాటు చేసుకుంటాడు బండాని రాజు, అక్కడి చెరువును ‘‘కాముని చెరువు’’ అంటారు ఇవి ఇప్పటికీ ఉన్నాయి.తీరా పెళ్లి సమయంలో సమ్మక్క అందగాడైన పైగిడిద్ద రాజును చూసి తన చెల్లెలు నాగులమ్మ చేసిన మోసానికి ఆగ్రహించి పెళ్లి మండపంలోనే చెల్లిపై దాడి చేసింది, ఆ పెనుగులాటలో సమ్మక్క చేతికడెం పగిడిద్దరాజు కంటికి తగిలి కన్ను కోల్పోయాడు, ఇక చేసేదేమీ లేక తను అక్కా చెల్లెలు ఇద్దరిని అదే మండపంలో పెళ్లాడుతాడు. కానీ చివరికి చెల్లెలు పోరు పడలేక తన పుట్టింటికి వచ్చేసింది చంద్రవంశీయుల సమ్మక్క.తల వారితో ఉండి పోయి ఆ ఇంటి ఇలవేల్పుగా మిగిలిపోయింది, అలా చందా వంశీయులు అనేక తరాలుగా సమ్మక్క ను అనంతరం ఆమె వస్తువులను, పూజించుకుంటూ వారి వారి జీవితాలు సాగించుకుంటున్న క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలతో చందా వంశీలు కుటుంబాలుగా విడిపోయి దూర ప్రాంతాలకు, బ్రతుకు తెరువు కోసం వలస పోయారు. అలా వలస వచ్చిన వారిలో ఒక చందా కుటుంబం వారు పడమరదేశంలోని అడవిలో బాయక్క అనే ఆమె పేరుతో ఒక గూడెం నిర్మించుకొని ‘‘బయ్యక్కపేట’’అని పేరు పెట్టుకున్నారు, ఆ గ్రామం ప్రస్తుతం మేడారం సమీపంలో ఉంది. బయ్యక్కపేట చందా వంశీలే మొదట రెండేళ్ళ కోసారి మాఘ పున్నమికి ‘‘సమ్మక్క జాతర’’ చేసేవారు, కానీ కాలక్రమంలో కరువు కాటకాలలో డబ్బులు లేక పక్క గూడెం అయిన మేడారం గిరిజను లకు జాతర బాధ్యతలు అప్పగించారు, అలా మేడారంకు సమ్మక్క జాతర ప్రవేశించింది. అంటూ చిత్రలిపి ఆధారంగా సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర పుస్తక రూపం చేశారు మైపతి అరుణ్ కుమార్. ఈ చరిత్రకు అంతర్గతంగా గోండ్వానా రాజ్య ఆనవాళ్ళ గురించి ప్రాంతాలవారీగా ఆధారాలు చూపుతూ సింధు నాగరికతకు పూర్వమే ఆదివాసుల ‘‘గోండ్వానా నాగరికత’’ ఉన్నదనే విషయం చరిత్రకారులు విస్మరించారని ఆదివాసులపై ఆర్యులు చేసిన అణిచివేతకు ఇదొక ఉదాహరణ అంటారు అరుణ్ కుమార్. అంతేకాక ఈ పరిశీలన గ్రంథంలో కాకతీయ రాజ్యం కూడా గోండులదే అన్న తన వాదాన్ని వినిపిస్తారు. ఆనాడు గూండాను చరిత్రను భూస్థాపితం చేసినట్టే ఇప్పుడు మేడారం చరిత్రను సమ్మక్క సారక్కల చరిత్రను తప్పుదారి పట్టించి హిందూ తత్వాన్ని ఆపాదించి అసలైన గిరిజన సంస్కృతిని మటుమాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ తన ఆవేదన వ్యక్తపరిచాడు అరుణ్ ఈ పుస్తకంలో. దీని ద్వారా పరిశోధకులు ముందుకు వచ్చి సందిగ్ధ భరితమైన ఈచరిత్రను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,గిరిజన పరిశోధకులు, చరిత్ర ప్రేమికుల తో పాటు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
పుస్తకం : సమ్మక్క సారమ్మ పూర్వ చరిత్ర, పేజీలు : 174, వెల : 300/- రూ, రచన : మైపతి అరుణ్ కుమార్, సెల్ : 9441966756. సమీక్ష : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్ : 7729883223.