శక్తిమంతులు…మట్టి మహిళలు

‘వేట వృత్తిగా బతికిన ఆటవిక యుగంలోన/ స్త్రీ రాజ్యం స్థాపించి సమానతను చూపినాము/ నాగలి కనిపెట్టినాము/ నాగరికత నేర్చినాము’ అనే జనపదం మహిళ సామర్థ్యాన్ని తెలుపుతుంది. మహిళ ఒక ఉత్పత్తి సాధనం. పునరుత్పత్తికి ఆమే ఆధారం. ఒకప్పుడు మానవ జీవన విధానంలో ప్రముఖపాత్ర మహిళదే. అయితే పరిణామ కమంలో ఆమె మనుగడ అనేక అవరోధాల వలయంలో చిక్కుకుపోయింది. తన శ్రమ అలానే ఉంది, కానీ గుర్తింపు మాయమైపోయింది. తన కష్టం అలానే ఉంది, కానీ గౌరవం కనుమరుగైపోయింది.బాధ్యతలూ, బరువులూ ఆమె నెత్తిమీదే. ప్రమోషన్లు, రిటైర్‌మెంట్ల ఊసే తెలీదు.వెరసి ఆమె ఓ నిరంతర ఉత్పాదక మరమనిషి. నాటు వేసి, కోత కోసి, కుప్ప నూర్చి మట్టిలో మాణిక్యాలు వెలికితీసే నైపుణ్యం ఆమెది. ఈరోజున మనుషులంతా వేళకింత అన్నం తింటున్నారంటే..అందులో మెజారిటీ కష్టం గ్రామీణ,ఆదివాసీ మహిళలదే. ప్రతిఫలంగా వాళ్లకు దక్కే మూట విప్పి చూస్తే.‘కొన్ని తిట్లు, కొన్ని కన్నీళ్లు, కొంత అలసట,కొంత గుర్తింపులేనితనం,రాత్రికి రోజువారీ ఒంటినొప్పులు’.మేల్‌ సుపీరియారిటీ సొసైటీలో ‘అవని ఆకాశంలో సగం’ అనే మాట ఒట్టి మాటే. తతిమా ప్రపంచానికి సరే..గ్రామీణ, ఆదివాసీ మహిళలకు వారి హక్కుల పట్ల వారికే అవగాహన లేదు. వారిలోనూ,ప్రజల్లోనూ ఆ అవగాహన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సంబంధించి ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

‘అందరికీ మంచి ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణమహిళలు’అనేది ఈ ఏడాది అంతర్జాతీయ గ్రామీ ణ మహిళల దినోత్సవం థీమ్‌. ప్రపంచమంతటా ఆహా రాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళలను గుర్తించడం.. వారికున్న హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగిం చడం..అనే ముఖ్యోద్దేశ్యాన్ని చెప్పే థీమ్‌తో ఐరాస పిలుపు నిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయానికి, ఆర్థిక వ్యవ స్థకి,ఆహార ఉత్పత్తికి గ్రామీణ మహిళలే అపారమైన కృషి చేస్తున్నారు.వారి శ్రమకు, సృజనాత్మకతకు గుర్తింపు తేవాలనే ఉద్దేశ్యంతో 2008,అక్టోబరు 15న గ్రామీణ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే దీనికి అంతగా ప్రాచుర్యం అందలేదు. అవగాహనా పెంపొందలేదు. సహజంగా గ్రామీణ ఉత్పత్తిలో ప్రధానంగా పాలుపంచుకుంటున్నది దళిత,బహుజన, ఆదివాసీ మహిళలే. ఆదివాసీ మహిళలు అడవుల్లో సేకరించి,ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. పోషకాల విషయంలోనూ అవి అంతే విలువైనవి. ప్రపంచ మహిళల్లో సగ భాగానికి పైగా భూమి లేక కూలి చేసే మహిళలే. చిన్న, సన్నకారు రైతు కుటుంబాల మహిళలు ఆహార ఉత్పత్తిలో, భద్రతలో ప్రధాన భూమిక నిర్వర్తిస్తున్నారు.పారిశ్రామిక వ్యవస్థ లోనూ మహిళల శ్రమా కీలకమైనదే.
నాటి ఆదర్శం..
గ్రామాలు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ జీ అన్నారు.గ్రామస్వరాజ్యం సాధిస్తేనే గ్రామాలు, పట్టణా లు,నగరాలు,రాష్ట్రాలు,దేశం అభివృద్ధి పథంలో పయనిస్తా యన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ వనరులే దేశ ఆర్థిక పరిస్థితికి,ఆహార భద్రతకు ఆధారం.ఆ విషయం గ్రామీణ మహిళల శ్రమ ఫలితంలో కనిపిస్తుంది. పంటల సాగు, విత్తనాల సంరక్షణ,పశుపోషణ,పెరటికోళ్ళ పెంపకం, అటవీ వనరుల సేకరణ,చేపల పెంపకం (అమ్మకం), చేనేత రంగం,బీడీ పరిశ్రమలు..ఇవన్నీ గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలే. వీటిలో మహిళలదే ప్రధాన భూమిక.
నేటి ఆధునికం..
అయితే ప్రపంచీకరణ, ప్రైవేటీ కర ణస్థానం బలోపేతమౌతున్న కొద్దీ గ్రామీణ వనరులన్నీ పలచనవుతూ వచ్చాయి. దాదా పు రెండున్నర దశాబ్దాల నుంచి గ్రామా ల్లో పేదరికం తాండవిస్తోంది. ఆర్థిక వెసులు బాటు లేక ప్రజలు మగ్గిపోతున్నారు. ఈ పరిణామం ముఖ్యంగా గ్రామీణ మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది. పోషకాహార లేమితో అనారోగ్య సమస్యలకు గురవుతు న్నారు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.ఈ ఇరవై ఏళ్ళలో దాదా పు 50శాతం మహిళలు తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామాల్లో సెజ్‌ల రూపంలో భూదోపిడీలు జరుగుతు న్నాయి. ప్రభుత్వాలే ప్రజలను మభ్యపెట్టి, పారిశ్రామిక వర్గాలకు భూములను కేటాయిస్తున్నాయి.దీంతో గ్రామాల్లో పేదప్రజలు తమ భూముల నుండి నిర్వాసి తులవుతున్నారు.ప్రభుత్వ అక్రమ విధానాల కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకం నిరాఘాటంగా సాగుతోంది. వారు సాగు చేసుకునే పోడు భూములను ప్రభుత్వాలు వివిధ కారణాలు చెప్పి,స్వాధీ నం చేసుకుం టున్నాయి. నిర్వాసితులు, నిరాధారులంతా వలస మార్గం పడుతున్నారు.
గిరిపుత్రుల గోడు..
అనాదిగా గిరిజనులుప్రకృతి ప్రేమి కులు. జీవనానికి తోడ్పడే ప్రతిదీ వారికి దైవంతో సమానం. అంతగా వారి జీవన విధానం పరిసరాలతో ముడిపడి ఉంటుంది. చెట్టు,పుట్ట,పక్షి..ఇలా తమ చుట్టూ ఉండే ప్రతిప్రాణీ వారి సొంతంగా బతుకు తారు. ఆట,పాట వారి జీవనంలో భాగం.అదే వారి సంస్క ృతి.గిరిజను లకు అటవీ భూమిలో నివసించే హక్కు ఉంది.ఆ భూమిని సాగు చేసుకునే హక్కూ ఉంది.అటవీ ఉత్పత్తులను సేక రించి,వినియోగించుకునే హక్కూ వారి కుంది.వారి ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగితే ఎదుర్కొని, న్యాయం కోరేందుకు చట్టాలున్నాయి. అయితే నిరక్షరా స్యత వల్ల వారికి వీటిపై అవగాహనే లేదు. అభివృద్ధి పేరుతో నెలకొల్పే ప్రాజెక్టులు, గనుల తవ్వ కాలు,అడవుల నరికివేత వంటివి వారి మనుగడకు పెనుభూతాలుగా మారి, నిర్వాసి తులను చేస్తున్నాయి.
అక్షరాస్యతతో అవగాహన వైపు..
గ్రామాల్లో సరైన విద్యా సౌకర్యాలు లేక నిరక్ష రాస్యత రాజ్యమేలుతోంది. ఆడ పిల్లల చదువు ప్రాథమిక పాఠశాల స్థాయి లోనే ఆగిపోతోంది.దాంతో వారికి తమ శ్రమకు విలువ కట్టడం తెలియడం లేదు.వారికున్న హక్కు ల పట్ల అవగాహన కలగటం లేదు.అనేక దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటున్నారు.అక్షరాస్యతను అభివృద్ధి పరచాలని‘బేటీ బచావో బేటీ పఢావో,సర్వశిక్ష అభియాన్‌, మధ్యాహ్న భోజన యోజన’లాంటి పథకాలను ప్రభు త్వాలు తెచ్చాయి. కానీ అవి అమలుకు నోచుకున్నాయా అని తరచి చూస్తే మనకి అన్నీ ‘అచ్చుతప్పులే’ కనిపిస్తా యి.ఈవిషయంలో మన పొరుగు రాష్ట్రం కేరళది ఆదర్శవంతమైనపాత్ర. మనదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం.2011జనాభాలెక్కల ప్రకారం 94శాతం అక్షరాస్యత ఉంది. ఇటీవలి అంచనాల ప్రకారం 96.2 శాతానికి పెరిగింది. మిగిలిన రాష్ట్రాలూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే దేశం అక్షరాస్యతతో సుసంపన్నమవుతుంది.
ఏరువాక విడిచి ఊరు దాటితే..
జీవనోపాధిని కోల్పోయి పట్టణాలకు,నగరాలకు పొట్ట చేతపట్టుకొని వలస పోతున్నారు గిరిజనులు, గ్రామీ ణులు.దారం తెగిన గాలిపటాలయ్యాయి వీరి జీవితాలు. తెలియని ప్రదేశాలలో ఇమడలేక,సరైన పనులు దొరక్క నానా యాతనలు పడుతున్నారు.మహిళలైతే పని ప్రదేశాల్లో హింసకు,లైంగిక వేధింపులకు,దాడులకు గురవుతున్నారు.బలవంతంగానో,బతకలేని పరిస్థితుల్లోనో వ్యభిచార వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారు.గ్రామీణ మహిళలు బయటే కాదు ఇళ్లల్లోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తీవ్రమైన గృహ హింసను అనుభవిస్తు న్నారు. కుటుంబసభ్యుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిని భరించాల్సి వస్తోంది. అలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు చిన్నతనంలోనే వ్యసనాలకు లోనవు తున్నారు.తాము చేయని తప్పులకు అటు పిల్లలు, ఇటు భర్త వ్యసనాలబారిన పడుతున్నారు.చివరికి ఈ కష్టాలు మహిళలకు తీరని క్షోభను మిగుల్చుతున్నాయి.
ఘనత ఉన్న పంచాయితీరాజ్‌..
మన గ్రామీణ రాజకీయ నేపథ్యంలో పంచాయి తీరాజ్‌ వ్యవస్థ కీలకం.ఇది అతి ప్రాచీనమైనది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగశాలగా చెప్పుకునే ఘనత దీనికి ఉంది.గ్రామ పరిపాలనకు వెన్నెముకగా పనిచేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 72 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారి భవిష్యత్తు పంచాయితీరాజ్‌ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది.ఈ వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ మహిళల భాగ స్వామ్యం ఉంది. వారికి ఉండేది వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే.ఆ ఆసరా కూడా లేకుండా చేసే కార్య కలాపాలు ఆపి, వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.
పథకాల అమలే పరిష్కారమా..?
మహిళా రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ గ్రామ స్థాయి లోని మహి ళలు ఆర్థికంగా,సామాజికంగా ఇంకా వెనుక బడి ఉన్నారు. పంచాయితీ రాజ్‌లో పది లక్షల మంది మహిళా ప్రతి నిధులు ఉన్నారు. అయినప్పటికీ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరటం లేదు.ఈ పరిస్థితిని అధిగ మించాలనే ఉద్దేశాన్ని చెబుతూ మహిళల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టాయి.డ్వాక్రా గ్రూపు లు,సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లాంటి రకర కాల పథకాల ద్వారా మహిళలకు కొంత వరకు తోడ్పాటు ను అందిస్తున్నాయి. అయితే అవి సక్ర మంగా అమ లుకు నోచుకోవడం లేదు. దీనికి పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో పాటు మహిళలకు వాటిపై అవగాహన లేకపోవడం కూడా కారణమే. రాజ్యాంగం అనేది ఒకటి ఉందనీ, దానిలో మహిళలకు అంటే తమ కోసం కొన్ని చట్టాలు ఉన్నా యన్న కనీస అవగాహన గ్రామీణ మహిళ ల్లో లేదని ఇటీవల ఒక అధ్యయనంలో తెలిసింది.ఆయా చట్టాల గురించి,హక్కుల గురించి వారికి తెలిసిన ప్పుడే మార్పు మొదలవుతుంది.
పితృస్వామిక పరిమితులు..
సమాజంలో పాతుకుపోయిన పితృ స్వామిక విలు వలు మహిళల హక్కులను తొక్కి పెడుతున్నాయి. చాలా వరకు గ్రామా ల్లో ఆస్తులన్నీ పురుషుల చేతుల్లోనే ఉన్నా యి.అవి మహిళలకు లభించే విధంగా అమలు జరగటం లేదు.బాంకు అకౌంట్లు కూడా జనధన్‌ యోజన,ఫైనాన్స్‌ఇంక్లూ జన్‌లో మహిళలను భాగస్వా మ్యం చేయాలి. ప్రభు త్వం ఇచ్చే స్థలాలు,ఇళ్ళ పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వాలి.అవి నేరుగా మహి ళలకు చేరేవిధంగా ఏర్పాటు చేయాలి.అంగన్‌వాడీ,జననీ సురక్ష యోజన లాంటి పథ కాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి.శ్రమకుతగ్గ వేతనం అందక పోయినా పురుషులతో సమానంగా శ్రమిస్తూనే ఉన్నారు.సామాజిక బాధ్యతలు మోస్తూనే ఉన్నారు.
విధిలేక వివక్షలో..
మహిళల శ్రమ పురుషులతో సమానం లేదా అంతకు మించి ఉంటుంది.వేతనం విషయంలో మాత్రం వివక్ష స్పష్టంగా,నిరాఘాటంగా కొనసాగుతోంది. మహిళ లకు పనికి తగ్గ వేతనం లేదు.ఆరుగాలం శ్రమించినా తిరిగి చూసుకుంటే శూన్యమని పిస్తోంది.అంతేకాదు.. ఇంత చేసినా మహిళలకు భూమిపై హక్కు లేదు. మహిళా రైతుగా గుర్తింపు లేదు. జీవనోపాధిలో నిర్ణయా ధికారం లేదు.ఆదాయంపై నియంత్రణ అనేది లేదు.తల్లిగా, భార్యగా,సోదరిగా ప్రతి పురుషుని జీవితాన్నీ తీర్చిదిద్దేది మహిళే. అయినా మన పితృస్వామ్య సమాజంలో స్త్రీకి ఉన్న విలువెంత అంటే సమాధానం శూన్యం.మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా,మన పురుషాధిక్య సమాజంలో వారికే మాత్రం గౌరవం, గుర్తింపు ఉండటం లేదు. చట్టపరంగా సమాన హక్కులు ఉన్నా,అవి తెలిసినవారు ఎక్కడో ఒకరుంటారు. ఇప్ప టికీ ఇంటాబ యటా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు.పైకి కనిపించే చిరునవ్వుల వెనుక కనిపించని కన్నీళ్ళెన్నో. మహిళల పరిస్థితులు మారాలని అందరూ చెబుతున్నారు. కానీ మహిళా కమిషన్‌ బిల్లును సైతం తొక్కిపెడుతూనేఉన్నారు.
తీర్పుతో మార్పు ఉందా..
సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం నియమాన్ని స్పష్టీకరించింది. రోజువారీ కూలీలకు, క్యాజువల్‌ సిబ్బందికి,కాంట్రాక్టు సిబ్బందికి ఈ నియమం వర్తిస్తుంది. అయినా ఇప్పటికీ ఆనియమం అమలు కాలేదు. స్త్రీ-పురుషుల వేతనాల విషయంలో తీవ్ర వ్యత్యా సాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వైనాన్ని కళ్ళకు కట్టింది మాన్‌స్టర్‌ సబ్‌వే. ఓవైపు వేతనాల్లో అన్యాయానికి గురవుతున్న స్త్రీలు ఇటు ఇల్లు, అటు ఆఫీసు పనుల్లో తీవ్ర మైన వత్తిడికి గురవుతున్నారు.పని ఒత్తిడిలో మగ్గుతున్న మహిళలు43శాతం మంది ఉన్నారని ఇటీవలి నివేదికలో తెలిసింది.వీరిలో దాదాపు 92శాతం మంది మహిళలు. స్త్రీల పథకాల అమలు లోనైనా మహిళల భాగస్వా మ్యం ఉంటే కొంతవరకు అమలుకు నోచుకునే అవకాశం ఉంటుంది.
వారసత్వపు హక్కులో సత్తువుందా..
సహజంగా మనదేశవారసత్వ చట్టంలో తాత ఆస్తి మనవడికి అని ఉండేది. స్త్రీకి గానీ,ఆమె సంతా నానికిగానీ చెందేలా లేదు. చట్టపరంగానే లింగ వివక్షను చవిచూ సింది మహిళ.అయితే వారసత్వచట్టం ఒక అడుగు ముందుకేసి స్త్రీలకూ పురుషులతో సమానంగా ఆస్తి హక్కును కల్పించింది.దీన్ని ఆధారం చేసుకుని భూమిపై హక్కును,వాటాను మహి ళలు సాధించుకోవాలి. మహిళలకు వీటిపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలి. స్వచ్ఛం ద సంస్థలతో పాటు ప్రభుత్వాలూ బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళలకు ఆస్తి హక్కు సరైన రీతిలో చెందేలా ప్రభుత్వాలే చట్టాలు రూపొందించాలి.
మహిళా రైతు దినోత్సవం..
నేడు మన దేశంలో చిన్న,సన్నకారు రైతుల విష యానికొస్తే..వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళా కార్మికులు 86శాతం పైనే ఉన్నారు. వారిలో 53 శాతం కుటుంబాలకు సాగుభూమి లేదు. భూమిని కౌలుకు తీసుకుని,వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. వర్షా భావం తో పంటలు పండకపోయినా కౌలు మాత్రం యజమానికి చెల్లించాల్సిందే. దీంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు భూమిపై హక్కులున్నాయా అంటే? లేవనే చెప్పాలి. మరి ఇలాంటివారికి ప్రభుత్వాలే భూపంపిణీ చేయాలి.అదీ మహిళ పేరుతో ఇస్తేనే లబ్ది చేకూరుతుంది. అప్పుడే స్త్రీలు ఒడిదుడు కులను ఎదుర్కొని పిల్లల బాధ్యత, కుటుంబ పోషణను సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. పథకాలు ప్రభుత్వాల ప్రకటనల వరకే పరిమితం కాక, అమలు చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది.దీనివల్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరే అవకాశంఉంది.
మహిళా రైతుల వేదిక సభ్యులు వీటిపై కృషి చేస్తున్నారు. మహిళల హక్కుల గురించి, వారి శ్రమకు గుర్తింపు రావాలని చేస్తున్న కాంపెయిన్‌లు, సదస్సులు, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి,కొన్ని సంఘాలు ముందుకెళ్తున్నాయి.గతేడాది కేంద్ర వ్యవసా య మంత్రి గ్రామీణ రైతుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.తమ హక్కు లూ, పథకాలూ గ్రామీణ మహిళలకు చెందా లి.అందుకోసం ప్రజాస్వామిక శక్తులూ, మానవహక్కుల సంఘాలూ, మహిళా సంఘా లూ గళమెత్తాలి.మహిళలంతాఒక్కటై నినదిం చాలి.ఇది మహిళా రైతుల కృషికి సత్ఫలి తాలిస్తుందని భావిద్దాం. మానవ మనుగడకు నిరంతర కార్యదర్శిని గుర్తించి,గౌరవిద్దాం. – (టి.టాన్య)