వైవిధ్యం వారి జీవనం
‘‘ స్వచ్ఛమైన సెలయేళ్లు. దట్టమైన అడవులు. గంభీరమైన కొండలు. పక్షుల కిలకిలారావాలు. పచ్చని ప్రకృతి అందాలు. వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుం టాయి. ఏ పల్లెకు వెళ్లినా గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.’’
కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. రాజకీయాలు తెలియని మనస్తత్వం.. ప్రతి నెలా పండుగలు.. పండు గలకు అనుగుణం గా ప్రత్యేక పూజలు.. అందుకు తగ్గట్టుగా వేషధారణ.. ఇదీ ఆదివాసీ గిరిజనుల ప్రత్యేకత. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల కు పెట్టింది పేరు. వివిధ తెగల రూపంలో జీవిస్తున్న వారి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి సంప్రదాయాలూ అందరికీ ఆశ్చర్యం కలిగించేవే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 9 లక్షల 95 వేల 794 మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తఉన్నట్టు అంచనా. అయితే ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర గిరిజనుల జీవన వైవిధ్యం విభిన్నంగా ఉంటుంది. లంబాడా(బంజార)లను ప్రభుత్వం 1977 సంవత్సరంలో గిరిజనులుగా గుర్తించడంతో ఆనాటి నుంచి వీరు గిరిజనులుగా గుర్తింపు పొందారు. గోండులు, కొలాంలు,మన్నెవార్,తోటి,ప్రధాన్లు, నాయక్‌పోడ్,ఆంద్,కోయా తదితర ఇతర జాతులను ఆదివాసీలుగా వ్యవహరిస్తుండగా వీరిలో కొలాం,మన్నెవార్,తోటి తెగలను పీటీజీ (ఆదిమ గిరిజన తెగలు)గా వ్యవహరిస్తారు.
గోండులు
గోండుల ప్రధాన వృత్తి పోడు వ్యవసాయం. ఆదిమ జాతి గిరిజనులైన గోండులు గోండి భాషలో మాట్లాడుతారు. కుస్రం హన్మంతరావు గోండు లిపిని రూపొందించారని చరిత్ర కారులు పేర్కొన్నారు. అయితే ఇటీవల నార్నూర్ మండలం గుంజాలలో గోండుల లిపి వెలుగు లోకి వచ్చింది. దీంతో లిపిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గోండు గూడాల్లో జీవించే వారు మర్యాదకు, క్రమశిక్షణకు మారు పేరు. ఆచార వ్యవహారాలు పాటించడంలో వారికి వారే సాటి. కొమురం భీమ్ కాలం నుంచి గోండులది పోరాటతత్వం. మారుముల ప్రాంతాల అడవుల్లో జీవిస్తున్న వీరు ఎవరైనా కొత్తవారు గూడెంలోకి వస్తే ‘రాం… రాం’ (నమస్కారం) అని ఆహ్వానిస్తారు. వీరు తమ గూడెం పటేల్ మాట కాదనరు. గోండులు కాలికి చెప్పులు వేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టరు. ఇతరులను అనుమతించరు. గూడాల్లో ఏ చిన్న పండుగైన అంతా కలిసి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. గోండులు పెర్సాపెన్, ఆకిపెన్, జంగుబాయి తదితర దేవుళ్లను నమ్ముతారు. దీపావళీ సమయంలో గోండులు దండారీ పండుగను అత్యంత నియమనిష్టలతో జరుపుకుంటారు. గిరిజన సంస్కృతి నుంచి పుట్టిన రాయిసెంటర్ల (న్యాయస్థానం) తీర్పును గోండులు శిరసావహిస్తారు.
కొలాంలు
అభివృద్ధిలో వెనుకబడిన ఆదివాసీ తెగల్లో కొలాం గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వీరు కొలామీ భాషలో మాట్లాడుతారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవిస్తారు. వ్యవసాయం, వెదురు బుట్టలు, తడకలు అల్లడం వీరి ప్రధాన వృత్తులు. వీరు ముఖ్యంగా భీమల్ పేన్ దేవతను కొలుస్తారు. థింసా నృత్యం చేస్తారు. కొలాం జాతుల్లో తెలుగు మాట్లాడే వారిని మన్నెవార్ అంటారు. గోండుల ఆచార వ్యవహారాలకు వీరి ఆచార వ్యవహారాలకు పెద్దగా తేడా లేనప్పటికీ కొన్ని పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి.
ప్రధాన్, తోటి
రాజ్‌గోండుల కాలంలో ప్రధాన్, తోటి తెగలకు చెందినవారు కవులుగా ఉండేవారని చరిత్రకారులంటారు. ప్రధాన్‌లు అధికంగా మరాఠీ మాట్లాడుతారు. వ్యవసాయం ప్రధాన వృత్తి. తోటి తెగవారు అత్యంత వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా గోండి భాష మాట్లాడుతారు. తోటిలలో అధిక శాతం ఇతర ప్రాంతాలకు వలసలు సాగిస్తూ జీవనం కొనసాగిస్తారు. కిక్రీ వాయిద్యాలు వాయిం చటం,చుక్కబొట్టులు వేయడంలో వీరు సిద్ధహస్తులు.
ఆంద్, నాయిక్‌పోడ్
ఆంద్ తెగవారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు కాగా..మరాఠీ భాషలో మాట్లాడుతారు. వీరి జనాభా అంతంతే. వ్యవసాయం జీవనాధారం. పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు.
లంబాడీ
రాష్ట్రంలో లంబాడీలను రాష్ట్ర ప్రభుత్వం 1977లో గిరిజన తెగల్లో చేర్చింది. జిల్లాలో ఉన్న లంబాడీలు ఆదిమజాతి గిరిజనుల కంటే అభివృద్ధి చెందిన వారు. గోండు జనాభా తరువాత వీరు రెండో స్థానంలో ఉన్నారు. వీరు వ్యవసాయమే కాకుండా వ్యాపారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తు న్నారు. వీరు నిర్వహించే తీజ్ ఉత్సవాలు ఎంతగానే ఆకట్టుకుంటాయి.
అడవి బిడ్డల జాతరలు
ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వివిధ జాతర ఉత్సవాలు వారి సంస్కృతి సంప్రాదాయాలు, ఆచార వ్యవహరాలే ప్రధా నంగా సాగుతాయి. ఆదివాసీలకు నాగోబా జాతర అత్యంత పవిత్రమైనది. నాగోబాతో పాటు ఖాందేవ్,బుడుందేవ్,మహాదేవ్, జంగు బాయి ఇలా..ప్రతీ జాతర వారికి ప్రత్యేకమైనదే.
నాగోబా జాతర
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువై ఉంది. ఏటా పుష్య మాసంలో అమావాస్య అర్ధరాత్రి మెస్రం వంశీయులు పవిత్ర గంగజలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభిస్తారు. ఈ పూజలకంటే ముందు ఇంద్రాయిదేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మెస్రం వంశీయులలో ఏడు దైవతలను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. మెస్రం వంశంలో ఉన్న 22 తెగలవారు అత్యంత నియమనిష్టలతో నాగోబాను కొలుస్తారు. నాగోబా పూజలకు ముందు మెస్రం వంశీయులు పవిత్ర గంగజలం కోసం కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు అత్తల మడుగు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగజలం తీసుకొచ్చి పుష్యమి అమావాస్య అర్ధరాత్రి నాగోబాకు అభిషేకించి జాతర ప్రారంభిస్తారు. దక్కన్ పీఠభూమిలోనే ఆదివాసీలకు ముఖ్యమైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర పండుగగా గుర్తింపు నిచ్చింది.
ఖాందేవ్ జాతర
నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది. పుష్య పౌర్ణమికి ఖాందేవ్‌ను తొడసం వంశీయులు కొలువడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది.15రోజుల పాటు జరుగుతుంది. పూర్వ కాలంలో తోడసం వంశాస్థుడైన ఖమ్ము పటేల్‌కు రాత్రి వేళ కలలో ఖాందేవుడు ప్రత్యక్షమై గ్రామమంత సుఖ సంతోషాలతో ఉండాలంటే నీ వ్యవసాయ భూమిలో నేను కొలువయ్యాయని తనను కొలవాలని పేర్కొన్నాడని.. నాటి నుంచి ఏటా పుష్య పౌర్ణమితో ఖాందేవును తొడసం వంశీయులు కొలుస్తున్నారు. ఈ జాతర ముగింపుతో ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు నాగోబా జాతర కేస్లాపూర్‌కు తరలివెళ్తారు.
బుడుందేవ్ జాతర
నాగోబా జాతర ముగింపు మరుసటి రోజు ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలతో ప్రారంభిస్తారు. పది రోజుల పాటు నిర్వహిస్తారు. పూర్వకాలంలో గౌరాపూర్ అనే గ్రామంలో ఉన్న ఆవుల మందలో ఉన్న ఆంబోతు(ఎద్దు) పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్ ప్రాంతంలో ఉన్న పంట చేలల్లో పడి పంట నాశనం చేయడంతో ఆగ్రహించిన కొత్వాల్‌లు వారి వద్ద ఉన్న ఆయుధంతో ఆంబోతును సంహరించారని మృతి చెందిన ఆంబోతును దూర ప్రాంతంలో పారేయడానికి వెళ్తుండగా అక్కడే బండరాయిగా మారి బుడుందేవ్‌గా అవతరించిందని పూర్వీకుల కథనం.
మహాదేవ్ జాతర
శ్యాంపూర్‌లో బుడుందూవ్ జాతర ముగింపుతో సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతర ప్రారంభమవుతోంది. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలిచి ప్రారంభించే జాతర పదిహేను రోజులపాటు సాగుతుంది. అంతేకాకుండా మండలంలోని లింగాపూర్‌లో జగదాంబ జాతరను బంజారాలు అత్యంత నియమ నిష్టలతో నిర్వహిస్తారు.
జంగుబాయి జాతర
శార్దూల వాహిని దుర్గమాత ప్రతి రూపమే జంగుబాయి అని ఆదివాసీల నమ్మకం. ఏటా పుష్య మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీలు అత్యంత నియమనిష్టలతో జంగుబాయిని కొలుస్తారు. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలం పరందోళి గ్రామం సమీపంలో గల శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో జంగుబాయి కొలువై ఉన్న ఈ ప్రదేశమంతా పదుల సంఖ్యలో దేవతలున్నాయని పూర్వకాలం నుంచి ప్రచారంలో ఉంది. జంగుబాయి దేవతను ఆదివాసీలోని ఆరు తెగలకు చెందిన వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ పూజలకు జిల్లా, ఏజెన్సీ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా ఆదివాసీలు, ఇతరులు తరలివెళ్తారు.
జాగేయ్ మాతరీ జాగేయ్
ఆదివాసీ గిరిజనులు సంవత్సర కాలంలో నిర్వహించుకునే పండుగల్లో జాగేయ్ మాతరీ జాగేయ్ పండుగ ప్రత్యేకత సంతరించు కుంటుంది. భాద్రపద(సెప్టెంబర్)లో పెత్రమాస(పెద్దల పండుగ), యుజ(అక్టోబర్)లో దండారీ,మృ గశిర(డిసెంబర్)లో కొత్త పంటలు ఇంటికి వచ్చే సందర్భంగా సెట్టి పండుగ జరుపుకుంటారు. ఇవే కాకుండా కాలాన్ని బట్టి దురాడి, మరుగోళ్ల ఉత్సవం, దాటుడి పండుగ లతో పాటు దసరా,దీపావళీ,ఉగాది,హోలీ తదితర పండుగలను ఘనంగా చేస్తారు.
దండారీ సంబురం
గోండులు దీపావళీ సందర్భంగా జరుపుకునే దండారీ పండుగ అతి ప్రధానమైనది. అకాడి నుంచి మొదలై దీపావళీ తరువాత రెండు రోజులకు బొడుగ పండుగతో దండారీ ఉత్సవాలు ముగిస్తారు. దండారీ ఉత్సవాల్లో భాగంగా గోండులు ఆషాడ మాసం లేదా దసరా తర్వాతి రోజుల్లో అకాడి పెన్ దేవతకు పూజలు నిర్వహించి దండారీ ఉత్సవాలు ప్రారంభిస్తారు. దండారీలో ఆటపాటలకు ఉపయోగించే పర్రా,వెట్టె,తుడుం,డప్పు,పెప్ప్రి తదితర సంగీత పరికరాలను, నెమలి ఈకలతో కుంచెం కట్టిన గుస్సాడీ కిరీటాలను, ఇతర వస్తు సామగ్రిని గూడెం గ్రామ పటేల్ ఇంటి ముందు పేర్చి సంప్రదాయ రీతిలో పూజలు జరుపుతారు. ఈ నృత్యాల్లో గుస్సాడీ, చచ్చొయి-చాహోయి,థింసా,గుమ్మెలాట ప్రధానమైనవి. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమ నిష్టలతో ఉంటారు.
బంజారాల బతుకమ్మ తీజ్ లంబాడీలు(బంజారాలు) నిర్వహించే ఉత్సవాల్లో తీజ్ అతి ముఖ్యమైనది. రాఖీపౌర్ణమి నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు గిరిజన తండాల్లో పెళ్లి కాని యువతులు నిర్వహించే తీజ్‌ను బంజారాల బతుకమ్మ పండుగ అనవచ్చు. రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలను పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు జరుపు కుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతీ ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు. యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్టమన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు. రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు చల్లుతారు. రోజూ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు. పూర్వ కాలంలో తీవ్ర కరువు కాటకాలు వచ్చినప్పుడు గిరిజన పెద్దలు(నాయక్)లు తమ ఆరాధ్య దైవమైన జగదాంబ మాతను వేడుకోగా ఏటా శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని సూచించిందని చెప్తారు. కాగా,తీజ్ అంటే పచ్చదనం.
గోండ్ ‘‘దురాడి’’ (హోళి)పండుగ -సిడాం అర్జు
దేశములో గల జనజాతులలో గోండుతెగ ఒకటి. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా,ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ దాదాపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో గోండు తెగలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రములో ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచి ర్యాల, నిర్మల్ జిల్లాలలో ఉన్న గోండులతో కలిపి కోయతూర్, పర్ధాన్ తెగవారు, కొలామ్ తెగవారు, కొలవార్ తెగవారు, తోటి తెగవారు, నాయికపోడ్ తెగవారు, కమ్మర తెగవారు కలసిమెలసి ఉంటారు. వీరు జరుపుకునే పండుగలు, దేవతల పూజలు కలసి జరుపుకుంటారు. గోండులు జరుపుకునే పండుగలలో ‘‘దురాడి’’ ఒకటి. దురాడిని (హోళి) అంటారు. హోళి అంటే సర్వసా ధారణంగా రంగులువేసుకునే పండగ అని అందరి భావన మరియు తెలిసిన విషయమే! కాని కోయ,కోయతూర్,గోండ్, పర్ధాన్, కొలాం, తోటిలు జరుపుకునే ‘‘దురాడి’’ (హోళి)కి ఒక ప్రత్యేకత ఉంది. గోండుతెగ గ్రామాలలో గ్రామపెద్దను నార్‌పాట్లలల్ అంటారు. అతనికి అన్ని విధముల సహాయ సహకారాలు అందిం చడానికి ‘పంచులు’ఉంటారు. పంచులు అనగా ఆ గ్రామములో ఉన్న కులపెద్దలు. వారిలో ఒకరు నార్‌పాట్లల్, ఒకరు రాయ్ యజమాని (మహాజన్), మరొకరు దేవారి, ఇంకొకరు హవల్‌దార్, మరొకరు కార్బరి అనే పేర్లతో గోండ్ సంస్కృతి సాంప్రదాయాలు గల పటిష్టమైన పునాదిగల గ్రామ కమిటి ఉంటుంది.ఈ కమిటిలు (వ్యవస్థ) రామ`రావణుని కాలమునుండి అనగా యుగయుగముల నుండి ప్రారంభమై నేటివరకు కొనసాగుతున్నాయి. ఆదియుగములో కోయ, కోయతూర్,గోండ్ తెగవారు మొట్టమొదటి మానవ జన్మలో ప్రథములు కాబట్టి నేడు ఆదిమజాతి వారుగా,ఆదివాసులుగా పిలువబడు తున్నారు. కాని వీరు మూలవాసులు. వీరికి చరిత్రకలదు. ఈ భారతదేశాన్ని పరిపాలించిన వారి చరిత్రలో ద్రావిడులు గా పేర్కొనబడ్డారు. ద్రవిడ ప్రదేశాలలో ఆర్యులు వచ్చి వారి సంస్కృతి సాంప్రదాయాలను చిన్నభిన్నం చేశారు. మొహంజోదారో, హరప్పా రాజు పాహండికుపార్ లింగో. వీరిలో జంగో రాయితడ్, హీరాసుఖ, బిర్ధ్‌మక్ మొదలగువారు కోయపున్నెం గోండిధర్మాన్ని ప్రారంభించిన ధర్మగురువులు. నేడు కోయ, కోయతూర్, గోండ్,పర్ధాన్,తోటి,కొలామ్,కొల వార్ కమ్మర తెగలలో సగ్గ ఘట్టాల వ్యవస్థ ఉన్నది. ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయం ఉన్నది. గోండులలో 750 ఇంటిపేర్లు ఉన్నవి. ప్రతి ఇంటిపేరుకు ఒక జంతువు, ఒక పక్షి, ఒక వృక్షములతో కూడి యుంటుంది. జలము,పృథ్వి,వాయు,అగ్ని, ఆకాశ ము ఈ పంచ భూతముల ఆధారముగల ప్రకృతి ఆరాధకులు. వీరిది నిసర్గ సంస్కృతి. ఈ సంస్కృతిలో 1)గాంవ్‌ఘడ్ 2)పేన్‌ఘడ్ 3)వర్వఘడ్ 4)రాజ్ ఘడ్ 5)ముట్వపోయి ముఖ్య స్థానముల గణ రాజ్య వ్యవస్థ ఉండేడిది. ఇట్టి వ్యవస్థను రాముని కాలములో చెడగొట్టి నందున, రామ్ రహిమ్ అనే ఇద్దరు అన్నద మ్ముల వరుస పెట్టి గోండుల కూతురైన అమ్మాయిని వరుసకు చిన్నాయిన అని అంటూ రామ్ రహీమ్‌లు హిందుముస్లింలు కోయ, కోయతూర్,గోండ్‌వారి సాంప్రదా యమునకు విరుద్దంగా చేసారు. అందుకని కులపెద్దలు, గ్రామపెద్దలు కట్టుదిట్టంగా ఉండేం దుకే ఈ ‘‘దురాడి’’ పండు గను చేస్తారు. కామదహనం జరిపేరోజు సాయంత్రంవేళలో గ్రామములోగల కుటుంబాల యజమానులు ప్రతి ఇంటి నుండి ఒక కొబ్బరికుడుకను సేకరించి గ్రామకులపెద్ద, నార్‌పటేల్‌కు పంచుల మందు ఇస్తారు. ఒకవేళ ఆ కుటుంబ యజ మాని గ్రామకట్టుబాట్లకు వ్యతిరేకి అయితే అతని కుడుకను తీసికొనరు. కుడుక తీసుకోకపోతే అతనిని బహిష్క రించిన కిందికి లెక్క. అతని ఇంట్లో ఏ కార్యమైన జరిగితే మిగతా కుటుంబాలు అందులో పాలుపంచుకోరు. అతడు గొప్ప ఉద్యోగి కావచ్చు లేదా ప్రజా ప్రతినిధి కావచ్చు, జాతికి పెద్దకాదని లెక్క. అందుకు ప్రతి ఒక్కరు గోండ్ గ్రామాలలో పంచుల మాట శిరసా వహి స్తారు. ఏమాత్ర ము జవదాటరు.పుట్టుక, పెండ్లి, కర్మలాంటి కార్యాలు పంచుల ఆధ్వర్యములో ఉంటాయి. కుడుకలు సేకరించిన తరువాత వెదురుతో పంజరం చేసి దానికి పటేల్ ఇంటిలో తయారుచేసిన గారెలు 5, మోదుగుపువ్వు రేకులు 5, వంకాయలు 5, ఉల్లిపాయలు 5 కట్టి రెండు వెదురుబొంగులతో ఒకటి (మాత్రల్) పురుషుని పేరుతో మరొకటి (మాత్రి) స్త్రీ పేరుతో రెండిరటిని కలిపి పంజరం కట్టి పటేల్ ఇంటివద్ద నుండి డోల్, పేప్రే, కాలికోమ్, తుడుం వాయ్యిద్యాలు మ్రోగిస్తూ గ్రామం బయట ఒకచోట గూమిగూడి పూజచేసి, వాటి నిలువెత్తు కఱ్ఱను భూమితో పాతిపెట్టి నిప్పువేసి కాల్చుతారు. ఈ చోటును ‘‘పుల్లర’’ అంటారు. అదేరాత్రి ప్రతి ఇంటినుండి జొన్నరొట్టెలు తీసుకు వచ్చి అన్నింటిని ఒకచోట కలిపి గ్రామ కుటుం బాల యజమానులు దురాడి పుర్లర వద్ద వరుసగా అందరు సహపంక్తిగా కూర్చొని తింటూ అందరు కలిసి రొట్టెలు తింటారు. దీనిలో ఐక్యత కలదు. పేద, ధనిక అనే తేడాలేదు. ఉద్యోగి, ప్రజాప్రతినిధి అనే భేదం లేదు. గ్రామంలోగల కుటుంబాల వారంత ఒకటే అనే భావన అందరిలో ఉంటుం ది. తరు వాత పాటలు పాడుకుంటూ డోల్, తుడుం వాయిస్తూ రాత్రివేళలో తమతమ ఇళ్లకు పోయి అరసోల అనగా దాదపు ఒక పావుకిలో ధాన్యం లేదా జొన్నలు లేదా మక్కలు లేదా కందులు లేదా చిక్కుళ్లు జమచేస్తారు. వీటిని పుల్లర దగ్గర గుడాల్లు (గుగ్గిళ్లు) చేస్తారు. మరునాటి ఉదయం దురాడి (హోళి)రోజు కుటుంబ యజమాని స్నానంచేసి ఒక పల్లెము, ఒక ముంతలో స్వచ్ఛ మైన నీరునింపుకొని చేత గొడ్డలిపట్టుకొని కాము డు కాల్చిన పుల్లరచోటుకు చేరుతారు. ఆ స్థల ములో గుడాల్లు (గుగ్గిళ్లు) తీసుకొని పుల్లర స్థలంలో నైవేద్యంగా సమర్పించి మ్రొక్కి అక్కడినుండి తనకు చెందిన పొలములోనికి పోయి అక్కడ దేవుని పేరిట,పేర్సపేన్ పేరిట గుగ్గిల్లు సమర్పించి మ్రొక్కి పొరకలు కొట్టి నూతన వ్యవసాయ పనిని ప్రారంభింస్తారు. తరువాత తిరిగి పుల్లర స్థలము వద్దకు చేరుకొని గ్రామములోని కుటుంబయజమానులందరు కలిసి గుగ్గిళ్లు తింటారు. తిన్న తరువాత ఒకవ్యక్తిని గురువుగా తయారుచేసి కాముని కాల్చిన బూడిదను ఒక గుల్లలో తీసుకొని డోలు,పేప్రే,కాళీకోం,తుడుం వాయిద్యాలు వాయించుతారు. మోదుగపువ్వుతో తయారు చేసిన రంగు, వెదురుబొంగుతో తయారుచేసిన పుచ్కుడ్‌గొట్టంను అంటే సిరంజిలాగ ఉండేది ఉపయోగి స్తారు. చిన్నలు పెద్దలు ఇల్లిల్లు తిరిగి ఇంటి గడపలో గురువు వద్దనున్న పుల్లర బూడిదను అడ్డంగా వేసి బదులుగా ఇంటివారు ఇచ్చిన రూపాయలను తీసుకొంటారు. బావ వరుస ఉన్నవాళ్లు ఒకరిపై మరొకరు రంగులు జల్లుకొంటారు. సాయంత్రం 5గంటల వేళ పుల్లర వద్దకుచేరి దురాడి దేవున్ని మొక్కి ఎవరి ఇంటికి వారు పోతారు. రాత్రివేళలో వారి ఇండ్లల్లో వండిన గారెలు,బూరెలతో చక్కని భోజనం చేసి తృప్తిగా దురాడి దేవున్ని మాతరి, మాత్రాల్‌ను సంవత్సరమంతా కుటుంబాలను సుఖశాంతులతో ఉండాలని వేడుకుంటూ హాయిగా నిద్రిస్తారు.