విశాఖ తీరంలో నేవీ డే విన్యాసాలు

విశాఖలో నేవీ విన్యాసాలతో,సాగ తీరం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది. నేవీ విన్యాసాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు, నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నేవీ చేస్తున్నటువంటివి అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. విశాఖ సాగర్ తీరంలో నేవీ విన్యాసాలు చూడటం ఎంతో బాగుందని పర్యాటకులు అంటున్నారు.నేవీ యుద్ధ విమానాలు దగ్గర నుండి చూడటం ఇదే మొదటిసారి అంటూ చెబుతున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో చాలా బాగుందని అంటున్నారు. నేవీ దేశం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నేవీ విన్యాసాలు చూడటం ద్వారా తెలిసిందని మరికొందరు అంటున్నారు. మన దేశం కోసం ఎంతో కష్టపడి నేవీ పని చేస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని, తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్స్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు.భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్ స్థావరానికి పునాది పడిరదని,అధికారికంగా తూర్పునౌకాదళం 1983లో ఏర్పాటైంద న్నారు.చిన్న నేవల్ బేస్‌గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగిన నేవీ ఆపరేషనల్ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మనవడు దేవాన్ష్ బాబుతో కలిసి తిలకించారు.అనంతరం సీఎం ప్రసంగించారు.మదిని మైమరపించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలను చేసి చూపించింది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్ చేస్తున్నా. నేవీ డే ఒడిశాలో జరిగినా విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్ అడ్మిరల్ నిర్ణయించడం చాలా సంతోషకరం. ఎంత క్రమశిక్షణ,కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడంసాధ్యం అవుతుంది.1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్ కమాండ్ చాలా కీలకంగా పని చేసింది. పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీని ధ్వంసం చేసింది మనవిశాఖ తూర్పు నౌకాదళమే.ఆ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచింది. కలకత్తా నుంచి చెన్నైవరకు కోస్టల్ ప్రాంతం ఉన్నా విశాఖ నావికా దళానికి ప్రత్యేకత ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి.అందుకే ప్రధాని మోదీ వికసిత్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళంచేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది.దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది.హుద్‌హుద్ తుపాను సమయంలో పది రోజులపాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడు తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్రఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగా పురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది’’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో జనవరి 4ననిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.తూర్పునౌకాదళాధిపతి రాజేష్ పెంథార్కర్ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.
టెక్నాలజీలో ఏపీ ముందంజ :దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. – గునపర్తి సైమన్