విశాఖ ఉక్కు కోసం ఏపీలో బంద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ రాష్ట్రవ్యాప్త బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణా సమితి పిలుపునిచ్చింది. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించినా భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఏపీ ప్రభుత్వం సైతం ప్రకటన చేసింది. టిడిపి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. వామపక్ష పార్టీలు కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరింపజేసే బాధ్యత వై.ఎస్.జగన్మోహన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ కొనసాగుతున్న ఆందోళనలలో ట్రేడ్ యూనియన్లు , ప్రజా సంఘాలతో పాటు ,అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉక్కు ఉద్యమంలో ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించి భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. బీజేపీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ అయింది . మొదట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం ఢిల్లీ దాకా వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన బిజెపి నేతలు ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ పార్టీ స్టాండ్ ను చెప్పకనే చెప్పారు.కేంద్రం నిర్ణయమే శిరోధార్యం.. బీజేపీ నేతల అభిప్రాయం ఇదే ప్రైవేటీకరణ ప్రకటన రాకముందే వైసీపీ, టీడీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కేంద్రం నిర్ణయమే శిరోధార్యం అంటూ తేల్చి చెప్పేశారు. ఇక ఇప్పుడు ఏపీలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న బంద్ లో బిజెపి భాగస్వామ్యం తీసుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదట్లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కనీసం మాట్లాడటం లేదు . కనీసం కార్మికుల పక్షాన ప్రకటన కూడా చేయలేదు. అటు కార్మికుల పక్షాన మాట్లాడలేక, ఇక అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ప్రజాభీష్టాన్ని కాదనలేక కక్కలేక మింగలేక బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం నిర్ణయాలు రాష్ట్ర బీజేపీ నాయకుల ఆలోచనలకు భిన్నంగా సాగుతుండడం గమనార్హం. అందరూ ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న చోట బీజేపీ నాయకులు నోరు మెదపలేని పరిస్థితి ఏపీ నాయకులకు ఇబ్బంది కలిగిస్తుంది .