విశాఖలో సి ఎం పర్యటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటుందని, అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజు పర్యటన నిమిత్తం గురువారం విశాఖపట్టణం చేరుకున్న ఆయన పోతిన మల్లయ్యపాలెం డా.వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా స్టేడియం ముందరి భాగంలో ఏర్పాటు చేసిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టేడియం లోపల ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువ క్రీడాకారలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖపట్టణం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ముందుగా క్రికెట్ క్రీడా చారిత్రాత్మక విశేషాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన కె. అంజలి శర్వాణి, అండర్ -19 విభాగంలో ప్రాతినిధ్యం వహించిన శబనంకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. మెడల్స్‌తో సత్కరించి అభినందించారు. ఈ క్రమంలో అక్కడకు విచ్చేసిన సుమారు 100 మంది యువ క్రీడాకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులు మరింత మంది తయారయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తగిన ప్రణాళికలు రచించి ముందుకు వెళుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని అన్నారు. శక్తి సామర్థ్యాలు ఉండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి తగిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రిని రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాకేష్, సిఈఓ వెంకట శివారెడ్డి, ట్రెజరర్ చలం పురుషోత్తం తదితరులు దుశ్శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బివి సత్యవతి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ, ప్రభుత్వ విప్ లు కరణం ధర్మశ్రీ, కోరుముట్ల శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, రెడ్డి శాంతి, వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు కెకె రాజు, ఓబుల్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేతలకు ముఖ్యమంత్రి ఆత్మీయ పలకరింపు
పర్యటనలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వారిని ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు- జి ఎన్ వి సతీష్