వివాహ బంధం పటిష్ట పరచాలి

శక్తివంతమైన వేదమంత్రాలతో ఏర్పడిన వివాహబంధం తో ఒకటైన దంపత్యబంధం శాత్వతం, పవిత్రం. ..జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు సమన్వయం తో ఒకరికొకరు తోడుగా ఉంటూ పరిష్కారించుకుంటూ ముందు కు సాగాలి. సంసారనౌక సజావుగా ప్రయాణించాలంటే ఓర్పు,నేర్పు, సమయస్ఫూర్తి ఉండాలి…నిర్వచనానికి అందని ఎత్తైన భావన దాంతప్యబంధం…సంతోషంలో భాగస్వామ్యం పంచుకుంటూ ఒకరి దుఃఖం లో మరొకరి ఓదార్పు పంచుతూ సంతానం యొక్క ఆలనా పాలనా చూసుకుని సంతోషపడతారు.. పరస్పర అనుకురాగం, అవగాహన కలిగి కలిసి నూరేళ్ళ జీవిత ప్రయాణమే వివాహబంధం యొక్క లక్ష్యం..అరమరికలు లేని ఆనందం పంచుకోవడం లోనే అంతర్లీనంగా ఒకరిపై మరొకరికి ఉన్న బాధ్యత, బంధం కలిసి ఉంటాయి.కేవలం ఆర్ధిక సంబంధ విషయాల వల్ల ఈ మధ్య వివాహ బంధాన్ని అతి సులువుగా రద్దు చేసేసుకుంటున్నారు…సంస్కృతి సంప్రదాయాలు గౌరవించడం నేటి తరానికి గిట్టనిమాటలు…విచ్చలవిడితనం కూడా పెరిగిపోయి వివాహబంధాన్ని తృణప్రాయంగా తీసిపారేస్తున్నారు… గత శతాబ్దంలో ఈ దుస్థితి లేదు..ఆదర్మవంతమైన జంట సీతారాములు…అరణ్య వాసంలో భర్తతో కలిసి కష్టపడడానికైనా సిద్ధపడినట్లు మనకి తెలుసు… సమస్యలు వచ్చాయని బయటపడకుండా భర్తకి, భార్య..భార్యకి భర్త ధైర్యం చెప్తూ కష్టం లోనూ సుఖంలోనూ తోడుగా నిలిచి ముందుకు సాగడమే దాంపత్య బంధం..
మానవ జీవితంలో ముడిపడిన అన్యోన్య బంధం వివాహం. పెళ్లిళ్లు భారతీయ సంస్కృతికి, సహజీవనానికి ఆనవాళ్ళు. పెళ్లిళ్లకు ప్రత్యేకించినది మాఘమాసం. పురోహితులు సూచించే శుభ ముహుర్తాలను బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. హిందూ సమాజంలో దాగివున్న పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా సాగే వివాహ మహోత్సవానికి మన దేశంలో సముచిత ప్రాధాన్యత,విలువ,గౌరవం ఉంటుంది. ఇప్పటికీ భారతీయులు వైవాహిక జీవిత విలువలను దైవ స్వరూపంగా పాటిస్తారు. ఇలాంటి వివాహ బంధాలు కొన్ని ఈ మధ్య కాలంలో విడిపోతున్న సందర్భాలు కుటుంబ పెద్దలను కలవరపెడుతున్నాయి. లక్షల కట్నాలతో లక్షణమైన సంబంధాలు వెతికి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి సంక్షోభం మనోవేదనను కల్గిస్తున్నది. ఆలుమగల మధ్య అవగాహన లోపిస్తే, సంయమనం లేకపోతే సంసారం నిస్సారమవుతుంది. భార్యాభర్తల విభేదాలు వివాహబంధాన్ని విడదీస్తాయి. చివరికి విడాకులకు దారి తీస్తుంది. ప్రపంచ దేశాలతో పొల్చితే కేవలం ఒక శాతం విడాకులతో అత్యల్పంగా నమోదైన దేశంగా ఇండియాకు పేరుంది. గరిష్టంగా విడాకులు బెలారస్‌ దేశంలో 68శాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేటులో చైనా 2.2 శాతం, ఇటలీ 2.7శాతం,కెన్యా 15 శాతం ,బ్రెజిల్‌ 21శాతం,అస్ట్రేలియా 38 శాతం,స్విస్‌ 40శాతం, జర్మనీ 41శాతం , కెనడా45శాతం,అమెరికా 49శాతం, ఉత్తర కొరియా మరియు నూజిలాండ్‌ 53శాతం, బెల్జియం 56శాతం,స్వీడన్‌ 64శాతం,రష్యాలో 65శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడాకుల పెరుగుదల రేటు 1960లో12 శాతం,1980లో 26శాతం,2000లో 25 శాతం,2010లో41శాతం,2017లో 44 శాతం,2020 నాటికి 51.8 శాతంగా నమోదు కాబడిరది. గత మూడేళ్ళలో వివాకుల రేటు 7.8 శాతం పెరుగుదల గమనార్హం. ఇండియాలో విడాకుల రేటు పూర్వంతో పోల్చితే క్రమంగా పెరుగుతోందని సంబంధించిన నిపుణులు వెల్లడిస్తున్నారు. మనదేశంలో విడాకులకు ముఖ్య కారణాలు- వివాహేతర సంబంధాలు, ఇరువురి మధ్య విశ్వాసం సన్నగిల్లడం, సంక్షోభాలు, బాల్యవివాహాలు, వితండ వాదనలు, ఆర్థిక సమస్యలు, చిర కాలంగా దంపతుల ఎడబాటు , గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక సమస్యలు, అహంభావ దోరణి, మానసిక వైకల్యం, సర్దుకునే దోరణి లేకపోవడం వంటివి ప్రముఖమైనవి. దేశ జనాభాలో 0.11శాతం అనగా1.36 మిలియన్ల మంది వివాహితులు విడాకులు తీసుకున్నారు. వారిలో పురుషుల కన్నా స్త్రీలు అధికం. దేశంలో విడాకుల సంఖ్య రాష్ట్రాల వారీగా మిజోరాం (6.34శాతం), మేఘాలయా (4.11శాతం ),సిక్కిం (2.16శాతం), కేరళ (1.59శాతం), మణిపూర్‌ (1.32శాతం), తమిళనాడు (1.22శాతం), మహారాష్ట్ర (1.08శాతం),వెస్ట్‌ బెంగాల్‌ (1.02శాతం ), ఆంధ్ర ప్రదేశ్‌ (1.12శాతం), గుజరాత్‌లో 1.08శాతంగా ఉంది. ఈ విడాకుల సంఖ్య గ్రామీణుల కంటే పట్టణవాసుల్లో , మద్యతరగతి కుటుంబాలలో, అందులోనూ విద్యాధికుల్లోనే నమోదు అధికం. విదేశీయుల్లో కంటే భారతీయుల్లో విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి ప్రదాన కారణం పూర్వం నుండే విడాకులనేది ఓ సామాజిక దురాచారంగా గుర్తించబడిరది. విడిపోయి జీవించటం అనేది ఒక అసామాజికమైనదిగా, దుస్సంస్కృతిగా భావించబడుతున్నది. వివాహేతర సంబంధాల్లో పురుషులు 75 శాతం,స్త్రీలు 25శాతం విడాకులు తీసుకుంటున్నారు. అందులోనూ 10 నుంచి 15 సంవత్సరాల వైవాహిక జీవితం గడిచిన తర్వాత 53శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. 20ఏళ్ళకు పైగా వైవాహిక జీవితం గడిపిన వారిలో విడాకులు చాలా అరుదుగా కన్పిస్తు న్నాయి. భారత్‌ లో వివిధ మతాల వారు హిందూ వివాహ చట్టం-1955 ను అనుసరిస్తున్నారు. ముస్లిమ్‌ విడాకులు ముస్లిం వివాహ చట్టం -1939, క్రిస్టియన్లకు భారతీయ విడాకుల చట్టం-1963, కుల మతాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం-1954 చేయబడ్డాయి. ఇతర కారణాలతో పోల్చితే ఉభయుల అంగీకారంతో విడాకులు తీసుకోవడం సులభంగా జరుగుతోంది.
పెళ్ళంటే నూరేళ్ళ మంట కాకూడదు
పెళ్ళంటే రెండువంశాలు కలిసే వేడుక. వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న ఇరువురిని ఒక బాటపై కలిసి నడవమని పెద్దలు ఏర్పాటు చేసే మొదటి మెట్టులాంటిది. అలాంటి సోఫానం శుభ్రంగా ఉండాలి కాని కలతలు, తగాదాలతో మొక్కుబడిగా చేసేవి, పాచి పట్టిన మెట్టులా తయారు చేయకూడదు. పెళ్ళంటే ఎవరికైనా కంగారు, హడావుడి సహజం. బాగా ధనవంతులైతే ఏమో చెప్పలేం గాని, మధ్య తరగతి, మరికొంచెం స్థితిమంతులైనా ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలు కాదు. పెళ్ళి సంబంధాలు వెతకటం ఒక యజ్ఞం. అయితే, పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపేసరికి పిల్ల తల్లిదండ్రులకి కాస్తోకూస్తో అప్పులు ఆపైన నిందలు. లక్షల్లో చేరిపోయింది. కట్నాల రేంజ్‌. చదువులు ఎంత పెరిగాయో, దానికి సమా నంగా కట్నాలు లాగుతున్నారు అబ్బాయి తల్లిదండ్రులు. పెద్ద చదువులు, సంస్కారం నేర్పడానికి బదులు ఆశలు, దురాశలు నేర్పుతున్నాయి. కట్నాలు వద్దని గొప్పలకు పోయి, దానికి బదులుగా కానుకలంటూ, పదిరెట్లు ఆడపిల్లల తండ్రులు దగ్గరలాగు తున్నారు. పెళ్ళికూతురు మాత్రం పెద్ద చదువు చదవాలి, ఉద్యోగం చేసి రెండు చేతులా సంపాదించి భర్త చేతిలో పోయాలి. పనిపాటలు రావాలి. అత్తగారు ఎలా చెబితే అలా తల ఊపాలి. అంత చదువు చదివిన పిల్ల వ్యక్తిత్వం చంపుకుని ఎవరేం చెబితే అలా తలాడిరచేలా అణగిమణిగి ఉండాలి. కొడుకు ఎక్కడ కోడలి మాట వినేస్తాడోనని అత్తా మామలు కంగారుపడుతుంటారు.కొంతమంది అబ్బాయిల తరఫువారు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తుం టారు. అందరికీ కూర్చోవడానికి వేసిన కుర్చీలు బాగోలేవని, భోజనాల్లో ఎక్కువ వెరైటీలు చేయించినా ఇంకా ఏవో తక్కువ అయ్యాయని, పెళ్ళికొడుకు స్నేహితులకి హోటళ్ళలో ఎ.సి. రూములు తీసుకోలేదని, పొద్దున్నే టిఫిన్లు తిరిగి రెండోసారి అడగలేదని వియ్యపురాలికి మాటమాటికి ఏం కావాలి? అని అడగలేదని సతాయిస్తుంటారు. కట్నాలు వద్దు, కానుకలు ఇవ్వండి అనే వారు కొందరు. పెళ్ళి బాగా చేయండి అంటూ పిల్ల తల్లిదండ్రి నుంచి ఎన్ని విధాలుగా రాబట్టాలో అన్ని విధాలా గుంజుకునేవారు కొందరు. మళ్ళీ పిల్లని కన్నతల్లిదండ్రులని గౌరవించరు. ఎంత పెద్ద చదువులు చదివినా సంస్కారం లేదని, ఇలాంటి పెళ్ళిళ్ళు రుజువు చేస్తున్నాయి. మర్యాద ఇచ్చుపుచ్చుకోమన్నారు. ఆడపిల్ల కన్నవాళ్ళని తేలిగ్గా చూసే తీరు మార్చుకోవాలి ఈనాటి వరుడి తల్లిదండ్రులు. ఒకసారి మనసులు బాధపడితే తర్వాత ఎంత మంచిగా మాట్లాడినా, అది నటనగానే ఉంటుంది అవతలి వారికి పెళ్ళిబాగా చేశారు అనే ఒక్కమాట కన్యాదాతకి ఎంత బలమిస్తుందో అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించాలి. గతంలో అయితే పెళ్ళిళ్ళు ఇంటి ముందే పెద్ద, పెద్ద పందిళ్ళు వేసి అందులోనే జరిపేవారు. ప్రస్తుత కాలంలో చిన్నచిన్న ఇళ్ళు, ఇరుకు గదుల్లో ఉండే సందర్భంలో అలాంటి అవకాశా ల్లేవు. కాబట్టి ప్రతిఒక్కరూ కళ్యాణ మండ పాలనే ఆశ్రయిస్తున్నారు. వీటిని కూడా ఆర్థిక తాహతుకు మించి బుక్‌చేస్తున్నారు. పెద్ద పెద్ద మండపాల్లో చేసుకునేబదులు, తక్కువ ఖర్చుతో చిన్నమండపాల్లో చేసుకుంటే కొంత ఖర్చు కలిసివస్తుంది. ఇంకా ఇలాంటి అనవ సరపు వాటికి, ఆడంబరాలకు అదనంగా ఖర్చు చేస్తుంటారు. ఒక విధంగా ఆలోచిస్తే ఇవన్నీ వృధాయే. పెళ్ళిపేరజరిగే కొన్ని ఖర్చులు తగ్గించుకుని, వధూవరులకు అందిస్తే వారు జీవితంలో కొంత ఒడిదుడుకులు లేకుండా, ఆర్థిక అవసరాలకు పనికివస్తాయి. ఒక రోజు జరిగే తంతుకి ఎక్కువ ఖర్చుల జోలికిపోకుండా పొదుపు చేస్తే, తర్వాత ఏఇబ్బంది లేకుండా కొత్తగా పెళ్ళిచేసుకున్న వారి జీవితం హాయిగా సాగిపోతుంది. ఈ విషయాన్ని వధూ వరుల ఇరువైపులవారు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తే పెళ్ళంటే నూరేళ్ళపంట అవుతుంది, లేకుంటే నూరేళ్ళ మంట అవుతుంది
గిరిజన తెగలలో వారి సంస్కృతి, ఆచారాలలో జరిగే వివాహ వ్యవస్థ ఆదర్శవంతమైనవి. భిల్లు, గొత్తికోయ వంటి గిరిజనులు ఆర్థిక వెసులుబాటు లేక సహజీవనంతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధ్యయనం చేసిన రaార్ఖండ్‌ లోని ‘నిమిట్టా’ అనే స్వచ్చంద సంస్థ 2016లో 200 జంట లను చేరదీసి పెళ్ళి చేసింది. వెంటనే మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేపించడంతోఆ మహిళలకు చట్టబద్దమైన హక్కులు లభించాయి. ఉత్తరాది రాష్ట్రాలలో వివాహ సంప్రదాయాలను పాటించాలని, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ హితమైన పెళ్ళిగా ‘ రాధాసోమి ‘ అనుసరిస్తున్నారు. ఈ వివాహ సంప్రదాయంలో శుభలేఖ ఖర్చు రూ.5,భోజనాలు ప్లేటుకు రూ. 13కు మించడానికి వీల్లేదు. అమ్మాయి తరపు అతిధితులు 65మంది, అబ్బాయి తరపు బంధువులు 85 దాకా హాజరు కావాలి. ఈ రాథాసోమి అనేది ఉత్తరాధిన బహుళ ప్రాచుర్యం పొందిన అనేక ఆధ్యాత్మిక తెగల్లో ఇదొకటి. ప్రేమ పెళ్లిళ్ల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు సమాజ ఆమోదయోగ్యంగా ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో మూడుముళ్ల వివాహ బంధం పట్ల పవిత్రత, పితృసామ్య వ్యవస్థ, వివాహిత ఇంటికి పరిమితం కావడం, సామాజిక విలువలు, గ్రామపంచాయతీ తీర్పులు, లింగ సమానతలు, పెద్దల మాటలు పాటించటం వంటివి మనదేశంలో విడాకుల రేటు తక్కువ నమోదుకు తోడ్పడుతున్నాయి. భారత హిందూ పవిత్ర వివాహబంధం మూడు పువ్వులు ఆరు కాయటంగా వర్ధిల్లుతూ, కుటుంబంలో నవ్వుల పువ్వులు పూయాలి. ప్రపంచ దేశాలకు బారతీయ వివాహవ్యవస్థ దీప స్తంభం కావాలి. ప్రస్తుత వివాహ వ్యవస్థలో ఆశించిన మార్పులు రావాలంటే సాంస్కృతికంగా సంప్రదాయంగా పెళ్లిల్లు రూపుదిద్దుకోవాలి. బాల్య వివాహాలను నిరోధించడానికి పేద, కార్మిక కుటుంబాలలో వ్యసనాలను తగ్గించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వివాహబంధం పటిష్ఠతకు అవసరమైన కౌన్సిలింగ్‌ కేంద్రాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలి. నవ దంపతులకు ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించాలి. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును బట్టి మదుపుతో, కాలుష్యానికి తావులేకుండా పర్యావరణ హితంగా,ఆరోగ్యకర వాతావరణంలో పెళ్లిల్లు జరిగితే శుభకరం !
వ్యాసకర్త : –గుమ్మడి లక్ష్మీ నారాయణ, ప్రముఖ సాహితీవేతత 9491318409