విపరీతం(వాక్ చిత్రం)
అదో అందమైన పల్లెటూరు పేరు ‘పెండ్యాల’ పట్టణానికి దగ్గరగా ఉన్న ఆ ఊర్లో, అన్ని భావాలు గల ప్రజలు కలిసి మెలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతుంటారు, అక్షర జ్ఞానంగల ప్రజలకు వర్తమాన రాజకీయాల పట్ల, నాయకుల పట్ల, అవగాహన బాగానే ఉంది, అసలే ఇది ఎండాకాలంతో కూడిన ఎన్నికల కాలం…అదిగో గ్రామ కూడలిలోని వేప చెట్టు కింద పంచాయతీ వాళ్ళు వేసిన సిమెంట్ బెంచీల మీద కూర్చున్న రామచంద్రయ్య,సూర్యం,కరుణాకర్,విశ్వక్, ఏదో మాట్లాడుకుంటున్నారు..
మనము చెవి వేద్దాం రండి….
రామచంద్రయ్య :-
హాయిగా ప్రొఫెసర్ జాబ్ చేసుకుంటూ లక్షలకు లక్షలు సాలరీ వచ్చే నౌకరితో బతకకుండా… ఎందుకీ లొల్లి అభ్యుదయం ఆవకాయ తొక్కు అని! ఇప్పుడేమైంది ఊరు గాని ఊర్లో జైలు కూడు తినుకుంటా‘రావు’కుహాయిగా ఉందా.!? సూర్యం :-అట్లెట్ల అనుకుంటావ్ చంద్రన్న కొమరం భీమ్ నీ లెక్కనే ఆలోచిస్తే ఇప్పుడు ఈ గోండు బిడ్డల పరిస్థితి ఎట్లుండేది!? ‘ఉద్య మం’ అంటే మనతోనే ఆగిపోయేది కాదు, అది విత్తనం తీరు భూమిలో పడి చనిపోయి కూడా కొత్త మొలకలు పుట్టిస్తది.
రా.చం :- ఏమి మొలకలో ఏమి ఉద్యమాలో అప్పుడు నడిచినయి గాని ఇప్పుడు కష్టమే…!!
సూర్యం : – నడవనిస్తేగా?? నడిచేది,ఆ మధ్య నారాయణమూర్తి పాపం అప్పులు చేసి కష్టపడి వాస్తవాలు ‘దండకారణ్యం’ సినిమాగా తీస్తే విడుదల కాకుండా ఆపారు మీ ధనవంతుల గుంపు.
రా. చం :- ఆపకపోతే ఏం చేస్తారు అన్ని అవకతవకల సినిమాలే నాయె..! 1978ల కరీంనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ జీ రుద్రయాగం చేయాల్సిన వాడు ఈ రావు మాటల మాయాజాలంలో పడి విప్లవాల బాట పట్టాడు.
సూర్యం :- ఎవరు ఎవరిని మాయాజాలంలో పడేస్తారు? అన్ని అవసరాల కోసమే అయితయి…!!
రా. చం :- మీ నారాయణమూర్తి సినిమాలన్నీ..అగ్రవర్ణాలు ధనవంతులు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లంతా విప్లవ ద్రోహులు పేదల పొట్టలు కొట్టేవారు అన్నట్టు చూపిస్తాయి గా!?
కిషన్ జీ అనే పరుశురాముడిని మమతా బెనర్జీ అనే ధీరశక్తి పొందిన సాయం కూడా మరిచి చివరికి ఎలా మట్టు పెట్టిందో ఎలా మర్చిపోగలం?
సూర్యం :- ఇంత అభ్యుదయ అవగాహన ఉండి ఈ యాగాలు,పూజలు, దేనికి చేస్తారు మీరు?
రా.చం :- ఈ కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, వారి వారి భావజాలంతో సమాజాన్ని ఎంత బ్రష్టు పట్టించాలో అంతా పట్టించారు, అది చాలదు అన్నట్టు ఆడవారిని హక్కుల పేరుతో చక్కని సంసారాల్లో నుంచి బయటకు లాగి వారి జీవితాలను చెల్లా చెదురు చేశారు, ఇలాంటి అకృత్యాలు నుంచి సమాజాన్ని కాపాడాలి అంటే పూర్వం మన పెద్దలు చెప్పిన క్రమశిక్షణ విలువలు కలిగిన ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లోకి వ్యాపింప జేయాల్సిన అత్యవసరం ఇప్పుడు వచ్చింది.
విశ్వక్ :- ఆపుండి మీ ఇద్దరి లొల్లి..శాస్త్రీయ విలువలకు పూజలకు పొంతన ఎట్ల అయితది??
రా.చం :- ఇప్పుడు కావాల్సింది శాస్త్రీయ విలువలు కాదు జాతీయ విలువలు.
విశ్వక్ :- మళ్లీ మీ వాదాలకే తీసుకుపోతున్నావా??
రా.చం :- నేను చెప్పేది ఏ వాదంతో కాదు మనమంతా ముందు భారతీయులం ఆతర్వాతే ఏదైనా ఈ జాతీయ విలువలన్నీ వీరుల ఆరాధన, భక్తి ఉద్యమాలు,పూజలు, హోమాలు,ద్వారా వచ్చాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే శాశ్వత సత్యాలన్ని జాతీయ విలువలతో ముడిపడి ఉన్నవే!!
విశ్వక్ :- అదెట్ట! చిత్రంగా చెబుతున్నావ్?
రా.చం :- అవును వాస్తవాలు తెలియకపోతే అన్ని చిత్రంగానే ఉంటాయి..
ఇండోనేషియాలో 90% కన్నా ఎక్కువగా ముస్లింలే ఉంటారు. అయినా వారు ఆ దేశంలో రామాయణ భారతాలను వారి జాతీయ సంపదలుగా గౌరవిస్తూ సరస్వతి, గణేష్, మార్కండేయ, పేర్లతో విశ్వవిద్యా లయాలు ఏర్పాటు చేసుకున్నారు. యోగ, ధ్యానం, అక్కడి పవిత్ర ఆధ్యాత్మిక విషయాలు, మన భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటి ని ప్రపంచానికి కానుకలుగా అందించింది,అన్న విషయం నేటి మీయూత్‌లో ఎంతమందికి తెలుసు!? విశ్వక్ : – చంద్రం మామ..!! మరి ఆ విలు వలు అన్ని మన దగ్గర లేకుండా ఎందుకు పోయాయి??
రా.చం :- జాతీయ ఉద్యమానికి, కొందరు విదేశీ తొత్తులైన మనవాళ్లే విఘాతం కలిగిస్తు, మాయ తెలియని అమాయక ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు, అలాంటివారి వల్లే మన భారత జాతీయ విలువలు అన్ని ఆధునికత, నాగరికత, పేరుతో కనుమరుగైపోతున్నాయి.
విశ్వక్ :- మామా!!..అసలు ‘‘జాతీయత’’అంటే ఏమిటి?సూటిగా సుత్తి లేకుండా చెప్పు. రా.చం :- మనదేశంలో జాతీయత ఉపజాతీ యత కులం మతం ప్రాంతంభాష అనే వాటిని అర్థం చేసుకోకుండా ఈ హేతువాదులు నాస్తికులు ఏమీ సాధించలేరు, చేతి పార్టీ వాళ్లు దీనిని కాస్త గమనించి బీ.సీ,దళిత, మైనారిటీ, విభాగాలు ఏర్పాటు చేసింది. ఇక కమలం పువ్వు వాళ్ళు కూడా అదే దారిన ముందుకు పోతున్నారు.
కరుణాకర్ :- ఈ అసమానతలు పోవాలంటే కులాంతర, మతాంతర, పెళ్లిల్లు జరగాలి, అలా కులాతీత, మతాతీత, వర్గాతీత, సమాజం రావాలి అప్పుడే మన దేశం ప్రశాంతంగా అభివృద్ధి చెందుతుంది అది జరగాలి అంటే ‘‘లౌకికవాదం’’ నర నరాన జీర్ణించుకున్న మా అభయహస్తం పార్టీకి అధికారం రావాలి.
రా.చం :- ఏమిటి ఏర్పడేది? ఇప్పటి మన విప్లవ హేతువాదులంతా సాంప్రదాయ పెళ్లిళ్లు చేసుకున్న వారే!! కానీ వారి ఉపన్యాసాల ప్రభావంతో ఆదర్శ వివాహాలు చేసుకున్న వారంతా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో!!? మనస్పర్ధలతో, ఏకం చేసే వాళ్ళు లేక, తల్లిదండ్రులను ఎదిరించి వచ్చిన ఆడపిల్లలు భర్త నుంచి వేరుపడి పుట్టింటికి పోలేక, ఎన్ని అవస్థలు పడుతున్నారు ??ఆపడే వారికి తెలుస్తుంది.
విశ్వక్ :- మన ముచ్చట ఎక్కడో మొదలై ఎటో పోతుంది??
రా.చం :- అటువంటి ఆదర్శ వివాహాలు చిరంజీవి లాంటి ధనవంతుల కుటుంబాలకే చెల్లుతాయి, మన బోటి మధ్య తరగతి,నిరుపేద కుటుంబాల వారికి అస్సలు కుదరవు.
కరుణాకర్ :- ఇప్పటివరకు వరవరరావు వంతు అయిపోయింది,ఇక చిరంజీవి మిగిలి పోయాడా? ఆయన చేసిన పాపం ఏమిటో సెలవీయండి !!
రా.చం :- చిరంజీవి సినిమాలు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్యస్థంగా ఉం డటం మాట వాస్తవమే ఆ మాటకొస్తే తెలుగు సినిమాకు కొత్త డాన్సులు నేర్పిన ఘనత కూడా ఆయనదే!!
విశ్వక్ :- మరి అంత ఆదర్శ వారిని పట్టుకుని ఏమిటా మాటలు!?
రా.చం :- ఏమి డ్యాన్స్ లో !! చిరంజీవి పాటలు రికార్డింగ్ డాన్సులు చేసే పోరంబోకు వెధవల కామపు వలల్లో ఎన్ని అమాయకపు కుర్రలు చిక్కి జీవితాలు నాశనం చేసుకున్నా యో ఆ సినిమాల ప్రభావంతో ఎంతమంది రెండు పెళ్లిళ్లు తప్పు కాదు హక్కు అనే భావం లో పడ్డారో మీకేం తెలుసు!?
కరుణాకర్ :- చంద్రం..బాబాయ్ సినిమాల్లో అవి అన్ని మామూలే!! మనసు మనసు కలిసి నప్పుడు శరీరాలు కలవడం పెద్ద అసమంజసం ఏమీ కాదు, ఆ సూత్రం సినిమా రంగం వారికే కాదు అందరికీ వర్తిస్తుంది.
రా.చం :- రస సిద్ధాంతం లోతులు బాగానే పరిశీలించావు కరుణాకర్…!!
కరుణాకర్ :- అదే మీ సాంప్రదాయ వాదులతో వచ్చిన చిక్కు, సంస్కృతి సాంప్రదాయాలకు మీరే దిక్కు అనుకుంటారు. మీ కళాతపస్వి ని మించిన పాండిత్య ప్రకర్ష కులు ఎందరో మన సామాజిక రంగం మార్పు కోసం పాటుపడుతున్నారు, అనే విషయం మర్చిపోకండి.
విశ్వక్ :- సమాజం నిరంతరం సామాజిక మార్పుకై పరిణామానికై ముందుకు పోతుంది, ఒక్కోసారి ఆర్థిక ప్రాతిపదికత ఉంటుంది, ఇది స్థిరీకరించబడిన తర్వాత సాంస్కృతిక ప్రాతి పదిక ఏర్పడుతుంది, ఒకరకంగా ఇవి రెండు పరస్పర ఆశ్రితాలు.
కరుణాకర్ :- ఏది ఏమైనా చంద్రంబాబాయ్, రావు, చిరంజీవి నీకు చేసిన అన్యాయం ఏమిటి?? వాళ్ల మీద నీకు ఎందుకా ద్వేషం??
రా.చం :- ద్వేషం కాదు ప్రేమ మనం ఎవరిని బాగా ఇష్టపడతామో వాళ్ళు తప్పులు చేస్తే సహించలేం కదా?? మన బాధ వ్యధ అంతా కోపంగా మారి వారిపై మనం అగ్నిపర్వతం లెక్క విరుచుకుపడతాం.
కరుణాకర్ :- అంతగా మీరు ఇష్టపడేది బాధపడేది ఆ ఇద్దరిలో ఏముంది!? రా. చం :-సాధారణంగా ఎవరైనా జీవితంలో 50 సంవత్సరాల పాటు ఒక సిద్ధాంతం ప్రకారం ఒక అవగాహనతో వెళ్ళినప్పుడు అవి మనం ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు వాటిని పునః సమీక్షించుకొని విచారించు కోవాలి,ఉదాహరణకు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు పద్ధతిలోనే భారత దేశానికి స్వరాజ్యం రావాలి అంటే కుదిరేదా!
సూర్యం :- కుదరదు కానీ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రష్యా, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చైనా స్వాతంత్రం పొందాయి కదా!?
రా.చం : -అవును సాధారణ దృష్టికి అలాగే అనిపిస్తుంది, కానీ ఏ నియంతృత్వం వద్దని ‘‘లెనిన్’’ చెప్పాడో.. అదేవిధానంతో ‘‘స్టాలిన్’’ ఒక వెలుగు వెలిగాడు కదా!?
సూర్యం :-అది అట్లా ఉంచండి అసలు వరవరరావు గారిని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీ దృష్టిలో ఆయన ఎవరు!?
రా.చం :- బ్రాహ్మణ సంతతికి చెందిన వాడు,
సూర్యం :- అసలు బ్రాహ్మణుల వృత్తి ఏమిటి??
రా.చం :- పౌరహిత్యం అందుకే వారిని పురోహితులు అని కూడా అంటారు.
సూర్యం :- మీ వివరణ బాగానే ఉంది కానీ పురోహితుడు అంటే అర్థం ఏమిటి!?
రా.చం :- పురం యొక్క హితం కోరి అందుకోసం కృషి చేసేవాడు అని అర్థం.
సూర్యం :- అంటే ఆ ఊరిలో దేవాలయాల్లో పూజలు చేస్తూ ఆ పురం యొక్క హితం కోరుతూ.. కాలచక్రం గణిస్తూ ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ప్రజలకు చెబుతూ వారికి మార్గదర్శనం చేయాలి కదా!?
రా.చం :- అక్షరాల అంతే..
సూర్యం :- అయితే సమాజంలోని అసమానతలు తొలగించే పనిలో భాగంగా పేదల పక్షాన నిలిచి వారిని చైతన్యం చేయడం కూడా పురోహితమే కదా? అంటే మా కమ్యూ నిస్టులు అందరూ చేస్తున్న పని అదే కనుక మేమూ… పురోహితులమే మరి..!!
రా.చం :- మీ మొండి వాదనలు మీవే కానీ ఎవరి మాట వినరు అందుకే నేటి ప్రజాస్వా మ్యంలో మీ స్థానం ఏమిటో ప్రజలు చెబుతూనే ఉన్నారు..! మేము మాత్రం మా లక్ష్యంతో ముందుకు పోతూ సాంస్కృతిక విద్రోహులను, అరాచక వాదులను,అదుపు చేసి భారత దేశ పునర్వైభవం సాధిస్తాం. మాకు వ్యక్తులు శత్రువులు కాదు, వారు చేసే చెడు పనులే మా నిత్య శత్రువులు.
సూర్య :- మీరు చెప్పేదొకటి చేసేదొకటి దళితులు ముస్లింలను బద్ధ శత్రువులుగా చూస్తారు, మన దేశ ప్రజలే మతాలు మారుతున్నారని ఒప్పుకుంటూనే.. సెక్యులరి జంను తెరచాటుగా వ్యతిరేకిస్తారు,మేము మాత్రం మీరు వ్యతిరేకించే సెక్యులరిజం తోనే విజయం సాధిస్తాం.
రా.చం :- మీ ప్రజాస్వామ్య ధోరణి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు,ఆనాడు నియంతృత్వ నిజాం పై,పోరాడి ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటున్నారు. మన దేశానికి పక్కలో బల్లెంలావున్న ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల, అరబ్ షేకుల అరాచకాల పట్ల మాట్లాడడానికి మీకు నోరు రాదు. ఇస్లామిక్ పురుషాధిక్యత మీకు కనిపించదు, కేవలం హిందూ పురుషాధిక్యతే మీకు కనిపిస్తుంది.
కరుణాకర్ :- అప్పటినుంచి వింటున్నా మీ సనుగుడు..
మీ ఇద్దరూ సాధించింది ఏమీ లేదు! సాధించలేరు కూడా..!!
మన దేశ ఆకాంక్షలను ఆశయాలను మా అభయహస్తం జాతీయ పార్టీనే తీర్చగలరు సుదీర్ఘకాలంగా మమ్మల్ని ఈ దేశ ప్రజలు అక్కున చేర్చుకుని పాలనా అధికారం అందిం చారు, ఏదో అప్పుడప్పుడు మాలో మాకు వర్గ పోరు ఎక్కువైనప్పుడు, ప్రజలకు మా మీద మొహం మొత్తినప్పుడు మధ్యలో పాలన మా అభయహస్తం చేజారి ఉండవచ్చు.. కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించే పార్టీ మాదే!!
రా.చం :- నిజమే మీ పాలనంతా కనిపించని నియంతృత్వమే! చాప కింద నీరులా విదేశీయతను పెంచి పోషించారు. భారతదేశం అనే భౌతిక రూపానికి సంపూర్ణ బ్రిటిష్ వాదాన్ని నింపి స్వదేశంలో పరదేశ పాలన అందించారు.
విశ్వక్ :- మధ్యలో పోయిన బ్రిటిష్ పాలన దేనికి? మన గురించి చెప్పండి.
రా.చం :- పోయింది అనుకుంటే సరిపో తుందా ఇక్కడ అమలు జరుగుతున్నది అదే కదా? ‘‘విభజించి పాలించు’’ బ్రిటిష్ వాళ్ళ తొలి పాలన సూత్రం.
విశ్వక్ :- అది ఇప్పుడు ఎక్కడ ఉంది?
రా.చం :- సిద్ధాంతాలతో పని లేకుండా శత్రువు యొక్క శత్రువుతో స్నేహం చేయడమే ఈ అభయ హస్తం వారి పని.
విశ్వక్ :- అది సరేగాని మామా..మధ్యలో చిరంజీవి నిన్ను ఏమన్నాడు? అతను అందరి వాడు కదా!?
రా.చం :- నిజమే తెలుగు సినిమా రంగంలో ఏ కులం అండదండలు లేకుండా ప్రతిభతో కష్టపడి ప్రజల మనసుల్లో స్థానం పొందాడు, అంతటితో ఆగకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎన్టీఆర్ లెవెల్లో పార్టీ పెట్టాడు బాగానే ఉంది..
అంత బతుకు బతికి చివరికి అభయ హస్తం పంచన ఎందుకు చేరినట్టు? తనను నమ్ముకున్న పోసాని వంటి వారిని అనాధలను చేయడానికి మనసు ఎలా వచ్చింది? సినీ నటనలో తను వలకబోసిన ఆదర్శాలను నిజజీవితంలో ఎందుకు ఆచరించలేదు??
విశ్వక్ :- ఇక ఆపండి మీ వాద ప్రతి వాదనలు మీ మాటల చాతుర్యంతో మీరు చేసిన చేస్తున్న పనులను చక్కగా సమర్థించు కుంటూ పథకాల పేరుతో ఉచితాలకు ప్రజలను బానిసలు చేసి, ప్రజల సొమ్మునే ప్రజలకు పంచుతూ మీ సొంత సొమ్ములు ఇస్తున్నట్లు పోజులు పెట్టకండి.
‘‘ఉచితాలే భవిష్యత్తుకు ఉరితాళ్లు’’ అనే నిజం ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుం టున్నారు. ప్రలోభాలకు లొంగకుండా మా పవిత్ర ఓటు హక్కు వినియోగిస్తాం, నాయ కులకు ‘‘ఓటరు ప్రజలు’’ అంటే వెన్నులో వణుకు పుట్టే అసలైన ప్రజాస్వామ్యం నిర్మించుకుంటాం.
రా.చం :- విశ్వక్…! చిన్నవాడివైనా విలువైన మాటలు చెప్పావు ఏ పార్టీ అయినా నాయకులైన ప్రజలంతా ఏకమై కదం తొక్కితే తలలు వంచి నిలవాల్సిందే!!
విశ్వక్ :- అవును మామా!! మన పెద్దలు ఆశించిన అసలైన ప్రజాస్వామ్యం ఏర్పాటు కావాలంటే దానికి మా యువతే నడుం బిగించాలి, ఆధునిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయాలి అందుకు ఈరోజే మొదలు పెడతాం.- సెల్:- 98668 37741. -డా: కాసర్ల రంగారావు