విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం

వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు ఒంటరివి.వృద్ధోపనిషత్‌లోని ప్రతీ పేజీ ‘మసకే’, సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే ‘‘వృద్ధాప్యం’’.కాలధర్మంలో దేహధర్మమే ‘‘వృధ్ధాప్యం’’.మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు’’వృద్ధోపనిషత్‌’’లో భాగస్వామి కాక తప్పదు.
జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక.
మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్‌ సిటిజన్‌ బడిలోకి అడుగుపెడితే సమాజం మనగురించి పట్టించు కోదు. పాత వస్తువులా ఓపక్కన పడేస్తుంది.‘‘ఆరోజుల్లో నేను’’ అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్‌ ఆలోచన వుండదు.
కాళ్ళు,కీళ్ళు,ఒళ్ళు సడలి,కదల్లేక,మెదల్లేక,దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతాకాదు.వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమోపాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యంరాగానే బయటి వాళ్ళు సరే కుటుంబసభ్యులు కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి. ‘‘ఏమండీ / నాన్నగారూ.’’ అంటూ విధేయంగా వుండే భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడిరగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా,యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా ‘చాదస్తం’ అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువ గా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే,మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచన తోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.
చివరి మజిలీ !!
మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువు లతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే,శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా,రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధా ప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడిరచి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి.వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది.కానీ దురదృష్టం యేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు. ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నాకొడుకు అమెరికా లోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్‌ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశా ల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధా ప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్‌గా వచ్చే సెల్‌ ఫోన్‌ కాల్స్‌ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో,మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్‌ చేస్తే ‘సారీ.! బిజీ.’ అంటూ సమాధాన మొస్తుంది.పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవ టానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం బాగుంటే అప్పుడ ప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్న ట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు. అనాథా శ్రమంలో అయితే వాళ్ళుకూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుం టారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధార పడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగాబతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థనుతలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్‌.!ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.
వృద్ధాప్యం శాపం కాదు..ఓ వరం.
ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్‌ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకో వచ్చు.ఏం చేసినా అఫెక్షన్‌ బ్యాంక్‌లో ఆప్యాయతని క్రెడిట్‌ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్‌ అవుతామో?మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు. సో..ఇప్పటికే సీనియర్‌ సిటిజన్స్‌ అయిన వారు, భవిష్యత్తులో సీనియర్‌ సిటిజన్స్‌ కాబోయేవారు జీవితాల మీద ఓలుక్కేసి వుంచుకోండి.!?
వృద్ధాప్య సంరక్షణ కోసం కొత్త దృష్టి
భారతదేశం పెరుగుతున్న పట్టణీకరణ మరియు కుటుంబాలు చిన్న యూనిట్లుగా విడిపోవడంతో,వృద్ధుల కోసం గృహాలు పుట్టుకొచ్చాయి. వృద్ధుల సంరక్షణ అనేది వృద్ధాప్య సేవలపై ఆసక్తి ఉన్న నిపుణులు లేదా స్వచ్ఛంద సంస్థలచే నిర్వహించబడు తుంది. అర్బన్‌ మరియు సెమీ అర్బన్‌ ఇండి యాలో ఇటువంటి సంరక్షణ గృహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ గృహాలు చెల్లించ బడతాయి లేదా ఉచిత లేదా సబ్సిడీ సేవను అందిస్తాయి. సాధారణంగా, ఇటువంటి గృహాలు ప్రభుత్వం నుండి మద్దతుతో ఎన్‌జీఓ లు మతపరమైన లేదా స్వచ్ఛంద సంస్థలు లేదా స్థానిక పరోపకారిచే నిర్వహించబడ తాయి.వారు తమ నివాసి తులకు వసతి, సకాలంలో సంరక్షణ మరియు భద్రతా భావాన్ని అందిస్తారు.ఈ గృహాలకు నియం త్రణ పర్యవేక్షణ లేకపోవడంతో సేవ యొక్క నాణ్యత మారుతూ ఉంటుంది. చాలా గృహా లలో స్పష్టంగా స్థాపించబడిన ప్రామా ణిక ఆపరేటింగ్‌ విధానాలు లేవు మరియు ఆరోగ్య సంరక్షణకు వారి రిఫరల్‌ మార్గాలు అనధికారి కంగా ఉంటాయి. వారి నివాసితుల మానసిక ఆరోగ్యంపై ఈగృహాల ప్రభావంతో సహా అటు వంటి సంస్థలలో జీవన నాణ్యతను అర్థం చేసుకోవడం అత్యవసరం.వృద్ధుల గృహాలకు అధికారిక విధానం భారతదేశానికి ఒక ముఖ్యమైన విధానం మరియు ప్రణాళిక సమస్య. భారతదేశం యొక్క వృద్ధాప్య జనాభా (60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 2050 నాటికి దాదాపు 8% నుండి దాదాపు 20%కి పెరుగుతుందని వరల్డ్‌ పాపులేషన్‌ ఏజింగ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.2050 నాటికి, వృద్ధుల శాతం 326 పెరుగు తుంది, 80 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్న వారి సంఖ్య 700 పెరగ నుంది, దీనితో వారు భారతదేశంలో అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న వయస్సు గల సమూ హంగా మారతారు. ఈ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ మరియు సామాజిక ప్రతిస్పందనలు ఈవాస్తవి కతకు అనుగుణంగా ఉండటం చాలా అవసరం. వృద్ధాప్యం అంటే భారమేనా?
జీవన ప్రమాణాలు పెరిగినందుకు సంతోషించాలా? వయోభారాన్ని పెద్దలు మరికొంతకాలం మోయాల్సి వస్తున్నందుకు చింతించాలా? అత్యాధునిక వైద్య పరిజ్ఞా నానికి మురిసిపోవాలా? కార్పొరేట్‌ దవాఖా నల మోతలను తలుచుకునివణికి పోవాలా? ఎలా చూసినా.. వృద్ధాప్యం సంక్షోభంలో పడుతున్న ఛాయలే కనిపిస్తున్నాయి.వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థికం నుంచి సామాజికం వరకు అనేకానేక సవాళ్లు చిరాకుపెడుతుంటాయి. వాటన్నిటికి పరిష్కారాలు అసాధ్యం కానేకాదు. ముందు జాగ్రత్తతో, పరిపూర్ణ అవగాహనతో ఆ సంక్షో భాన్ని దాటేయవచ్చు. వి.ఎస్‌.అచ్యుతా నందన్‌! భారతీయ ఫిడెల్‌ క్యాస్ట్రోగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి, ఆయన వయసు 83 ఏండ్లు. లాటరీ మాఫియా, అక్రమ కట్టడాల కూల్చివేత లాంటి విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.97ఏండ్లు వచ్చే వరకూ పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌! చరిష్మా లేకున్నా, మాటల మాంత్రికుడు కాకున్నా వ్యక్తిత్వంతో, మేధస్సు తో అత్యున్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి. 82 ఏండ్ల వయసులోనూ దేశాన్ని నడిపించిన మౌని. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతగా ఉన్న అద్వానీ కూడా ఎనిమిది పదులు దాటినవారే. ఇలాంటి నేతలెందరో, వయసును ఓ సంఖ్యగానే భావించారు. చురుకైన ప్రజా జీవితం గడిపారు. ఆ మాట కొస్తే నేతలే కాదు అన్నా హజారే లాంటి సామాజిక కార్యకర్తలు సైతం రాజీలేని పోరుతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మిలీనియల్‌ తరం మధ్య ఉంటూనే తాము నమ్మిన విలువల కోసం పోరాడుతున్నారు. గుల్జార్‌, శ్యామ్‌ బెనెగల్‌,రోమిలా థాపర్‌..80 ఏండ్లు దాటినా తమవైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఓ వ్యక్తిగా కాకుండా, వ్యవస్థకు మార్గ దర్శిగా ఉన్న వృద్ధుల జీవితాలు ఏమేరకు సౌకర్యంగా ఉన్నాయి? అనే ప్రశ్నకు సవాళ్లే జవాబుగా నిలుస్తున్నాయి.
వైద్యం.. ఖరీదైన వ్యవహారం
వృద్ధుల ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. కణ విభజనలో లోపంవల్ల వయసుతో పాటు అవయవాలూ బలహీనపడుతూ ఉంటాయి. ఇక డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వార్ధక్యంలోని ఒంటరితనంతో వచ్చే కుంగుబాటు లాంటి సమస్యలు సరేసరి. ఆ వయసులో వీటికి మందులు వాడటమే ఆర్థికంగా పెను భారం. ఇక హాస్పిటల్‌లో చేరాలన్నా, శస్త్రచికిత్స అవసరమైనా..ఆస్తుల మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి. కారణం! ఆసుపత్రి ఖర్చులకు అండగా నిలిచే ఆరోగ్య బీమా వీరికి అంత తేలికగా వర్తిం చదు. ఓఅయిదు లక్షల పాలసీ తీసుకో వాలన్నా.. నెలనెలా వేలకు వేలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక అనారో గ్యం ఉన్నవారిని బీమా సంస్థలు అంత త్వరగా కరుణించవు. ఓ ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ టారిఫ్‌ ప్రకారం..రక్తపోటు, మధుమేహం ఉన్న ఎనభై ఏండ్ల వ్యక్తికి పదిలక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కావా లంటే వార్షిక ప్రీమియం అక్షరాలా 84వేలు. మరేదో కంపెనీ అందులో సగానికి సగం ప్రీమియం వసూలు చేసినా.. నెలకు దాదాపు నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది. దశా బ్దాల క్రితమే రిటైర్‌ అయిపోయి..అప్పటి లెక్కల ప్రకారం పెన్షన్‌ పొందుతున్న వృద్ధు లకు ఇదంతా ఎంత భారం! ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోవు. అప్పటికప్పుడు కాకుండా, తక్కువ వయసులోనే పాలసీ తీసుకుంటే.. ప్రీమియంలో రాయితీ వస్తుంది. మిత్రులంతా కలిసి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే సౌలభ్యం కూడా ఇప్పుడిప్పుడే మొదలవు తున్నది. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి..ఆస్తిలో, ఆదాయంలో కొంత భాగాన్ని వైద్యానికి దాచి ఉంచడం మరో పద్ధతి. ఇలాంటి సందర్భాల్లో సమా చారమే కీలకంగా మారుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మధుమేహం, క్యాన్సర్‌, కుంగుబాటు తదితర సమస్యల మీద కృషి చేస్తూ ఉంటాయి. వాటిని సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తాయి. ఆ ఎన్జీవోలు నిర్వహించే వైద్య శిబిరాలను కూడా వినియో గించుకోవచ్చు. వృత్తిపరమైన సంఘాల్లో సభ్యు లుగా కొన్ని రాయితీలు దక్కించుకోవచ్చు.ఇక ప్రభుత్వాల తరఫు నుంచి కూడా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన,ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు వర్తిస్తా యి అనే అవగాహన కూడా ముఖ్యమే.
టెక్నాలజీ ఆసరా
కంప్యూటర్ల ప్రవేశంతో సాంకేతికత విస్తరిం చింది. కంప్యూటర్‌ వాడని కార్యాలయం.. స్మార్ట్‌ ఫోన్‌ లేని ఇల్లు కనిపించడం లేదు. టెక్నాలజీ ఊసే లేకుండా చదువు, కెరీర్‌ దాటేసిన తరం..హఠాత్తుగా వాటి మీద పట్టు సాధించడం కష్టమే. అందుకు చాలా కార ణాలే ఉన్నాయి.గతంలో ఎన్నడూ పరిచయం లేని క్లిష్టమైన విషయాన్ని నేర్చుకునేందుకు సంకోచించడం.దృష్టి సమస్య కారణంగా.. స్క్రీన్‌ మీది అక్షరాలను చదవలేకపోవడం. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రకారం 23 శాతం మంది వృద్ధులు ఈ ఇబ్బందితోనే ఆన్‌లైన్‌కు దూరంగా ఉంటున్నారు. చేతులు వణకడం లేదా వేళ్లు మొద్దుబారిపోవడంవల్ల టచ్‌ స్క్రీన్‌ ఉపయోగించలేకపోవడం.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)