లోక్‌ అధాలత్‌తో సత్వర న్యాయం

కోర్టు పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదా లకు వెనువెంటనే పరిష్కారం.. ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరిం చటానికి లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగపడు తుంది. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీకుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కార మార్గాలు చూపుతారు.లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవడానికి వీలులేని విధంగా పరిష్కారం చూపుతారు. దీంతో లోక్‌ అదాలత్‌లో వందలాది కేసులు (దావాలు) పరిష్కారమవుతున్నాయి. వివిధ కేసుల్లో బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా లోక్‌ అదాలత్‌లో పరిష్కారం లభిస్తుంది. సత్వర న్యాయం కూడా లభిస్తుంది.
ఏండ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో కేసులు లోక్‌ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పరిష్కారమవుతున్నాయి. ఇరు వర్గాలకు రాజీకుదిర్చి,ఇద్దరికీ సమ్మతమైన న్యాయాన్ని అందిస్తున్నారు. లోక్‌ అదాలత్‌లో మోటారు వెహికిల్‌ యాక్టుల్లోనూ, ఆబ్కారీ (ఎక్సైజ్‌) కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ తగదాల కేసులు, ఇలా పలు కేసులు పరిష్కరిస్తున్నారు.
లోక్‌ అదాలత్‌ అంటే ఏమిటీ..?
రాజీ పడదగ్గ కేసుల్లో బాధితులు, ముద్దాయిలు ఇరువర్గాలు రాజీ పడదలచినచో వారు కోర్టుకు వచ్చి డిసెంబర్‌ 11న రాజీ చేసుకోవచ్చు. ఇరువర్గాలను రాజీకుదిర్చి సత్వర న్యాయం చేయడమే లోక్‌ అదాలత్‌ లక్ష్యం. ఇందులో పరిష్కరించిన కేసులపై పైకోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదు.
లోక్‌ అదాలత్‌లో ఏఏ కేసులు రాజీ పడొచ్చు?
కొట్లాట,దొంగతనం,చీటింగ్‌,అసభ్య పదజాలం, అతిక్రమణ, వ్యభిచారం, పరువునష్టం,బెదిరింపు, భార్యాభర్తల గొడవలు,మెయింటనెన్స్‌ క్రిమినల్‌ కంపౌండబుల్‌ కేసులు,ప్రీ-లిటిగేషన్‌, టెలిఫోన్‌, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు రాజీపడొచ్చు.
లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలు ఏమిటీ..?
కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవడం తప్పుతుంది. సమయం, డబ్బుల ఖర్చు కలిసివస్తాయి. కోర్టు ఫీజు లేకుండా ఇరువర్గాలు సంతోషపడే విధంగా రాజీ కుదుర్చుకోవచ్చు. సత్వర న్యాయం లభిస్తుంది. ఇరువర్గాలకు మేలు జరుగు తుంది. కోర్టు ఫీజు తిరిగి ఇస్తారు. లోక్‌ అదాలత్‌ కేసులకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సాధారణంగా అప్పీలు ఉండదు.సంబంధిత న్యాయవాది,పోలీసు అధికారి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులను సంప్రదించవచ్చు.
న్యాయసేవా అధికార సంస్థ అంటే ఏమిటీ..?
పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం అందించే ఏర్పాట్లను న్యాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.డబ్బున్నా ,లేకపోయినా అందరికీ సరైనా న్యాయం అందించడానికి ప్రభుత్వం జాతీయ,రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిల్లో న్యాయసేవా అధికార సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చు.ఈ సేవలను పేదలు వినియోగించుకోవాలి.
లోక్‌ అదాలత్‌ ద్వారా బాధితులకు సత్వర న్యాయం దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌ ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పని చేస్తోందని గుర్తు చేశారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌ వద్ద శనివారం ఉదయం జరిగింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.లోక్‌ అదాలత్‌ లాంటి వేదికల్లో పౌర శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి పరిధిలోని రాజీకాగలిగిన కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు పరిష్కారానికి వస్తాయన్నారు. ప్రభుత్వ సంస్థలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కక్షిదారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
కార్యక్రమంలో భాగంగా గనవ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, కాలుష్య నివారణ పద్ధతులపై రూపొందించిన పోస్టర్ను జిల్లా కోర్టు న్యాయ మూర్తులు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ,మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి ఎం.వెంకటరమణ,ఫ్యామిలీ కోర్టు జడ్జి కె. రాధారత్నం, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి. సత్యనారాయణ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌. కృష్ణ మోహన్‌, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.-జిఎన్‌వి సతీష్‌