మా గుండెల్లో చెరగని మీ సింహసనం
ఆయన ఆదివాసీ హృదయాల్లో చెరగని సంతకం. పుట్టింది ఉన్నత కుటుంబంలోనైనా..ఆయన జీవితం ఆదివాసులకే అంకితం. వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు..విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆయనే రెబ్బాప్రగడ రవి. రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ ఏరియాలో ఆయన సేవలకుగాను చత్తీష్‌ఘర్ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో గిరిపుత్రులు..ఆదివాసుల ముద్దబిడ్డలు.. ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ అక్టోబరు 4న రెబ్బాప్రగడ రవిగారిని ఘనంగా సత్కరించింది. ఈ పురస్కార సభలో పరిశోధకుడు సురేష్ కుమార్ తన స్వీయ రచన నుంచి అందించిన అభినందన పత్రంలోని అంశాలు మన థింసా పాఠకుల కోసం యథావిధిగా ప్రచరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం -థింసా సెంట్రల్ డెస్క్.
ఆదివాసుల ఆప్తులు, సామాజికనాయకులు, నిర్వాసిత జన బంధు,బాలల మిత్రులు, యువతకు గురువు,తాత్వికులు,శ్రీయుత రెబ్పాప్రగణ రవిగారికి చత్తీస్‌ఘర్ రాష్ట్ర పీసా చట్టం వర్కింగ్ గ్రూప్ చైర్మపర్సన్‌గా నియమితులైన సందర్భంగా సమర్పించు అభి నందన ప్రసూనము సమానత్వము,మానవత్వము తపస్సులై సమాజ న్యాయం,ఇల సంరక్షణ అకుంఠ దీక్షాధారణలై పీడిత,బాధిత ప్రజా కావలికి,దుర్బల నిర్బలజన త్రాణమై మహోద యించిన ప్రభాకరా.. జయం జయం! దివాకరా… జయం జయం!
యోగులు,యోధులు,స్వాతంత్య్ర వీరులు-ఊరకరారు మహాత్ములు కారణజన్ములు, అవతార పురుషులకు జనోద్ధారణే జన్మఫలం ధర్మం తరిగి, అన్యాయం పెరిగితె రాముడు, గాంధీ వెలిసారు
గిరులు,రaరులు,తరువులు,నదులు-జీవాధారం,దైవసమం ఈ పరోప కారుల బాధలుబాపగ మన్యం మెట్టిన ఆపద్బాంధవ…జోహారు! పృధ్వీ రక్షక…జోహారు!
మింటికి రంగులు దిద్దాలా,మిన్నేటికి నడకలుచూపాలా,మున్నీరుకు గర్జన నేర్పాలా, పన్నీటికి పరిమళమద్దాలా కాగల కార్యం తీర్చే ఘనులు గమ్యస్థానం వెతకాలా నవ ప్రభంజనం యువతరంగమై కనుమలకే సెగసింది..నిప్పురవ్వలై,జన ప్రవాహమై ఎల్లలేక చెలరేగింది
మల్లాపురము,సూరంపాలెం,నిమ్మలపాడు,నియంగిరి,అరకు, బొర్రా,పాడేరు, పూలబంద టు బళ్లారి..తూరుపు కనుమల ఏ అడివైతే పులికేటి
భూవివాదమో,గనులాక్రమణో,పర్యావరణపు పెనుముప్పో,బాలల వేదన, మహిళలపీడన,హక్కుల భంగం,కుంగిన న్యాయం కష్టం తీర్చే కార్యమేదైతే మునికేటి..!
తుని తగువైనా,గని పోరైనా,ఠానా,న్యాయస్థానానైనా గూడెం అయినా,గల్లీ అయినా,ఢల్లీినగరపుబొడ్డైనా మేధావైనా,వేదాంతైనా,పదవీ,పట్టా,పైవాడైనా యెత్తులు, జిత్తులు కట్టే యుక్తికి, తేనెలతూటా మాటలకి ఎదురేలేని, బెదురే లేని ఆదిత్యునికి…జేజేలు! అజాతశతృవుకు…జేజేలు! నిప్పును కప్పేదేది, కాంతిని దాచేదేది,చురకత్తి చుపులు,మెలిపెట్టి మీసము, కేశరి జెబ్బచరిస్తే ఆటేది! బిర్లా పథకం,ప్రభుత్వ బలగం,ఆశాపాశం, చీమలదండు..కదపవు అంగధ పాదాన్ని, అణచవు అనల ప్రవాహాన్ని
సత్యం,శాంతి,సౌభ్రాతృత్వం,కూరిమి,ప్రేమ,సుహృద్భావం నీచేతిలో ఒదిగిన తల్వార్లు-బందూకు బలాలను తలదన్ను ధైర్యం,శౌర్యం,నిగర్వం,అహింస, ధృఢసంకల్పం, క్షమ, నిర్భయత్వం పొదగిన మణులై,ఎదిగిన ఒదిగే, ఒదు గుతు ఎదిగే నీ కీర్తి మకుటాన విరాజిల్లు.సభలు,యాత్రలు,పరిశోధనలు,చర్చాఘోష్టులు,పత్రిక రచన,కోర్టుదావాలు, ర్యాలీలు,ప్రజాచేతనమే సాధనాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం, యువత శిక్షణ, జన సంక్షేమంకై,సమత, క్రైనెట్, ఎమ్‌ఎమ్.పీ,ధింసా వ్యవస్థ లేకతాటిపై ఏకధాటిగా వేగంతగ్గని గమనం,దూరం కొలవని పయనం..అలుపే ఎరగని ప్రస్థానం, నీప్రతి మజిలీ ఓప్రబంధం రమణీయంగా రాతిరి బసకై రమ్మని ఉరిస్తే ప్రయాణ మింకా ఉంది,తీర్చగ బాసలు మిగిలే ఉన్నాయంటావ్ కర్తవ్యాన్నే విలాసమంటూ,కార్యధీక్షతే విహారమంటూ చక్రం పట్టిన చక్రధారీ… జిందాబాద్! ఓబహుదూరపు బాటసారీ…జిందాబాద్!
హృదయం మృదులం,జ్ఞానమపారం,నిశితం బుద్ధి,సుదూరందృష్టి ఓర్పు, నేర్పు,వీడని పట్టు,కూర్పు,తీర్పు,దిశా నిర్దేశం కళలు,భాషలు,భావాలు, కవి త్వం,సంగీతం,గీతం,చిత్రాలు,రాతలు లోతుగ చదివే గ్రంధసాంగునికి-సలాములు! బహుముఖప్రజ్ఞాశాలికి …సలాములు! ఆదివాసీ ఆప్తుడు, సామాజికనాయకులు, నిర్వాసితుల బంధువు, బాలల మిత్రుడు, యువతకు గురువు, తాత్వికులు, శ్రీయుత రెబ్పాప్రగణ రవి గారికి..! మనుషులది ఆశ మీది ఆదర్శం,మీ నిశ్వార్ధ జీవన యానం ఎన్నో పూలు,ముళ్లమయం. పూలు కురిస్తే మురవకు, ముళ్లు మొలిస్తే వెరువక ముందునడిచి మాకు బాటను చూపారు మీరాక మన్యవాసుల వరం,మీరులేని భారత ఆదివాసీ జీవనం కర్ణుడులేని భారతం. ఎన్నో సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు బహుమానాలు. ఏవీ మీ చూపులలో లేవు, మీకేది సరిరాదు. వాటిని మించి మాఆనందానికి కారణమైన మీకు, మీ గురుతులకు మాగుండెలలో చిరస్థాయిగా చెదరని సింహాసనం మాత్రమే మేమివ్వగలిగేది!
సామాజిక సేవలో రవి కిరణం.
ఆదివాసీ తెగల జీవన సామాజిక సేవలో ఆయనో రవి కిరణం. నాగరిక సమాజానికి ఆమడ దూరంలో అమాయకంగా జీవిస్తున్న ఆదివాసీల హక్కులు కాపాడుతూ, వారి వనరుల పరిరక్షణకు ఆయన యవ్వన కాలాన్నింతా దారపోశారు.రాజ్యాంగబద్దంగా నిశబ్ధ విప్లవానికి తెరలేపారు. గిరిజనుల హృదయాల్లో ఆశాజ్యోతిగా నిలిచారు.వారి జీవితాల్లో వెలుగు నింపారు. దేశంయావత్తూ ఒక్కసారిగా ప్రభుత్వేతర సంస్థల పదునేమిటో ప్రత్యక్షంగా చవిచూసిన సంఘటన 1997నాటి సమత తీర్పు. గనుల గుత్తాదారు రంగంలో పేరుమోసిన బిర్లా పెరిక్లస్ కంపెనీ గిరిజన ప్రాంతం నుంచి తరిమికొట్టారు. ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తూర్పు కనుమల్లో గనుల తవ్వకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ద్వారా సమత వాదన సరైందేనని తీర్పు పొందిన ఘనతకు మూల కారకుడయ్యాడు. వారి సేవలకు ప్రతిరూపంగా జాతీయస్థాయిలో ఎన్నో పదవులు అధిరో హించారు.ఆంధ్ర విశ్వకళాపరిషత్ కోర్సు సెలక్షన్ కమిటీ సభ్యులు,10వ పంచవర్షప్రణాళికలో లా అండ్ పాలసీలో సభ్యులుగా పనిచేశారు.12వ పంచవర్ష ఆర్ధిక ప్రణాళిక స్టీరింగ్ కమిటీ మరియు ఆదివాసీ సాధికారిత కమిటీ సభ్యులు,అటవీ హుక్కుల చట్టం కమిటీ సభ్యులు జాతీయ స్థాయిలో పదవులు చేపట్టారు. సామాజిక సేవారంగంలో ఆదివాసీ తెగలకు చేసిన నిరంతర సేవా కార్యక్రమాలకు గుర్తుగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఐదో షెడ్యూలు ప్రాంతమైన చత్తీష్‌ఘర్ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్ గ్రూపు చైర్ పర్సన్‌గా ఆరాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సామాజిక సేవా స్పూర్తి కలిగిన ప్రతి వ్యక్తి ప్రజల గుం డెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారనడానికి నిదర్శనం సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి. విజయనగరం,విశాఖపట్నం,తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో యాత్ర చేపట్టారు.గిరిజన ప్రాంతాల్లో లేటరైట్,బాక్సైట్ తవ్వకాలు చేపడితే అక్కడ నిక్షేపమైన నీటివనరులు,దెబ్బతిని గిరిజన ప్రాంతానికే కాకుండా దిగువున ఉన్న నదులు, రిజర్వాయుర్లు, చెరువులకు నీటివనరులు తగ్గిపోయి సాగు,త్రాగునీటి కొరత ఏర్పడుతుందని చాటిచెప్పి నెలరోజుల పాటు కాలినడకన నడిచి కోస్టల్ రూరల్ యాత్ర చేపట్టి ప్రభుత్వాలను మేలుకొలిపారు.
బీడీ శర్మ,ఎస్.ఆర్.శంకరన్ స్పూర్తితో
సామాజిక సేవా ధృక్పధంతో ప్రజలకు సేవలం దించిన ప్రముఖ ఐఏఎస్ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్.ఆర్.శంకరన్ గార్ల స్పూర్తితో పీసా చట్టం సాధనలో ఎంతో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,ఒరిస్సా,చత్తీషఘర్ రాష్ట్రాల్లో ఎంతో మంది గిరిజన యువకులకు పీసా చట్టం పట్ల చైతన్య పరచడానికి శిక్షణలు ఇప్పించారు. సమత తీర్పు,పీసా చట్టం ఉన్న ఐదోవ షెడ్యూలు ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో గిరిజనులు తమ హక్కులు ఉల్లంఘన,వనరులు దోపిడికి గురవుతున్న నేపథ్యాన్ని బీడీశర్మ, శంకరన్ గార్లతో కలసి ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. 2001లో బిడిశర్మతో ఛత్తీష్ ఘర్ రాష్ట్రంలో సుదీర్ఘమైన ప్రయాణం చేశాను. జగదల్‌పూర్ జిల్లా నగర్నర్ ప్రాంతంలో నిర్మించిన ఎన్‌ఎండీసీ కంపెనీవల్ల నిర్వాసితులైన ఆదివాసులను సందర్శించాను. అక్కడ నిర్వాసితులతో పీసా చట్టం ప్రాధాన్యత,సమత జడ్జిమెంటు విశిష్టతపై అవగాహన కల్పించాం. నగర్నర్‌లో సమత జడ్జెమెంట్ ప్రకారం 2003లో స్పాంజ్‌ఐరన్ ఇండియా లిమిటేడ్ పాలవంచ ప్రవేటీకీకరణ వ్యతిరేకించి వారికి న్యాయం చేయడం జరిగింది. కోర్బాలో బాల్కో ప్యాక్టరీ ప్రైవేటీకీకరణ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కార్మికులకు మద్దుతు ప్రకటించి, సమత జడ్జిమెంటు ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను ప్రైవేటీకీకరణకు విరుద్దమని అక్కడ బాల్కో కంపెనీ కార్మికులకు సంఫీుభావం ప్రకటించాం. బీడీశర్మ గారితో కలసి బస్తర్ ప్రాంతంలోని అనేక ఆదివాసీ ప్రాంతాల్లో పీసాచట్టం పట్ల అవగాహన కల్పించి పీసా చట్టం,గ్రామసభల విశిష్టతను వివరించాం.సొవ్వా పంచాయితీకిచెందిన మాలీస్ ఆదివాసీ తెగలలో కొంతమంది యువకులద్వారా సెంద్రీయ ఎరువులతో పండిరచిన కూరగాయలను ఉత్పత్తి చేయించి వాటిని విశాఖనగరంలో రైతుబజార్లు ఏర్పాటు చేయించడం జరిగింది. వారిన్ని ఒక సంఘంగా నియమించి ఐటీడీఏ ద్వారా నగరానికి కూరగాయలు తరలించేందుకు రెండు వాహనాలను మంజూరు చేయించడం జరిగింది. పీసా గ్రామసభ అధికారిక ప్రకారం స్థానిక వనరులపై గిరిజన యువకులకు ఆదాయం కల్పించేందుకు కటిక జలపాతం వద్ద టోల్‌గేట్ ఏర్పాటు చేయించి వారికి ఆదాయం కల్పించడం జరిగింది.ఇంకా రవిగారు సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. ఆదివాసీ గిరిజన హక్కులు పరిరక్షణలో వారు చేసిన సేవలు షెడ్యూల్ ప్రాంతాల గిరిజన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అడవి,భూమి,వనరులు,పర్యావరణ పరిరక్షణ,గనులు వనరుల పరిరక్షణ ఆయన జీవిత పోరాటంగానే మలుచుకున్నారనడంలో సందేహం లేదు.– గునపర్తి సైమన్