మహానీయ స్వామి వివేకానంద

మహనీయ స్వామి వివేకానంద ఉన్నతమైన ఆశయాలు ఏదోఒకరోజు సర్వజనాంగీ కారాన్ని పొందుతాయి. కారణం ఆభావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ,ప్రతీ ఆలోచనా విధా నంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి,పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచు కుని,అర్థనిమీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేక మం తమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయాలను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించడం, ఆ సౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింపచేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంత రాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృ తమైన కొత్త విషయాలను అనుభ విస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసు కుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంతర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడ్కె ఉండేవారు.జ్యోతిర్మయ ప్రకా శంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనా త్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆచ్కెతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చ్కెతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తు నంత స్పష్టంగా చూశాను,మతం అనేది అను భూతి పొందవలసిన సత్యం,లోకాన్ని మనం అర్దం చేసుకోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో న,కర్మ,భక్తి,యోగ మార్గాలో కానరాని మెరు గులు ఆస్వాదించి వారి వచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసం గం బాహ్యంగా ఎగసిన ఉత్సాహపు టలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారతదేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది.‘‘నేను ఎవరిని?ఆసియా వాసినా? ఐరోపా వాసినా?అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో…‘‘అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు అస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కలలో తగులబెడతారు పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిల బెడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు’’
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘ టించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పే వారు.జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది.మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమతత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదిం చేవాడు.మతం అనేది సిద్ధాంత రాద్ధాంత ములతో లేదు అదిఆచరణలే ఆధ్యాత్మికంగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసించేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరునిగా భావిం చారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటు వంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతి మౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసు లను దోచుకోవడం గమనార్హం. అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్యనిష్టుని సాన్ని హిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకా నంద ఆత్మ్ఞనంలో సుప్రతిష్టుల్కె ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారతదేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమ డిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగిం చారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయిన ప్పటికి,ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వంతో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ‘‘ఓభారతమా! నీఆధ్యా త్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత,త్యాగశీలత,సౌభ్రాతృత్వాల సందేశా లను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజయం సాధించారు.దుస్తరమైన అద్వ్కెతాన్ని కళాత్మ కమైనదిగానూ,సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదాయాలను అత్యంత శాస్త్రీయంగానూ,ఆచరణ యోగ్యం గానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరిం చేవారు. సత్యమనేది మతానికి ఆపాదించటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీర గంభీరత్వంతో ఎన్నో ఆటుపోటు లను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు.‘‘మన జాతీయ ఆత్మన్యూన తాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి.లేఖ మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారంభించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించు కున్న మనస్సులో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయనటంలో అతిశ యోక్తిలేదు. ‘అక్కడ సూర్యుడు ప్రకాశించ డు.చంద్రతారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు.ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి.దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’ ‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను,ఆతరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవాల్సిందిగా మిమ్మల్ని కోరు కుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు,వెనుకబడ్డ వారికిసేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘అని ఉద్భో దించి భారతీయ యువతకుదిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమ యంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురి చేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేతస్వామి.తన 33ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధ్కెర్యంసడలి,దౌర్భ్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామ కృష్ణు శిష్యుణ్ణి నేను’’అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్తదౌర్భ ల్యాలు,అధ్కెర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజనది నోత్సవం’’గా ప్రకటించింది.‘‘జనన మరణాలు సహజం,కాని నాభావనలు మావ వాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం,సర్వదా ఆచరణీయం.- (డాక్టర్‌.దేవులపల్లి పద్మజ), వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి, విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం,ఫోను. 9849692414