మరో వయనాడ్ ఎలా ఆపాలి..?
వయనాడ్ ఒక ప్రదేశం మాత్రమే కాదు. పర్యావరణ దుర్ఘటనలకు అదొక ప్రతీక. అటువంటి విపత్తులు మరెన్నో సంభవిం చేందుకు ఆస్కారమున్న పరిస్థితులకూ వయనాడ్ ఒక తాజా ప్రతీక.సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్‌లో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడిన దుస్సంఘటనకు బాధ్యులు ఎవరు? ఎవరి అలక్ష్యం ఆ ఉపద్ర వానికి దారితీసింది? ప్రాణనష్టం, ఆస్తినష్టం హృదయ విదారకంగా వాటిల్లేందుకు కారణ మైన ప్రమాదం అనివార్యమైనది కాదు.నేను నా గత కాలమ్‌లో ఈ అంశాలను చర్చించాను (ఆగస్టు15,‘వయనాడ్ విపత్తుకు కారకులు ఎవరు?’).
మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు. ఆ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజ లను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. విషాదసీమ వయనాడ్ ఘోషిస్తున్న సత్యమది. వయనాడ్ విలయం వాటిల్లి నాలుగు వారాలు గడిచిపోయాయి.మనదృష్టి వేరే ప్రదేశాలలో వాటిల్లిన ప్రాకృతిక విధ్వంసాల పైకి మళ్లింది. అక్కడా ఇక్కడా, ఈ ధరిత్రిపై మరెక్కడైనా కొట్టివేయలేని ఒక సుస్థిర సత్యంగా ఉన్న వాతావరణ మార్పు, వయనాడ్ వినాశనంలో నిర్వహించిన పాత్రనూ నా గత కాలమ్‌లో వివరించాను. పశ్చిమ కనుమలలోని వయనాడ్ ప్రాంతం ఇప్పటికే దుర్బల పర్యావరణ సీమగా మారిపోయింది. విచక్షణారహిత మానవ కార్యకలాపాల మూలంగా వాతావరణ వైపరీత్యం పెచ్చరిల్లడంతో వయనాడ్ ఒక విషాద సీమగా పరిణమించింది. అందుకే పర్యావరణ విపత్తులు సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకు వయనాడ్ ఒక ప్రతీక అన్నాను. మరి మరో ‘వయనాడ్’ సంభవించకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?
తొలుత వయనాడ్‌లో అభివృద్ధి కార్యకలాపాలు అమలవుతున్న తీరుతెన్నులను అవగతం చేసుకుందాం.నా సహచరులు రోహిణి కృష్ణమూర్తి, పులాహ రాయ్ ఆ‘అభివృద్ధి’ని నిశితంగా పరిశీలించారు.జూలై 29 అర్ధరాత్రి వయనాడ్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన నివారింప సాధ్యం కానిదని వారి దర్యాప్తులో వెల్లడయింది.భీతి గొల్పుతున్న వాస్తవమది. మరింతగా వివరిస్తాను. వెల్లెరిమల గ్రామ పరిధిలో కొండచరియలు విరిగిపడ్డాయి.సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా కె.కస్తూరి రంగన్ కమిటీ నివేదిక (2013)పేర్కొన్న గ్రామాలలో వెల్లెరిమల కూడా ఒకటి. ‘పశ్చిమ కనుమల సమగ్ర సుస్థిరాభివృద్ధికి అనుసరించవలసిన పద్ధతులను’ సిఫారసు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆ కమిటీలో నేనూ ఉన్నాను. గ్రామ వైశాల్యంలో ఇరవై శాతానికి పైగా సున్నిత పర్యావరణ ప్రదేశాలు ఉన్న గ్రామాలు అన్నిటిలోనూ ప్రకృతి వనరులను మరింతగా ధ్వంసం చేసే అభివృద్ధి కార్యక లాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.ముఖ్యంగా మైనింగ్,క్వారీయింగ్ లాంటి విధ్వంస కార్యక లాపాలను అసలు అనుమతించవద్దని కూడా కస్తూరి రంగన్ కమిటీ స్పష్టంగా సూచించింది. నవంబర్ 2013లో కస్తూరి రంగన్ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఐదవ సెక్షన్ కింద వయనాడ్ జిల్లాలో 60,000చదరపు కిలో మీటర్ల సువిశాల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదని ప్రకటించింది. మైనింగ్,క్వారీయింగ్‌తో సహా ఆప్రాంతంలో నిర్దిష్ట అభివృద్ధి కార్యలాపాలు జరగకూడదని ఆంక్షలు విధించింది.అయితే కేరళ ప్రభుత్వం ఆ సిఫారసులకు ఒక సవరణను కోరింది సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా పేర్కొన్న గ్రామాలలో నిలిపివేయడానికి వీలులేని ఇతర అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతున్నందున అటువంటి గ్రామాలను పూర్తిగా సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రత్యేకించకూడదని తమ సొంత కమిటీ ఒకటి నిర్ధారించిందని, కనుక ఆ గ్రామాలను మాత్రమే పాక్షికంగా సున్నిత పర్యావరణ గ్రామాలుగా ప్రకటిం చాలని కేరళ ప్రభుత్వం అభ్యర్థించింది. కస్తూరి రంగన్ కమిటీ సున్నిత పర్యావరణ ప్రాంతా లుగా పేర్కొన్న 13గ్రామాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పులహరాయ్ పరిశీలిం చారు.ఆ13గ్రామాలలోను15క్వారీయింగ్ ప్రదేశాలు ఉన్నట్లు వెల్లడయింది. ఒక్క నూల్ పూరa్హ గ్రామంలోనే 6 క్వారీయింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంగా ప్రత్యేకించిన భూములలోనే అవన్నీ ఉన్నాయి. ఈ నియ మోల్లంఘన కథ ఇంకా ఉంది. 2017లో మైనింగ్ నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించిందని రోహిణి పరిశోధనలో వెల్లడయింది. ఒక నివాస గృహానికి 50 మీటర్ల ఆవల అటవీ భూములు, కొండ వాలు ప్రాంతాల్లోగానీ ఎక్కడైనా సరే పేలుడు సామగ్రిని ఉపయోగించేందుకు ఆ సవరణలు అనుమతిచ్చాయి.అంటే మీ ఇంటి వెనుక ఉన్న కొండలను అస్థిరపరిచే పరిస్థితులను సృష్టించడం చట్టబద్ధమే అవుతుంద!. ఈపరిస్థితులను నివారించేందుకు మనమేమి చేయాలి అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. పశ్చిమ కనుమల పర్యావరణ రక్షణకు తొలుత మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫారసులను,ఆ తరువాత కస్తూరి రంగన్ కమిటీ సూచనల అమలును సున్నిత పర్యావరణ ప్రాంతాల ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాంతాలలో పర్యటించి నప్పుడు పర్యావరణ పరిరక్షణ చర్యల పట్ల ప్రజల విముఖతను నేను స్వయంగా గమనిం చాను. పరిరక్షణ పద్ధతులు, చర్యలను ప్రజలు వీథులలోకి వచ్చి నిరసిస్తున్నారు. వారు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారా? వాస్తవమేమిటంటే సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా తమ తోటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, తాము అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులపై ఆంక్షలు విధించవచ్చని వారు భయపడు తున్నారు. వారి భయాందోళనలకు కారణమేమిటి? పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం, అదీ హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తుండడమే సుమా! పర్యావరణ పరిరక్షణ విధానాల రూపకల్పనలో మనం ఈ వాస్తవాలను తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ వ్యవస్థల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను మనం శీఘ్రగతిన మార్చుకోవల్సివుంది. వాతావరణ మార్పు పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది తప్పనిసరి. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటు న్నందున ప్రకృతి వనరులకు హాని కలిగిస్తున్న సదరు కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలనే భావన ప్రాతిదికన పర్యావరణ పరిరక్షణ విధానాలను రూపొందిస్తున్నారు. ఇది సరైన విషయమే కావచ్చు గానీ మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు.. ఇది వాస్తవం. ఆప్రాం తాలు జనవాసాలు మాత్రమే కాదు, వ్యవసాయ భూములకు నెలవులు కూడా. మరి అటువంటి సున్నిత పర్యావరణ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజలను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. ఇందుకు ఆ ప్రాంతాలలోని సామాజిక సముదాయాలకు ప్రయోజనకరమైన ప్రోత్సాహకాలు సమకూర్చాలి.
కాఫీ,తేయాకు తోటల పెంపకం, పర్యావరణ-పర్యాటకం మొదలైన హరిత జీవనాధారాల ప్రాతిపదికన అభివృద్ధి పథకాలు రూపొందించు కోవడం చాలా చాలా ముఖ్యం. ప్రజల భూములను వారి భాగస్వామ్యంతో సంరక్షిం చడాన్ని మనం నేర్చుకోవాలి. వయనాడ్ విపత్తు చెప్పుతున్న సత్యమది. వాతావరణ మార్పు చిక్కులు జటిలమవుతోన్న ఈకాలంలో విషాదసీమ వయనాడ్ పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. మనం వాటిని నేర్చుకోవాలి. నేర్చుకోవడమంటే పర్యావరణకు అనుసరించే పద్ధతులను మార్చుకోవడమే. పర్యావరణ పరిరక్షణలో గుణప్రదమైన మార్పును సత్వరమే సాధించలేనిపక్షంలో మన మనుగడ శాశ్వతంగా అపాయంలో పడుతుంది.
అదుపులేని వినియోగమే అసలు సమస్య
భారత్‌కు, వచ్చే నెల ప్రత్యేకమైనది. అవును, జూలైలో, జనాభా విషయంలో మనం చైనాను అధిగమించబోతున్నాం.ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ప్రస్తుతం చైనా జనాభా 145కోట్లుగా ఉన్నది.భారత్ జనాభా త్వరలోనే ఆ స్థాయికి చేరుకుని, అధిగ మించనున్నది.మరి కొద్ది రోజులలో ఈ మహా మార్పు సంభవించనున్నది. సరే, ప్రపంచ అగ్రగామి కానున్న జన భారతం పర్యావ రణంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనున్నది? నేను పదే పదే అడిగే ఈ ప్రశ్నను ఇప్పుడు ప్రత్యేకించి మరీ అడుగుతున్నాను. పెరుగుతున్న జనాభా మనుగడకు మరిన్ని వనరులు అవసరం. జనాభా పెరుగుదల పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని భావించనవసరం లేదు. ఎందుకంటే ఇంచు మించు 37కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికా, రెండున్నర కోట్ల జనాభా మాత్రమే ఉన్న ఆస్ట్రేలియా భారత్ కంటే పర్యావరణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆయా దేశాలు ఉపయోగించుకుంటున్న జీవ వన రులను గణించిన ‘ఎర్త్ ఓవర్ షూట్ డే’ అనే బృందం ఒకటి ఇలా అంచనా వేసింది: ఈ ధరిత్రిపై ఉన్న ప్రతి ఒక్కరూ అమెరికన్‌లా జీవించాలంటే ఐదు భూగోళాలు అవసరమవు తాయి. ఒక ఆస్ట్రేలియన్‌లా జీవించాలంటే 4.5 భూగోళాలు అవసరమవుతాయిబీ ఒక భారతీయుడులా జీవించాలంటే మన భూగోళం లో 0.8శాతం భాగం సరిపోతుంది! తక్కువ జనాభా ఉన్న దేశాలే వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉద్గారిస్తూ మానవాళి మనుగడకు ముప్పును ముమ్మరం చేస్తున్నాయి. చెప్పవచ్చిందేమిటంటే పర్యావరణ సమస్యలకు జనాభా పెరుగుదల నేరుగా కారణం కాదు. దేశ ప్రజల వినియోగ రీతులే పర్యావరణ శిథిలత్వానికి దారి తీస్తున్నాయి. సంపన్న దేశాల వినియోగంతో పర్యావరణానికి జరుగుతున్న హాని తీవ్రంగా,విస్తృతంగా ఉం టోంది.భూమి,నీరు,అడవులు మొదలైన సహజ వనరులను అవి అపరిమితంగా ఉపయోగించు కుంటున్నాయి. శిలాజ ఇంధనాలను ధనిక దేశాలు వాడుకొంటున్న తీరు తెన్నుల వల్లే భూ తాపం పెరిగిపోతోంది. మరి సంపన్న దేశా లలో గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు కనిపించ డానికి కారణమేమిటి?వాయు కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోగల అధునాతన సాంకేతి కతలను అభివృద్ధి పరచుకోవడమే. అలాగే సంపన్న దేశాలలో ఆవాసమూ, వ్యవసాయమూ లేని ప్రదేశాలు చాలా విస్తృతంగా ఉండడం వల్లే వారి నివాస ప్రాంతాలు భద్రంగా ఉన్నాయనే వాదన ఒకటి ఉన్నది. ఇది నిజం కాదు. తమ తమ నివాస ప్రాంతాలలోని సహజ వనరులను అవి అపరి మితంగా వాడుకుంటున్నాయి. ఫలితంగా అడవులు తరిగిపోతున్నాయిబీ భూసారం క్షీణించిపోతోందిబీ జల వనరులు కలుషితమ వుతున్నాయి. పేద దేశాలూ తమ స్థానిక వనరులను విచక్షణా రహితంగా వినియోగిం చుకుంటున్నాయి. ఇప్పటికే నరికివేసిన అడవులు, బీడువారిన భూములను, కాలుష్య జలరాశులపై పేద దేశాల గ్రామీణ ప్రాంతాల వారు ఆధారపడుతున్నారు. పర్యా వరణ విధ్వంసం ఇంత స్పష్టంగా కనిపిస్తు న్నప్పటికీ పర్యావరణంపై ఆ దేశాల సంయుక్త ప్రభావం సంపన్న సమాజాలు నెరపుతున్న దానికంటే తక్కువే. పర్యావరణంపై భారత జనాభా ప్రభావం వాస్తవానికి తక్కువే. కారణమేమిటి? భారత ప్రజలు పేదవారు కావడమే. పేదరికం వల్లే వారు పొదుపుగా జీవించడం నేర్చుకున్నారు. అయితే మనం సంపన్నులం అవుతున్న కొద్దీ ప్రపంచ మధ్య తరగతి ప్రజల జీవన శైలిని అలవరచు కోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదని చెప్పక తప్పదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్ జీవన శైలికి మనం వెంపర్లాడు తున్నాం.సంపద్వంత జీవితానికి, ఆధునికతకు ఆ జీవన శైలినే ఒక ప్రమాణంగా భావిస్తున్నాం కదా. సంపన్న దేశాల మధ్యతరగతి ప్రజల వలే మనమూ అనారోగ్యకరమైన వినియోగ రీతులను అలవరచుకోకపోయినా, మన జనాభా అధికం గనుక పర్యావరణంపై మనం నెరపే ప్రభావం తక్కువగా ఉండబోదు. ఆదా యాలు పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరిగిపోతోంది. మన వీథులు చెత్తా చెదారంతో నిండిపోతుండడమే ఇందుకొక తార్కాణం..అలాగే వాయు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. పెరుగుతున్న ఆదాయాలతో అత్యధికులు పూర్తిగా సొంత వాహనాలను సమకూర్చుకుంటున్నారు.ఆవాహనాలను మెరుగైన సాంకేతికతలతో రోజూ కాలుష్య కారకం కానివిగా చేసినప్పటికీ వాటి సంఖ్యా ధిక్యత కాలుష్యం పెరుగుదలకు విశేషంగా దోహదం చేస్తోంది. కనుక, మనం మూడు అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలి. అవి: జనాభా పెరుగుదలను అదుపులో ఉంచడమె లా?ఈ జనాభా లబ్ధి (ఒక దేశంలో పని చేసే వయసు ఉన్న జనాభా పెరగడం వల్ల సమ కూరే ఆర్థిక వృద్ధి)ని ఎలా ఉపయోగించు కోవాలి? (ప్రతీ మానవుడూ ఒకఅద్భుత జీవి, ఒక విలువైన ఆస్తి అనడంలో సందేహం లేదు)బీ మన జనాభా పెరుగుతున్న కొద్దీ, మిగతా ప్రపంచం వలే స్వయం వినాశక రీతిలోకి పోకుండా ఉండేందుకు మనమేమి చేయాలి? మొదటి ప్రశ్నకు సమాధానం సాపేక్షంగా స్పష్టమే: భారత్ ఇప్పటికే తన ‘జీవితకాల సంతాన సాఫల్య రేటు’ (టోటల్ ఫెర్టిలిటీ రేట్)లో తగ్గుదలను చూస్తోంది. బిహార్, జార?ండ్, మణిపూర్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌లు మాత్రమే ఇందుకు మినహా యింపు. జననాల రేటు విషయంలో దేశసగటు కంటే అధిక సంతానోత్పత్తి రేటును ఈ రాష్ట్రా లు కలిగివున్నాయని ఇటీవలి ‘జాతీయ కుటుం బ ఆరోగ్య సర్వే’ వెల్లడిరచింది.ఈ రేటు ‘రీప్లేస్‌మెంట్ లెవల్ కంటే తక్కువకు పడిపోయింది (జనాభా సంఖ్య స్థిరంగా కొనసాగడానికి సరిపడా ఉండే కొత్త జననాల స్థాయిని ‘రీప్లేస్‌మెంట్ లెవల్’గా పిలుస్తారు). ప్రస్తావిత రాష్ట్రాలలో ప్రతీ మహిళ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం ఇప్పటికీ పరిపాటిగా ఉన్నది! బాలికలు విద్యావంతులు అయినప్పుడు, మహిళలకు ఆర్థిక సాధికారిత,ఆరోగ్య,ఆర్థిక భద్రత ఉన్న ప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. పిల్లలను కనాలా, వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకునే అధికారం మహిళలకు మాత్రమే ఉండాలి. అది మహిళల పురోగతిని సూచిస్తుంది. సరే, జనాభా లబ్ధి విషయానికి వద్దాం. విద్యతో ముడివడివున్న అంశమిది. విద్యాహక్కు మరింత మందికి సమకూరేలా మనం చూడవలసిన అవసరమున్నది. ఇక చివరగా పర్యావరణ భద్రత చాలా ముఖ్యం. అయితే ఇది చాలా కష్టతరమైన విషయం. ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు వినియోగదారీ మనస్తత్వంతో వినూత్నంగా ఉంటున్నాయి.ఈ వాస్తవాన్ని విస్మరించలేము. మార్కెట్ శక్తులు ప్రపంచవ్యాప్తంగా వినియో గదారుల జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయి. సుఖసంతోషాలతో కూడిన నివాసయోగ్యమైన ధరిత్రిని మనం కోరుకుంటున్నాం. ఈ విషయ మై మనం తక్షణమే, సమగ్రంగా చర్చించాల్సిన సమయమాసన్నమయింది.
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)వ్యాసకర్త :(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు) – సునీతా నారాయణ్