మన్యం విప్లవం..మహోద్యమం..!

‘‘ బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంతఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4,1897-మే7,1924). భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.’’– గునపర్తి సైమన్‌
భారతీయ చరిత్రలో ఆయన మహో జ్వల శక్తి.మన్యం విప్లవం.. మహోద్యమ శీలి. అడవి నుంచి ఆకాశానికి ఎగిసిన విప్లవ కెరటం అల్లూరి సీతారామారాజు. సమర నాదానికి ప్రతిరూపం..విప్లవ నినాదానికి ఆయువు. బ్రిటీషర్ల పాలిట సింహస్వప్నం. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి. కేవలం 27ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు అమాయ కులు,విద్యా విహీ నులైన కొండజాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజ పరచి,వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికికృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ ఘోష్‌,అల్లూరి సీతా రామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు.మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే..ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాం డ్రంగి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకట రామరాజు,తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి స్వగ్రామం. అయితే, తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధి తో సీతారామరాజు తండ్రి 1908లో మరణిం చాడు.అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువు తున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడిరది. స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది. చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు. భీమవరంలో మిషన్‌ ఉన్నత పాఠ శాలలో చేరినా..తొలియేడాదే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొ న్నాడు. తండ్రి లేకపోవడం, పేదరికం, నివా సం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతా రామరాజు చదువుపై చాలా ప్రభావం చూపిం చాయి. 1918 వరకు సీతారామరాజు కుటుం బం తునిలోనే నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు,అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండే వాడు. వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతి ష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చు కున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృ తం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు,దానగుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. సీతారామరాజు అంటేనే ఓ మహో జ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలం లోనే స్థానికులకు,బ్రిటిష్‌వాళ్లకు బోధపడిరది. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అను చరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామం లోకి దూకాడు. ఇలా..భారత స్వాతంత్య్ర సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓప్రత్యేక అధ్యాయం. రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారా మరాజు. తొలిసారి 1916 ఏప్రిల్‌ 26వ తేదీన బెంగాల్‌ వెళ్లారు. ఆతర్వాత లక్నోలో కాంగ్రె సు మహాసభకు హాజరయ్యాడు.కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలి సారి యాత్రలో బరోడా,ఉజ్జయిని,అమృత్‌సర్‌, హరిద్వార్‌,బదరీనాథ్‌,బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు.బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు సీతారామరాజు.తొలియాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నాడు.గృహవైద్య గ్రంథము,మంత్రపుష్పమాల,అశ్వశాస్త్రము, గజశాస్త్రము, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను అధ్యయనం చేశాడు. 1918లో రెండోసారి ఉత్తరభారతయాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్‌,నాసిక్‌,పూనా, బొం బాయి, మైసూరు వంటి ప్రాంతాలు పర్యటిం చాడు. తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహిం చాడు. దీంతో రాజుకు అతీంద్రియ శక్తులు న్నాయని స్థానికులు భావించేవారు. అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు. ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వాళ్ల దురాగతాలు, దోపిడీ లు, అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి. స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. పోడు వ్యవసాయం,అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్ప డేవారు. తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసు కొచ్చాడు. సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు. దీంతో,గిరిజనులు సలహాలు,వివాద పరిష్కా రాలకు సీతారామరాజును ఆశ్రయించే వారు. క్రమంగా దాదాపు 40గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరా టానికి సిద్ధం చేశాడు. ఆక్రమంలో గంటందొర, మల్లుదొర,కంకిపాటి ఎండు పడాలు సీతారామ రాజుకు ముఖ్య అనుచరులైపోయారు. అంతేకాదు..దాదాపు 150మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు.1922 ఆగస్టు 19వ తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్‌ చేశాడు.1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపి వేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11తుపాకులు,5 కత్తు లు,1390 తుపాకీ గుళ్ళు,14బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి,రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. మరుసటిరోజే అంటే ఆగష్టు 23న కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌ను ముట్టడిరచి, ఆయుధాలు తీసుకెళ్ళారు. అక్కడ 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు లభించాయి. వరుసగా మూడోరోజు అంటే.. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా పోలీసు లను ఎదుర్కొని బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడులలో మొత్తం 26 తుపాకులు, 2వేల 500కు పైగా మందు గుండు సామాగ్రి సీతారామరాజు బృందానికి లభించాయి.వరుసదాడులతో ఉక్కిరి బిక్కిరైన బ్రిటీషు అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి కబార్డు,హైటర్‌ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియ మించింది. సెప్టెంబర్‌ 24వ తేదీన సీతా రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో దాడి చేసి, ఆ అధికారులిద్దరినీ హతమార్చింది. అది చూసి మిగిలిన పోలీసులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలను అధికారులు తీసుకువెళ్ళడానికి స్థానికులు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.1922 అక్టోబర్‌ 15వ తేదీన సీతారామరాజు దళం అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు చేసిన దాడులకు భిన్నంగా ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. కానీ, అప్పటి అధికారులు ముందు జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా.. ఈ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. కేవలం ఆయుధాలు వీరికి చిక్కకుండా దాచిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఇక,అక్టోబర్‌ 19వ తేదీన రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌ను పట్టపగలే ముట్టడిరచినా ఆయుధాలు దాచి పెట్టడంతో దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన సీతారామరాజు..తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిరచి విజయం సాధించడంతో ఆయన సాహసాల గురించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. కొన్ని సార్లు తను ఫలానా చోట ఉంటానని, కావా లంటే యుద్ధం చేయమని కూడా సీతారామ రాజు సవాలు విసిరేవాడు. ఈ పరిణామాలతో సీతారామరాజును వాంటెడ్‌ లిస్టులో చేర్చిన బ్రిటిషు ప్రభుత్వం అక్టోబర్‌ 23న సాండర్స్‌ సేవాని అనే అధికారి నేతృత్వంలో ప్రత్యేక సైనిక దళాలను పంపింది. సాండర్స్‌ దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థి తులు అనుకూలంగా లేవని సాండర్స్‌ వెనుదిరి గాడు. తమకు పట్టుబడిన బ్రిటిష్‌ పోలీసుల్లో భారతీయులు ఉంటే సీతారామరాజు దళం మందలించి వదిలేసేవారు. అదే ఏడాది డిసెంబర్‌ 6వ తేదీన అల్లూరి విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సీతారామరాజు దళానికి, బ్రిటిష్‌ సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్‌ వాళ్లు శక్తివంతమైన ఫిరంగులు ప్రయోగించారు.ఆరోజు జరిగిన పోరాటంలో మొత్తం 12 మంది అల్లూరి దళ సభ్యులు మరణించారు. ఆ పరిణామం తర్వాత దాదాపు 4నెలలపాటు దళం కార్యకలాపాలు తగ్గిపోయాయి. సీతారామరాజు ఆ పోరులో చనిపోయాడని,విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. అయినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అల్లూరి సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. సరిగ్గా ఐదు నెలల తర్వాత 1923ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్కసారిగా సీతారామరాజు కొద్దిమంది అనుచరులతో అన్న వరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆయుధాలేమీ దొరకలేదు. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. అక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు. ఆ సంభాషణ 1923 ఏప్రిల్‌ 21వ తేదీన ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి సీతారామరాజును ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్‌ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయ త్నాలు సాగించింది. సీతారామరాజు దళం టార్గెట్‌గా బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్‌ ఫర్డ్‌..విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే..ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు..తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు. కానీ,స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో,1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్‌ గుడాల్‌ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా.. ఆయ నను ఓ చెట్టుకు కట్టేసి గుడాల్‌ కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితా భస్మాన్ని సమీపంలోని వరాహనదిలో కలిపేశారు. అలా..కేవలం 27 ఏళ్ళ వయసు లోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరా టం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు
శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్‌ (బెంగాల్‌) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజ నోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యం లో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు. చోటానాగ్‌పూర్‌, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరుగు బాటు చేసింది. దీనినే ఉల్‌గులాన్‌ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది.బీర్సా జీవితం,ఉద్యమం అద్భు తమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్య మాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామ రాజు ఉద్యమం ఆగస్ట్‌ 22,1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్‌ మీద దాడితో మొదలై, మే 7,1924 వరకు ఉదృతంగా సాగింది.ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాము గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించ డానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.విశాఖ మన్య విప్లవం తెలుగువారి చరిత్రలో, ఆమాట కొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్‌ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామ రాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్‌, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్న పూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారంతా గుర్తించి నివాళులర్పించారు.నిజానికి సాంప్రదాయిక ఆయుధాలను వాడుతూ బ్రిటిష్‌ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడడం విశాఖ మన్యానికి కొత్త కాదు. అక్కడ 1790 తరువాత అలాంటి పరిణామాలు జరిగాయి. పోలీసు స్టేషన్లను దగ్ధం చేయడం కూడా ఉండేది. ద్వారబంధాల చంద్రారెడ్డి (1875 ప్రాంతం) ఇందుకు ప్రసిద్ధుడు. మన్యంలో పాత పద్ధతు లను రామరాజు యథా తథంగా తీసుకోక పోయినా కొన్నింటిని అనుసరించారు. ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మ వారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్‌ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం వాస్తవంగా మొదలైంది. 23వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌ను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్రాస్‌ ప్రెసిడెన్సీని గడగడలాడిరచింది. ఇరవై ఒక్క తుపాకులు కలిగి ఉండడమంటే దాదాపు ఒక ఆధునిక పోలీసు పటాలం తయారైనట్టే.