మన్యం కాఫీ తోటల కథ..

చల్లటి సాయంత్రానా..వేడి వేడి కాఫీని తాగుతూ..ఓ మంచి పుస్తకాన్ని చదువు తుంటే… ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓకప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ..పొగలు కక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. ఇంతటి విశిష్ట కలిగిన కాఫీ పంట మన ఆంధ్రాలోను పండుతుం దండోయ్‌?.అంతేనా అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను అందుకోవటంతో పాటు… కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మరి ఈ కాఫీ కథేంటో కాస్త చూద్దామా…
ఓ మంచి కాఫీ… తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ… కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. అలాంటి విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖ నర్సీపట్నంలోని కాఫీ శుద్ధీకరణ కేంద్రం. ఇందులో శుద్ధి చేస్తున్న కాఫీ గింజల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ మన్యంలోని ప్రత్యేకమైన వాతావరణంలో పండే ఈ కాఫీ గింజలకు దేశంలోనే విశిష్ట స్థానం ఉంది. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ఏన్నో పురస్కారాలు దక్కాయి. నర్సీపట్నం కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ ప్రస్థానం…మన్యం కాఫీ గింజల గుర్తింపు వెనుక నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ కృషి ఎంతో విలువైనది. ఈ కేంద్రం ఏపీఎఫ్‌ డీసీ ఆధ్వర్యంలో 1959లో ఏర్పడిరది. అప్పట్లో శ్రీలంక కాందిశీకులకు (వలసదారులు) ,ఉపాధి కల్పించాల్సిన ఒప్పందం మేరకు … ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించింది. తోటలోని గింజలను శుద్ధి చేసేందుకు మన్యానికి సమీపంలో ఉన్న… నర్సీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మకం, రవాణాకు తగిన సదుపాయాలు ఉండటం వల్ల లాభదాయ కంగా ఉండేది. దీని ద్వారా కోట్లరూపాయల ఆదాయం రావడంతో పాటు.. మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మహిళా ఉపాధి…ఇక్కడి కేంద్రంలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు…దశాబ్దాలుగా కాఫీ శుద్ధీకరణ పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గింజల్లోని నల్లటి పప్పును వేరు చేయడం వంటి పనులు చేపడుతుంటారు. తొలిరోజుల్లో 15 మంది మాత్రమే సగటున 40రూపాయల వేతనంతో పనిచేసేవారు. క్రమేపి వీటి సాగు విస్తరించటం… దిగుబడులు పెరగటం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాఫీ శుద్ధీకరణ పనులకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు.
లాభ, నష్టాల బేరీజు…ఈ ఏజెన్సీ ప్రాంతంలో పదివేల ఎకరాల్లో కాఫీ తోటలు ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్నారు. గతంలో స్థానిక గిరిజనుల సహాయంతో బెంగ ళూరు వంటి పట్టణాల్లో ఈ గింజల విక్రయాలు జరిపేవారు. ప్రస్తుతం ఆన్‌?లైన్‌? లో వేలం వేస్తున్నారు. ఈ పంట వల్ల ప్రతి ఏటా 18 కోట్లు ఆదాయం వచ్చేది. ఏజెన్సీలో వీటి సేకరణపై మావోయిస్టుల ఆంక్షలు, పంట దిగుబడి తగ్గడం…వంటి కారణాలతో ఈ వ్యాపారానికి నష్టాలు తప్పటం లేదు. గత ఏడాది శుద్ధిచేసిన 234 టన్నుల గింజలు మాత్రమే విక్రయించగలిగారు . దీంతో 4.5 కోట్ల ఆదాయం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సీజన్‌ ప్రారంభం కావడంతో కాఫీ శుద్ధి పనులకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. ఈ సంవత్సరం మన్యంలో కాఫీ పంట విస్తారంగా పెరిగిన నేపథ్యంలో ఆదా యం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.నాలుగేళ్లుగా కొత్త వ్యాపారం. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నీలగిరి వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.మునుపు విశాఖ డివిజన్‌ లో దీనిని చేపట్టేవారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఆ డివిజన్‌ మూసి వేసి నర్సీపట్నంలో విలీనం చేశారు. దీంతో జిల్లాలోని కసింకోట మండలం , కన్నూరు పాలెం…వంటి ప్రాంతా ల్లో ఏపీఎఫ్‌?డీసీకి చెందిన నీలగిరి తోటలను టెండర్ల ద్వారా అమ్మకాలు చేపడుతున్నారు. వీటి ద్వారా సుమారు 10కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ కు తోడు టన్ను ధర 8వేల నుంచి 4వేల దిగిపోవడంతో అమ్మకాలు ముందుకు సాగడం లేదు.
అరకు కాఫీ’కి వందేళ్లు..
భారతదేశంలో అరకు కాఫీ టాప్‌ బ్రాండ్స్‌లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసు కుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది.
చెట్ల మధ్య తోటల పెంపకం…
విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌) మాజీ ఎండీ రవి ప్రకాష్‌ గతంలో వివరించారు.‘‘1898లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతా ల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువ గా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10వేల ఎక రాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగిం చింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’ అనే పేరు స్థిర పడిరది’’ అని చెప్పారు.
పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి…
గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిం చారు.వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు,అనంతగిరి,జీకే వీధి, చింతపల్లి, పెదబయలు,ఆర్వీనగర్‌, మిను మలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా… ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరిం చాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.
అరకు కాఫీ రుచికి కారణం అదే…
అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యం లోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యా లయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ తెలిపారు. ‘‘సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ…పొడవాటి మిరియాలు,సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్యలో సాగవు తాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది’’ అని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండిరచే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.బ్రెజిల్‌ 25 లక్షల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో…12 రాష్ట్రా లు కాఫీని పండిస్తుండగా…అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమి ళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరి చారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్ట మొదటి ‘అరకు కాఫీ’ షాప్‌ ఇది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌ నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్‌ లో ఏర్పాటు చేసింది. ఆతర్వాత అరకు కాఫీ రుచులు జపాన్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి. 2018లో పారిస్‌ లో జరిగిన ప్రిక్స్‌ ఎపిక్యూర్స్‌-2018 పోటీలో (ూతీఱఞ జుజూఱషబతీవం) అరకు కాఫీ గోల్డ్‌ మోడల్‌ గెల్చుకుంది. రుచికరమైన కాఫీ బ్రాం డులకి పేరుపొందిన బ్రెజిల్‌, సుమత్రా, కొలం బోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.-(కిల్లో సురేంద్ర)