మనువాదం వర్సెస్‌ మానవాదం

మన దేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరుస్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్య మంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్య మిస్తున్నారు. వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా ?
ఇవాళ ప్రపంచంలో మూడు అతి పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. ఒకటి-ఆయుధాలు, రెండు- మాదకద్రవ్యాలు, మూడు-ఆధ్యాత్మికత.ఆయుధాలు, మాదక ద్రవ్యాల తయా రీలో ఎంతోకొంత పని చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధ్యా త్మికతలో ఇవ్వాల్సింది ఏమీ ఉండదు.చేయా ల్సింది కూడా ఏమీ ఉండదు. అందుకే భారత దేశంలో ఆధ్యాత్మికవేత్తలు ఎక్కువ. ఈ ఆధ్యాత్మిక సూపర్‌ మార్కెట్‌లో అడిగిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది.ఈమెయిల్‌లో మోక్షం అందు తుంది.ఆత్మసాక్షాత్కారంలో క్రాష్‌ కోర్సు ఉం టుంది.నాలుగైదు సులభ వాయిదాలలో విశ్వ చైతన్యం లభిస్తుంది.ఈఆధ్యాత్మిక సూపర్‌ మార్కె ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు న్నాయి. అశాంతితో ఉన్న ఉన్నత వర్గాలు, సంపన్న కుటుంబాలు ఆ దుకాణాలలో ఆధ్యాత్మి కత పేరుతో దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ కొనుక్కుని తింటూ ఉంటాయి.అదేమిటో పూటపూటకూ రెక్కలు ముక్కలు చేసుకునే వారికి దీని అవసరమే ఉండదు.
నిజాలు చెప్పినప్పుడు ఎవరి మనోభా వాలైనా దెబ్బతింటే, వారు-వారి మనోభావాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ మారవు. వాటిని మార్చి చెప్పి కొందరికి సంతోషం కలిగించాలను కుంటే అవి, అప్పుడు నిజాలుగా ఉండవు కదా? నిజాలు తెలుసుకోవా లనుకున్న నిజాయితీ గలవారు మనోభావాల్ని మూసి పెట్టుకుని,నిజాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి! కృష్ణా కాన్షస్‌నెస్‌కు సంబం ధించిన ఓ స్వామి, మనల్ని ఎలా ఆలోచించమని చెపుతున్నాడో చూడండి…దేవాలయాల అవసరం చాలా ఉంది అని,మనతోనే చెప్పించాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆయన ఇలా అన్నా రు… ‘దేవాలయాలు కట్టడానికి అనవసరం గా ధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారూ? అని కొందరు అంటూ ఉంటారు. దేవాలయాలు కట్టడంకంటే పేదల ఆకలి తీర్చవచ్చు కదా? పాఠశాలలు, ఆసుపత్రులు కట్టొచ్చుకదా? అవసరమైన వారికి అవసరమైన రీతిలో ఖర్చు చేయవచ్చు కదా?’’ అని ప్రశ్నిస్తుంటారు. నిజమే! కానీ, క్లబ్‌లు, పబ్‌లు, సినిమా హాళ్ళు,క్రికెట్‌ల మీద ఎందుకు ఖర్చు చేస్తున్నారు-అనేది మాత్రం ఆలోచించరు. మనిష న్నాక ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అవసరం కదా అని అంటారు.కానీ,ఎన్‌లైట్‌మెంట్‌ కూడా అవసరమని ఆలోచించరు.మనిషైన వాడికి ఆధ్యాత్మిక చింతన, ప్రశాంత జీవనం అవసరమే కదా? మానసిక వేదనలతో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదుపుతప్పిన ఆవేశాలతో ఎందరో ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నారు. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన పనిలేదా? దైవ చింతనతో గడుపుతూ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టు కోవాల్సిన పనిలేదా? మా హరేరామ హరేకృష్ణ మిషన్‌ లాంటివి పేదలకు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాయి. మత పరమైన విహార యాత్రలు పెరిగితే,ఆర్థిక వనరులు పెరుగుతాయి.వాటి చుట్టూ మరెన్నో వ్యాపారాలు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకు ఆలోచించరూ?’’ అని స్వామి ప్రశ్నించారు. ఇందులో మనం ఎన్‌లైట్‌మెంట్‌- జ్ఞానోదయం గురించి మాట్లాడే పనేలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో ‘పూజారులు’గా ఉన్నవారికే జ్ఞానోదయం కాలేదు. ఇక ఓ గంట కోసమో, పూటకోసమో ఇలా వెళ్ళి అలా వచ్చేవారికి ఏం జ్ఞానోదయం అవుతుందీ? హరేరామ హరేకృష్ణ వాళ్ళు, సిక్కు గురుద్వార వాళ్ళు, సంత్‌సంగ్‌ల వాళ్ళు వాళ్ళదగ్గరికి వచ్చిన వారికి భోజనం పెడుతుంటారు. ఎందుకంటే వారి దగ్గరికి వచ్చినవారి సంఖ్య తగ్గిపోగూడదని! అది వారి జాగ్రత్త!! జనం ఆకలి తీర్చాలంటే మురికివాడల్లో తిండిలేక మలమల మాడుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. దేవాలయాల ముందు, మెట్ల మీద అడుక్కునేవారు ఉంటారు. వారి ఆకలి తీర్చాలి కదా ?
క్రికెట్‌, పబ్స్‌, సినిమాహాళ్ళూ ఎలా వ్యాపార కేంద్రాలో- అలా అన్ని మతాల అన్ని ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు కూడా వ్యాపార కేంద్రాలేనని మొదట ఒప్పుకోండి! ఎన్ని ఆత్మహ త్యలు ఈ దేవాలయాలు ఆపగలిగాయి? ఎన్ని అత్యాచారాల్ని, ఎన్ని హత్యల్ని, ఎన్ని డ్రగ్స్‌ దం దాల్ని ఈ దైవ క్షేత్రాలు ఆపగలిగాయీ? ఎవరైనా లెక్కలివ్వగలరా? ఈ ఆధ్యాత్మికత ఎందమందికి ప్రశాంతత ఇవ్వగలుగుతోంది? ఎంతమందికి ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వగలుగుతోంది? ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ దేశంలో ఎక్కువ! మరి ఏ దేశంలోనూ లేని అల్లకల్లోలం ఈ దేశంలో ఎందుకుందీ? ఆత్మవిమర్శ చేసుకో వాలి కదా? దేవుడొక్కడే అని చెపుతున్నప్పుడు ఇన్ని రకాల ప్రార్థనా స్థలాలు ఎందుకున్నాయీ? వాటి మధ్య విభేదాలెందుకున్నాయి? వాటి కారణంగా జనం ఎందుకు విడిపోతున్నారూ? జనం మధ్య రాజకీయాలు చొరబడి అగాధాలు ఎందుకు పెంచుతు న్నాయీ? జనం మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలకు ఎందుకు దారి తీస్తున్నాయీ? ఏ మత కేంద్రంలోనైనా ‘మానవత్వం’ అనే మాట వినిపించదు ఎందుకూ?మనిషి ప్రమేయం లేకుం డా ఏ మతానికి చెందిన ఏదేవుడైనా ఏమీ చేయ లేడని ఎందుకు ప్రకటించరు?జ్ఞానోదయం సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు చెప్పే దేవదేవుణ్ణి ‘నిజం’ చేసి చూపండి.
దేవుడే అబద్దం! అబద్దానికి బంగారు కిరీటాలుపెట్టి,పట్టుబట్టలు కట్టి, గుళ్ళూ గోపురాలు కట్టి,పూజలు, భజనలు చేసినంత మాత్రాన అబ ద్దం నిజమైపోతుందా?కల్పించుకున్న దేవుడు శక్తిమంతుడైపోతాడా?ఒకవైపు దేవుణ్ణి శక్తిమం తుణ్ణి చేయడానికి-మరోవైపు మనుషుల్ని విభజించి శక్తిహీనులుగా తయారు చేయడానికి రాసుకున్నదే‘మనుధర్మశాస్త్రం’.ఇది మనుషులంతా ఒక్కటే అని చెప్పే ఆధునిక మానవవాదం ముందు నిలవదు- మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రార్థనా స్థలమూ అక్కరలేదు. ఏ నది ఒడ్డునో, చెరువు గట్టునో,చెట్ల మధ్యో గడిపితే చాలు. ఏదీ లేకపోతే డాబామీద పడుకుని ఆకాశం, నక్షత్రాలు చూస్తూ ఆనందించగలిగితే చాలు.దేవాలయాల చుట్టూ,ప్రార్థనా స్థలాల చుట్టూ తిరిగి ఎన్‌లైట్‌ మెంట్‌ పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా? వేల వేల మందితో కలిసి, క్యూలలో నిలబడి, దైవద ర్శనం గోలలో పడి, ఒళ్ళు హూనమై తల నొప్పు లు తెచ్చుకునే వారికి నిజంగానే జ్ఞానోదయం కావాలి.కానీ అవుతోందా? ఆధ్యాత్మిక ప్రశాం తత-అక్కడ లభిస్తోందా?ఎవరికి వారు ఆలోచిం చుకోవాల్సిన విషయం. పారసిటమాల్‌ బిళ్ళవేసు కుంటే జ్వరం తగ్గినట్టు-ఏ ప్రార్థనా స్థలానికో పోయి కూచుంటే జ్ఞానోదయమైన ఉదంతాలు న్నాయా? దేవాలయాల నిర్మాణం కన్నా పాఠశా లలు కట్టండి! ఆసుపత్రులు కట్టండి!! అని చెప్పేది ఎందుకంటే భావితరాల కోసం. ఇప్పటి పిల్లల్ని రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం. ఇక ఆసుపత్రులుంటేనే అందరి ఆరోగ్యాలు బావుంటాయి గనుక ! ప్రార్థనా స్థలాలకు వెళితే చదువురాదు,ఆరోగ్యమూ బాగుపడదు.లేని దేవుణ్ణి నమ్మి, మూఢభక్తికి అలవాటు పడి జీవితాన్ని అబద్దంగా మార్చుకోవడం జరుగుతోంది. జబ్బు లకు వైద్యం చేయించుకోకుండా దేవుడికి మొక్కు కున్నంత మాత్రాన, ముడుపులు కట్టినంత మాత్రాన, ఉపవాసాలున్నంత మాత్రాన ఎవరికీ ఏ జబ్బూ ఎప్పుడూ తగ్గలేదు.తగ్గినవి ఉంటే నిరూపించి చూపాలి కదా?ప్రార్థనా స్థలాన్ని కానీ, దైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకుని వస్తే శరీరం నుంచి నెగటివ్‌ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది-అని కొందరు విశ్వాసకులు దుష్ప్రచారం చేస్తుంటారు.వ్యక్తిగతంగా మనిషి ఆలోచనా విధా నాన్ని బట్టి పాజిటివ్‌,నెగటివ్‌లు ఉంటాయి తప్పితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ ఉండదు.మొక్కులు, ముడుపులు ఎంత హాస్యా స్పదంగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ ఒక వాస్తవ సంఘటనని గుర్తుచేస్తున్నాను. ఒకసారి ఒకతను అడవిలో నడుస్తూ ఉండగా చెప్పు తెగి పోయింది. తెగిన చెప్పుతో ముందుకు నడవలేక అతను ఒకచిలిపి పనిచేశాడు. దాని పక్కన గల ఒక చెట్టుకు తెగిన చెప్పులు తగిలించి, చెట్టు పక్కనఉన్న బండ మీద బొగ్గుతో ఇలా రాశాడు… ‘’ఈ చెట్టు కొమ్మమీద మీ చెప్పులను వేలాడదీస్తే మీ భార్య మీ చెప్పుచేతల్లో ఉంటుంది’’ అని… రాసి వెళ్ళిపోయాడు. అంతే! కొన్నాళ్ళకు ఆ చెట్టు కొమ్మలకు వందలచెప్పులు వేలాడబడ్డాయి. తెగిన చెప్పులు కాదు, వాడుకుంటున్న మంచి జతలు, కొత్తగా కొన్నవీ, అన్నీ చెట్టుకొమ్మల మీదికి చేరా యి. ఆ ప్రాంతంలో అదొక ఆచారమైంది. తర్వా త కాలంలో ఆ చెప్పుల చెట్టును వెతుక్కుంటూ జనం రాసాగారు. కొంతకాలానికి ఆ చెట్టు ఎటు వైపు ఉందో చూపడానికి డైరెక్షన్‌ బోర్డులు వెలి శాయి. చెప్పులచెట్టు-తిరనాళ్ళ అయ్యింది. ప్రతి సంవత్సరం జనం గుమిగూడి ఉత్సవం చేయడం ప్రారంభించారు. సంప్రదాయాల పేరుతో మూర్ఖత్వం ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ! ఇలాంటివి దేశంలో అనేక చోట్ల అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.
‘ప్రపంచం మారాలని మనం కోరుకో వడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది’అన్నాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టారు. మన దేశానికి సంబం ధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరు స్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్యమంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా? ఒకసారి ఆలోచించండి!
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ – (డా.దేవరాజు మహారాజు)