మనమే నంబర్ వన్..రెండో స్థానానికి చైనా
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్.ఈ లెక్కలు, సర్వేల మాట వినగానే సందేహాలు వెల్లువెత్తుతాయి. ఈ లెక్కలూ, సర్వేలూ చెప్పని కొన్ని అంశాలు ఉంటాయి. అవి జనాభా పెరుగుదలలోని అసమతౌల్య ధోరణులు. దానితో వచ్చే ప్రమాదాలు. మతం పేరుతో దేశాలు ఏర్పడిన చరిత్ర ప్రపంచంలో ఉంది. జనాభా పెరుగుదల వరమా? శాపమా? జనాభాతో మనం అతి పెద్ద మార్కెట్‌గా అవతరించామా? కొత్త సమస్యలు ఏమిటి? ఆహార భద్రత ఎలా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో అసమతౌల్యంతో వచ్చే ప్రమాదాల గురించి కూడా చర్చించాలి. కచ్చితంగా జనాభా మీద స్పష్టమైన విధానం రావాలి. అది అందరూ ఆమోదించేదై ఉండాలి.యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తాజా సమాచారం ప్రకారం జనాభా పరంగా మనదేశం మొట్టమొదటిసారి చైనాను వెనక్కి నెట్టేసింది. దీని ప్రకారం ప్రస్తుత మనదేశ జనాభా 142.86కోట్లు. చైనా జనాభా ప్రస్తుతం 142.57 కోట్లు! ఇప్పుడు ప్రపం చంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన చైనాకు బదులు ఇక ఇండియా అని చెప్పాలి. 1950లో మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్.) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాను తయారుచేసింది. అప్పటి నుంచి యు.ఎన్.ఎప్పుడు ఈ జాబితా విడుదల చేసినా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశా లలో ప్రథమ స్థానం చైనాదే. ఇప్పుడు మనదేశం చైనాను తోసిరాజని ముందుకు దూసుకెళ్లింది. భారత్‌లో జననాల రేటు ఇటీవలి సంవత్సరాల్లో బాగా తగ్గినప్పటికీ, ‘పని చేసే వయసున్న వారు’ మొత్తం జనాభాలో 75% ఉండటం సానుకూలాంశం. భారత్‌లోని ఈ శ్రామిక సంభావ్య శక్తి ద్వారా రానున్న కాలంలో, ఇప్పటికే చైనా పడుతున్న ఇబ్బం దులను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఇక్కడ శ్రామిక జనాభా అధికంగా ఉండటం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పెరుగుతున్న వీరి జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే అది ప్రతికూలాంశంగా మారడం తథ్యం.
ఫలితమిచ్చిన కుటుంబ నియంత్రణ
1901లో భారత జనాభా 23 కోట్లు. 1951 వరకు ఈ జనాభా పెరుగుదల చాలా నిదా నంగా సాగింది. తర్వాతి ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్లు పెరిగి 2001 నాటికి మనదేశ జనాభా 102 కోట్లకు ప్రస్తుతం 1.4 బిలియన్లకు చేరుకుంది. యు.ఎన్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అంచనా ప్రకారం 2030 నాటికి 1.5 బిలియన్, 2050 నాటికి 1.64 బిలియన్లకు మనదేశ జనాభా చేరుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత జనాభా దాదాపు 350 మిలియన్లు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రభుత్వం 1952లో మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టింది. అప్పట్లో సగటున ఒక స్త్రీ ఆరుగురు సంతానాన్ని కలిగి ఉండేది. అప్పటి నుంచి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఇప్పటికి ‘‘ఇద్దరి’’కి పరిమితం చేయగలిగింది. దేశంలో కుటుంబ నియంత్రణ అమలుకు ప్రపంచ బ్యాంకు అప్పట్లో 66 మిలియన్ డాలర్లు రుణ సహాయం చేసింది. 1950 నుంచి 1990 వరకు దేశ ఆర్థిక ప్రగతి సగటున 4%గా కొనసాగింది. 1990ల్లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని దేశ ప్రగతి 5.5% తర్వాత 2000 సంవత్సరం నుంచి సగటున దేశ వృద్ధిరేటు 7.7శాతం నమోదు చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి జనాభాపై విధానకర్తల అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. 15-64 సంవత్సరాల మధ్య వయస్కులను ‘పనిచేసే’ వారిగా పరిగణిస్తూ, వీరిని ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా పేర్కొంటూ వచ్చారు. దీన్నే ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’గా వ్యవహరి స్తున్నారు. ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోని వివిధ దేశాలు అభివృద్ధి చెందింది కేవలం ఈ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ వల్లనేనన్న సత్యం వెల్లడవు తుంది. 1990 నుంచి భారత్ కూడా దీనివల్ల సానుకూల ఫలితాలు పొందింది.
భయపెడుతున్న నిరుద్యోగం
అధికారిక గణాంకాల ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.7శాతంగా ఉన్న నిరుద్యోగం, 2017-18 నాటికి 6.1శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వార్షిక సమాచారం ప్రకారం 2021-22లో ఇది 4.1శాతానికి తగ్గడం కొద్దిగా ఉపశమనం కలిగించినా, సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం గత మార్చిలో దేశలో నిరుద్యోగరేటు 7.8శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం ఏటా దేశంలో ఐదు మిలియన్ల మంది శ్రామిక మార్కెట్లోకి కొత్తగా చేరుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 18-35 మధ్య వయస్కులు 600 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 65%. వీరిలో వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచడంలోనే ఆర్థిక ప్రగతితో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ముడిపడివుంది.
స్థిరీకరణ దశకు జనాభా
జనాభా శాస్త్రవేత్తల ప్రకారం సగటున స్త్రీల ‘మొత్తం గర్భధారణ రేటు’ (టోటల్ ఫెర్టిలిటీ రేట్- టీఎఫ్ఆర్)2.1గా నమోదైనప్పుడు ఒక దేశ జనాభా స్థిరంగా ఉంటుంది. అంటే ఇందులో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల సంఖ్యను స్థిరంగా ఉంచడాన్ని, 0.1 పిల్లల్లో సంభావ్య మరణాలను సూచిస్తుంది. దీన్నే యు.ఎన్. పాపులేషన్ డివిజన్ ‘రీప్లేస్మెంట్-లెవెల్ ఫెర్టిలిటీ’ అని వ్యవహరిస్తుంది. ఇంతకూ చెప్పొచ్చేదే మంటే భారత్ ఈ టీఎఫ్‌ఆర్‌కు అత్యంత సమీపానికి చేరుకుంది. అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరుకున్నదని అర్థం. మనదేశం లోని చాలా రాష్ట్రాల్లో ఈ టీఎఫ్ఆర్ రేటు 2.1 కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ప్రముఖ డెమోగ్రాఫర్, సామాజిక శాస్త్రవేత్త షిరీన్ జెజీభోయ్ ప్రకారం భారత్‌లో మొత్తం 28 రాష్ట్రాల్లో 17,9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 ‘రీప్లేస్మెంట్ దశ’కు చేరుకున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒకవేళ మనదేశం జనాభా స్థిరీకరణ దశకు చేరుకోకపోతే జనాభా ఎంతలా పెరిగిపోయేదో ఊహిస్తేనే ఒళ్లు జలద రిస్తుంది. దేశంలో జనాభా పెరుగుదలరేటు క్రమంగా తగ్గడమే ఈ స్థిరీకరణకు కారణం. ఉదాహరణకు 1972 నుంచి 1983 మధ్యకాలంలో వార్షిక జనాభా పెరుగుదల రేటు 2.3%గా ఉండేది. 2011నాటికి ఇది 1.37 శాతానికి, 2017లో 0.98%కి 2023లో 0.81%కు పడిపోయింది. ఇదిలావుండగా సి.ఐ.ఎ. వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ జనాభా గణాంకాల అంచనా ప్రకారం 2022లో మనదేశ జనాభా వృద్ధి రేటు 0.67% మాత్రమే. ఇక మనకున్న మరో సానుకూలాంశం డిపెండెన్సీ రేటు కేవలం 0.4శాతం. దశాబ్దకాలం క్రితం మనదేశంలో చిన్నపిల్లల జనాభా అత్యధికంగా నమోదుకాగా ఇప్పుడది పడిపోతుండటం గమనార్హం. 1951 లో దేశ జనాభాలో హిందువుల జనాభా 84.1% కాగా ముస్లింలు 2.3% మాత్రమే. అదే 2011 నాటికి హిందువుల జనాభా 79.80%కు తగ్గి, ముస్లింల జనాభా 14.23%కు పెరగడం గమనార్హం. అంటే హిందూ జనాభా వృద్ధిరేటు 16.8% (2001- 2011 మధ్యకాలంలో) కాగా ఇదే కాలంలో ముస్లింల వృద్ధిరేటు 24.6%. మిగిలిన మతాల జనాభావృద్ధి గమనించదగ్గ స్థాయిలో లేదు. 1991-2001 మధ్యకాలంలో ముస్లిం జనాభా వృద్ధిరేటు 29.52%గా ఉండగా 24.6%కు పడిపోయింది. అదేవిధంగా హిందువుల జనాభా వృద్ధిరేటు 19.92% నుంచి 16.8%కు పడిపోవడం గమనార్హం.- (జమలాపురపు విఠల్‌రావు/సుంకవల్లి సత్తిరాజు)