మతతత్వ శక్తులను ఓడిస్తేనే దేశానికి రక్ష
ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం పాటుపడేవారికి, స్వాతంత్య్రపోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి ఆరెస్సెస్ అధినేత ఇంటర్వ్యూ ఒక బెదిరింపు అనే చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా ఈ మతతత్వశక్తులు అడ్డుకుంటున్నాయి..ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపు సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యామ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో ఉంది. హిందూత్వ శక్తుల తాజా ఎజెండాను ఓడిరచాలంటే ప్రతిఘటనా శక్తిని పెంచుకోవడంతో బాటు, పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించాల్సిన అవసరముంది.-` బృందాకరత్
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ‘’ఆర్గనైజర్’’, ’’పాంచజన్య’’ పత్రికల సంపాదకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హిందూ రాజ్య స్థాపనకు సంబంధించి ఆరెస్సెస్ స్థాపకులు హెడ్గే వార్,గోల్వాల్కర్ల మాటలను బలపర్చేవిగా ఉన్నాయి. ‘’హిందుస్థాన్ ఒక హిందూ రాజ్యం. అభివద్ధి చెందుతున్న శక్తివంతమైన హిందూ సమాజం,హిందూరాజ్యం,భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి, ప్రపంచానికి నాయకత్వాన్ని అందిస్తుంది’’అని భగవత్ అన్నాడు. భారతదేశం,బ్రిటీష్ వలస దేశంగా ఉన్నప్పుడే ఆరెస్సెస్ తన ప్రణాళికను చాలా స్పష్టంగా వివరించింది. నేడు స్వాతంత్య్ర భారతదేశం సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉంది.ఆరెస్సెస్ అధినేత అసాధారణమైన వ్యాఖ్యలు,ఆరెస్సెస్ ఎన్నటికీ భారత రాజ్యాంగాన్ని అంగీకరించదనే విషయాన్ని మరోసారి తేటతెల్లం చేశాయి. నేడు ఆరెస్సెస్ ‘’వనరులు’’,‘’సమద్ధి’’,‘’సాధనాల’’ను కలిగి ఉంది.ఆ వనరులు ఏమిటి, ఎలా సమద్ధి గా ఉంది, ఆ సాధనాలు ఎక్కడి నుండి వస్తున్నా యని అడగడం సముచితంగా ఉంటుంది.
గోల్వాల్కర్ విస్తరించిన ‘’అంతర్గత శత్రువు’’
ఆ ఇంటర్వ్యూ ‘’హిందూ సమాజానికి’’ సంబం ధించిన చర్చ కోసం ఉద్దేశించినది. కానీ ఆరెస్సెస్ చీఫ్ ప్రకటించిన ‘హిందూ సమాజం’ అనే భావనకు భారత రాజ్యాంగంలో చోటు లేదు.ఆయన చెప్పేదాని ప్రకారం ‘’హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలకు పైగా యుద్ధంలో ఉంటుంది కాబట్టి, యుద్ధంలో ఉండే వారు దూకుడుతనంతో ఉండడం సహజం’’.అందువల్ల స్థానిక భూస్వామ్య ఆధిపత్యవర్గాల సహాయంతో,దురాక్రమణ దారులకు,విజేతలకు మధ్య జరిగిన యుద్ధాలను, హిందూ ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలుగా మార్చారు. చారిత్రక అన్యాయా లను సవరించే పేరుతో నేటి ‘’హిందువుల దూకుడుతనాన్ని’’ న్యాయమైందిగా చెపుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘’ఇది బయటి శత్రువు కాదు అంతర్గత శత్రువు. కాబట్టి హిందూ సమాజాన్ని,హిందూధర్మాన్ని,హిందూ సంస్కతిని రక్షించుకోడానికి యుద్ధం తప్పదు’’ అని అంటాడు.‘’భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు వారి విశ్వాసాలను అంటిపెట్టుకొని ఉండాలనుకుంటే, వారి పూర్వీకుల విశ్వా సాలను తిరిగి ఆచరించాలనుకుంటే, వారికె లాంటి ప్రమాదం ఉండదు, వారు భయ పడాల్సిన పని లేదు. కానీ అదే సమయంలో ముస్లింలు తమ ఆధిపత్య ప్రసంగ గర్జనలను వదిలిపెట్టాలి.ముస్లింలు భారతదేశాన్ని తిరిగి పాలించబోతున్న ‘’ఉన్నత జాతి’’అనే కథనాన్ని ముస్లింలు వదిలెయ్యాలి.వాస్తవానికి ఇక్కడ నివసించే వారంతా, వారు హిందువులైనా, కమ్యూనిస్టులైనా ఈ తర్కాన్ని వదిలి పెట్టాలని’’ఆయన అన్నాడు.ఆరెస్సెస్ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టుల వలె రాజీపడని వారిపై దాడి చెయ్యడం, వారిని బెదిరించడం, భయపెట్టడమే ఆరెస్సెస్ తర్కం.’’ హిందూ జాతికి పూర్తిగా లోబడి ముస్లింలు భారతదేశంలో నివసించ వచ్చని’’గోల్వాల్కర్ అన్నాడు. భగవత్ ప్రకటనలు,చట్టం నుండి తప్పించుకోడానికి సవరించినప్పటికీ ఆరెస్సెస్ పరిశీలనలో ముస్లిం లను లొంగదీసుకోవడం, సంఫ్న్ పరివార్ నేరపూరిత దాడులను చూసీచూడనట్లుండడం, ఇవన్నీ అంతర్గత శత్రువుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించే లక్ష్యాలేనన్న మాట. ఈ యుద్ధంలో గోల్వాల్కర్ ముస్లింలు, కమ్యూనిస్టులు, క్రైస్తవులు శత్రువులనే నిర్వచనంటిచ్చారు. అంతటితో ఆగకుండా ఆరెస్సెస్ కథనాలకు అనుగుణంగా లేని హిందువులను కూడా శత్రుజాబితాలో చేర్చడం జరిగింది.అంటే ఇక్కడ నివసించే భారతీయ పౌరులు ప్రశాంతంగా జీవించాలంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా కాక ఆరెస్సెస్ కు అనుగుణంగా ఉండాలి. ఆరెస్సెస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇస్లామిక్ ఛాందసవాదులు చెలరేగ డానికి ఊతమిస్తాయి. ఇటువంటి చర్యల ద్వారా ఆరెస్సెస్ తన మత విభజన వ్యూహాలను మరింతగా బలపరచుకోవాలని చూస్తోందన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. ఒక మతతత్వం మరొక మతతత్వాన్ని బలోపేతం చేస్తుందని సిపిఐ(ఎం) పదేపదే చెప్పే విషయాన్ని భగవత్ ఇంటర్వ్యూ మరోసారి రుజువు చేసింది.
కుల హింసను పట్టించుకోని ఆరెస్సెస్
భగవత్ ‘’హిందూ సమాజపు’’ స్వయం నియామక ప్రతినిధిగా ‘’సమాజం’’ తరపున అనాగరికమైన వాదనలు చేస్తూ మాట్లాడతాడు. మతానికి ఎలాంటి సంబంధంలేని హిందూత్వ రాజకీయ భావనా కవచాన్ని ప్రకటించడం ఒకటైతే,ఈ దేశంలో అత్యధికంగా ఉన్న ప్రజలంతా హిందూమతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది రెండవది. కానీ మతపరంగా హిందువులైన ప్రజలు ఆరెస్సెస్ ఆలోచనలను సమ్మతించడం లేదు. ఆరెస్సెస్ నాయకునికి దళితులకు వ్యతిరేకంగా పెచ్చరిల్లుతున్న హింసాత్మక చర్యలు అసలు ఒక సమస్యగా కనిపించవు.‘’శ్రీరాముడే అన్ని జాతులను, వర్గా లను కలిపి ఉంచుతాడు’’ అనేదే కులా నికి సంబంధించిన ఏకైక ప్రస్తావన.హిందూత్వ గుర్తింపు నిర్మాణంలో జైశ్రీరామ్ నినాదం ఒక రాజకీయ సాధనంగా చేసుకుంటున్నది. దళితులు అగ్రవర్ణ హిందువుల చేతుల్లో వివక్షతను, హింసను, లైంగిక దాడులను ఎదుర్కొంటున్నదానిపై భగవత్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు .
ఆరెస్సెస్ అధినేత మాటల్లో ‘’పేదరికం’’ ఊసే లేదు
భగవత్ ‘’శక్తివంతమైన, సంపన్న హిందూ సమాజం’’ గురించి మాట్లాడతాడు.తీవ్రమైన పోషకాహార లోపం, అత్యధిక జనం ఆకలితో అలమటిస్తున్న దేశాలలో ఒకటిగా భారతదేశం ప్రపంచ ఆకలి సూచీ లో అవమానకరమైన స్థానంలో ఉంటే ఆయన ‘’సంపన్నం’’ గురించి మాట్లాడ్డం చాలా హాస్యాస్పదంగా ఉంది. భారతదేశాన్ని ధ్వంసం చేస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు,సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల గురించి సంఫ్న్ అధినేత ఒక్కమాట కూడా మాట్లాడలేదు.ఆరెస్సెస్‌కు కార్మికులు, రైతులు అనేవర్గాలు లేవు. వారి దష్టిలో అంతా హిందూ సమాజంగా పిలువ బడే దానిలోనే దాగి ఉంటారు.కాబట్టి,ఆదానీ రోజుకు సగటున 1216 కోట్ల రూపాయలు, గ్రామీణ మహిళ రోజుకు కేవలం 250 రూపా యలు సంపాదిస్తే, ఆరెస్సెస్ వారిరువుర్నీ హిందూ సమాజం పేరుతో ఒకే గాటన కడుతుంది. ఆరెస్సెస్ సష్టించాలనుకునే ముఖ్యమైన హిందూత్వ గుర్తింపులో భాగంగా ధనికులను,పేదలను గుర్తించడానికి నిరాకరిం చడం ద్వారా ఆరెస్సెస్ అధినేత భారీ అసమాన తలను సమర్థిస్తున్నాడు. జనాభాలో అధిక సంఖ్యాక ప్రజల తక్కువ కొనుగోలు శక్తిని ప్రతిబింబించే అధికారిక సంఖ్యలు ఉన్నప్పటికీ, అధిక సంఖ్యాక భారతీయులు అధిక ధరలతో బాధపడుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది ‘’వినియోగతత్వం’’ విధి అనీ, ప్రజలు అవసరానికి మించి అధికంగా కొనుగోలు చేస్తున్నందువల్లే ధరలు పెరిగిపోతున్నాయని సంఫ్న్ నాయకుడు అభిప్రాయపడుతున్నాడు. భారతదేశం ప్రస్తుతం మాంద్యం అంచున ఉంది.ఆఖరికి పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక వేత్తలు కూడా డిమాండ్‌ను పెంచే విధానాలతో ముందుకు పోతున్నారని, అయితే ధరల పెరుగు దలకు ప్రజలే కారణమని ఆరెస్సెస్ నేత నిందిస్తున్నాడు.
రాజ్యాంగేతర శక్తిగా ఆరెస్సెస్
ఇంటర్వ్యూలో భగవత్ ఆరెస్సెస్, దాని స్వయం సేవకులు,రాజకీయాలు, ప్రభుత్వం మధ్య ఉండే సంబంధం గురించి మాట్లాడినప్పుడు మరో అంశం బహిర్గతమైంది. ఆరెస్సెస్ ఒక ‘’సాంస్కతిక’’ సంస్థ అనీ, దానికి రోజువారీ రాజకీయాల్లో ఆసక్తి లేదనీ, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఇష్టం లేకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో బలవంతంగా జోక్యం చేసుకుంటుందని అంగీకరిస్తూ ఆయన ఓ కట్టు కథను అల్లారు. ‘’ఇంతకు ముందున్న తేడా ఏమంటే,మా స్వయం సేవకులు అధికార స్థానాల్లో లేరనీ, రాజకీయాల్లో స్వయం సేవకులు ఏమి చేసినా వాటికి మేము బాధ్యత వహిస్తాం. స్వయం సేవకులకు శిక్షణ ఇచ్చిన సంఫ్న్ కే అంతిమంగా ‘’కొంత బాధ్యత’’ ఉం టుంది. అందువల్ల మా సంబంధం ఏమిటి,ఏ అంశాలను జాగ్రత్తగా కొనసాగించాలి అనే విషయాలను గురించి ఆలోచించాల్సి వస్తుం దని’’ అంటాడాయన. ఇప్పుడు ‘’తేడా’’ ఏమంటే, ప్రధానమంత్రి గతంలో ప్రచారక్‌గా పని చేశాడు.యూనియన్ మంత్రిమండలిలో 71% మంది మంత్రులకు ఆరెస్సెస్ తో సంబంధాలు ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది మంత్రులకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు, సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని స్వయం సేవకుల పై తన పర్యవేక్షణ ఉంటుందని ఆరెస్సెస్ ప్రకటిం చింది.ఆ ‘’కొంత బాధ్యత’’ అంటే అర్థమేమిటి ? ‘’ఒకవేళ ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తూ, వారు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ,వాటిని మాకు తెలియజేస్తే, అప్పుడు సంబంధిత వ్యక్తుల దష్టికి తీసుకొని వెళ్ళొచ్చు, ఒకవేళ వారు స్వయం సేవకులైతే, అంతా మేమే చేసేస్తాం’’.‘’మేం చేసే’’ దానిలోని చిక్కుల్ని చూడండి. సంఫ్న్‌లో శిక్షణ పొందిన మూడిరట రెండొంతుల మంది మంత్రివర్గ సభ్యుల పర్యవేక్షణ (‘’కొంతబాధ్యత’’), విధానాలలో జోక్యం (శ్రద్ధతో కొన్ని విషయాలు), స్వయం సేవకులైన మంత్రులకు ఆరెస్సెస్ సిఫార్సులు (సంబంధిత వ్యక్తుల దష్టికి తీసుకొనిరావడం). రాజ్యాంగేతర శక్తి అంటే ఇదే. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరెస్సెస్ చెలాయిస్తున్న అధికారం రహస్యమేమీ కాదు. దీనిని ఇప్పుడు ఆరెస్సెస్ అధినేతే స్వయంగా చెప్పాడు.‘’మేము మీడియాను కలుసు కునే సందర్భాల సంఖ్యను పెంచాం, ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రారంభించాం. ఆశించిన ఫలితాల సాధన కోసం మేం సరైన వ్యూహంతో, సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుందనీ, రానున్న రోజుల్లో ఆరెస్సెస్ పై పొగడ్తల జల్లు కురిపిస్తూ, దానిపై ఉన్న ద్వేషాన్ని తగ్గించే కథలను గూర్చి వింటామని’’ భగవత్ చెప్పాడు.
మహిళల పట్ల చిన్నచూపు
హక్కుల ఆధారిత ప్రజాస్వామిక చట్రాన్ని గుర్తించ నిరాకరించడం కూడా మహిళల గురించి చేసిన వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తుంది. ఆరెస్సెస్ వారి దష్టిలో మహిళ అంటే కుటుం బంలో ఒక భాగం. ‘’మహిళా విముక్తి, మహిళా సాధికారత గురించి చాలా కాలంగా మాట్లాడు తున్నారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య మహిళలు, స్త్రీ పురుషులు పరస్పరం ఆధారితంగా ఉండే కుటుంబ జీవనానికి తిరిగి వస్తున్నారని’’ భగవత్ అంటున్నాడు. ఆరెస్సెస్ ఉద్దేశంలో, ఒక స్వతంత్ర మనస్తత్వం,సాధికారత,సమాన హక్కులు గల మహిళకు కుటుంబ జీవితంతో పొసగదట.ఎందుకంటే ఆరెస్సెస్ భావజాలం ప్రకారం, కుటుంబంలో మహిళలకు మనువాద విధానాల మార్గదర్శకత్వం ఉంటుంది కాబట్టి, హింస ఎదురైతే మహిళలు సర్దుకుపోవాల్సి ఉ ంటుంది. ఇది,ఆరెస్సెస్ మహిళా విభాగం ‘’రాష్ట్రీయ సేవికా సమితి’’ చేస్తున్న ప్రచారం. కానీ ఈ సమితి విఫలమైన ప్రణాళిక అని ఆరెస్సెస్ నేత స్దవయంగా అంగీకరించాడు. నేడు సమితికి అంత బలం లేదు.శాఖల ద్వారా నేర్చుకునే మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వారిని సేవికా సమితికి పంపకుండా నేరుగా సంఫ్న్ లోకి ఇముడ్చుకోవడం ఎలా అనే విషయాన్ని ఆరెస్సెస్ కసరత్తు చెయ్యాలని ఇప్పుడు ఆయన చెపుతున్నాడు. ద్వేషపూరిత ప్రసంగాలు,రెటచ్చగొట్టే ప్రకటనలు చేసే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లాంటి హిందూత్వ దళానికి చెందిన మహిళా సభ్యులు ఆరెస్సెస్ కు ఆదర్శంగా ఉన్నారు. పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలతో పాటు మహిళల పై పెరుగు తున్న హింస, వరకట్న మరణాలపై సంఫ్న్ నేత మౌనం వహిస్తున్నాడు. ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం స్వాతంత్య్ర పోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి, ఆరెస్సెస్ అధినేత ఇంటర్వ్యూ ఒక బెదిరింపు అనే చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా ఈ మతతత్వ శక్తులు అడ్డుకుంటున్నాయి..ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపు సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యామ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో ఉంది. హిందూత్వ ఆధునీకరణ ఎజెండాను ఓడిరచాలంటే ప్రతిఘటనా శక్తిని పెంచు కోవడంతో బాటు,పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించాల్సిన అవసరముంది. (ప్రజాశక్తి సౌజన్యంతో..)