భద్రచలం మన్నెంకతలు
తెలుగు సాహిత్యంలో గిరిజన సాహిత్య విభాగం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అటువంటి ప్రత్యేక స్థానం గల గిరిజన సాహిత్యాన్ని కథలు, కవితలు, వ్యాసాలు, పరిశోధనలతో ఎందరో మేధావులుసు సంపన్నం చేశారు. అటువంటి రచయితల్లో ఒక కథా రచయిత, ఆయన సాధారణ రచయిత మాత్రమే కాదు..పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్యం ప్రధాన అంశంగా తీసు కుని విజయం సాధించి ఐ.ఏ.ఎస్ అధికారి అయిన అపరమేధావి.. ఆయనే ‘‘అంగలకుర్తి విద్యాసాగర్’’ ఆయన ఉద్యోగ జీవనంలో భాగంగా ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్ అధికారిగా 1988 – 1990 మధ్యకాలంలో రెండు సంవత్సరాల పాటు భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో పాల్వంచ కేంద్రంగా పనిచేశారు. స్వతహాగా సాహితి పిపాసి అయిన విద్యాసాగర్‌కు సృజనాత్మకత కూడా అలవడిరది రెండేళ్ల పాటు నిత్యం అడవుల్లోని ఆదివాసులతో మమేకమై తిరిగారు. వారి జీవితాలను దగ్గరగా గమనించారు. అలా కలిగిన అనుభవం సాయంగా 20 కథలు రాశారు. కొన్ని కథలుగా అనిపించవు అయినా కథను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ అనుభవాల అనుభూతులను ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ పేరుతో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథ సాహిత్యంలో అత్యంత పాఠ కాదరణ పొందిన గిరిజన కథలుగా వీటిని చెప్పవచ్చు. ఈ కథా సమూహంలోని కథలన్ని గిరిజన జీవితాల మధ్యే తిరుగాడుతాయి. ప్రతికథ రచయిత అనుభవించిన ఒకవ్యధగా చెప్పవచ్చు. ఆ రెండేళ్ల కాలంలో విద్యాసాగర్ గారు చేసిన క్షేత్ర పర్యటనలు, గిరిజనాభివృద్దికోసం ప్రభుత్వాలు,అధికారులు,చేస్తున్న కృషి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టి చూపించడంలో రచయిత సఫలీకృతులయ్యారు.
కొన్ని ఆశయాలు ఆశలు నెరవేరకుండానే ఆయన బదిలీ అయి వెళ్లిపోయిన, తర్వాత కాలంలో అవి కార్యరూపం దాల్చడం వంటివి గమనిస్తే గొప్ప పనులు ఏనాటికైనా లక్ష్యాలు సాధిస్తాయనే నమ్మకం ఈకథలు చదవడం వల్ల కలుగుతుంది.
ఈ కథల్లో రచయిత తాను ప్రభుత్వ అధి కారిని అన్న భావన ఎక్కడ చూపించరు. అంతటా మానవతావాదంనిండి ఉంటుంది. అందుకే ఒక్కోచోట గిరిజన అభివృద్ధి పనుల్లో ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను కూడా ఎత్తిచూపుతారు.
‘‘నామొకంమల్లొచ్చింది సారు’’ కథలో అడవుల్లోని క్రూర మృగాల బారిన పడి గిరిజనులు అనుభవిస్తున్న హృదయ విదారక బాధలను రచయిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రులు అవలంబిస్తున్న అలసత్వం గురించి నిర్మొహమాటంగా రచయిత ఇందులో చెప్పారు. అంతేకాక గిరిజనులకు పుట్టిన భూమి మీద ఉండే మమకారం కూడా అంతర్లీనంగా చెబుతు,అడవి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లోనూ పుట్టిన ప్రాంతాలు విడిచిపోవడానికి ఇష్టపడరు. అందునా కన్న భూమి మీదే కన్నుమూయాలనే తత్వం వారి సొంతం.ఇక గిరిజన యువత చదువులకు ఎలా దూరం అవుతున్నారు? ఉన్నత చదువులు ఎందుకు చదవలేక పోతున్నారు? వాటి పరిస్థితులను అనుసరించి వ్రాసిన కత ‘‘ఇవి కూడా జరిగి ఉంటే…’’ దీనిలో గిరిజన గుడాలు వెనుకబాటుకు కారణాలు అన్వేషించిన రచయిత తన ఆలోచనలు కార్యరూపం దాల్చకుండానే కార్య స్థానం నుంచి బదిలీ అయిపోయిన అవినేటి కాలంలో అమలు కావడం, ముఖ్య ప్రణాళికలోని ప్రామాణికతను స్పష్టం చేస్తుంది.గిరిజన వివాహం వ్యవస్థను తెలుపుతూ… ‘‘మనిషిని మనిషి వంచించ నంతవరకు మనిషిని మనిషి హింసించనంత వరకు ఏఆచారము ఏ నమ్మకము తప్పు కాదు’’ అనే విలువైన సందేశాన్ని అందిస్తూ… , బిడియం,భయం,అనే లక్షణాలు గల అడవి బిడ్డల్లో సరైన అవగాహన,శిక్షణలు కల్పించడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఆవిష్కరించబడతాయి.
అనే సత్యాన్ని కూడా చెబుతారు రచయిత ‘‘ఇద్దరుండాల సారు’’ కథ ద్వారా ….. అదేవిధంగా సొంత భూముల్లో గిరిజనులు కూలీలుగా మారుతున్న వైనం వివరించే ‘‘ప్రశ్నల శర్మగారు’’ కథ,. మూడు దశాబ్దాల క్రితం గోదావరి వరదలు, వానాకాలం సమయంలో గిరిజన గుడాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రయాణ ఇక్కట్లు, వరదల బాధలు,గురించి వివరించడంతోపాటు నాటి అధికారులు అంకితభావంతో పడ్డ పాట్లు గురించి హృదయ విదారకంగా చెప్పిన కథ ‘‘ఆకాశ వాణి నందిగామ! రోడ్డు మీద లాంచి!!’’ తమ సొంత అడవుల్లో పరాయి బ్రతుకులు బతుకుతున్న గిరిజనుల వింత పరిస్థితిని వివరించే కథ ‘‘శాపలు దాగితే సెరువెండు ద్దాసారు?!’’ నిజంగా అధికారుల అనాలోచిత చర్యలకు చెంపపెట్టు లాంటిదిఈ కత. గిరిజన జీవన విధానాలు మార్పు కోసం ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న పరిణామాల గురించి వ్యాస కథనంగా చెప్పిన’’ ప్రొఫెసర్ హేమండార్ప్’’ కత.దీని ద్వారా ఖమ్మం జిల్లాకు డార్ప్‌కు గల అనుబంధం అవగతం అవుతుంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో అవలంబించాల్సిన ఆచరణాత్మక క్రియల గురించి మార్గదర్శనం చేసే మంచి కథ ‘‘చీకటి మండలం’’ ఇలా ప్రతి కథ విద్యాసాగర్ గారి అనుభవాల దొంతరల గుండా, గిరిజన స్థితిగతుల మీదుగా,మూడు దశాబ్దాల క్రితం భద్రాచలం మన్యంలోని గిరిజన గ్రామాల దుస్థితికి అద్దం పడుతుంది. ప్రతి కథలో కాలం, ఆనాటి మనుషులు,గ్రామాల పేర్లు, యదాలాపంగా నమోదు చేశారు రచయిత, ఒకానొక సందర్భంలో విద్యాసాగర్ గారి ‘‘స్వీయకథ’’గా అనిపిస్తుంది ఈ కథ సంపుటి, కారణం ప్రతి కథకు రచయిత ఒక పాత్ర కావడమే..!
కథల పేర్లు కూడా విచిత్రంగా ఆసక్తికరంగా ఉండి పాఠకులను కథల్లోకి ఆహ్వానిస్తాయి, అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి చెట్టు కింద ఆఫీసు, కొండకు కట్టెలు మోయమంటారా సారు?, కూసున్నకొమ్మ కొట్టుకుంటామా సారు??, మొదలైన కథలు.
ఇక కథల్లో వాడిన భాష కూడా పాత్రో చితంగా స్థానిక గిరిజనుల భాష ఉపయో గించడం అభినందనీయం,రచయిత విద్యాసాగర్ గారు పుట్టిన ప్రకాశం జిల్లా యాస అక్కడక్కడ వున్న, తెలుగు భాష మీద, సృజనాత్మకత పట్ల ఆయనకు గల పట్టు ప్రతి చోటా కనిపిస్తుంది.ప్రతి కథలో రచయిత గొంతు, అడవి బిడ్డల ఆవేదన స్వరాలు మేళవించబడి వినిపిస్తాయి. 1990 సం:లో రాసిన ఈ ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ తెలుగు కథా సాహిత్యపు గిరిజన కథా విభాగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రామాణిక కథలుగా చెప్పవచ్చును. అనుభవాలకు కథల రూపం ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి అనుకునే వారితో పాటు, కథా ప్రియులంతా తప్పక చదివి తీరాల్సిన కథా సంపుటి ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్ : 7729883223)