బాలకార్మిక వ్యవస్థకు ముగింపు ఎప్పుడు?


ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి.కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ,మైనింగ్‌,నిర్మాణ రంగం,కర్మాగారాలలో,హోటల్స్‌లో, రైల్వే,బస్సుస్టేషన్‌లు,బిక్షాటన,సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. చిన్నారులకు సరైనవిద్యలేకపోవడంతో ఉపాధిఅవకాశాలు తగ్గిపోతున్నాయి.దీంతోపాటు పోటీతత్వంతో నిండినసమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారన్నారు.ఈనేపథ్యంలో ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం,ఆర్థిక తోడ్పాటు లేకపోవడం,నైపుణ్యలేమి వంటి కారణాలవల్లే ఇలా మారుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటిహైటెక్‌ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరివ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని..!
ఐక్యరాజ్య సమితి బాల కార్మికుల సమస్యలపై వివిధ దేశాధినేతల సమక్షంలో 18సార్లు సమావేశాలను నిర్వహించింది.గరిష్ట వయస్సు,కనీస వేతనం, వైద్యపరీక్షలు, పనిచేసేచోట సౌకర్యాలు, పనిలో శిక్షణ, చదువుకోడానికి అవకాశాలు, రాత్రివేళ పని చేయించకపోవడం వంటి అనేక అంశాలపై ఈసమావేశాల్లో తీర్మానాలు చేశారు.ఇలాంటి తీర్మానాలు,సిఫార్సులు, ప్రతిపాదనలు ఎన్నివున్నా ప్రపంచ వ్యాప్తంగా సంఘటిత,అసంఘటిత రంగాల్లో బాలకార్మికులను యథేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. 1948 నాటిఫ్యాక్టరీలచట్టం నుండి,1986 నాటి ‘చైల్డ్‌ లేబర్‌’ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం నుండి,2016లో ‘చైల్డ్‌ లేబర్‌’ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్లు వరకూ బాల శ్రామికులకు రక్షణ కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి,జరుగుతున్నాయి.చదువు మాన్పించి పనికి పంపితే-అది బాలల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులకు తెలియకపోవడం. గ్రామాల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల విషయంలో ఇది అధికంగా ఉంటోంది.
గ్రామీణులు పట్టణాలకు వలసపోవడంతో పిల్లలు చదువుకు దూరమైపోతున్నారు. జీవనో పాధికి వలస పోయే కుటుంబాల్లో పిల్లలను సైతం పనిలోకి పెడతారు.కనీస వయస్సు రానిదే పిల్ల లను పనులకు పంపరాదన్న విషయమై చాలా మంది తల్లిదండ్రులకు అవగాహన లేదు. కార్మిక చట్టాలను అమలు చెయ్యాలన్న ఆలోచన కర్మాగారాల యజమానులకూ వుండదు. వారికి కావలసిందల్లా- బాలల చేత ఎక్కువ పనిచేయించుకుని,తక్కువ జీతం యిచ్చి అధిక లాభాలను పొందడం. బాలకార్మి కులకు కనీస సదుపాయాలు సమకూర్చాలని,వారు బడికి వెళ్లి చదువుకోడానికి కొంత సమయం ఇవ్వాలని,5గంటలు మించి పనిచేయించ కూడదని ఎన్నో ఆంక్షలు వున్నప్పటికీ-రోజుకు10,12 గంటలు వారిచేత పనిచేయిస్తూ వుంటారు. రాత్రిళ్లు కూడా పనిచేయిస్తూ వుంటారు. వారి ఆరోగ్యానికి హానికలిగించే పనులను చేయిస్తూ వుంటారు. ఇదంతా కార్మిక శాఖ ఉద్యోగులకు తెలిసినా వారు పట్టించుకోరు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగు తూనే ఉంది తప్ప,తగ్గడం లేదు.సమాజంలో భాగస్వాములైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మికులతో ఆప్యాయంగా మాట్లాడి సమీపంలోగల పాఠశాలలో, హాస్టళ్లలో చేర్పిద్దాం.అనాధలైన బాల కార్మికులను ప్రభుత్వ వసతిగహాలలో ఉండేలా ప్రవేశాలు కల్పిద్దాం. దేశ అభివద్ధికి అవరోధంగా నిలుస్తున్న బాలకార్మికవ్యవస్థను తరిమికొట్టడానికి ప్రతిఒక్కరం ముందుకు వద్దాం.బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం.బాల కార్మికుల పట్ల దయ,కరుణ,జాలి చూపుదాం!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్