ప్రైవేట్‌ స్కూల్స్‌..ఫీజల నియంత్రణ ఎక్కడ

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50వేల నుంచి రూ.లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు.ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుం డానే ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు.తమ పిల్ల లను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదం డ్రుల కోరిక ప్రైవేట్‌ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెరతీశారు. పట్టణా ల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది.దీంతో స్కూలు, హాస్టల్‌ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు,ఆ తర్వాత విద్యార్థు లకు పాఠశాలనుబట్టి రూ.60వేల నుంచి సుమారు లక్షరూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు తాము తక్కువ కాదం టూ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఇదే సంప్రదా యానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్‌ అంటూ మరికొంత నొక్కుతున్నాయి.దీంతో విద్యా ర్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి,వెనక్కి వెళ్ళ లేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
విద్యాహక్కు చట్టం అమలు తుంగలోకి
విద్యాహక్కు చట్టం సెక్షన్‌-6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్‌-11ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయ కూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులోపెట్టాలి.సెక్షన్‌1,2ప్రకారం స్కూల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను,నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియ మించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరా లను నోటీస్‌ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్‌-12ప్రకారంటీచర్‌,విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమా న్యం 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగు లకు, మైనారిటీలకు కేటాయిం చాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లై న్‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదర పు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల యాజమాన్యం అభం శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్‌ ఫీజుల రసీదులు ఇస్తున్నది.మీఅమ్మనాన్న ఇంకా ఫీజు చెల్లించలే దంటూ వారిని కించ పరుస్తున్నారు. ఫీజు స్లిప్పు లను చిన్నారుల చేతికిస్తే జరిమానా ఉంటుంది. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించ కూడదు. ప్రభుత్వ అనుమతి తోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవలు, సబ్బులు ఉంచి, పరిశుభ్రత చర్యలు పాటించాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్‌ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఈ కమిటీని ఏటామారుస్తుండాలి.ప్రతి నెల సమా వేశం ఏర్పాటు చేసి ఆవివరాలను నమోదు చేయా లి.పిల్లలకు జంక్‌ఫుడ్‌ను అనుమతించ కూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించ కుండా నడుపుతున్నాయి.ప్రతిజిల్లాకు జిల్లా విద్యా శాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవస రమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.
తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదు వులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న స్థితి తెలుగు రాష్రా ్టలలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధ నలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్‌ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2024-25కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచాయి. ప్రస్తు తం ఉన్న ఫీజుల కంటే ఎక్కువగా 10నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈవిద్యా సంవత్సరం వార్షిక పరీక్ష లు ఇంకా ముగియక ముందే వచ్చే ఏడాదికి కట్టా ల్సిన స్కూల్‌ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్‌, ప్రవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు, నోటీసులు, మెయిళ్లు పంపడం గమనార్హం. కొత్తగా తీసుకునే అడ్మిషన్లు గడువు తేదీలు ముగిశాయి. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగాస్క్రీనింగ్‌ టెస్టులు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూల ఆధారంగా వారు చేస్తున్న ప్రొఫెషన్‌ తెలుసుకుని వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ అసమానతలు పెంచుతున్నారు.
ఫీజులపై నియంత్రణ ఏది ?
ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులూ వున్నాయి. కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే. 1994లో వచ్చిన జీవో నెం-1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేస్తు న్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు చెప్పేస్తున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం-91లో ఫీజు స్ట్రక్చర్‌ నిర్వచించబడిరది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమా న్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధుల చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసు కొచ్చిన జీవోనెం 46/2010పై కూడా కోర్ట్‌ స్టే తీసుకుని వచ్చారు. పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వినియోగించడం లేదు. షూ, టై, బెల్టు అమ్మే వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మారినా చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు,కార్పొరేట్‌ ఫీజుల నియం త్రణకై అనేక వాదనలు జరుగుతున్నాయి. అటాన మస్‌ హోదా కల్గిన విద్యాసంస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యం వాదనలు వినిపిస్తున్నాయి.2002లో ’’టి.ఎ.పారు.వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’2003లో’’ఇస్లామిక్‌ ఎడ్యు కషన్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’, 2004లో’’మోడరన్‌ స్కూల్‌ వర్సెస్‌ ఢల్లీి ప్రభు త్వం’’,2005లోపి.ఎ.ఇనాందారి వర్సెస్‌ మహా రాష్ట్ర ప్రభుత్వం’’ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో చాలా స్పష్టత వచ్చింది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలైన ప్రైవేటు విద్యాసంస్థలుక్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉం దని సుప్రీం తెలిపింది. కానీ ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.
నియంత్రణ చట్టం అవశ్యం
ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రిం చేందుకు తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర, రాజస్ధాన్‌,పశ్చిమ బెంగాల్‌,పంజాబ్‌ సహా15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చా యి.తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది.దాదాపు 11వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది.కానీ ఆచరణలో గత ప్రభుత్వం ఈ కృషి చేయలేదు.రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 19(1) ప్రకారం విద్యను ఉచితంగా అందించాలి. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణలో ఉపాధ్యాయుల జీతాలు ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ప్రభు త్వం ఆయా సంస్థల ఎకౌంట్లను సమగ్రంగా పరిశీ లించి సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్వ హణ ఖర్చులు15శాతం మించకుండా పెంచుకు నేలా చట్టం చేయాలి. ప్రతి సంవత్సరం తల్లిదం డ్రులు,పాఠశాల యాజమాన్యం,విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో జిల్లాకలెక్టర్‌,జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న ‘డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ’ ఫీజులను నియం త్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. పాఠశా లలను దుకాణాలుగా మార్చి టై, బెల్ట్‌, పాఠ్యపుస్త కాలు అమ్మడంపైనా నియంత్రణ చేయాలి. ప్రత్యేక చట్టాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఫీజులను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలి.ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరిం చిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యా ర్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,చిన్న విద్యాసంస్థ ల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టాల్సి బాధ్యత ఉంది.
ఎక్కడ ఫీజుల నియంత్రణ చట్టం?
ప్రయివేట్‌,కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఫీజుల మోత మోగుతోంది. ఇది ప్రతియేటా విద్యార్థుల తల్లిదండ్రులకు భారమవుతోంది.ప్రయివేట్‌, కార్పొ ంట్‌,ఇంటర్నేషనల్‌ పేరుతో నడిపిస్తున్న స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటు విద్యాశాఖాధికారులుగానీ,అటు ప్రభుత్వంగానీ ఆ స్కూల్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు ఈ స్కూల్స్‌లో క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం దారుణం. ఫీజులను కట్టడి చేస్తామంటూ సంవత్స రాల నుంచి చెబుతున్న మాటలను ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ప్రొ. తిరుపతిరావు కమిటీ అంటూ కొన్ని రోజులు, మంత్రుల కమిటీ అంటూ కొన్నిరోజులు ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు.చివరికి ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార సులను పక్కన పెట్టేశారు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారో అంటూ తల్లిదండ్రులు ఆందో ళన చెందుతున్నారు.రాష్ట్రంలో పైచిలుకు కార్పొ రేట్‌, ప్రయివేట్‌ స్కూల్స్‌ ఉండగా, వీటిలో దాదాపు గా లక్షల మంది చదువుతున్నారు.ఫలితంగా ప్రయి వేట్‌,కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగు తుంది.రాష్ట్రంలో కొన్ని పాఠశాలకు పర్మిషన్‌ లేక పోయినా అద్దె భవనాలు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అడ్మిషన్ల పేరుతో డబ్బులు దండు కుంటున్నాయి యజమాన్యాలు. గత సంవత్సరం ఫీజు కంటే 20నుంచి 30శాతం వరకు ఫీజులు పెంచు తున్నాయి.స్కూల్స్‌ స్థాయిని,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంపకం నడు స్తుంది.కార్పొరేట్‌స్కూల్స్‌ బ్రాంచీల పేరుతో రాష్ట్రం లో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.ఈ ప్రాంతాల్లో అడిగే నాథుడు లేడనే ఉద్దేశాలతో విద్యాలయాలు నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రులను పరోక్షంగా భయాం దోళన గురిచేస్తున్నారు.రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య,భాష్యం,సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌, కృష్ణవేణి టాలెంట్‌,శాంతినికేతన్‌,నాగార్జున స్కూల్స్‌ వివిధ ప్రాంతాలలో బ్రాంచిల పేరుతో విద్యా వ్యాపారం సాగిస్తున్నారు. ఆఖరికి పపుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్‌ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతు న్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్‌ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్న పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. పూర్తిస్థాయిలో భవనాలు ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు,ఇరుకైన తరగతి గదులు, మౌలిక సదుపా యాలు ఉండవు. ఫైర్‌ సేఫ్టీ ఉండవు అయినప్పటికీ ఈ స్కూలుకు రెన్యువల్‌కు దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. స్కూల్‌ ఫీజుల పెంపును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓచట్టం చేయాలని నిర్ణయం తీసు కుంది. జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావే శంలో మంత్రులతో ఫీజు నియంత్రణకు విధివిధా నాలు ఏర్పాటు చేసేందుకు ఉప సంఘాన్ని నియ మించారు.ఈ కమిటీకూడా ప్రతిప్రయివేట్‌, కార్పొ రేట్‌ స్కూల్లో ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేసి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే ఫీజు లు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం జరగ లేదు.అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అడుగులు కూడా పడకపోవడం గమనార్హం. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ నిరసనలు వ్యక్తం చేస్తున్న గాని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. వాస్తవానికి ఏవిద్యా సంస్థనైనా ట్రస్ట్‌ పేరిట నడ పాలి. దానికి ఒక గవర్నమెంట్‌ బాడీ ఏర్పాటు చేయాలి.అయితే కార్పొరేట్‌ పాఠశాలలో నామ మాత్రంగా గవర్నమెంట్‌ బాడీ చూపిస్తున్నా, అధి కారం మొత్తం యాజమాన్యం చేతుల్లో పెట్టుకుం టుంది.కొన్ని స్కూల్స్‌ ఒకేసారి మొత్తం ఫీజు కట్టా లని నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రం లోని అన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు నియంత్రణ ఉండేటట్టు విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.-(టి.నాగరాజు)