ప్రామాణిక వివరణ గిరిజనులు తిరుగుబాట్లు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ రామ్‌దాస్‌ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ తెలంగాణలో గిరిజనులు తిరగుబాట్లు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
మానవ జీవనమే పోరాటాలమయం మనిషి జీవిత కాలం ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే మనుగడ కోసం జీవన పోరాటం సాగించక తప్పదు. మానవ సమాజానికి మూలవాసులుగా ఆదివా సులుగా అభివర్ణించబడుతున్న ఈ అడవి బిడ్డల జీవితమే ఒక పోరాటం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభిన్న పేర్లతో జీవిస్తున్న ఈ ఆదివాసులు ప్రతి పోరాటానికి మూలవాసులే అనాలి.
ఇక మన తెలుగు ప్రాంతాల్లోని గిరి బిడ్డలు అటు ఆదిలాబాద్‌ నుంచి ఇటు నల్లమల మీదుగా ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి ఉన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ లోని గోండులు పేరు చెప్పగానే కొమరం భీం పోరాటం, ఉత్తరాంధ్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన తిరుగుబాట్ల పోరాటాలు, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు మనకు తెలిసిందే!!
మనుగడ కోసం మొదలైన పోరాటం స్వాతంత్రం కోసం తీవ్ర రూపందాల్చింది. చివరికి స్వరాజ్యదేశంలో కూడా ప్రాంతీయత కోసం,అస్తిత్వాలు కాపాడుకోవడం భూమి కోసం భుక్తి కోసం ఆధునిక తిరుగుబాట్లు పోరాటాలు కొనసాగుతున్నాయి.
పోరాటాలను సమాజ విధముగా చర్యలుగా చూస్తూ వాటిని కూకటివేళ్లతో బికిలించి సమూలంగా నాశనం చేయాలనుకుని రక్షణ దళాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ..అనేకమంది అమాయకులను బలి చేస్తున్న పాలకులు అసలు పోరాటాలకు మూల కారణం గురించి ఆలోచించడం లేదు.
అచ్చంగా అలాంటి ఆలోచన కోసమే ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పరిశోధ నాత్మకంగా గణాంకాలతో అందించిన ప్రామాణిక పుస్తకమే ‘‘తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు’’
ఈ పుస్తకంలో గిరిజనులు చేసిన పూర్వ పోరాటాలు వాటి నేపథ్యం వివరిస్తూ గిరిజనులకు అందించాల్సిన అవకాశాలు, చేయబడ్డ చట్టాలు గురించి క్షుణ్ణంగా వివరించారు రచయిత రామదాస్‌,
తెలంగాణలో గిరిజనులు భూస్వాములు మొదలు ఉద్యమ దశలు కొరకు ఐదు విభాగాలుగా రూపొందించబడిన ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకం ద్వారా అనేక విలువైన విషయాలతో పాటు సమగ్ర సమాచారం క్షుణ్ణంగా తెలుస్తుంది.
ఇది కేవలం తెలంగాణ ప్రాంత గిరిజనులకే పరిమితం చేసినట్టు కన్పిస్తున్న దీనిలోని సమస్యలు పరిష్కార మార్గాలు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.
అడవి బిడ్డలు తరతరాలు ఓ అనుభవించిన బాధ వివక్షత తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికింది,దాన్ని అంతం చేయడానికి పాలకులు చేసిన చర్యలు అన్నీ విఫలం కావడంతో గిరిజన గిరిజనేతల మధ్య అలాగే గిరిజనుల్లోని వివిధ తెగల మధ్య వైరుధ్యాల సృష్టించి అనేక కుట్రలతో ఆదివాసీలను, ఆదివాసీ నాయకులను,లోబర్చుకోవడానికి నిత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంటారు రచయిత,
పోరాటాలపై ఎన్ని అణచివేతలు ఉన్నా గోండుల ఆరాధ్య దైవం కొమరం భీం ఆశయం అయిన జల్‌,జమీన్‌,జంగల్‌, కోసం నేటికీ తెలంగాణ అడవి బిడ్డలు తమ అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రాంత గిరిజనుల ప్రధాన సమస్య భూ సమస్య,ఇక్కడి గిరిజనుల ప్రతి పోరాటం దీని చుట్టూనే తిరుగుతుంది.
సహజంగా శాంతికాంకులైన అడవి బిడ్డల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం తమ కట్టుబాట్లకు తమను దూరం చేస్తూ వారిపై ఆధునిక పెత్తనం చేయడమే ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణం అంటూ వాటిని సహేతు కంగా వివరించే ప్రయత్నం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్‌ వారి పాలనలోనే భూముల వ్యాపారం మొదలైంది అని చెబుతూనే 18 వశతాబ్దపు తొలి రోజుల్లో తెలంగాణలో నాటి నైజాం రాజ్యంలో గిరిజనులు బయట ప్రపంచానికి సంబంధంలేని చక్కని జీవనం గడిపేవారు కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం నిజాం సర్కారుపై దండెత్తి ఆక్రమించి ఆధిపత్యం చిక్కించుకున్న సమయంలో (1800-1850) బ్రిటిష్‌ వారు చేసిన భూచట్టాలు తదితరాలవల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది తప్ప ఆదివాసులకు ఎలాంటి లాభం ఉండేది కాదు, అదేవిధంగా అడవుల మీద హక్కులు కూడా కోల్పోయారు.అడవులను రక్షిస్తూ పర్యావరణ సంరక్షకులుగా ఉన్న అడవి బిడ్డలు తమ సొమ్ములకు తామే పన్నులు కట్టే దుర్మార్గపు పరిస్థితి ఏర్పడిరది, అంటూ గిరిజన భూములకు కలిగిన అభద్రత గురించి వివరిస్తూ గిరిజన భూముల దురాక్రమణ కారణాలు వివరిస్తూనే భూ బదిలీ నియంత్రణ చట్టాల ఉల్లంఘన గురించిన వివరాలతో పాటు..
భూబదలాయింపు నిబంధన చట్టం అమలు అయిన వివరాలను పట్టిక రూపంలో పొందుపరిచారు.
రెండవ భాగములో స్వాతంత్రానికి ముందు తరువాత జరిగిన గిరిజన ఉద్యమాల గురించి చారిత్రక గణాంక ఆధారాలతో వివరించ బడిరది,గిరిజన ఉద్యమాల్లో తొలి ఉద్యమంగా 1879-80 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాలో గల చోడవరం తాలూకాలోని ‘‘రంప’’ అనే గ్రామంలో జరిగిన తొలి ఆదివాసి తిరుగుబాటు అనంతర కాలంలో జరిగిన పోరాటాలకు మూలంగా నిలిచింది,1915- 16 సం:లో జరిగిన కొండ రెడ్ల ఉద్యమం, అనంతర కాలంలో1922-24 మధ్యకాలంలో మన్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచింది. అలాగే 1940 దశకంలో కొమరం భీమ్‌ చేసిన గోండుపోరు,1946-51మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మరికొన్ని గిరిజన పోరాటాల గురించి వివరించి చివరగా స్వాతంత్రానంతరం గిరిజనుల దీనస్థితి గురించి కూడా సవివరంగా చెబుతూ దానికి కారణాలు నివారణ మార్గాల గురించి కూడా పరిశోధక రచయిత రామదాస్‌ సహేతుకంగా వివరించారు.
మూడవ విభాగంలో గిరిజన ప్రాంతాలపై జరిగిన పరిశోధనలు మార్గదర్శకాలు గురించిన వివరణలో గిరిజన ఉద్యమాలను నాటి బ్రిటిష్‌ వారు నేటి ప్రజాస్వామ్య పాలకులు ఎన్ని కుయుక్తులు చేసి వ్యూహాత్మకంగా ఉద్యమాల అణిచివేతకు ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు మాత్రం ఒక నిర్దిష్టమైన మార్గంలో ముందుకు పోతూ గిరిజనులను ప్రభావితం చేస్తున్నాయి అంటారు రచయిత.
నాల్గవ విభాగంలో తెలంగాణలో గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతుల పట్టికల ఆధారంగా విశ్లేషణలు చేయబడ్డాయి.
చిట్టచివరి భాగంలో భూ ఆక్రమణ తీరుతెన్నులు ఉద్యమ దశల గురించి వివరించిన ఈ వ్యాస సంపుటిలో గిరిజన ఉద్యమాలు మొత్తం భూమి కేంద్రంగా జరిగాయని అందుకు గిరిగినేతరులే ప్రధాన కారణం అన్న విషయం చెబుతూనే,చట్టాల గురించి అవగాహన కలిగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇందులో వివరించబడ్డాయి.
గిరిజన ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి కోసం ప్రస్తుతం చేపడుతున్న చట్టాలు చర్యలకు తోడు మరికొన్ని చట్ట సవరణలు అభివృద్ధి అవగాహన చర్యలు గురించి ఇందులో కూలంకషంగా వివరించారు.
గిరిజన సాహిత్య అధ్యయనకర్తలు, పరిశోధక విద్యార్థులకు ఎంతో విలువైన సమాచార దర్శిని ఈ ప్రామాణిక పరిశోధక వ్యాస సంపుటి.
తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు
రచన : ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పేజీలు : 82, వెల,60/-రూ ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌- 68 ఫోన్‌ : 040-24224453/54. సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.