ప్రామాణిక దర్పణం కొండరెడ్డి జీవన విధానం
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్ శాఖ వారి పరిశోధన గ్రంధం ‘ కొండ రెడ్ల గిరిజనుల జీవన విధానం’ అనే పుస్తకంపై సమీక్ష
మనం మూల వాసులుగా చెబుతున్న ఆదివాసీలలో ఒక తెగ అయిన కొండరెడ్డి గిరిజన జీవన విధానంకు సంబంధించి సంపూర్ణ సమాచారంగల ప్రామాణిక పుస్తకం ‘‘కొండరెడ్డి గిరిజనుల జీవన విధానం’’ తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్ శాఖ వారి పరిశోధన, ప్రచురణల విభాగంలో భాగంగా ఈ పుస్తకం 2010 సంవత్సరంలో ప్రచురించారు. గిరిజన జీవన విధానాల పరిశోధన ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని నాటి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి మండలంలో గల ‘‘బొడ్లంక’’అనే సంపూర్ణ కొండారెడ్డి గిరిజన గ్రామంను ఈ పరిశోధనకు ఎంపిక చేసుకొని పరిపూర్ణమైన సమాచారం సేకరించి పొందుపరిచారు.
నాటి గ్రామ చరిత్ర సమాచారాలను తెలిపే కైఫియత్తు ప్రక్రియలో వ్రాసిన ఈ గిరిజన గ్రామ చరిత్రలో అనేక చారిత్రక సామాజిక సాంస్కృతిక విషయాలు తెలుస్తాయి.
సుమారు 1901 సంవత్సరంలో పుట్టగండి గ్రామం నుంచి వలస వచ్చిన కొన్ని కొండ రెడ్డి కుటుంబాలతో ఏర్పడిన ఈ పూర్తి గిరిజన గ్రామంలో నేడు 60 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు.
చుట్టూ దండకారణ్యం ఎతైన కొండలు వాటి మధ్య బొడ్డు లాగా లోతుగా ఉండే లోయ నాలుగు దిక్కుల జలజల పారే సెలయేర్లతో అందాలు ఆరబోస్తున్న ఈ ప్రాంతం భౌతిక రూపం అనుగుణంగానే ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు సార్ధకం చేసినట్టు,అలాగే ఈ గ్రామ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిం చిన పల్లాల వీరపరెడ్డి తండ్రి బోడి రెడ్డి పేరు మీదుగా కూడా ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు వచ్చిందనే మరో కథనం కూడా ఉంది.
నేడు ఈ గ్రామం ఐటిడిఎ సహాయ సహకారాలతో కొంత కొత్త రూపును సంతరిం చుకుంటున్న,నగర సంస్కృతి ఛాయలు సంత రిస్తున్న ఇక్కడి కొండరెడ్డి గిరిజనులు వారి పూర్వ తరాల సంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ మనుగడ సాగించటం విశేషం.
‘‘బొడ్లంక పరిచయం’’ మొదలుకొని ‘‘ఆటలు’’ వరకు మొత్తం14విభాగాలుగా విభజించి వ్రాసిన సంపాదకులు ఆచార్య భట్టు రమేష్ గారి సంఘటిత అక్షర కృషి అభినందనీయం, విషయ సేకరణ కర్తల కృషి ప్రశంసనీయం, గ్రామాల చరిత్ర రాయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని ఇందులో అగుపిస్తున్నాయి. గ్రామ పరిచయంతో మొదలై. ప్రజలు కులాల మధ్య సయోధ్య, పర్యావరణం,ఇంటి నిర్మాణం, గృహ సంబంధ వస్తు సంస్కృతి,వైద్య విజ్ఞానం, దేవతలు పండుగలు,జీవిత చక్రం,సంబరాలు వేష భాషలు భూషణాలు,ఆహారం,వస్తువులు, నిలవ పద్ధతులు,ఆటలు,తదితర అంశాలు కొండరెడ్డి గిరిజన జీవితాల్లో ఎలా పెనవేసు కున్నాయో ఆసక్తిదాయకంగా ఇందులో వివరించారు.
కొండ రెడ్డి కుటుంబంలో పుట్టిన శిశువుకు పేరు పెట్టడం ఒక ప్రహసనంగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని ‘‘పేరు ముళ్ళ’’ అని పిలుస్తారు ఈ తంతులో వారి సంస్కృతిని ఆధారం చేసుకుని వ్యవహరించడంలో అనేక ఆసక్తి దాయకమైన విషయాలు వెల్లడవుతాయి మనుషుల పేర్లతో పాటు ఇంటిపేర్లు చెట్ల పేర్లు తదితర పేర్ల గురించి వివరంగా తెలిపారు. బొడ్డులంక సంపూర్ణ కొండ రెడ్డి గ్రామం అయినా వీరితో సయోధ్య గల కమ్మరులు వేగుజంగాలు తదితర జాతుల గురించి ప్రస్తావిస్తూ వారితో వీరికి గల సయోధ్య గురించి వివరించిన అంశాలు ఉపయుక్తంగా ఉన్నాయి.
అలాగే ఈ గ్రామస్తులు పర్యావరణ సంరక్షణలో తీసుకుంటున్న చర్యలు గురించి వివరిస్తూ అక్కడి వృక్ష సంపద గురించి అనేక విలువైన విషయాలు పేర్కొన్నారు. అలాగే కొండరెడ్డి గిరిజనులు నిర్మించుకునే ఇంటి నిర్మాణం గురించి జీవిత చక్రపు సంబరాల్లో ఇంటి ప్రాధాన్యత దానికి కొండరెడ్లు ఇచ్చే ప్రాతినిథ్యం తదితర అనేక విలువైన విషయాలు ఈ విభాగంలో పొందుపరచబడ్డాయి.
అలాగే ‘‘గృహ సంబంధ వస్తు సంస్కృతి’’ వైద్య విజ్ఞానం, వృత్తి విజ్ఞానం,తో పాటు కొండరెడ్లు ప్రత్యేకంగా చేసుకునే దేవతల పండుగలులో వారు చేసుకునే విలక్షణమైన సంక్రాంతి పండుగ గురించి, అనేక ఆసక్తిదాయకమైన విషయాలు ఈ విభాగంలో తెలిపారు దీనితో పాటు వాళ్లు చేసుకునే కొండ దెయ్యాల పండుగ,సొప్పల పండుగ,పచ్చిక పండుగ, మామిడి కొత్త పండుగ,మామిడి టెంకల పండుగ,కొర్ర కొత్త,జొన్న కొత్త,పండుగలు బుడమల పండుగ,దారి పండుగ,లక్ష్మీదేవి పండుగ,భూదేవి గంగానమ్మల పండుగలు, వంటి సామూహిక పండుగలతో పాటు వ్యక్తి గతమైన పండుగలను జీవిత చక్రపు సంబ రాలు శీర్షికతో కొండరెడ్లు చేసుకునే మరికొన్ని పండుగలు అవి చేసుకునే విధానాల గురించి ఉపయుక్తమైన విషయాలను సేకరించి అందిం చారు.దీనిలో కొండారెడ్డి జాతిలో జననం నుంచి మరణం దాకా చోటు చేసుకునే వివిధ సంఘటనల గురించి సవివరంగా తెలిపారు. ఇక 11వ విభాగం అయిన ‘‘వేష భూషణాలు’’ గురించిన దానిలో కొండరెడ్లు ధరించే ఆభర ణాలు అలంకరణలు తదితర విషయాలు ఎంతో చక్కగా పేర్కొన్నారు.అనంతరం ఆహా రం గురించిన విశ్లేషణలో వారు తినే సోడి రొట్టె, సామకూడు,సామజావ,కొర్రకూడు, గంట్లు,జీలుగు అంబలి,మామిడి టెంకల రొట్టె, అంబలి,మొక్కజొన్న అంబలి,సేమకూర, వెదురు కొమ్మలకూర,లక్ష్మిచారు,తదితర ఆహార దినుసులు తయారు చేసే విధానాలు మొదలైన అంశాలు ఈ విభాగంలో పొందుపరిచారు. ఇక చివరి రెండు విభాగాలుగా,వస్తువులు నిల్వ పద్ధతులు,ఆటలు,అనే అంశాలు చెప్పబడ్డాయి. పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధస్తులైన కొండరెడ్లు వారు పండిరచిన ఆహారం పంట లను నిల్వ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహి స్తారు.ఆధునికులకు ఈవిధానం ఆశ్చర్యకరంగా ఆగుపించిన,వీరు పాటించే పద్ధతులు ప్రామా ణికంగా ఆరోగ్య దాయకంగా ఉంటాయి. కొండరెడ్లు ఆడే ఆటల్లో కూడా కొన్ని విలక్షణమైన అంశాలను మనం గమనించ వచ్చు వాటిలో ప్రధానంగా ఆగుపించేవి ఉప్పరి పెట్టెలు,నాలుగురాళ్లు,పిన్నీసు ఆట,ముక్కు చిక్కుడు,తల్లి పిల్లఆట, ఎత్తురాళ్ళు,పుల్ల, బచ్చ,గూటి బిళ్ళ,గెలుపులాట,మొదలైన ఆటలు కొండరెడ్డి గిరిజన జాతులవారిలో పిల్లలు పెద్దలు స్త్రీ పురుషులు ఆడతారు..అనే అంశా లు ఇందులో తెలిపారు.
ఇలా ఒక గ్రామమును ప్రామాణికంగా తీసు కుని అక్కడి వివరాలను పరిశోధనాత్మకంగా అక్షరబద్దం,చేయడం ద్వారా బహుళ ప్రయో జనాలు చేకూరతాయి.
ఎన్నో పరిశోధక విలువలు గల ఈ బొడ్లంక కొండరెడ్డి గిరిజన గ్రామ చరిత్ర ఆధారంగా మరిన్ని గిరిజన గ్రామాల చరిత్రలు రావాల్సిన అవసరం కనిపిస్తుంది.
పుస్తకం : కొండ రెడ్డి గిరిజనుల జీవన విధానం (బొడ్లంక)
సంపాదకులు : ఆచార్య భట్టు రమేష్, పేజీలు:172,వెల :-85/-రూ,ప్రతులకు : జానపద గిరిజన విజ్ఞాన పీఠం తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్-506002, ఫోన్ : 0870-2101309/2441258
సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు
సెల్ :7729883223.