Skip to content
ప్రపంచ భాషల్లో అందమైనది..తెలుగు భాష ఒక్కటి
- ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర
’’అడుగుజాడ గురజాడది అది భావికిబాట’’ అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు. సమాజం లోని కుళ్ళును, మత మౌఢ్యాన్ని, కుల దురహం కారాన్ని, గ్రాంధిక భాషా ఛాందసత్వాన్ని, స్త్రీల పట్ల అణచివేతను తీవ్రంగా నిరసిస్తూ తన కలాన్ని కత్తిగా మలచి అభివృద్ధి నిరోధకత్వంపై పోరాడిన యుగకర్త గురజాడ. ఈయన దృష్టిలో సాహిత్యం ఒక భోగ(వినోద) వస్తువు కాక సమాజంలోని మార్పుకు ప్రజల పక్షాన కృషి చేసే ఆయుధంగా (దిక్సూచి)గా భావించారు.అందుకే గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు,నవయుగ వైతాళికు డయ్యాడు
జననం -కుటుంబ నేపథ్యం
గురజాడగారు 1862 సెప్టెంబర్ 21వతేదీన విశాఖ జిల్లా, ఎలమంచిలి తాలూకా లోని రాయవరం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు.తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు.గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా గురజాడ గ్రామంనుండి విశాఖ మండ లానికి తరలివచ్చారు. గురజాడ తండ్రి ’’చీపురు పల్లి’’లో ఉద్యోగం చేసేవారు. అందువల్ల గుర జాడ ఆఊరులో ఉన్న గ్రాంటు స్కూలులో మొదటి మూడు తరగతులు చదివారు. వెలువలి రామ మూర్తి పంతులుగారివద్ద సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. విజయనగరం మహారాజా వారి హైస్కూలులో లోయర్ ఫోర్త్, అప్పర్‌ఫోర్త్, ఫిప్తు,మెట్రిక్యులేషన్ చదివారు.1882లో మెట్రిక్యు లేషన్ ఉత్తీర్ణులయ్యారు.1882-1884మధ్య ’’ఎఫ్పే’’చదివారు. 1884-1886లో ఫిలాసఫీలో బి.ఎ.చదివారు.బి.ఎ.చదువుతుండగా 1885లో అప్పారావు వివాహం జరిగింది.భార్యపేరు ’’అప్పల నర్సమ్మ’’.ఈ దపంతులకు 1887లో లక్ష్మీనరసమ్మ (కుమార్తె),1890లో వెంకట రామదాసు (కుమారుడు) 1902లో కొండయమ్మ (కుమార్తె) జన్మించారు. గురజాడ బి.ఎ.ఉత్తీర్ణత పొందడంతో ప్రిన్స్‌పాల్ చంద్రశేఖరశాస్త్రి రాజా వారి కళాశాలలో ఎనిమిదో అసిస్టెంట్ లెక్చరర్‌గా ఉద్యోగం వేయించారు. నెలకు 25 రూపాయలు జీతం కావడంతో,ఆర్థిక ఇబ్బందుల వల్ల 1886 లో కళాశాల నుండి సెలవు తీసుకుని ’’డిప్యూటీ కలక్టరాఫీసులో’’ హెడ్ క్లర్కుగాచేరారు. కాని ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు.తిరిగి 1887లో ఆనందగజపతి మహారాజా వారి కళాశాలలో నాలుగవ లెక్చరర్‌గా చేరారు. దానితో పాటు మహారాజావారికి వార్తాపత్రిలు చదివి విన్పించి నందుకు మరో 50రూపాయలు అదనంగా ఇచ్చే వారు. మొత్తంగా నెలసరి జీతం 150 రూపా యలు వచ్చేవి.1889లో మహారాజావారి ఆస్థా నంలో ఏర్పాటు చేయబడిన డిబేటింగ్ క్లబ్ చర్చా వేదికకు ఉపాధ్యక్షుడైనారు.1896లో విజయ నగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా నియ మితులైనారు.1897లోఆనందగజపతి మరణా నంతరం సంస్థానం వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత నిర్వర్తించారు. 1898 నుండి 1912 వరకు రీవారాణి అంతరంగిక కార్యదర్శిగా చేసి 1913 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు.
గురజాడ రచనా వ్యాసంగం
గురజాడలో మెట్రిక్యులేషన్ చదువు తున్నప్పుడే కవిత్వ శక్తి వికసించింది. ఆంగ్లంలో ’’కకూ’’ (కోకిల)అనే కవితను వ్రాశారు. సంస్కృ తంలో శ్లోకాలు వ్రాస్తుండేవారు.1883లో ఇంగ్లీషులో ’’సారంగధర’’ అనే కథా కావ్యాన్ని రాశారు.అది ’’ది ఇండియన్ లీజ్జర్ అవర్’’ అనే ఆంధ్రాంగ్ల పత్రికలో ప్రచురించబడిరది. కలకత్తా నుండి వచ్చే ’’రీస్ అండ్ రయ్యత్’’ అనే పత్రికలో ’’సారంగధర’’ ను పునర్ముద్రించారు. ఈ పత్రికా సంపాదకుడైన శంభుచంద్ర ముఖర్జీతో గురజా డకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి.గురజాడ రాసిన రచనల్లో కన్యాశుల్కం ఒక గొప్ప రచన. ఇది ప్రపంచ సాహిత్యంలో గొప్ప ఆదునిక నాట కాల సరసన నిలిచిన నాటకం. దీని తొలికూర్పు 1897లో,రెండవ ముద్రణ1909లో జరి గింది. 1909లో నీలగిరి పాటలు రచించారు. 1910 లో గురజాడను తెలుగు కవిత్వ చరిత్రలో చిర స్థాయిగా నిలిపిన’’ముత్యాల సరములు’’ రచన చేశారు. ఇది కవితా సంపుటి. ఇందులో ముత్యా ల సరాలు,కాసులు,లవణరాజుకల,కన్యక, పూర్ణ మ్మ,లంగరెత్తుము,డామన్ పితియస్,దేశభక్తి గేయం మొదలైన కవితా ఖండికలున్నాయి. కొండు భట్టీయం, బిల్హణీయం అనే అనువాద నాటకాలు రచించారు. దిద్దుబాటు, దేవుళ్లారా మీ పేరేమిటి? మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, సుభద్ర, ఋతుశతకం వంటి సంస్కృత రచనలతో ఆపటు సౌదామిని వంటి నవలలను కూడా రచించారు. కథ చెప్పేటప్పుడు ఒక ఎత్తు గడా, నడిపించే తీరూ, నాటకీయత, ఒక పతాక స్థితి,ఒక ముగింపూ తప్పకుండా ఉంటాయి. వీటన్నింటి మేళవింపు గురజాడ రచనల్లో మనకు దర్శనమిస్తాయి.
ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర-ఒక పరిశీలన
’’జీవితం స్పష్టం చేయలేని దాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది’’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాట గురజాడ సాహి త్యానికి పూర్తిగా వర్తిస్తుంది. గురజాడ సాహిత్య పతాక సంఘ సంస్కరణకు మించిన సాంఘిక విప్లవం.అందుకే ఆయన ఆనాటి మొత్తం భారత దేశంలోనే విశిష్టమైన సాహితీవేత్త. సమకాలీన కొత్త వస్తువుతో, కొత్త దృక్పథంతో, కొత్త రూపంతో గురజాడ తన నాటక కళను కవిత్వాన్ని, కథాని కను తీర్చిదిద్దినారు. దానికి నిదర్శనమే ఆనాటి కాలంలోని కన్యాశుల్క వివాహాలను నిరసిస్తూ, అనాదిగా కొనసాగుతున్న సంస్కృత నాటక కళను నిరాకరించి వాడుక భాషలో కన్యాశుల్కం రచిం చడం.వ్యవహారికభాషలో రచన చేయడమే కాకుం డా 1906లో సహాధ్యాయి అయిన గిడుగు రామ మూర్తి పంతులుతో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించారు. ఇలా వాడుక భాషలో రచనలు చేసి ఆధునిక సాహిత్యంలో వాడుక భాషకు పునాదివేసి ’’ఆధునిక యుగకర్త’’ అయినారు. వేదాంతం పేరుతో మన దేశంలో ఎంత వంచన ఎంత మూర్ఖత్వం సాగు తుందో అని వాపోయాడు గురజాడ. మతాచారాల పేరు మీద సాగే స్వార్థపరత్వాన్ని ఎండగడుతూ రాసిన కథ -’’మీ పేరేమిటి?’’ మానవ సంబంధాల ఉద్వేగాలు మతాలకు అతీతమైనవి అని పెద్ద మసీదు కథ విశదపరు స్తుంది.మూఢ విశ్వాసా లను తృణీకరించే విధంగా ’’ముత్యాల సరములు’ రచన చేశారు.
’’దేశమంటే మట్టికాదోయ్.. దేశమం టే మనుషు లోయ్’’ – అంటూ దేశభక్తి గేయం ద్వారా ప్రజల్లో జాతీయ భావ స్ఫూర్తిని నింపారు. ’’ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరా స్తుందని’’ ఆశాభావం వ్యక్తం చేశారు. గురజాడ రాసిన తెలుగులో మొదటి కథానిక అయిన ’’దిద్దుబాటు’’ద్వారా’’పురుషుడి అడుగు జాడల్లో స్త్రీ నడవటం కాదు,పురుషుడికి నడక నేర్పేది, పురు షుడి జీవితాన్ని తీర్చిదిద్దేది స్త్రీ’’అని చాటి చెప్పారు. వర్ణవ్యవస్థను పూర్తిగా నిరాకరించి మంచి చెడ్డల ప్రాతిపదికగా మనుషులలో రెండే కులాలున్నాయి అని చెప్పారు.ఆధునిక సాహిత్యం లో ఎన్నో ఉద్యమాలకు ప్రేరకులైనారు. ప్రాచీన కాలం నుండి సాహిత్యాన్ని కేవలం ఒక భోగ (వినోదవస్తువు) వస్తువుగానే భావించి రచన లు చేశారు. నాటి వ్యవస్థను నిరసిస్తూ సమాజ మార్పే సాహిత్య లక్ష్యం అంటూ రచనలు చేశారు గురజాడ. ప్రజాస్వామ్య యుగపు లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం సాధనకు కలంబట్టి నాటకం,కవిత్వం,కథలు,సాహిత్య,విద్యా రంగంపై విమర్శనా రూపాలతో చివరిక్షణాల దాకా సమా జ ప్రగతికై రచనలు చేశారు. స్త్రీ జాతికి సమాన గౌరవం దక్కాలని పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించిన గురజాడ 1915 నవంబరు 30నాడు కన్నుమూశారు. స్త్రీలపై అణచివేత, పీడన కొనసాగినంత కాలం వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిస్తూనే వుంటాయి. కొందరు జీవిస్తూ మరణిస్తారు. మరికొందరు మరణించి జీవిస్తారు. ప్రజాకవి గురజాడ మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. – (స్త్రీవాద పత్రిక భూమిక సౌజన్యంతో) – (జాలిగం స్వప్న)
Related