ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేక అమ్మివేసే (దీనినే -వ్యూహా త్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రి యను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రజానీకానికి పలు విధాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భార తీయ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, జాతీయ రహదార్లు మున్నగువాటిని దేశీయ, విదేశీ బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగిం చడం కోసం ‘మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ విధానాన్ని శరవేగంగా అమలుచేసేందుకు పూనుకున్నది. గతంలో నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలలో కొంత వాటాను కానీ, సంస్థను పూర్తిగా కానీ అమ్మివేసే ప్రక్రియ ఆర్థిక సంస్కరణలలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 2014కి పూర్వం పదేండ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ వచ్చింది. కొన్ని సంస్థలలో 25శాతం లోపు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కొంతమేరకు ప్రైవేటీకరణ జరిగింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ లో తిరుగులేని మెజారిటీ సాధించిన బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తుల (ప్రజా ఆస్తులు)ను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేం దుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ అమ్మకాలను సదరు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు,ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ప్రజలు భావించ కూడదు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ళలో టాటా,బిర్లా లాంటి కొద్దిమంది బడా పారిశ్రామిక వేత్తలు తప్ప, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగల స్థోమత ప్రైవేట్‌రంగానికి లేకపోయింది. తత్కార ణంగా విద్యుదుత్పత్తి,ట్రాన్స్‌మిషన్‌,రైల్వేలు, జాతీయ రహదారులు,పెట్రోలియం,ఫార్మాస్యూటికల్‌, నౌకా శ్రయాలు,ఎయిర్‌పోర్టులు,వంటి వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం,బ్యాంకుల నుంచి రుణా లు,కార్మికులు,ఉద్యోగుల శ్రమవగైరాలతో ఈ సంస్థ లు అభివృద్ధి చెందాయి. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వల్ల కొంతమేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతోపాటు, వాటికి అనుబం ధంగా ప్రైవేట్‌ రంగంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాట య్యాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐడిపి ఎల్‌ ఏర్పాటు కావడంతో అనంతరకాలంలో పలు ఫార్మాస్యూటికల్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనితో హైదరాబాదుకు విశిష్టస్థానం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలయినందున రిజర్వేషన్‌ సూత్రాన్నను సరించి ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు చెందిన వారికి ఉపాధి లభించి, కొంతమేరకు సామాజిక న్యాయం జరిగింది. మోదీ సర్కార్‌ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న రిజర్వ్‌ను, మిగులు మొత్తాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తూ వాటి విలువ తగ్గేందుకు పావులు కదిపింది. ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’కు ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలో సూచించాల్సిన బాధ్య తను అప్పగించింది. 38సంస్థలను ప్రైవేటీకరిం చాలని,26సంస్థలను మూసివేయాలని,10 సంస్థ లను అమ్మివేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. 50శాతం షేర్‌ హోల్డింగ్‌ కన్నా తక్కువ శాతాన్ని ప్రైవేటీకరించినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగుతుంది. సదరు సంస్థకు మార్కెట్‌లో షేర్‌ వాల్యూ ప్రకారం కొంత ధనం చేకూరుతుంది. ప్రభుత్వరంగ సంస్థను అమ్మినపుడు, మేనేజ్‌మెంట్‌ మార్పిడి జరిగినపుడు సదరు సంస్థ రిజర్వ్‌ ప్రైస్‌ లెక్కించేటప్పుడు,ఆసంస్థకు ఉన్నభూమి, ఇతర భౌతిక ఆస్తుల మార్కెట్‌ విలువను కూడా జోడిరచాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్‌ 2016 మార్చి4నచేసిన ఒక ప్రకటనలో పిఎస్‌యుని అమ్మేస్తున్నప్పుడు సందర్భంలో, యాజ మాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలుదారునికి మారిన సందర్భంలో భూమి విలువను కూడా రిజర్వ్‌ప్రైస్‌లో చేర్చుతామని స్పష్టంగా చెప్పారు. అయితే మోదీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పలు సంస్థల స్ట్రాటజిక్‌ అమ్మకాల విషయంలో ఈసూత్రాన్ని విస్మరించడం పలు అను మానాలకు తావిస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ సందర్భంగా ఒకే సంస్థకు రెండిరటిని మించి ఇవ్వరాదని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును ప్రక్కనపెట్టి గౌతమ్‌ అదానీకి 6 ఎయిర్‌ పోర్టులను కట్టబెట్టడం, సిబిఐతో దాడులు నిర్వ హించి ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యాలను భయపెట్టి సదరు సంస్థలను అదానీ ఖాతాలోకి వెళ్ళేట్లు కృషిచేయడం వంటి కారణాలవల్ల ఆ రెండు సంస్థ లను గౌతమ్‌అదానీ,ముఖేష్‌అంబానీ,అనిల్‌ అంబా నీలకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సుదీర్ఘ పోరాటం, ఎంపీలు, ఎంఎల్‌ఎల రాజీనామాలు,32మంది ఆంధ్రుల ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పాటైన ఉక్కు ఫ్యాక్టరీని ఈనాడు నూటికి నూరుశాతం అమ్మివేయడం గానీ, మూసివేయడం గానీ జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దాదాపు 30వేలఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ కిందఉంది. ఆభూమి బుక్‌వాల్యూను రూ.56 కోట్లుగా ప్రభుత్వం లెక్కవేస్తోంది.మార్కెట్‌ విలువ కనీసం రూ.60 వేల కోట్లు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రిజర్వ్‌ప్రైస్‌ గురించి సమా చారాన్ని కేంద్రం ప్రకటించకపోవటం దుర్మార్గం. అలాగే లక్షలకోట్లు రూపాయల ఆస్తులతో వేలకోట్లు లాభాలను ఆర్జిస్తున్న 2వ అతి పెద్ద చమురు సంస్థ బిపిసిఎల్‌ను కొద్ది వేలకోట్ల రూపాయలకే అమ్మి వేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా లభించే ధనాన్ని తిరిగి నూతనంగా మౌలిక వసతులు కల్పించేందు కు, విద్యా,వైద్యరంగాలలో ఖర్చుచేయడానికి విని యోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘకాలం కిందట అత్యంత తక్కువ ధరలలో భూములను, పరిశ్రమలను,మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చేసినవాటిని 25 నుంచి 50 సంవత్సరాల కాలవ్యవధితో కారుచౌకగా బదలాయిస్తూ, ఇప్పుడు కొత్తగా మౌలిక వసతులను పెంపొందిస్తామని చెప్పడం కంటే నయవంచన మరొకటి ఉండదు. మోదీ ప్రభుత్వం ఇంతవేగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలనుకోవడం,‘మానిటైజేషన్‌ పై ప్‌లైన్‌’ అమలుచేయాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కంటే మోదీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చాలా హెచ్చుస్థాయిలో రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగడమే కాక మొండిబాకీల పరిమాణం చాలా అధిక స్థాయికి చేరింది. 2013-14నాటికి బ్యాం కులకు తిరిగి రాకపోవచ్చని భావించిన రుణాల మొత్తంరూ.2.05 లక్షల కోట్లు ఉండగా 2018–19 నాటికి ఆ మొత్తం 11.73లక్షల కోట్లకు పెరిగింది. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా బట్వాడా అవుతున్న రూ.100రుణంలో రూ.16లు కేవలం 20 అధిక స్థాయి రుణగ్రహీతల ఖాతాలకు వెళ్తోంది. 2018-19లో కూడా ఈ 20 ఖాతాల మొత్తం రుణాల పరిమాణం రూ10.94 లక్షల కోట్ల నుంచి రూ.13.55 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్న10కోట్ల చిన్న, సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలలో 30 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారీపరిశ్రమల రంగం లో కేవలం 1 కోటి మందికి ఉపాధి లభిస్తోంది. భారీ పారిశ్రామికరంగానికి రూ.24 లక్షల కోట్లు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 3.75 లక్షల కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ 1.06 లక్షల కోట్లు రుణం లభించింది. మొత్తం పారిశ్రామికరంగానికి అందిన రుణ సదుపాయంలో 50శాతం పైన ఈ 20అధికస్థాయి రుణగ్రహీతలకు లభించడం ఆశ్చర్యకరం. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందున కేంద్రప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ద్వారా బ్యాంకులకు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూ జన్‌’ చేస్తూ ఉంటుంది. యుపిఎ ప్రభుత్వం ఏడేళ్ల లో రూ.68,000 కోట్లు బ్యాంకులకు అందచేయగా మోదీ సర్కార్‌ కేవలం ఐదేళ్లలో రూ 3,20,000 కోట్లు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ కింద అందజేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణభారం జూన్‌ 2019లో రూ 88లక్షల కోట్లు ఉండగా, జూన్‌ 2020 నాటికి రూ.101లక్షల కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది కోట్ల రూపాయల ప్రభుత్వరంగ ఆస్తులను, రిటైల్‌ ఫుడ్‌ రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.బ్రిటీష్‌ హయాంలో పలు రూపా లలో భారతీయ సంపదను తరలించుకు పోయిన కారణంగానే, కొద్దిశతాబ్దాల క్రితం ప్రపం చంలోనే అత్యధిక జిడిపిగల భారత్‌, స్వాతంత్య్రం పొందే నాటికి ఆర్థికంగా క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు రైతులకు, మరొక వైపున సంఘటితశక్తి ద్వారా దీర్ఘకాల పోరాటాల ద్వారా శ్రామికవర్గం సాధించు కున్న ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, మరొకవంక అత్యధికస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రేట్లకు కట్టబెట్టడం వంటి దుర్విధానాల వల్ల కోట్లాది ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు రైతులు, పారిశ్రామిక కార్మికులు, ప్రజాసంఘాలు యావన్మంది ఏకమై, మానిటైజేషన్‌ ప్రక్రియకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త:మాజీ వ్యవ సాయశాఖ మంత్రి, మాజీ లోక్‌ సభ సభ్యులు)
‘సామాన్యులపై ప్రభావం ఏమిటో చెప్పడం లేదు’
` ప్రొ.బిశ్వజిత్‌ ధర్‌
విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటినితమ లాభాల కోసం నడుపు తారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మో శారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది.
మానిటైజేషన్‌ అనే పదాన్ని వాడడం ప్రభు త్వానికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఎయిర్‌ ఇండియా, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రతిపాదనలను చేసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అందుచేత ఆస్తుల మానిటైజేషన్‌ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడానికి పెట్టిన మరో పేరు మాత్రమే.
‘’పని చేస్తున్న’’ (పెర్‌ఫార్మింగ్‌) ఆస్తులను బద లాయించడం ద్వారా ‘’నిరర్ధకంగా’’ (ఐడిల్‌) వున్న పెట్టుబడిని విడుదల చేసి ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించి ‘’అదనపు ప్రయోజనా లను పొందుతాం’’- ఇది నీతి ఆయోగ్‌ నివేదిక మానిటైజేషన్‌ గురించి ఇచ్చిన వివరణ. ఇక్కడ మొదటి సందేహం : పని చేస్తున్న ఆస్తులైతే నిరర్ధకం గా ఎలా ఉంటాయి? ఒకవేళ నిరర్ధకంగా ఉంటే పని చేస్తున్నట్టు ఎలా ఔతుంది? ఈ రెండిరట్లో ఏదో ఒకటే సాధ్యం. రెండు పరస్పర విరుద్ధమైన పదాలను- ‘’పని చేస్తున్న’’, ‘’నిరర్ధక’’ ఒకే వాక్యంలో కలిపి చెప్పడం తప్పుదోవ పట్టించడం కాదా?
రెండో సందేహం : ఈ ‘’అదనపు ప్రయోజనాలు’’ సామాన్య ప్రజలకు అందుతాయని ఆశించగలమా? మూడవది : ఇలా టాక్స్‌ పేయర్ల సొమ్ముతో సమ కూరిన ఆస్తులను ప్రైవేటువారికి అప్పజెప్పే బదులు ఇతర మార్గాల ద్వారా వనరులను సమీకరించడం సాధ్యం కాదా ? మానిటైజేషన్‌ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘’పని చేస్తున్న’’ ఆస్తులలో 26,700 కి.మీ. జాతీయ రహదారులు,400 రైల్వే స్టేషన్లు, 90పాసింజర్‌ రైళ్ళు, డార్జిలింగ్‌ హిమా లయన్‌ రైల్వే తో సహా నాలుగు పర్వత ప్రాంత రైల్వేలు ఉన్నాయి. ఇవిగాక ప్రభుత్వ రంగంలోని టెలికాం, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, సహజవాయువు పైప్‌ లైన్లు ఉన్నాయి. ఇటువంటి అత్యంత విలువైన జాతి సంపదను ఆ జాబితాలో చేర్చకుంటే ప్రైవేటు కార్పొరేట్లు మానిటైజేషన్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.
ఇవన్నీ ‘’నిరర్ధక ఆస్తులు’’ కానే కావు.
ఇటువంటి విలువైన ఆస్తులను మానిటై జ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండ బోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియ జేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ ఆస్తులను ప్రభుత్వం సమకూర్చింది. వీటి నిర్వహణలో ప్రజల ప్రయోజ నాలు చాలా ఉన్నాయి. ఇక ఇంతవరకూ వీటిని ప్రభుత్వం నిర్వహించింది గనుక ప్రజల ప్రయోజ నాలను దృష్టిలో వుంచుకుని వీటిని నిర్వహించింది. అందుకే వీటి ద్వారా వసూలు చేసే చార్జీలు ప్రజ లకు అందుబాటులో వుండేటట్లున్నాయి. ఇక ముం దు వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాలకోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది. ఒకసారి ప్రైవేటు పరం అయ్యాక వీటిధరలను నియంత్రించే అధి కారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అలా కాకుండా వీటి ధరలను ప్రభుత్వం అప్పుడు కూడా నియంత్రిం చాలనుకుంటే ఆ మేరకు ప్రభుత్వమే ఆ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ముట్టజెప్పవలసి వుంటుంది.
ఢల్లీి అనుభవం ఏమిటి ?
దేశ రాజధాని ఢల్లీి లో విద్యుత్‌ పంపి ణీని గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రైవేటీకరిం చారు. ఆ తర్వాత పెరిగిన విద్యుత్‌ చార్జీలు పేదలే కాకుండా మధ్య తరగతి సైతం మోయలేనంతగా గుదిబండగా మారాయి. అప్పుడు ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం లోకి వచ్చింది. విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. ఆ తగ్గించిన మేరకు ప్రైవేటు విద్యుత పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీని ప్రజల నుండివసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లిస్తోంది. ఢల్లీి ప్రజలు పెరిగిన విద్యుత్‌ చార్జీల రూపంలోనో,కాకుంటే అదనపు పన్నుల రూపం లోనో భారాం అదనంగా మోయక తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం దర్జాగా లాభాలు పోగేసుకుంటున్నాయి.
ఆదాయం సమకూర్చుకునే మార్గాలు వేరే లేవా ?
మన దేశ జిడిపికి,వసూలు చేసే పన్నులకు మధ్య నిష్పత్తి 2019-20లో17.4 శాతంగా ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అందుచేత అదనంగా సంపన్నుల మీద పన్ను పెంచవచ్చు. అంతే కాదు, ఈ ప్రైవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నుల మాటేమిటి?కంపెనీలకు వస్తున్న లాభాలను, అవి చెల్లిస్తున్న పన్నులను ప్రభుత్వం ప్రచురిస్తున్న గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. 2005-2006 లో40శాతం ప్రైవేటు కంపెనీలు తమకు ఎటు వంటి లాభాలూ రాలేదని ప్రకటించాయి. అదే 2018-19 నాటికి ఏకంగా 51 శాతం కంపెనీలు తమకు ఏలాభాలూ రావడం లేదని ప్రకటించాయి. ఒక కోటి రూ., లేదా అంతకన్నా తక్కువ లాభాలు వచ్చే కంపెనీల శాతం 2005-2006లో 55గా ఉంది. అదికాస్తా 2018-19 నాటికి 43 శాతానికి పడిపోయింది. అంటే దేశంలోని బడా ప్రైవేటు కంపెనీలు చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కుని తక్కువ లాభాలను చూపిస్తూ పన్నులు చెల్లించ కుండా తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వం పక్కాగా చట్టాలను రూపొందించి పన్నులను వసూలు చేస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది.ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు ? అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్ధత గురించి నీతిఆయోగ్‌ పదే పదే మాట్లాడుతూ వుంటుంది. కాని వాస్తవం వేరు.బడా ప్రైవేటు కంపెనీల్లో నష్టాల్లో నడుస్తున్నవి 51 శాతం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్నవి 28 శాతం. ఎవరి సామర్ధ్యం ఎక్కువ? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పెరిగేవి లాభాలా?లేకనష్టాలా?ఈమాత్రం ఆలోచించ లేకపోతోందా ఈ ప్రభుత్వం?
( వ్యాసకర్త – జెఎన్‌ యు ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌’ లో ప్రొఫెసర్‌)/ ‘ది హిందూ’ సౌజన్యంతో
వడ్డే శోభనాద్రీశ్వరరావు