ప్రజల భాగస్వామ్యంతోనే వికేంద్రీకరణ

జగన్‌గారి మాటల్లో గాని, వైఎస్సార్ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆ సం దర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. ప్రజల్లో మరింత గందరగోళం పెంచుతోంది. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి? పాలనా వికేంద్రీకరణ అంటే ఏమిటి? రాజధాని వికేంద్రీకరణ అంటే ఏమిటి? ఇలాంటి అనేక అంశాలు ఈరోజు చర్చనీయాంశాలుగా మన ముందుకు వచ్చాయి. – (వి.శ్రీనివాసరావు)
అభివృద్ధి అంటే పెద్దపెద్ద రోడ్లు, విమానా శ్రయాలు, పోర్టులు మాత్రమే కాదు. ఈరోజు యువతకు ఉపాధి కల్పించగలిగిన పరిశ్రమల స్థాపన, ప్రజలందరికీ తిండి పెట్టగలిగిన వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల ఈ రెండు లేకుండా అభివృద్ధి జరగదు. అలాంటి అభివృద్ధి జరిగినా అది గాలిబుడగలా ఏదో ఒకరోజు పేలిపోతుంది తప్ప ప్రజలకు ఫలితాలు ఇవ్వదు. ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాలు, మండలాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వెనుకబాటుకు ప్రధానమైన కొలబద్ద అక్కడ సహజ వనరులను ఉపయోగించుకుని పరిశ్ర మలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా, వ్యవసా యానికి నీటి వనరులు ఉన్నాయా లేదా, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం జరుగు తున్నదా లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడి దారీ అభివృద్ధినే మనం ఈ రోజుఅభివృద్ధిగా భావిస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందున్న భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు, అలాగే అత్యంత పురాతనమైన ఆదిమ వ్యవస్థ అవశేషాలు కూడా నేడు రాష్ట్రంలో కొనసాగు తున్నాయి. అటు ఆదిమ వ్యవస్థ, ఇటు కాలం చెల్లిన భూస్వామ్య వ్యవస్థ, మరొక వైపు ముందు కు పోలేక సంక్షోభంలో కొట్టుమిట్టా డుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ,ఈ మూడు మిశ్రమ రూపాలు మన రాష్ట్రంలో కనిపిస్తుం టాయి. కాబట్టి వెనుకబడినటువంటి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలున్న ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, పరిశ్ర మలు అభివృద్ధి అయితే దాన్ని మిగతా ప్రాంతాలతో ముందుకు పోవడంగా మనం భావిస్తాం.కానీ పెట్టుబడి దారీ అభివృధ్ధి కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. అందులో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల మూలంగా సంపద కేంద్రీకరణ పెరిగి ఆర్ధిక వ్యత్యాసాలు తీవ్ర రూపంలో ముందుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి మాంద్యం ఏర్పడుతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రాంతీయ, సామాజిక వ్యత్యాసాలు కూడా పెరుగు తున్నాయి. ఈ వ్యత్యాసాల ఫలితమే ఆర్ధిక సంక్షోభం రూపంలో మనకు కనిసిస్తున్నది. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు పోవాలనుకున్నా సాంకేతిక, యాంత్రిక విస్తరణకు అవకాశాలున్నా వాటిని ఉపయో గించుకోలేని స్థితికి ఈరోజు వ్యవస్థ చేరింది. మనం ప్రపంచంలో ఒక సూపర్ పవర్ కావాలని కోరుకుంటున్నా ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం. మన జిడిపి మైనస్‌ల్లో నడుస్తున్నది. కనీసం ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో పోటీ పడుతున్నామా అంటే 5జి టెక్నాలజీ మొదలుకొని మిషన్ లెర్నింగ్‌ల్లో కానీ, ఇంటర్నె ట్ ఐఒటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గానీ ఎందులో కూడా మనం ముందుకు పోలేకపో తున్నాం. అన్నింటికీ మించి ఈరోజు టెక్నాలజీ లో కీలక స్థానం వహిస్తున్న సెమీ కండెక్టర్లను తయారు చేసుకోలేకపోతున్నాం. ఒక చిప్‌ను కూడా స్వతంత్రంగా తయారు చేసుకోలేని స్థితిలో మన దేశం ఈ రోజు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయిల్, గ్యాస్ నిక్షేపాలున్నా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. విదేశీ మారకద్రవ్య లోటు ఏర్పడి అమెరికా లాంటి దేశాల పెత్తనానికి తలొగ్గాల్సిన స్థితి వస్తున్నది. అందు వల్ల ఒక సమగ్రమైన రూపంలో అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. ఆర్ధిక అసమానతలూ తగ్గాలి. ఈ అవగాహన పాలకులలో లోపించింది. కేవలం కంటికి కనబడే రోడ్లు, ఫ్లైఓవర్లను మాత్రమే అభివృద్ధిగా చూస్తే అది భ్రమ అవుతుంది. రెండవ అంశం అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు అబివృద్ధి వికేంద్రీకరణ ఎంత అవసరముందో మన రాష్ట్రం వెనుక బాటును చూస్తేనే అర్ధమవుతుంది. రాష్ట్ర విభజనకు కూడా ఇదొక ముఖ్యమైన కారణం. ఒకప్పుడు తెలంగాణ బాగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగం పెద్దయెత్తున పరిశ్రమలు పెట్టిన తరువాత దానికి అనుబంధంగా చాలా ప్రైవేటురంగ పరిశ్రమలు వచ్చాయి. హైదరాబాద్ నగరం అభివృద్ధి కావడంలో ప్రభుత్వ రంగం పునాదిగా పని చేసింది. ఆ తరువాత 90వ దశకం నుండి ఐటి అభివృద్ధి కావడంతో కొత్త రూపం ధరించింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న దేశీయ,విదేశీ పెట్టుబడులన్నింటికీ కేంద్రంగా హైదరాబాద్ రూపుదాల్చింది. ఈ క్రమంలో మొత్తం అబివృద్థి అంతా హైదరాబాద్, దాని చుట్టూ కేంద్రీకరించడం వల్ల తెలంగాణాలోని మిగతా ప్రాంతాలతో సహా ఆంధ్ర,రాయలసీమ ప్రాంతాలు కూడా వెనుకబడ్డాయి. ఈ అభివృ ద్ధిలో వచ్చిన వ్యత్యాసాల్లో నుండే తెలంగాణా ఉద్యమం కూడా వచ్చింది.ఈ అభివృద్ధిలో వచ్చిన కేంద్రీకరణ ఫలితంగానే కోస్తా, రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒక సమగ్రమైనటువంటి వికేంద్రీకరణ పద్ధతిలో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం చీలిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్‌లాగే విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ రంగం అబివృద్ధి అయ్యింది. కానీ క్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి దాని అభివృ ద్ధిని దెబ్బకొడుతున్నారు. తాజాగా మోడీ ప్రధాన మంత్రి అయ్యాక విశాఖ నగరానికి జీవనాడిగా, అభివృద్ధికి పునాదిగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడమో, మూసే యడమో చేస్తామంటున్నారు. అంతకుముందు హిందుస్థాన్ జింక్స్, ఇంకా కొన్ని పరిశ్రమలను మూసేశారు. అక్కడ ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున రావడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగమూ పోయింది. అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతం, అత్యంత అభివృధ్ధి అయిన విశాఖ నగరం ఒకే జిల్లాలో పక్కపపక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధా నిగా నిర్ణయించిన తరువాత 33 వేల ఎకరాలను తీసుకుని విద్య, వైద్యం తదితర అనేక రకాల హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి రాజధాని లక్ష కోట్ల వ్యయంతో అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకరించే మాస్టర్‌ప్లాన్‌ను ఆరోజే సిపియం వ్యతిరేకించింది. అమరావతిలో శాసన, పరిపాలన రాజధాని ఉండాలి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అన్ని వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ రాష్ట్ర మంతా విస్తరింపజేయాలని కోరాము. ఆరకం గా అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా వెనుక బడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుం డా స్థానిక యువతకు ఉపాధి కల్పనకు కూడా ఒక మార్గంగా ఉంటుంది. లేనియెడల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లాగా మరొక చీలికకు పునాది ఏర్పడినట్లుంటుందని ఆరోజే హెచ్చరించాము. ఏమైనా అమరావతి రాజధానిగా ఉండాలన్న అంశంలో సిపిఎం ఆనాడే కచ్చితమైన వైఖరి ప్రకటించింది. అదే సందర్భంలో వైఎస్సార్ సిపితోపాటు అన్ని పార్టీలు దానిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ రీత్యా ఈరోజు అమరావతి రాజధాని అనేది తెలుగు ప్రజల ఉమ్మడి భావంగా ఉన్నది అనడంలో సందేహంలేదు. ఇక మూడవ అంశం పరిపాలన వికేంద్రీకరణ. జగన్ గారి మాటల్లో గాని, వైఎస్సార్ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ,పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, తద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. స్వాతంత్య్రోద్యమంలో గ్రామస్వరాజ్యం అనే భావన ఏర్పడిరది. కానీ దానికి భిన్నంగా స్వాతంత్య్రానంతరం దీర్ఘకాలం స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా అభివృధ్ధి కూడా కేంద్రీకరించబడిరది. కేంద్రంలో, రాష్ట్రాల్లో నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడడానికి, ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదంగా పరిణమించిన విషయం మనకు తెలుసు. స్థానిక సంస్థలకు అధికారాలు, దానితోపాటు చట్టబద్ధంగా ఫైనాన్స్ కమిషన్‌ల ద్వారా నిధుల విడుదల జరిగితే గ్రామ, వార్డు స్థాయిల్లో జనసభలు జరిపి ప్రజలకు ఏది అవసరమో అక్కడ ఆ రకమైన అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిపాలనలో ప్రజలు ప్రత్యక్ష భాగస్వాములవుతారు. ఇదే వికేంద్రీక రణకు అసలైన అర్ధం. స్థానిక సంస్థల ద్వారా పాలనా వికేంద్రీకరణ అనే నమూనా కేరళలో అత్యంత జయప్రదంగా అమలైంది. ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు దాన్ని ఒక ఆదర్శంగా అంగీకరి స్తున్నాయి. మన రాష్ట్రంలో పాలనా వికేంద్రీ కరణ అనే పేరుతో రాజధానిని ముక్కలు చేయడాన్ని సమర్ధించు కుంటున్నారు. నిజానికి రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈరోజు కూడా గ్రామ స్థాయిలో సచివాలయాలు పెట్టారు. వలంటీర్ల వ్యవస్థను పెట్టారు. వాళ్ళద్వారా నేరుగా రాష్ట్ర రాజధాని నుండి ప్రభుత్వమే వారికి ఆదేశాలు ఇచ్చి నడుపుతున్నది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్‌లు,ఆ డిపార్ట్‌మెంట్ లకు సంబంధించిన వ్యక్తులు గ్రామ,వార్డు సచివాలయాల్లో వారికి అనుబంధంగాఉంటారు. వీరు క్రింది వారికి ఆదేశాలిచ్చి పనులు చేయిం చే పద్ధతి నడుస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రమే కాకుండా పౌరుల మీద నిఘా పెట్టడానికి, ఆందోళన కారులను ఆపడానికి, నిరోధిం చడానికి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పేరిట పాలక వర్గాలకు అనుగుణంగా ప్రజలను మలచడానికి, రాజకీయంగా ప్రభావితం చేయడానికి ఈ వ్యవస్థలు ఉపయోగపడు తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న పంచాయితీలు, మున్సిపాలిటీలు నామమాత్రంగా మారాయి. కనీసం రోడ్లు వేసుకోగలిగిన పరిస్థితిగాని, కుళాయిలు పెట్టుకోగలిగిన పరిస్థితి గాని లేదు. దీనికి ‘మీరు పన్నులు వసూలు చేసుకోండి, ఆదాయాలు పెంచుకోండి’ అని వారికి సల హాలు ఇస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ షరతులను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలపై రుద్దుతున్నది. ఎక్కడికక్కడ ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచారు. నీళ్ళపన్ను పెంచుతున్నారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళకు ఇప్పుడు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. కన్వర్షన్ పేరుతో అదనపు భారం మోపుతున్నారు. అలాగే వివిధ రకాలైన భారాలను ప్రజలపై వేస్తున్నారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ప్రజలనుండి బలవంతంగా వసూలు చేసుకోమనడం వల్ల అవి ప్రజలకు భారంగా మారుతున్నాయి. అభివృద్ధికి తగిన నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయడం కోసం స్థానిక సంస్థలు ఉండాలి తప్ప ప్రజల మీద భారాలు వేయడానికి ఒక సాధనంగా స్థానిక సంస్థలను మలిస్తే అప్పుడు కూడా వికేంద్రీకరణకు అర్ధం లేకుండా పోతుంది. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కేటాయించడం ద్వారా మాత్రమే పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలనా వికేంద్రీకరణకు ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చుకుని తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయట పడ వచ్చు. రాజధానిని ముక్కలు చేయకుండానే అమరావతిలోనే శాసన, పరిపాలన రాజధానిని ఉంచి దాని చుట్టూ మొత్తం వికేందీక్రకరణ చేయడం సహేతుకంగా ఉంటుంది. అదే సమయంలో శాసన, పరిపాలన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. రాజధానిలో అంతర్భాగంగా ఉండాలన్న నియమం లేదు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, హైకోర్టు బెంచ్‌లు మరొక చోట వివిధ ప్రాంతాలలో ఉండి ప్రజలకు హైకోర్టును అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రజల వాంఛకు అనుగుణంగా హైకోర్టును కర్నూలులో పెట్టి మిగతా ప్రాంతాలలో అవసరమైన చోట్ల బెంచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా హైకోర్టును అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఆ రకంగా న్యాయవ్యవస్థను విడిగా చూసి శాసన పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధిని, పాలనను వికేంద్రీకరించి అమలు చేయడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.