పోలవరం దారెటు..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకంగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టుపై టిడిపి కూటమి ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలో నిర్వాసితుల పరిహారం, పునరావాసానికి ప్రాధాన్యమివ్వకపోవడం ఆందోళనకర విషయం. రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షల మంది నిర్వాసితుల గురించి సర్కారు పొడిపొడి మాటలతో దాటవేయడం అమా నవీయం.జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల పునరావాసంపై పదేళ్లుగా దోబూచులాడుతున్న, నిధులివ్వకుండా తాత్సారం చేసిన, ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క మాట శ్వేత పత్రంలో ఉదహరించకపోవడం సరికాదు. ఒక వైపు తప్పులు చేసిన మోడీ ప్రభుత్వాన్ని కాపాడుతూ మరోవైపు గత వైసిపి ప్రభుత్వ ప్రమాదకర ధోరణులను ఎత్తిచూపి, అంతకు ముందు తన హయాంలో అద్భుతాలు చేశామని పేర్కొన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉండి, తనపై కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆధారపడ్డ స్థితిలో కూడా కేంద్రం నుంచి నిధులు సాధి స్తామనికానీ, గట్టిగా నిధులు అడుగుతా మనికానీ శ్వేతపత్రంలో కనీసమాత్రమైనా ముఖ్యమంత్రి చెప్పలేదు. టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలూ పోలవరం అంటే డ్యామ్‌ నిర్మాణం, ఇతర సివిల్‌ పనులుగా చూశాయే తప్ప ప్రాజెక్టు కోసం ఊళ్లూ, ఇళ్లు, భూములు త్యజించిన నిర్వాసితుల గోడు పట్టించుకోలేదు. రిజర్వాయర్‌ వలన లక్షా ఆరు వేల కుటుం బాలు మునుగుతాయని ఎప్పుడో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన 2005లో అంచనా వేశారు. రెండు దశాబ్దాల అనంతరం సామాజిక ఆర్థిక సర్వే పేరిట ముంపు కుటుంబాలను 96 వేలకు కుదించినట్లు శ్వేతపత్రంలో వెల్లడిరచారు. ఎగువ కాఫర్‌ డ్యాం కట్టాక కొద్దిపాటి వరదలొస్తే చాలు కాంటూరు సర్వేల కంటే అదనపు ప్రాంతాలు మునుగుతున్నాయి. ఇంకోవైపు ఈ ఇరవై ఏళ్ల కాలంలో జనాభా పెరిగింది.18 ఏళ్లు నిండిన వారూ పెరిగారు. జనాభా, కుటుంబాలు పెరుగుతుండగా, నిర్వాసితులయ్యే కుటుంబాలను తగ్గించడం వెనకున్న మర్మం ఏమిటో అర్థం కాదు. ఎక్కడేకాని ప్రాజెక్టులు గాలిలో కట్టరు. అభివృద్ధిలో భాగంగా ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు వాటి వలన నిర్వాసితులయ్యే వారందరికీ పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకనే నిర్మాణం ప్రారంభించాలన్నది సహజ న్యాయసూత్రం. అంతర్జాతీయ చట్టాలూ అదే చెబుతున్నాయి. దశల పేరిట నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామనడం త్యాగధనుల పట్ల ప్రభుత్వాల అమానవీయతను సూచిస్తుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచితం, అవకతవకల వలన పోలవరం స్తంభించినందున తొలి దశకు నాలుగేళ్లు పడుతుందని శ్వేతపత్రంలో టిడిపి సర్కారు తెలిపింది. తొలి దశ నిర్వాసితుల పునరావాసం రెండేళ్లలో పూర్తవుతుందని, రెండవ దశ పునరావాసం ఆపై దశలవారీగా కొనసాగుతుందని వెల్లడిరచింది. ఇన్నేళ్లయినా పునరావాసం కోసం పోరాడుతున్న గిరిజన, పేద నిర్వాసితులకు దరిదాపుల్లో పునరావాసం దక్కదని ప్రభుత్వ శ్వేతపత్రంతో అర్థమైపో యింది. తొలి, మలి దశల్లో పునరావాసానికి ఇంకా రూ.25 వేల కోట్లు కావాలంటోంది ప్రభుత్వం. మొదటి ప్రాధాన్యతలో ఆ నిధులు కేంద్రం నుంచి రాబట్టే విషయంలో మాత్రం నాలిక మడత పెడుతోంది. డిజైన్ల దగ్గర నుంచి అంచనాల వరకు, కాఫర్‌ డ్యాము నుంచి డయాఫ్రంవాల్‌, గైడ్‌బండ్‌, రివర్స్‌టెండర్ల వరకు అన్నీ కేంద్ర సంస్థల కనుసన్నల్లోనే జరిగాయి. కాబట్టి టిడిపి, వైసిపి,ఏ ప్రభుత్వం తప్పు చేసినా కేంద్ర అండదండలు పుష్కలంగా ఉందన్నది స్పష్టం. జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినందున పోలవరంలో తప్పిదాలకు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలో కేంద్ర సంస్థలు తప్పించు కోజాలవు. అవకతవకలకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పునరా వాసం కల్పించాలి. ముంపుపై శాస్త్రీయ సర్వే చేసి నిర్ధారిం చాలి.ఆగస్టులో గోదావరికి వరదల ముప్పు ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి. అందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలి.
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం – కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా వెల్లడి
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌?ను నిర్మించనున్నట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా వెల్లడిరచారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు.మరోవైపు ప్రాజెక్టులోని సమస్యలపై రెండు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వనునట్లు విదేశీ నిపుణులు తెలి పారు. ఈ క్రమంలోనే నిర్మాణాలకు అంత రాయం ఉండకపోవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నివేదిక ఆధారంగా డిజైన్లు, నిర్మాణాలు రూపొం దించనున్నారు.పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు.పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.కొత్త డయాఫ్రం వాల్‌ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు ఎంత దూరంలో కట్టాలి? ఎలా నిర్మిం చాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విం దర్‌ ఓహ్రా కోరారు. నాలుగు రోజులుగా పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్య లపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు బుధవారం నాడు దిల్లీ నుంచి కుష్విందర్‌ ఓహ్రా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ పాల్‌, సీస్‌ హించ్‌ బెర్గర్‌, రిచర్డ్‌ డొన్నెల్లీ,గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇంఛార్జ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి,పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్‌, కేంద్ర జలసం ఘం డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్‌, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్‌, గౌరవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.
నిపుణుల నివేదిక ఆధారంగానే..
ఇప్పటికే కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌, విదేశీ నిపుణులు ఛైర్మన్‌ ఓహ్రాకు ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీ లించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్‌ ఓహ్రా భేటీ నిర్వహించారు.విదేశీ నిపుణులు నలుగురు తమ అభిప్రాయాలు ఆయనకు తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని, వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు విదేశీ నిపుణులు వివరిం చారు.ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా వెల్లడిరచారు. ఆ నివేదికలను ఆధారంగా తీసుకుని ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్‌ నిపుణులు ఆఫ్రి పోలవరంలో పని చేస్తున్నారు. వారు డిజైన్లు రూపొందిస్తారు. వాటిని విదేశీ నిపుణులకు పంపి, ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర జలసంఘానికి సమర్పించి, డిజైన్లకు ఆమోదం తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఎగువ కాఫర్‌ డ్యాం గట్టిగా ఉన్నా సీపేజీ తప్పదేమో!
ఈ సందర్భంగా విదేశీ నిపుణులు మాట్లాడుతూ ఎగువ కాఫర్‌ డ్యాంలో నిర్మాణపరంగా ఎలాం టి భద్రతా లోపాలూ కనిపించడం లేదని తెలిపారు. సీపేజీ విషయంలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు మార్గాలు ఉన్నాయేమో చూస్తామని చెప్పారు. కాని పక్షంలో సీపేజీని ఎప్పటికప్పుడు తగ్గించు కుంటూ నిర్మాణం కొనసాగించేందుకు ప్రత్యా మ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని వారు వివరించారు. ప్రస్తుతం అక్కడ నాలుగు బోరు గుంతలు (బోర్‌ హోల్స్‌) తవ్వించి, తాము చెప్పిన పద్ధతిలో సమాచారం సేకరించాలని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు బోరు గుంతల సమాచారం మాత్రమే వచ్చిందని చెప్పారు. మొత్తం 18 బోర్‌ హోల్స్‌ తవ్వి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే ఇందుకు సమయం పడుతుందని, ఈలోపు కొంత సమా చారం వచ్చినా తమ అభిప్రాయం తెలియ జేస్తామని నిపుణులు వివరించారు. కట్టడం నుంచి మాత్రమే సీపేజీ ఉంటే ఒకరకంగా ఉంటుందని, దిగువన ఉన్న కటాఫ్‌ నుంచి కూడా సీపేజీ వస్తుంటే మరో తరహాలో ఉంటుందని విదేశీ నిపుణులు తెలిపారు. మధ్యంతర నివేదికలో దీనిపై స్పష్టమైన అభిప్రాయం తెలియజేస్తామని పేర్కొన్నారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులకు సంబంధించి కొన్నిచోట్ల ఒక స్థాయికి మించి దిగువకు ఇసుకను నింపలేకపోవడం, సాంద్రత పెంచలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతు న్నాయని, అది పర్వాలేదని వారు అభిప్రాయ పడ్డారు. కొన్ని మార్పులు సూచిస్తామని వారు చెప్పారు. పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం తదితర అంశాలపైనా విదేశీ నిపుణలు మాట్లాడారు. బంకమట్టి పరిస్థితులున్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. మొత్తం మీద విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజి నీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.-(జి.అంజిబాబు)