పోలవరం అగమ్యగోచరం

పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల జరిగిన శాసనసభలో ఆవిష్కృతమైన చర్చ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న వారిని మరింత అయో మయానికి,భూములు,ఊళ్లు,ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన లక్షల మంది గిరిజన నిర్వాసి తులను తీవ్ర వేదనకు గురి చేసింది. ప్రాజెక్టు పనులు మొదలయ్యాక, మరీ ముఖ్యంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం జరుగుతున్న తరుణంలో గోదావరికి కొద్దిపాటి వరదలొచ్చినా ముంపు గ్రామాలు మునుగు తున్నాయి. నిర్వా సితులు ఉన్నపళంగా కట్టుబట్టలతో ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. మొన్న వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయి. నేటికీ కొండలపై, గుడారాల్లో ముంపు బాధితులు బతుకీడుస్తున్నారు. ఈ సమయాన అసెంబ్లీలో చర్చ అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాలను ఏకరువు పెట్టడానికే సమయాన్నంతా వెచ్చించింది. పోలవరం జాప్యానికి మీరు కారణం అంటే కాదు మీరు అన్న నిందారోపణలే తప్ప నిర్వాసితుల వెతలు పట్టించు కోలేదు. పైపెచ్చు కాంటూరు లెక్కలతో నిర్వాసితుల పరిహారం వాయిదా వేస్తున్నట్లు సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి ప్రకటించారు.
పోలవరం నిర్మాణాల్లో గతటిడిపి ప్రభు త్వ లోపాలను కనుక్కో గలిగిన వైసిపి ప్రభు త్వం, నిర్వాసితుల లెక్కల దగ్గరకొచ్చేసరికి ఆ ప్రభుత్వ గణాంకాలనే పొల్లు పోకుండా ఒప్పజెప్పడం విడ్డూరం. ప్రాజెక్టును ప్రతిపాదిత 45.72 మీటర్ల (కాంటూర్‌) ఎత్తులో నిర్మిస్తే లక్షా పది వేల మంది మునుగుతారు. 41.15 మీటర్లవద్ద నీరు నిలిపితే 20వేల మందే మునుగుతారన్నది గత ప్రభుత్వ లెక్క. ఇటీవలి వరదల్లో 38 మీటర్ల ఎత్తుకే 45.72 కాంటూ రు లోని 373 గ్రామాలూ మునిగాయి. అంతే కాదు,ఆపైన వంద గ్రామాల చుట్టూరా నీరు చేరింది. దీన్నిబట్టి కాంటూరు లెక్కలు కాకి లెక్కలనేగా? వాటిని పట్టుకొని ఈ ప్రభుత్వం వేలాడుతోంది. ప్రాజెక్టు కింద లక్ష మంది మునుగుతుంటే 41.15 కాంటూరు వద్ద 20 వేల మంది మునుగుతారు, ముందు వారికే పునరావాసం అంటే తతిమ్మా 90వేల మంది గతేంటి? చెప్పిన కాంటూర్‌ వరకు ఇస్తామన్న ఆర్‌ అండ్‌ ఆర్‌ చెల్లింపులకు జిఓ ఇచ్చేశా మన్నారు సిఎం. ఏడాదైనా రూ.6.5లక్షల నుంచి పది లక్షలకు పెంచి చెల్లింపులు చేయ నేలేదు. భూములు కోల్పోయిన వారికి ఎకరానికి రూ.10 లక్షలకు పెంచుతామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో తూచ్‌..అలా అనలేదు, రూ.5 లక్షలేననడం మాట తప్పడం కాదా? పోలవరంలో2013-భూ సేకరణ చట్టం ఎందుకు అమలు కాదు?ఈ ప్రాజెక్టు నిర్వాసితులేమన్నా వేరే దేశంలో ఉన్నారా? విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజె క్టుగా పేర్కొన్నారు. అంటే కేంద్రమే ప్రాజెక్టు కయ్యే నిధులన్నింటినీ పెట్టుకోవాలి. ఏప్రాజెక్టూ గాలిలో కట్టరు. భూమి కావాల్సిందే.కనుక భూ ములు కోల్పోయే నిర్వాసితుల పునరావాసం ప్రాజెక్టు వ్యయంలో కలిసే ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడుగా మాట్లాడు తోంది. నిర్వాసితుల వ్యవహారం తమది కాదంటోంది. కేంద్రాన్ని నిలదీసి ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దాటవేస్తోంది. చేసిన పనులకు రావాల్సిన నిధులనూ గట్టిగా అడగలేకపోతోంది. 2013-14 అంచనాల ప్రకారం రూ.20వేల కోట్లే ఇస్తామని కేంద్రం ఒకటికి పదిసార్లు వల్లెవేస్తున్నా మౌనమే. పోల వరం తాజా అంచనా రూ.55 వేలకోట్లు. అందులో రూ.33వేల కోట్లు నిర్వాసితుల పున రావాసానికే. పోలవరం ప్రాజెక్టును ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణిస్తారు. అటువంటి జీవనాడికి ఊపిరులూదుతూ తమ సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు అందించే పునరా వాసంపై కేంద్ర సర్కార్‌ దోబూచులాడు తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. నిర్వాసితుల పట్ల మానవతతో ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్కశంగా వ్యవహ రించడం దారుణం. జాతి అభివృద్ధి కోసం భూములను,ఊళ్లను,ఇళ్లను అర్పించిన త్యాగధ నులను గౌరవించి ఇతోధికంగా ఆదుకోవాలి. చట్టప్రకారం అది వారి బాధ్యత. నిర్వాసితులు ఉద్యమాలతో పాలకుల మెడలు వంచాలి. ‘‘నిరుడు చాలా కష్టాలు పడ్డాం.ఈసారి జూన్‌ నుంచే మాకు వరద ముప్పు మొదలైంది. దారులు మూసుకుపోతున్నాయి. ఊళ్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. పోనీ పరిహారం ఇచ్చేస్తే పోదామని చూస్తుంటే మీరు ఖాళీ చేయండి, ఆ తర్వాత మేం చూస్తామంటున్నారు’’ అంటూ ఆవేదన చెందారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తురాలు మాడే చినపోశమ్మ. ‘‘మా ఇల్లు, పొలం,చెట్టూ,పుట్టా తీసేసుకుంటే మేం ఇక్కడి నుంచి పోయి ఏం చేయాలి? ఏం తినాలి. ఎలా బతకాలి. ఇప్పటికే ఖాళీ చేసిన వెళ్లిన వాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ అన్నారామె. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవా హానికే వరద తాకిడి మొదలైంది.గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు. దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్న మవుతాయోనన్న ఆందోళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది. విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రక టించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆసమయంలో 18ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వా సితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటిం చారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎక రాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచ నాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది.దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
ఇప్పటి వరకూ ఇచ్చిందెంత?
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితం అవుతాయని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిర్ధరించింది. వాటిలో ఇప్పటి వరకు 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు.వారంతా ప్రస్తుతం స్పిల్‌ వే,కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి సమీ పంలో నివసించిన వారు.పునరావాసం కోసం ఇప్పటివరకు రూ. 6,371 కోట్లు ఖర్చుచేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మరో రూ.26, 796 కోట్లు అవసరం అవుతాయని తాజాగా రూపొందించిన డీపీఆర్‌-2లో పేర్కొన్నారు. అంటే పునరావాసం పొందిన వారి సంఖ్య 4శాతం లోపు ఉండగా,చేసిన వ్యయం కూడా దాదాపు 20 శాతమే.ప్రస్తుతం 41.5 అడుగుల వద్ద పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం లెక్కలేస్తు న్నారు. దాని ప్రకారం 18, 622 కుటుంబా లకు తక్షణమే పునరావాసం కల్పించాల్సి ఉంది. కానీ నేటికీ అందులో నాలుగో వంతు మందికే పునరావాస ప్యాకేజీ దక్కింది.
అమానవీయ ధోరణిలో ప్రభుత్వం
‘‘పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం తగదు. ప్యాకేజీ ఇచ్చేస్తే ఖాళీ చేస్తామని వారు చెబు తున్నారు. కానీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతూ పునరావాసం మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లు ఏం కావాలి. నిరుడు నెల రోజులు పైగా వరద నీటిలోనే ఉన్నారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ మూసేశారు. కాబట్టి మూడు నెలల పాటు వరదలు వచ్చేలా ఉన్నాయి.1986 నాటి వరదలను మించి వస్తాయని అధికారులే చెబు తున్నారు. నిరుడు కూడా నిర్వాసితులకు వరద సహాయం అందించకుండా వేధించారు.ఈసారి అదే పద్ధతిలో కనిపిస్తున్నారు. ఇది తగదు. తక్షణమే పరిహారం చెల్లించాలి.వరదల సమ యంలో వారిని ఆదుకోవాలి’’అని ఏపీ గిరిజన సంఘం నేత ఎం కృష్ణమూర్తి అన్నారు. జిఓ ఇచ్చేశాం… : పోలవరం పరిహారంపై సభలో సిఎం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం పెంపునకు సంబంధించిన జిఓను ఎప్పుడో ఇచ్చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి అన్నారు. గతనెలలో జరిగిన శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విష యం ప్రస్తావనకు వచ్చింది. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,డాక్టర్‌ నిమ్మల రామా నాయుడు, చిన రాజప్ప, అచ్చెన్నా యుడులు పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ 10లక్షల ఇస్తామను హామీ ఏమైందని, గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబునాయుడు 6.86 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతామంటూ హామీ ఇచ్చామని, ఆ మేరకు2021 జూన్‌30 వ తేదీన జిఓ కూడా జారీ చేశామని చెప్పారు. జిఓ ఇచ్చిన విషయాన్ని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి దాని అమలు తీరుమాత్రం దాటవేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల సాధనకోసం ఏం చేయనున్నారను విషయాన్ని కూడా ఆయన వివరించలేదు. అదే సమయంలో 41.15 కాంటూరు పరిధిలోని వారికే పరిహారం ఇస్తామని మరోచెప్పారు. పరిహారం జారీకి సంబంధించి జారీ చేసిన జిఓను చూపిస్తూ ‘కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం’ అని టిడిపి సభ్యులనుద్దేశించి అన్నారు. పోలవరం డ్యామ్‌ 45.76 మీటర్లకు పూర్తిఅయినా భద్రత దృష్ట్యా మొదట నీటిని 41.15 మీటర్ల ఎత్తులో నిల్వ చేస్తామని అన్నారు. ఆ పరిధిలో ఉన్న వారికే పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుకింద 1,06,006 మంది నిర్వాసితులుండగా, 41.15 మీటర్ల పరిధిలోకి 20,946 మంది వస్తారనిచెప్పారు. వీరిలో 14,110 మందికి పునరావాసం పూర్తయ్యిందని, దీనికి గానూ రూ 1,960.95 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. మిగిలిన 6,836 నిర్వాసిత కుటుం బాలకు ఈ ఏడాది అక్టోబర్‌లోపు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ‘ మొత్తం 41.15 కాంటూర్‌ వరకు చెల్లించాల్సిన పరిహారం రూ 6.86 లక్షలకు బదులు రూ10లక్షలు పెంచాం. దీని ద్వారి అదనంగా అయిన ఖర్చు 500 కోట్ల రూపాయలే. బటన్‌ నొక్కి రూ 6,500 కోట్లు, రూ 6,700 కోట్లు ఇచ్చే మా ప్రభుత్వానికి ఇది పెద్ద మొత్తం కాదు.’ అనిఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,900 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. గతంలో రూ 1.50లక్షలు నష్టపరి హారంగా తీసుకును వారికి కూడా రూ 5లక్ష లకు పెంచి ఇస్తామని చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని అన్నారు. స్పిల్‌వేను పూర్తి చేసి నీటినిడైవర్ట్‌ చేయకుండా కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ నిర్మాణాలు చేపట్టి, సగం సగం పనులు చేయడం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని అన్నారు. అక్టోబరులో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరులో పనులు మొదలు పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
హామీ ఇవ్వలేదన్న అంబటి
అంతకుముందు టిడిపి సభ్యుల ప్రశుకు లిఖితపూర్వకంగా జవాబిచ్చిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిహారం పెంపునకు సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదని రాతపూర్వకంగా జవాబిచ్చారు. దీనిపై టిడిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులు వక్రీకరించి చెబుతున్నారని మంత్రిచెప్పారు. ఈ దశలో టిడిపి సభ్యులకు, మంత్రికి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో సభలోకి వచ్చిన సిఎం హామీ ఇచ్చామని, అమలుకు జిఓ కూడా ఇచ్చినట్లు తెలిపారు.
వైఫల్యాలివీ….
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్‌ను రాష్ట్ర పభుత్వం ఆమెదింపజేసుకోలేకపోయింది.2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లుకు సాంకే తిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమెదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటికీ అప్పజెప్పింది. ఆ కమిటీ రూ.47, 725.74కోట్లకు అంచనాలు ఆమోదిం చింది. ఇంతవరకు కేంద్ర మంత్రి మండలి పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలియజేయ లేదు. కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా పరిష్కరించు కోలేకపోతున్నాం. నాడు డీపీఆర్‌ ఆమోదించు కోలేకపోయారని విమర్శలు గుప్పించిన జగన్‌ ఇప్పుడు..పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు..మనం కిందా మీద పడుతున్నాం.. రూ.1000 కోట్లో,రూ.2000కోట్ల అయితే నేనే ఇచ్చేవాణ్ణి..రూ.వేల కోట్లు కేంద్రం ఇవ్వాలి.. నేనేం చేయగలను అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 25ఎంపీ స్థానాలిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా.. కేంద్రం నుంచి అన్నీ తెస్తా.. అని ఎన్నికల్లో ఓట్లడిగిన జగన్‌ ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లోనూ,అనేక కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి భేషరతుగా ఎందుకు మద్దతు పలికారు. రాజ్యసభలో,లోక్‌సభలో ఎందుకు మద్దతినిస్తున్నారు?పోలవరం డీపీఆర్‌`2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు..అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన స్పందించడం లేదు. పునరావాసం ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలు నానా అవస్థలు పడుతు న్నాయి.ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరద నీరు వెనక్కి ఎగుదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవి ల్లాడుతున్నారు. 2019వరదల్లో నిర్వాసితుల కష్టాలు అందరూ చూశాం. 2020వరదల్లోనూ వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.2021 వరదల సమయానికి కూడా కనీసం తొలిదశ పునరావాసం ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేక పోయింది.2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడేనాటికి తొలిదశ పునరావాసం పూర్తి చేసేందుకు రూ.2,728 కోట్లు అవసరమని లెక్కించారు. ఏదో రూ.వెయ్యి కోట్లో, రూ.2000కోట్లో అయితే నేనే ఇచ్చేస్తా అని ప్రకటించిన జగన్‌ ఈ మూడేళ్ళలో ఆ సొమ్ము లు ఎందుకు ఇవ్వలేకపోయారు? తొలిదశలో 20,946 కుటుంబాలకు పునరా వాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 8,272 కుటుంబాలకే పూర్తియింది. పునరా వాసం కోకవరం,జంగారెడ్డిగూడెం,చర్ల వంటి ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. నెలకు రూ.6,000 నుంచి రూ.8000 వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్‌ చెప్పినట్లు మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా అని నిర్వాసితులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.55, 548కోట్లు కావాలి.భూసేకరణ, పునరా వాసానికి ఇంకా రూ.26,585కోట్లు అవసరం. ఇతర సివిల్‌ పనులన్నీ కలిపి రూ.7,174 కోట్లు,విద్యుత్కేంద్రం నిర్మాణానికి రూ.4,124 కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తి యితే ఉత్తరాం ధ్ర సుజల సవ్రంతికి నీళ్లు ఇవ్వచ్చు.- జిఎన్‌వి సతీష్‌