పునరపి జననం

నాలుగు జీతం రాళ్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో సంసారం గడవటం అంత తేలిక కాదు. కరోనా లాక్డౌన్‌ లతో పెరిగిపోయిన ధరలను తట్టుకోవడం సామాన్యుని శక్తికి మించిన పని. ఇక ప్రైవేటు పాఠశా లల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంగతి దీనికి భిన్నం కాదు. కరోనా లో లాక్‌ డౌన్‌ లో పాఠశాలలు నెలలతరబడి మూసేస్తే? గోరుచుట్టుపై రోకటి పోటే. ఉపాధ్యాయులకు యాజమాన్యం అంతంత మాత్రంగానే జీతాలు ఇస్తారు. కరోనా లో అది మానేసారు. ఆవు ఉపాధ్యాయుల బ్రతుకు కుడితిలో పడ్డ బల్లి చందమే. ఉపాధ్యాయుడు కరోనాతో తండ్రిని పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వ లేని అతడు ఏం చేయాలో తెలియక మరణమే శరణ్యం అనుకున్నాడు. ఆ ఇంటి యజమాని ఈ ఉపాధ్యాయుడికి ఎలా జీవితంపై ఆశ కల్పించాడోచెప్పేదే ఈ కథ.

‘‘ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి కోవిడ్‌ నన్ను ఎందుకు వదిలి పెట్టిందో నాకు అర్థం కావటం లేదు. నా చావు నా చేతిలోనే ఉందేమో’’ అనుకుంటూ సీసా మూత తీసి నోట్లో పోసు కుందాం అనుకుంటూ ఉండగా మధు మధు అంటూ ఎవరో తలుపు శబ్దం చేసేటప్పటికి ఉన్నపళంగా వచ్చి తలుపు తీసి చూసేసరికి హుందా గా ఉన్న ఓ అపరిచితుడు
‘‘లోపలికి రావచ్చా’’ అంటూనే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని’ ఇదిగోండి తిరుమల
ప్రసాదం’ అని మధు చేతిలో పెట్టాడు.
అన్నం తిని ఎన్ని రోజులు అయ్యిందేమో కానీ ఆవురావురంటూ కొండ లడ్డు తిని తృప్తిగా గ్లాసుడు నీళ్లు తాగాడు మధు. అపరిచితుడు‘‘ నాపేరు శివ శంకర్‌. నేను స్వర్గీయులు అయిన మీ నాన్న గారి శిష్యుడిని.
నీవు ఉంటున్న ఇల్లు నాది. కోవిడ్‌ మూలంగా ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలల్లో పనిచేసే
ఉపాధ్యాయులకు జీతాలు లేవని, వారి బ్రతుకులు రోడ్డున పడ్డాయి అనే వార్త చదివి
ఇలా వచ్చా. నాకు కొంచెం మంచినీళ్లు ఇస్తారా’’? అని అడిగాడు శివ శంకర్‌.
మధు లోపలికి నీళ్లు తేవటానికి వెళ్లగానే టేబుల్‌ మీద మూత తీసి ఉన్న సీసాను చూచి
ఆశ్చర్య పోయాడు శివ శంకర్‌.
‘‘ ఇదిగోండి నీళ్లు.’’ అంటూ మధు నీళ్ల గ్లాసు శివశంకర్‌ కు అందించాడు. ‘‘ మీరు లోపలికి
వెళ్లగానే నా దాహం తీరింది. ఇక మీకు ఈ సీసాతో పనిలేదు, మీరు నాతో బయలుదేరండి.
ఇది మీ సోదర తుల్యుని ఆజ్ఞ అనుకోండి’’ అంటూ మధు సూట్‌ కేసు లో బట్టలు సర్ది,
చేయి పట్టుకొని బయటకు తెచ్చి, తలుపుకు తాళం వేసి, ‘‘ఎక్కండి కారు’’. అని ఇద్దరూ
కారులో కూర్చోగానే డ్రైవర్‌ కార్‌ స్టార్ట్‌ చేసి ముందుకు దూసుకుపోయాడు.
రెండు నెలలు తరువాత మధు, శివశంకర్‌ తిరిగి శంకరాపురం చేరుకున్నారు. తలుపు తాళం తీసి
‘‘ఇదిగో లక్ష రూపాయలు చెక్‌. రెండు నెలలు ముందు నీకు ఇద్దామని తెచ్చా. నీవు నా
ఇంట్లో ఉన్న రెండు నెలల్లో నా గురించి నీకు, నీ గురించి నాకు పూర్తిగా
తెలిసిపోయింది కదా ధైర్యంగా ఉండు. నీవు ఇప్పుడు ఒంటరి వాడివి కావు. కోవిడ్‌ వల్ల
తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఐదుగురు అనాధలకు తల్లి, తండ్రి, దైవం, గురువువి.’’
అంటుండగానే ఐదుగురు పిల్లల్నితీసుకొని డ్రైవర్‌ తులసిరామ్‌ వచ్చాడు.
‘ నమస్కారమండీ’ అని ఐదుగురు పిల్లలు ఒకేసారి చెప్పి ఇద్దరి కాళ్లకు దండం
పెట్టారు.
‘‘ ఈ బ్రీఫ్‌ కేస్‌ లో అనాధల పోషణకు కావాల్సిన ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయి.
ఈరోజు అందరం హోటలులో భోజనం చేద్దాం, రేపటి నుండి వంటమనిషి వస్తుంది’’ అంటూ
బ్రీఫ్కేస్‌ మధుకి ఇచ్చాడు శివశంకర్‌.
మధు బ్రీఫ్‌ కేస్‌ తెరిచి చూడగానే తన తండ్రి పేరున ‘‘గోస్వామి ఆనందరావు అనాధ
శరణాలయం’’ అని రిజిస్ట్రేషన్‌ చేయించిన పత్రాలు చూడగానే కళ్ళ వెంట ఆనంద
భాష్పాల రాలాయి.
శివశంకర్‌ ను హత్తుకున్నాడు మధు. ‘‘ నా విషయంలో ఇదేనేమో పునరపి జననం అంటే’’అంటూ ‘‘
మీరు నా మీద పెట్టుకున్న ఆశలు తప్పక నెరవేరుస్తాను. ఈ పిల్లలను అభివృద్ధిలోకి
తెచ్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి’’ అంటూ నమస్కరించాడు మధు.