పాలకుల నిర్లక్ష్యం…ఆదివాసీలకు శాపం

‘‘ ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలను, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను(ఓటీఎఫ్‌డీ) తొలిగించే విషయంపై ఆయా రాష్ట్రాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేయడం గిరిజనులలో కలకలం రేపుతున్నది. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలిగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 21 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే జూలై 17లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంచేసింది ’’- గునపర్తి సైమన్‌
అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేత ృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగక పోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణ లున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదాఅనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియ ను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది. ‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్‌ అయిన వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వతేదీకి వాయిదావేసింది. అటవీ హక్కుల చట్టం అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతంఉత్తర్వులు ఆదివాసీలకు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న నిరుపేదలకు పిడుగుపాటు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 21రాష్ట్రాల్లో అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 23.30 లక్షల గిరిజన, గిరిజనేతర కుటుంబాలనుకోర్టు ఆర్డర్‌ తీవ్రఆందోళనకు గురి చేసింది. యుపిఎ-1ప్రభుత్వ హయాంలో 2006లో తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టం అమల్లో భాగంగా ఆదివాసీలు తమఅధీనంలో ఉన్న భూములను గుర్తించివాటిపై యాజమాన్య హక్కులు కల్పిం చాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆవిధంగా పెట్టుకున్న అర్జీలను తిరస్కారానికి గురయ్యాక కూడా ప్రభుత్వాలు ఇంకా వారిని భూముల నుంచి ఖాళీ చేయించలేదన్నది కేసు వేసిన ‘వైల్డ్‌ లైఫ్‌ఫస్ట్‌’ సంస్థ అభియోగం. విచారించిన న్యాయస్థానం అర్జీలు తిరస్కరించినా ఇంకా భూముల్లో ఉన్న వారిని ఖాళీ చేయిం చాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసు వాయిదా తేదీని జులై 24గా పేర్కొని ఆలోపు గిరిజనులను, గిరిజనేతరులను భూము లనుంచి ఖాళీ చేయిం చాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లను ఆదేశించింది. కోర్టుఆదేశాల అమలు దిశగా రాష్ట్రాలు అడుగులేస్తుండటంతో గిరిజనుల్లో భయోత్పాతాలు బయలు దేరాయి. కోర్టుకేసు వేసిన వారి కోణంలో అటవీ హక్కుల చట్టం అమలును చూసింది తప్ప పూర్వాపరాల జోలికి పోలేదనిపిస్తుంది. అందుక్కారణం కేంద్ర ప్రభుత్వమే. కేసు వేసిన వారు అటవీశాఖలో పని చేసిన మాజీ అధికారులు. చట్టంలో లొసుగులను ఆమూలాగ్రం ఔపోసన పట్టినవారు. వన్యప్రాణుల సంరక్షణ ముసుగులో ఆదివాసీలను, అటవులనే నమ్ముకున్న ఇతర పేదతరగతులను భూముల నుంచి వెళ్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలన్న కుట్ర ఈకేసు వెనుక దాగుందనిపిస్తుంది. సహజ వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అవకాశం కల్పించేలా చట్టాలను మారు స్తూ విధానాలను రూపొందిస్తున్న మోడీసర్కారు కోర్టులో అంటీముట్టనట్లు వ్యవహరించింది. గిరిజన సంక్షేమ వ్యవహారాలు చూసే మంత్రిత్వశాఖకు కాకుండా అటవీ శాఖకు కేసు బాధ్యత అప్పగించింది. కేసు విచారణ సమ యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం కేసు వేసినవారికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వాజ్‌పేయి సర్కారు 2002లో లక్ష లాది మంది ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొడుతూ ఉత్తర్వులి చ్చింది. ఆపూర్వరంగంలో చూసినప్పుడు ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా గిరిపుత్రుల హక్కులకు ఉద్దేశపూర్వ కంగానే హాని తలపెట్టిందని అర్థమవుతోంది. యుపిఎ-1ప్రభుత్వ సమయంలో ప్రజాసంఘాల కృషితో గిరిజనుల అధీనంలోని భూములపై వారికే హక్కులు కల్పిం చేందుకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. చట్టమైతే వచ్చింది కాని పూర్తి స్థాయిలో ఆచరణాత్మకం కాలేదు. గిరిజనులకు హక్కులు కల్పిం చాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు వేసి సాంకేతికాంశాలతో లక్షలాది దరఖాస్తులను పరిష్కరించకుండా ఏళ్లుపూళ్లు గడుపు తున్నాయి. అటవీ హక్కుల చట్టం కోసం పోరాడిన గిరిజనులు చట్టం అమలు కోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గ్రామసభలు నిర్వహించి గిరిజనుల అర్జీలను పరిష్కరించాలి. అక్కడ తేలకపోతే రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకోవచ్చు. ప్రభుత్వాల్లో గిరిజన వ్యతిరేకత గూడుకట్టు కోవడంతో అటవీ భూములపై హక్కుల కోసం గిరిపుత్రులు న్యాయ స్థానాలను సైతం ఆశ్రయించాల్సి వస్తోంది. నిరుడు డిసెంబర్‌ నాటికి భూములపై హక్కు ల కోసం దేశవ్యాప్తం గా42 లక్షల అర్జీలు అందితే 18లక్షలు మాత్రమే (40శాతం) పరిష్క రించారు. పరిష్కరించా రంటున్న వాటిలో తిరస్కరించినవి కూడాఉన్నాయి. ఎ.పిలో1.14లక్షల ఎకరాలకు సంబంధించి 66, 351 అర్జీలను తిరస్కరించారు. సుప్రీం ఆర్డర్‌ అమలు చేస్తే ఆమేరకు గిరిజనులు భూములను కోల్పో యి నిరాశ్రయు లవుతారు. దేశంలో21రాష్ట్రాల్లో ఇదేపరిస్థితి. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వ అసమర్ధ వాదనలే కారణం. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. హడావుడిగా త్రిపుల్‌ తలాక్‌ పైన, మెడికల్‌ కౌన్సిల్‌ పైన ఆర్డినెన్సులు తేగలిగిన మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా లక్షలాది గిరిజనులు నిరాశ్రయులు కాకుండా నిలవరించడానికి ఒక ఆర్డినెన్సు తేవడం అసాధ్యంకాదు. కాకుంటే ప్రాయ శ్చిత్తం చేసుకునే నిజాయితీ మోడీ ప్రభుత్వానికి ఉన్నదా అన్నదే సందేహం. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా లక్షలాది గిరిజన కుటుంబాలు నిరాశ్రయులు కాను న్నాయి. వీరిలో ఎక్కువశాతం పోలవరం నిర్వాసి తులే. వారికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వకుండా నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని నిరాక రించే దుష్ట తలంపుతోనే రాష్ట్రంలో 66వేల మంది క్లెయిములను తిరస్కరించారు. ఇప్పుడీసుప్రీం ఆదేశాలను అడ్డం పెట్టుకుని వారం దరినీ బలవం తంగా ఖాళీ చేయించేందుకు సైతం వెనకాడరు. ఈవిష యమై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేసి ఎన్నికల పబ్బం గడుపుకునే యోచన కూడా చేయవచ్చు. చైతన్యవం తమైన ప్రజా ఉద్యమ ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితి సూచిస్తోంది.
నేరం ప్రభుత్వాలది-శిక్ష ఆదివాసీలకా
దేశం మొత్తంపై 21 రాష్ట్రాల్లో 42.19 లక్షల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందికే పట్టాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 66,350, తెలంగాణలో 80,000, గుజరాత్‌లో 1,82,869, కర్నాటకలో 1,76,540 దరఖాస్తులు తిరస్కరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మాత్రమే ఆదివాసీలకు అనుకూలంగా దరఖాస్తులు పరిష్కరించింది. మొత్తం 39,999 దరఖాస్తుల్లో 894 మాత్రమే తిరస్కరించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఆదివాసీలకు వ్యతిరేకమైనప్పుడు చట్టం ఎలా అమలు జరుగుతుంది? కేరళ వామపక్ష ప్రభుత్వం 99 శాతం దరఖాస్తుదార్లకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీల వాస్తవ హక్కులను గుర్తించింది కదా! ఆదివాసీలు సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ప్రభుత్వమే అన్యాయంగా వ్యవహరిస్తుంటే ఆదివాసీలకు హక్కు పత్రాలు ఎలా వస్తాయి? ఎవరి హక్కు పత్రం వారే రాసుకునే అవకాశం లేదు కదా? కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది/అధికారి కోర్టుకు హాజరై వాస్తవ పరిస్థితులను వాదనకు పెట్టి ఉంటే కోర్టు తీర్పు మరోలా వచ్చి ఉండేదేమో? కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం కోర్టుకు గైర్హాజరై ఆదివాసీ వ్యతిరేకులైన పదవీ విరమణ చేసిన అటవీ అధికార్ల వాదన నెగ్గేందుకు సహకరించింది. బిజెపి ఆదివాసీ వ్యతిరేకినని రుజువు చేసుకుంది.
అనాదిగా ఆదివాసీలకు అన్యాయం
ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు తున్నట్లు 2006 అటవీ హక్కుల చట్టం భాష్యం చెప్పింది. మైదానాల్లో ఎవరు సాగు చేసుకున్న భూమి వారికి దఖలుపర్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు అడవిపై హక్కును ఇవ్వకుండా తరతరాలుగా అన్యాయం చేస్తూ వచ్చాయి. నాటి రాజులు, అనంతరం బ్రిటిష్‌ పాలకులు, స్వాతం త్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు అడవి మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను దురాక్రమణదారులుగానే పరిగణించాయి. నేడు వారిని ఏకంగా అడవి నుండి గెంటివేస్తున్నారు. 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో రాజ్యాంగం, పీసా చట్టం భూమికి సంపూర్ణ రక్షణ కల్పించి నప్పటికీ మోడీ ఉల్లంఘించి కార్పొరేట్లకు ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టులో వేలాది ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. రాజధాని నిర్మాణానికి 50వేల ఎకరాల అటవీ భూమి కావాలని చంద్రబాబు అడగడం, కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం అందరికీ తెలిసిందే. తక్షణమే ఆదివాసీ హక్కులను రక్షిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తేవాలని, రాష్ట్రంలో ఆదివాసీలు చేసుకున్న దరఖాస్తులకు హక్కు పత్రాలు 27.7.2019లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆదివాసీలంతా ఉద్యమించాలి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. 11.8 లక్షల ఆదివాసీలను తొలగించాలని ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌ లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా.. అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత చట్టాల ప్రకారం.. ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13 న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించింది.