పాలకులకు పట్టని ప్రాధామిక విధులు

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, రాజకీయ అధికారాలున్న ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత, భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామరస్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు. పంచాయితీ నుండి పార్లమెంటు వరుకు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి, పాటించాలి.
ద్వేష భావజాలం భారత దేశాన్ని మింగేస్తుంది’.మహాత్మాగాంధీ 75వవర్థంతి సంద ర్భంగా ఆయన ముని మనవడు తుషార్‌ గాంధీ చేసిన వ్యాఖ్య ఇది.ద్వేష భావజాలం భారతదేశం లో ఎందుకు పెరుగుతున్నదో దేశ రాజకీ యాలను చూచాయగా పరిశీలించే వారికి సైతం తెలుస్తుంది. ద్వేష భావజాలాన్ని పెంచటంలో, వ్యాప్తి చేయటం లో రాజకీయ నాయకులు, పాలకుల పాత్ర ఎంత వున్నది? రాజ్యాంగం వారికి చెప్పిందేమిటి? వారు చేస్తున్నదేమిటో చర్చించటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఈ క్రమంలో ప్రాథమిక విధుల గురించి తెలుసు కోవటం అవసరం.
ప్రాథమిక విధులు – చరిత్ర
రాజ్యాంగం ఆమోదించినపుడు ప్రాథ మిక విధులు అందులో భాగం కాదు. నాటి రాజ్యాం గ నిర్మాతలు అప్పుడున్న సామాజిక, నైతిక పరిస్థి తులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక విధులు అవసరం లేదని భావించి ఉండవచ్చు.కాని 1976 లో స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 42వ సవరణ ద్వారా వాటిని రాజ్యాంగంలో పొందు పరిచారు.
ప్రాథమిక విధులను ఎందుకు చేర్చారు ?
‘కాలం గడిచే కొలది నైతిక విలువలు … ముఖ్యంగా ప్రజా జీవితంలో విలువల పతనం స్పష్టమైన కారణంగా ప్రాథమిక విధులను ప్రత్యేకం గా రూపొందించటం అవసరమని దేశం భావిం చింది.’’ అని జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ కమిటీ పేర్కొంది.
ప్రాథమిక విధులు – స్వభావం
51ఏ అధికరణంలో మొత్తం 11 ప్రాథ మిక విధులుంటాయి. వాటిలో 51(ఎ)(ఇ)లో ఉన్న ప్రాథమిక విధిని మాత్రమే ఈవ్యాసంలో చర్చిం చాం. కొన్ని విధులు నైతిక నియమావళిలాగా, మరికొన్ని పౌర నియమావళిలాగా ఉంటాయి.
అధికరణం 51(ఎ)ఇలో ఏముంది ?
ఈ అధికరణంలో రెండు భాగాలున్నా యి. మొదటి భాగం భారత ప్రజలందరి మధ్య కుల,మత,భాషా,ప్రాంతలేదా ఏ ఇతర విభజనలతో వైవిధ్యాలతో వైవిధ్యాలతో సంబంధం లేకుండా ప్రజలందరి మధ్య సామరస్యం,సోదరభావాన్ని పెంపొందించాలని ఆదేశిస్తుంది. రెండవ భాగం స్త్రీలను అగౌరవ పరిచే అన్ని అంశాలను, విధానా లను విడనాడాలని ఆదేశిస్తుంది.
ఎవరు పాటించాలి ?
51వ అధికరణం ప్రారంభంలో ఇది ప్రతి పౌరుని యొక్క విధి అనే వాక్యం ఉన్నది.దీని అర్థం.. ప్రభు త్వానికి, పాలకులకు, అధికార గణానికి, రాజకీయ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ సమాధానం చెప్పారు. ప్రాథమిక విధులపై 1999లో ఆయన నేతృత్వంలో వేసిన కమిటి అనేక సిఫార్సులు చేసింది.
జస్టిస్‌ జె.యస్‌.వర్మ సిఫార్సులు
రాజకీయ నాయకులు ఈ విధుల గురించి మాట్లాడేటప్పుడు ఇవి ప్రజలు పాటించ వలసినవిగా తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా చెబుతారు. కాని వాస్తవంలో వారే ఈ విధులను పాటించవలసిన బాధ్యత ఉంది. నైతిక విలువల వ్యాప్తిలో ఆదర్శనీయులుగా ఉండే వ్యక్తుల పాత్ర చాలా ప్రముఖమైనది.కేవలం చట్టపరమైన నిబం ధనల ద్వారా ఈ విలువల వ్యాప్తి జరగదు. విలువ లు పాటించటం ద్వారా ఆదర్శప్రాయులుగా మార టం ద్వారా,సామాజిక ఆంక్షలద్వారా ఈ విలువలు వ్యాప్తి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులు,ప్రజా ప్రతి నిధు లు,రాజకీయ అధికారాలున్న ప్రధానమంత్రి, రాష్ట్రా ల ముఖ్యమంత్రులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత,భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామర స్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు.పంచాయితీ నుండి పార్లమెంటు వరు కు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి,పాటించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉండే అధిపతులు ప్రాథమిక విధులు ఆచరించి, వ్యాప్తి చేయాలనే బాధ్యతకల్గి ఉన్నారు.వారికి ఇది అదనపు విధి.సిబ్బంది అందరి ముందు ప్రతి సంవత్సరం ప్రాథమిక విధులను ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేయాలని జస్టిస్‌జె.యస్‌.వర్మ సూచించారు.అవినీతి లేకుండా, ప్రజలకు సన్నిహితంగా ఉంటూ స్నేహపూర్వకమైన విధానంతో విధులు నిర్వర్తించాలని పారదర్శకత చూపాలని సిపార్సు చేశారు. ప్రతి అధికారికి రెండు రకాలైన బాధ్యతలు (వ్యక్తిగతంగా,అధికారయుతం గానూ) ఉంటాయని ఆరెండిరటి సందర్భంగా కూడా విధులు పాటించాలని ఆయన సూచిం చారు. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ కార్యాల యాల మీద ఆధిపత్యం ఉన్న వారు ఎవరైనా… రాజకీయ,పరిపాలనా,విద్య,ఇతర ఏ ప్రజా సేవలకు సంబంధించినదయినా…వారు తమ అధికార పరిధి ఉన్నంతవరకు పౌరులను ప్రాథమిక విధుల విషయంలో మార్గదర్శకంగా నిలుస్తూ ప్రచారం చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీని ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి.పై సిఫార్సులను పరిశీలించినప్పుడు ప్రధానంగా రాజకీ య నాయకులు, ఎన్నికలలో పాల్గొనేవారు, ప్రభుత్వ అధికారులు అత్యంత నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా సోదరభావాన్ని పెంపొందించటంలో ప్రముఖ పాత్ర పోషించాలని అర్థమవుతుంది.
ఆచరణ ఎలా ఉంది ?
2014 నుంచి 2018 మధ్య 4సంవ త్సరాల కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలు 5 వందల శాతం పెరిగాయని ఎన్‌డిటివి పరిశోధనలో తేలింది. అలాగే కర్ణాటక లో బిజెపి ప్రభుత్వం 2019 నుండి 2023 ప్రాం తం మధ్యలో 7ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా 182 మత హింస, విద్వేష ప్రసంగాలు, గోరక్షణ నేరాలకు సంబంధించిన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఫలితంగా ఈ నేరాలలోనిందితులుగా ఉన్న వందలాది మంది శిక్షల నుంచి బయటపడ్డారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. అంటే వందల మంది రాజకీయ నాయకులు ప్రాథమిక విధులకు విరు ద్ధంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని అర్థమవు తుంది.అలాగే 2017లో హిందూస్థాన్‌ టైమ్స్‌ చేసిన సర్వే ప్రకారం ఎన్నిక కాబడిన, అధికారాలు పొం దిన వారిలో 50మందిపై మత హింస, ద్వేష ప్రసంగాలకు సంబంధించిన నేరాలు నమోదయ్యా యి.2018-2019మధ్య కాలంలో అసత్యపు వార్తలను,వాట్సాప్‌ వార్తలు నిజమని నమ్మి 31 మంది చనిపోయారని బిబిసి పరిశోధనలో తెలి పింది. ఇతర మతాలపై ద్వేషపూరిత, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా గల్ఫ్‌ దేశాలు, ముస్లిం దేశాలు తమ అసమ్మతిని తెలియజేయటం మనం గమనించాం. మణిపూర్‌, హర్యానా, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు …ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్వేష ప్రచార ఫలితాలే.
సుప్రీంకోర్టు తీర్పులు
ప్రాథమిక విధులను క్షేత్ర స్థాయి నుంచి ప్రచారం చేయాలన్న జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సుల ను వెంటనే అమలు చేయాలని 2003లో జస్టిస్‌ రంగనాథ్‌మిశ్రా పిటిషనర్‌గా భావించబడిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్కూలు స్థాయి నుంచి అన్ని విద్యా స్థాయిల వరకు సమాజంలోని అన్ని విభాగాలలోను ఈ విధులను ప్రచారం చేయాలని, సోదరభావం,మతాలపట్ల సమభావం పెరిగేం దుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.20 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ద్వేషభావాన్ని తీవ్రస్థాయికి చేర్చిన రాజకీయ నాయ కులు, పాలకులు సమాధానం చెప్పుకోవాలి. ద్వేష ప్రసంగాల విషయంలో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ బెంచ్‌ ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యం లో ప్రచారం చేయవలసిన, పాటించ వలసిన ప్రాథమిక విధులు,నైతిక విలువ లను పక్కనబెట్టి మతపరమైన విషయాలను ప్రచా రంచేస్తామని, అవగాహన కల్పిస్తామనిఎ.పి మంత్రి వర్యులొకరు ప్రకటించటం విపరీతం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి భారతదేశ సంస్కృతి సాంప్ర దాయ మైన…పరమత సహనం,సహోదర భావంతో పాటు ఇతర అన్ని ప్రాథమిక విధులను పాటించి ప్రచారం చేయాలని ఆశిద్దాం. (వ్యాసకర్త :ఎ.పి.సి. ఎల్‌.ఎ ప్రధాన కార్యదర్శి,సుప్రీంకోర్టు న్యాయవాది) – (పొత్తూరి సురేష్‌ కుమార్‌)