పాఠశాలల్లో సంస్కరణలు నష్టదాయకం

పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌…పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచేదానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్కరణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతున్నది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
సమాజ పరివర్తనకు, దారిద్య్ర నిర్మూలనకు, ఆకలిని అంతం చేయడానికి ఒక విప్లవాత్మక సాధనం విద్య. పాలో ఫ్రీర్‌ అనే విద్యావేత్త విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ…మనిషి వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి సామర్ధ్యాలను పెంచే సాధనం విద్య అన్నారు. అయితే విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెడుతూ…ఈ సంస్కరణలన్నీ మన పిల్లలను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికని నమ్మబలు కుతున్నది. కానీ ఇవి మన చిన్నారులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తయారు చేయడం సంగతి అటుంచి వారిని విద్యకే దూరం చేసేలా వుండడం విచారకరం. ఎన్‌.ఇ.పి-2020 అమలు పేరుతో మూడు కిలోమీటర్లలోపు వున్న పాఠశాలలను విలీనం చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనలతో దానిని ఒక కిలోమీటర్‌కు కుదించి అమలు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ‘మా ఊరు బడి మా ఊరిలోనే ఉండాలి’ అని చేసిన తీవ్రమైన ఆందోళనలు, ఎమ్మెల్సీల బస్సు యాత్రలు, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం మొదట ప్రకటించిన అన్ని స్కూళ్లను విలీనం చేయలేకపోయింది. 5,400 ప్రాథమిక పాఠశాలలు, 600 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఇప్పటికే ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్న 8000 పాఠశాలలతో పాటు మరో 4000 పాఠశాలలు ఏకో పాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విభజించిన తర్వాత ఒకటి రెండు తరగతులు మిగిలి ఉన్న ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా వుంది. ఇక్కడ 10 లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులు, ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో…పాఠశాలకు ఉండవలసిన హంగు, ఆర్భాటాలను కోల్పోయి…సహజ మరణం పొందే బడులుగా మారాయి. దీనితో ఆ పాఠశాలలో మిగిలిన విద్యార్థులు చదువు మానేయడం లేదా ప్రైవేటు పాఠశాలలకు తరలిపోవడం తప్ప మరో దిక్కు లేని వారిగా మిగిలిపోయారు. తీరా ఇప్పుడు విలీనం తర్వాత మిగిలిన ఒకటి రెండు తరగతులలో పది లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియ మించడానికి రూపొందించిన జీవో-117 నిబంధనలు ఉపాధ్యాయుల కుదింపే లక్ష్యంగా ఉన్నాయి. దీనితో 37 వేల యస్‌.జి.టి పోస్టులు, 18 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కనుమరుగు అయ్యాయి. ఉపాధ్యాయులను కుదించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడం ఎలా సాధ్యమో పాలకులే చెప్పాలి. ఈ విలీన ప్రక్రియ వలన అందుబాటులో ఉన్న స్కూలు నుండి దూరంగా ఉన్న స్కూలుకు విద్యార్థులను బలవంతంగా తరలించడం వలన విద్యార్థులు చదువు మధ్యలోనే బడి మానేస్తారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీనితో అందరికీ విద్య అందించాలనే రాజ్యాంగ లక్ష్యం నెరవేరదు. ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఆర్టికల్‌ 21-ఏ ని ఉల్లంఘించడమే అవుతుంది. విలీనం అనంతరం రేషనలైజేషన్‌ కోసం జీవో-117 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని ప్రాథమిక పాఠశాలలో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలలో 1:45, ఉన్నత పాఠశాలలో 1:53గా నిర్ణయించారు. ఇది విద్యా హక్కు చట్టం-2009 నిబంధన లకు విరుద్ధంగా ఉంది. విద్యాహక్కు చట్టం-2009లో ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35, ఉన్నత పాఠశాలలో 1:45 ఉండాలని సూచించారు. కానీ దీనికి భిన్నంగా ఉపాధ్యా యుల కుదింపే లక్ష్యంగా జరిగింది. ఇది విద్యార్థుల అభ్యసనా ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు అదనపు భారం మోపడంతో ఆనందకరమైన బోధనా అభ్యసన భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సాకుగా చూపుతున్న ఎన్‌.ఇ.పి-2020లో కూడా 5ం3ం3ం4 అనేది అభ్యసనా దశలుగానే ప్రకటించింది తప్ప దీనికోసం భౌతికపరమైన విభజన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. అందువలన ఈ విలీన ప్రక్రియ రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 21-ఎ, విద్యాహక్కు చట్టం-2009, ఎన్‌.ఇ.పి-2020 లను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల విద్యా వ్యవస్థలు, చివరికి ఎన్‌.ఇ.పి-2020 కూడా బోధనా భాషగా మాతభాషను ఒకటి నుండి ఐదు తరగతుల వరకు, అవసరమైతే ఎనిమిదో తరగతి వరకు కొనసాగించడం ద్వారానే పిల్లలలో భావనలు, అభివృద్ధి అర్థవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాయి. ఇంగ్లీష్‌ భాష నేర్చుకోవడానికి బోధనా భాష ఆటంకం కాదని విద్యావేత్తలు చెప్తున్నారు. కానీ అశాస్త్రీయ పద్ధతిలో బోధనా భాషగా ఇంగ్లీషును ప్రవేశపెట్టి పిల్లలను బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియంలోకి నెట్టడం పిల్లల హక్కులను కాలరాయడమే. కనీసం ఏ భాషలో చదువుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికి ఇవ్వకపోవడం పిల్లలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగానే పరిగణించాలి. దీనితో పిల్లలు ఇంటి భాషకు, బోధనా భాషకు మధ్య సమన్వయం చేసుకోలేక భావనలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులకు గురవుతుంటే భవిష్యత్తులో ఏ విధంగా విజయవంతం అవుతారో ఏలిన వారికే తెలియాలి. దీనికి భిన్నంగా ప్రైవేటు వ్యవస్థలో కూడా మాతృభాషలో బోధనను తప్పనిసరి చేయడం ద్వారానే పిల్లల జ్ఞానాభివృద్ధి, జ్ఞానతష్ణను తీర్చగలం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను కేంద్ర జాబితా నుండి ఉమ్మడి జాబితా లోకి మార్చడం జరిగింది. ఆ యా రాష్ట్రాలలో ఉన్న భౌతిక పరిస్థితులు భౌతిక వనరుల ఆధారంగా విద్యలో కావలసిన మార్పులు, చేర్పులు చేసుకునే అధికారం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. 2019లో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను నిరాకరిస్తూ అన్ని వ్యవస్థలను కేంద్రీకృతం చేస్తుంది. దానిలో భాగంగానే విద్యా రంగంలో కూడా నీట్‌-2020, ఎన్‌.ఇ.పి-2020, సిలబస్‌లో చరిత్రను మార్చడం వంటివి చేస్తున్నది. అన్ని రాష్ట్రాలు సిబిఎస్‌ఇ ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్రాలలో ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి కరికులం, బోధనా పద్ధతులను తయారు చేస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా కరికులం, బోధనా పద్ధతుల్ని ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి నిర్ణ యిస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రలో మన రాష్ట్ర సంబంధిత అంశాలు ఉండే అవకాశం ఉండదు. అందువలన దీనిని ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి పరిధిలోనే ఉంచి సి.బి.ఎస్‌.ఇ లోని మంచి అంశాలను స్వీకరించవచ్చు. విద్యా వ్యవస్థలో అద్భుత ఫలితాలు సాధించిన ఢల్లీి ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న సి.బి.ఎస్‌.ఇ, ఐ.సి.ఎస్‌.ఇ బోర్డులతో పాటు డి.బి.ఎస్‌.ఇ ని ప్రారంభించి దాని అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. దీనికి భిన్నంగా సిబిఎస్‌ఇని ప్రవేశపెట్టి ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి ని నిర్వీర్యం చేయడమనేది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం. విద్యాబోధనలో టెక్నాలజీని మిళితం చేయడాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఉపాధ్యాయుల బోధనకు బైజూస్‌ ప్రత్యామ్నాయం కాదు. కరోనా కాలంలో ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధనకు డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రత్యామ్నాయం కాదని అందరికీ అనుభవం అయింది. దీనికి భిన్నంగా మంచి ఉపాధ్యాయులను గుర్తించి వారితో డిజిటల్‌ కంటెంట్‌ రూపొందించుకుంటే అది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి ఉండేది.
పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌…పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచే దానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్క రణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతోంది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్కూళ్ల విలీనం పేరుతో గందరగోళం సృష్టించడంతో, ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు స్కూళ్లకు ఈ సంవత్సరం లక్షల్లో పిల్లలు తరలి వెళ్లారు. విద్యార్థులలో పఠన సామర్థ్యాలు, గణిత సామర్థ్యాలు 2012 ముందు నాటి స్థితికి పడిపోయాయని ‘అసర్‌ రిపోర్టు-2022’ తెలియజేస్తున్నది. ఏకపక్షంగా అమలు చేసిన సంస్కరణలతో విద్యార్థుల చదువు గందం గోళంలో పడిరది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం…ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఆలోచించాలి. లేని పక్షంలో విద్యా రంగంలో సానుకూల ఫలితాల కోసం ప్రజలే పోరు బాట పడతారు.
సమైక్యతా సాధనంగా విద్య..
స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది.1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమా నంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10ం2ం3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటీష్‌ పాలనలోని పరిమి తులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యారంగం పరిస్థితిని పరిశీలించి సరైన దిశా నిర్దేశాలు చేయటానికి విశేష కృషి చేశారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు నియమించారు. తొలి ఐదేళ్ళ కాలంలోనే యుజిసి, ఐసిసిఆర్‌, ఎఐసిటియు, సిఐఎన్‌ఆర్‌, తదితర అత్యున్నత సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థను, సంగీత, సాహిత్య, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేశారు. దేశం గర్వించే విద్యాశాఖామాత్యులుగానే కాక బహుముఖ ప్రజ్ఞానా శాలిగా, సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడిగా, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా మౌలానా ఆజాద్‌ స్వతంత్ర భారత నిర్మాతల్లో ప్రము ఖులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు మరణానం తరం 1992లో ‘’భారతరత్న’’ బిరుదునిచ్చి గౌరవించారు.
ఆయన చనిపోయి 57 సంవత్సరాలు గడిరచింది. కానీ ఆయన తలపెట్టిన విద్యావిధానం ఇంకా అసమగ్రంగా, అనేక మందికి అందకుండా నిరాశా నిస్పృహలతో నిట్టూరుస్తోంది. జాతీయ సగటు అక్షరాస్యత 73.9 శాతంగానే ఉండిపోవటంతో ఏడు సంవత్సరాలు పైబడిన జనాభాలో 28.7 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరా స్యుల్లో 37 శాతం మంది మన దేశంలోనే ఉండడం పాలకుల అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం. కనీసం 14 ఏళ్ళ ప్రా యం వరకైనా బాలబాలికలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలనే మౌలానా ఆకాంక్షకు అనుగుణంగా ఎట్టకేలకు విద్యా హక్కు చట్టం వచ్చినా కేంద్రంలోని కాంగ్రెస్‌, బిజెపి పార్టీల పాలనా వైఫల్యాలతో అది కాగితాలకే పరిమితమయింది. పాఠ శాలల్లో చేరిన విద్యార్థులలో సగం మంది 8వ తరగతి కూడా చ దవకుండా మధ్యలోనే మానేస్తుండడంతో పాఠశాల విద్యా సా ్థయికి చేరుకోలేక పోతున్నారు. నిరక్షరాస్యుల్లో, మధ్యలోనే బడి మానేస్తున్న వారిలో అధికులు దళితులు, గిరిజనులు, మైనార్టీలే.
పాఠశాల విద్యను గట్టెక్కిన వారిలో కూడా అందరూ పై చదువులకు పోవటం లేదు. 15-18 సంవత్సరాల వయస్కుల్లో 22 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరుతు న్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ జనాభాల్లో గ్రాడ్యుయేట్లు 4.5శాతం మందే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెక్కిరిస్తు న్నాయి. ఇక నాణ్యత విషయంలోనూ నాసికరమే. ప్రథమ్‌ సంస్థ ప్రకటిం చిన వార్షిక విద్యాస్థాయి-2014 నివేదిక ప్రకారం 5వ తరగతి విద్యార్థుల్లో సగం మంది, 8వ తరగతి విద్యార్థుల్లో నాల్గవ వం తు మంది రెండవ తరగతి తెలుగు వాచకాన్ని కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. అంతేకాదు 3వ తరగతి గణి తంలోని కూడిక లు, తీసివేతలు, భాగహారాలు కూడా చేయలేక పోతున్నారని తేల్చింది. నిర్ణీత విద్యా ప్రమాణా లు లేకపోవడం అనేది పాఠశాలల స్థాయికే పరిమితంకాక అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ అర్హత కలిగిన వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు సరి పడిన సామర్థ్యం ఉంటు న్నట్లు పారిశ్రామిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యున్నత ప్రమా ణాలు గల 200 విశ్వ విద్యాలయాల్లో భారతదేశానికి చెందినవి ఒక్కటి కూడా లేదు.వివిధ దేశాల్లోని విద్యార్థుల స్థాయినీ బేరీజువేసే అంతర్జాతీయ సంస్థ (పిఐఎస్‌ఐ) జాబితా నుంచి భారతదేశం ఆరేళ్ల క్రితమే తప్పుకున్నది. ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపో తున్నందున మన దేశంలో విద్యా సంస్థల ప్రమాణాలను కొలిచే వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభు త్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నది. అమెరి కాలోని సిలికాన్‌ వ్యాలీలోని సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో అత్యధికులు భారతీయులేనని, దేశ దేశాల్లో మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఒరిగేదే ముంది. ‘’ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత’’ అన్నట్లుగా ఉంది.కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంలో ప్రతికూల పరిణామాలు పెరిగి పోతున్నాయి. సమాజాభివృద్ధికి తోడ్పడే శాస్త్ర సాంకేతిక రంగాలను విస్మరిస్తూ మూఢ విశ్వా సాలను ప్రచారంలోకి తెస్తున్నారు. పదమూ డేళ్ళ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోప ణలతో మూ డేళ్ళ నుంచి జైలులో ఉంటున్న ఆశారాం బాపు జీవిత కథను ఆదర్శ పురుషుల జాబితాలో భాగంగా రాజస్థాన్‌లో ఉపవాచ కంగా ఉపయోగిస్తున్నారు. అదే పుస్తకాన్ని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 10వ తగరతి విద్యార్థులకూ పంచిపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల ప్రార్థనా సమయంలో సూర్యనమస్కా రాలు చేయిస్తు న్నారు. ఆ విధంగా చేయని మహా రాష్ట్రలోని ఒక టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ పొందాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బడిపిల్లల మధ్యా హ్న భోజన పథకంలో కోడిగుడ్డును నిషేధించింది. చీర, జాకెట్‌ మాత్రమే ధరించాలని గుజరాత్‌ ప్రభుత్వం మహిళా టీచర్ల వస్త్రధారణపై ఆంక్షలు విధించింది. ఈ విధంగా విద్యా రంగంలో హిందూత్వ ఎజెండాను జొప్పిస్తూ దళితులూ, క్రిష్టియన్‌లు, ముస్లిం విద్యార్థులు, టీచర్లను లొంగదీసుకొనేందుకు హిందూ త్వ చర్యలు చాపకింద నీరులా అల్లుకుంటున్నాయి.
నూతన విద్యావిధానం-2015 పేరుతో కేంద్ర విద్యాశాఖ చేస్తున్న బూటకపు సంప్రదింపుల తతంగం మరింత ఆందోళన కరంగా ఉంది. ఉన్నత, సాంకేతిక విద్యలతోపాటు పాఠశాల విద్యను కూడా పబ్లిక్‌-ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌కు ఎగదోస్తు న్నది. విదేశీ విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకూ భారతీయ విద్యార్థులను బలిచేసే వినాశకర బిల్లులతో ఎదురుచూస్తోంది. విద్యారంగం నుంచి ప్రభుత్వాలను తప్పించేందుకు ఎన్నికల కమిషన్‌ లాంటి స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయా లనే ప్రతిపాదనను ‘’శిక్షా సంస్కృతి ఉత్థాన్‌ న్యాస్‌’’ (ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ) అనే సంస్థతో ముందుకు తెస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో విద్యకు నిధులను భారీగా కోతకోయటం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత దివాళా తీసే పరిస్థితి తయారైంది. ప్రయివేట్‌ విద్యావ్యాపారం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. విద్యారంగంలో ప్రబలిపోతున్న మతోన్మాద ఎజెండాతో, ప్రయివేట్‌రంగంలోని విద్యావకాశాలతో అనైక్యతా పరిణా మాలు ప్రబలే అవకాశం ఉంది. హిందూత్వ పాఠాలతో మతాల మధ్య విభజనకు దారితీస్తుంది. ప్రయివేట్‌ కార్పొరేట్‌ కాలేజీల్లో సంపన్నులు, పై కులాల పిల్లలు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, గిరిజనులు, బిసిల పిల్లలే మిగిలిపోవటం విద్యారంగంలో ఆధునిక అంటరానితనంగా తేలిపోతోంది. ఈ రెండు పరిణామాలతో భావిభారత పౌరుల్లో సమైక్యతా భావజాలాన్ని ప్రోది చేయాల్సిన విద్యా విధానమే విచ్ఛిన్నకర శక్తిగా మారే ప్రమాదం పొంచివున్నది. అది మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆకాంక్షలకు అపచారం చేసినట్లు కాగలదు. కనుక భారతీయుల సమైక్యతా సాధనంగా విద్యను వికసింపజేస్తేనే తొలి విద్యామంత్రికి నిండు నివాళి అర్పించినట్లు అవుతుంది. అందుకు అనువైన విద్యావిధానం కోసం ప్రత్యేక కృషి జరగాల్సిన అవసరం ఉన్నది. -(వ్యాసకర్త ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు)/ వ్యాసకర్త యుటిఎఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి,
-(జి.వెంకటేశ్వరరావు)