పసిడి బాల్యమంటే అదేనా..?
ఆ ఇల్లంతా బొమ్మలే. రంగుల పుస్తకాలే. ఫోన్ల నిండా పిల్లల ఫొటోలే. స్టోరేజీ నిండా మ్యాజిక్ వీడియో మిక్స్‌లే. ఇప్పుడు పిల్లల్ని సెలబ్రెటీల కన్నా గొప్పగా పెంచేస్తున్న తీరు పెరిగింది. ప్రతిదీ కొనివ్వడం వరకే తల్లిదండ్రుల, కుటుంబ పెద్దల అభిమానానికి ఓపిక. చిన్నారులతో కొన్ని విలువైన సమయాల్ని గడిపే తీరికే లేదు. వెలకట్టలేని పసిదనాన్ని అమ్మకమంటూ బోర్డులు పెట్టేసే టారు కొట్ల ముందో, థీమ్డ్ బడుల వద్దో పెద్దలు తచ్చట్లాడుతున్నారు. బాల్యాన్ని సెలబ్రేట్ చేయడమంటే.. ఎవరో అమ్ముతున్నది పిల్లలకు కొనివ్వడమనే అనుకుంటున్నారు. పసిడి బాల్యమంటే అదేనా..?
పిల్లలకు ఖరీదు తెలీదు. డాడీ.. అప్పుచేసి డ్రోన్ కొని రిమోట్ చేతిలో పెట్టక్కర్లేదు. దగ్గరుండి న్యూస్‌పేపర్‌తో పతంగి తయారుచేసి ఎగరేస్తే చాలు. మబ్బుల్ని పట్టుకునేంత ఎత్తుకు చిన్నారుల ఆనందం ఎగురుతుంది. కానీ, పెద్దలకు టైంలేదు. సోషల్ మీడియాలో అటెండెన్స్ లేటవుతుంది. అటెన్షన్ లాస్ అవుతుంది. బాలలకు విలువ అర్థం కాదు. కాస్ట్లీ చాక్లెట్లని మమ్మీ హ్యాండ్ బ్యాగ్‌లోంచి తీసి ‘సర్ప్రైజ్’లివ్వకర్లేదు. తను తినే అన్నం ముద్దల్లో ఒకటి పిల్లల నోట్లోను పెట్టేంత నిదానంగా తింటే చాలు. కానీ, పెద్దలతో బిజీ బతుకు. వర్క్ పెండిరగ్లో పడుతుంది. టీమ్‌లో పేరు వెనుకబడుతుంది. చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి. తండ్రి చాటుకు పరుగెత్తి గోరు ముద్దల అల్లరి చేసే పిల్లలకు… సొంతంగా భోజనమెలా చేయాలో నేర్పిస్తామంటూ ఎల్కేజీ సిలబస్‌లో కలిపేసుకున్న ప్లేస్కూళ్లు పెరిగాయి. పేరెంట్స్‌కు వంటింట్లో సాయమెలా చేయాలో కూడా మంచిపాఠమే కానీ, తాము మిగిల్చిన కాలాన్ని పెద్దలు టచ్‌స్క్రీన్‌కు బదిలీ చేస్తే పిల్లలేం కావాలి? ఇదివరకు బడి ఎగ్గొట్టేందుకు పిల్లలకు దొంగ జ్వరాలొచ్చేవి. కడుపు నొప్పి వచ్చేది. కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు ఓ పూట పని మానుకుని తమ వద్దే ఉంటారని పిల్లలు జబ్బు చేస్తున్నారు.
విరిగిన బొమ్మలు
సురేష్‌కు ఫేస్బుక్ ఓ లోకం. అందులోనూ అల్లరి చేసే పిల్లల పేజీల్నీ ఫాలో అవుతుంటాడు. ఫన్నీ వీడియోలు చూస్తూ పడిపడీ నవ్వుతుంటాడు. పనిచోట ఇది నడవదు కనుక, ఇంటికెళ్లే ప్రయాణంలో ఫోన్‌ను మెడ తిప్పకుండా చూస్తుంటాడు. తీరా ఇంటికెళ్లాక పడుతూ లేస్తూ ఎదురొచ్చే కూతురిని అంతెత్తున ఎగరేసి ఎత్తుకుని, ముద్దిచ్చి మీద నుంచి దింపేస్తాడు. చకచకా రిఫ్రెష్ అయ్యి మళ్లీ ఫోన్ పట్టుకుని ఓ మూలకు చేరుతాడు. కూతురొచ్చి ఎంత బన్నీ లాగినా ‘2 మినిట్స్ తల్లీ.. 2 మినిట్స్’ అంటూ రెండు గంటలైనా వదలకుండా ఫోన్‌తోనే గడిపేస్తాడు. చిన్నారులకు ఖరీదు తెలీదు. విలువ అర్థం కాదు.. అలానే, గుర్తు ఉండదు కూడా. ఇలా ఎన్నిరోజుల్నుంచి తండ్రి పట్టించుకోకున్నా ప్రతి సాయంత్రం కూతురు అలానే ఎదురుచూస్తుంటుంది. మౌనంగా తండ్రికి దూరం జరిగి ఒక్కతే.. విరిగిన బొమ్మను మరింత విరగ్గొడుతూ మూలన కూర్చుని ఆడుకుంటుంది. ఇదో భరించలేనంత ఒంటరితనం. ఆఇంటి అట్టపెట్టె నిండా ఇలాంటి విరిగిన బొమ్మలెన్నో. అవెందుకు అలా విరిగిపోతున్నాయనే పట్టింపే లేకుండా మరో బొమ్మతో మరో వీకెండ్ దాటేస్తాడు సురేష్.
అతకని మనసులు
సంధ్యకు పనే ఓప్రపంచం. అందులోనూ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ర్యాట్ రేస్‌లో చలోమంటుంది. ఒక పనిచేసే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులు పూర్తిచేసేంత శక్తిని నింపుకుంటుంది. పనిచోటే ఇది నడవదు కనుక ఇంటికెళ్లేపుడు ఇవే ఆలోచనల్ని వెంటతీసుకెళుతుంది. తీరా ఇంటికెళ్లాక కళ్లూమూస్తూ నిద్రకళ్లతో తూలుతూ వచ్చే కొడుకుని గట్టిగా హత్తుకుని తల నిమిరి పక్కకు జరుపుతుంది. చకచకా డిన్నర్ వగైరా కానిచ్చి ఫైళ్లో, మెటీరియలో ముందేసుకుని హాల్ మధ్యకు చేరుతుంది. కొడుకొచ్చి ఎంత చేయిలాగినా ‘అయిపోయింది.. అయిపోయింది’ అంటూ అర్ధరాత్రైనా వదలకుండా పనితోనే గడిపేస్తుంది. చిన్నారులకు పట్టింపు ఉండదు కదా! ఎంత కాలం నుంచి తల్లి తెలీకుండానే పనిలో కూరుకుపోయినా ప్రతి రోజూ కొడుకు అలానే వేచిచూస్తాడు. అమ్మ చెప్పే బైబైలతో తలుపునో, గేటునో బలంగా తన్ని ఒంటరిగా టీవీ సెట్కో, తన లోకానికో అతుక్కుపోతాడు. ఇదో చెప్పలేనంత ఒంటరిభావం. ఎన్నో ఇళ్ల గదుల నిండా ఇలాంటి అతకని మనసులెన్నో. అవెందుకు ముక్కలవుతున్నాయనే పట్టింపే లేకుండా మరో ప్రాజెక్ట్‌తో వీకెండ్ మొదలెట్టేస్తుంది సంధ్య.
దగ్గరుండి నేర్పాలి
దారెంట ఓగ్యాస్‌బెలూన్ బండి కనిపిస్తే.. లోనున్న పిల్లలు అడిగి మారాం చేయకముందే కొని తీసుకెళ్తున్నారు. కొన్ని రోజులకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లన్నీ చప్పబడిపోయి.. పిల్లల్లో అస్సలు స్పందన ఉండని పరిస్థితి తయారవుతుంది. జేబులు మరింత పెద్దవి చేసుకుని మరింత పెద్ద బహుమతులు, ఖరీదైన సర్ప్రైజ్లు ఇవ్వడం వరకే నేటి చాలామంది పేరెంట్స్ అవగాహన. దానికోసం మరింత ఉద్యోగాలకు, పనులకు అంకితమవడం.. చేజేతులారా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చెడగొట్టుకోవడం… పిల్లలకు మరింత దూరమవడం.. ఇదో ఒంటరి బాల్యపు చక్రం. వినిమయ ఛట్రంలో బందీ అయిపోయిన తమ లైఫ్‌స్టైల్‌నే చిన్నతనం నుంచే పిల్లలకూ వంటబట్టించేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఓ స్కూల్ కాంపిటీషన్లో పాల్గొన్నా చాలనుకుంటారు పిల్లలు. విజేత ఎలాగూ ఒక్కరో, ఇద్దరో ఉంటారనే విషయం వాళ్లకు తెలీకున్నా తల్లిదండ్రులకు తమ పాటో, డ్యాన్సో, ప్రసంగమో, నటనో, ఆటో.. ఏదో ఒకటి చేసి అందరూ హీరోలైపోవాలని ముందు రాత్రి నుంచే కలత నిద్రపోతున్నారు. సైకిల్ కొనిస్తే సరిపోతుందని పేరెంట్స్ ఆలోచన. దాన్ని పక్కనే ఉంటూ నేర్పించడం బాలలు కోరుకునేది. చిట్టిపాదాలు సైకిల్ పెడల్ మీద స్థిరపడేలోపు ఎన్ని విలువైన క్షణాలు, మేమున్నామనే భరోసాలు.. కుదురుకుంటాయో తెలుసా..! చేతుల్ని గాల్లోకి వదిలేసి సైకిల్ ముందుకు నడిపించడంలో ఎన్ని సాహసాలు, ఉద్వేగాలు, కేరింతలు.. పేరెంట్స్ సాంగత్యంలో కోరుకుంటున్నారో తెలుసా..! పేరెంట్సే కనుక వీలు చేసుకుంటే.. సైకిల్ నేర్పేటపుడే ఎన్నేసి బతుకు పాఠాలు పిల్లలకు తేలిగ్గా తిప్పి చెప్పొచ్చో. నడిచేపుడే రెండు చక్రాల మీద సైకిల్ ఎలా బ్యాలెన్స్ అవుతుందో అనే విషయానికి ఓరోజు ఇష్టమైన క్లాస్ చెప్పుకోవచ్చు. బురదలో పడిన సైకిల్ని సరదాగా కలసి కడుగుతూ బంధాన్ని ఎంత శుభ్రం చేసుకోవచ్చో..! వెనుకే కూర్చుని అటు హ్యాండిల్‌ని కంట్రోల్ చేయడం నేర్పిస్తూ, ఇటు పెడల్‌కు ఆసరాగా పెద్దల కాళ్లబలాన్ని అందిస్తూ.. ఒక్కరిగా కాకుండా జట్టులో ఒకరిగా ఉంటే ఏం ప్రయోజనమో విడమర్చి చెప్పొచ్చు. ఎందుకు పక్కవాడు అవసరమో చిన్నారికి ఇట్టే తెలిసిపోతుంది. మీరెన్ని పుస్తకాలు కొనిచ్చినా.. ఎన్ని క్లాసులు తీసుకున్నా… ఆవలింతలొస్తాయి గానీ, బతుకు పాఠం ఆ చిట్టి బుర్రలకు బోధపడదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్‌ల్ని చిన్న వయస్సు నుంచే ఎక్కడో కొని పరిచయం చేస్తున్న తల్లిదండ్రులు పేరెంటింగ్ పాఠాల్ని నేర్వాలి.
అఆఇఈలు అద్దెకే…
అంతంత కళ్లేసుకుని పలకనే చూస్తూ.. విరిగేంత గట్టిగా బలపాన్ని పట్టుకుని తల్లి/ తండ్రి ఒళ్లో కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లల ద ృశ్యాల్ని ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్నాం. సరిగ్గా అడుగులు కూడా వేయలేని వాడిని ఏదో మిలట్రీ ట్రైనింగ్‌కు పంపిస్తున్నట్టు బూట్లు, యూనిఫామ్, బ్యాగులతో ఏడిపిస్తూ ప్లేస్కూళ్లకు పంపిస్తున్న చిత్రవిచిత్రాల్నే ఎక్కువ చూస్తున్నాం. కిండర్‌గార్టెనే ఎక్కువనుకుంటే.. నర్సరీ, అంతకన్నా ముందే అనే వెనకబాటుకు ఇప్పటి బాల్యం బాటేస్తోంది. నిద్ర కూడా పనిష్మెంట్ అనే చోద్యం ఆ చిట్టి గదుల్లో చూస్తున్నాం. ఇల్లు అంటే ఓ భద్రభావన. తల్లి ఒడిలో ఉన్నంత హాయిదనం. దాన్ని బలవంతంగా తెగ్గోసేస్తున్నారు ఆధునిక విద్య పేరిట. ఇళ్లంటే తల్లిదండ్రులు ఒక్కరే అవ్వడమూ బాల్యానికి చెప్పలేనంత లోపమవుతోంది. అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో.. ఇంకా కుదిరితే చిన్నాన్నో, అత్తమ్మో… కలసి ఉంటే తల్లిదండ్రులు ఇంట్లో లేని లోటుని భర్తీ చేస్తారు. అఆఇఈల నుంచి మరెన్నో విషయాల్ని చక్కగా నేర్పిస్తారు. అమ్మానాన్నల్ని కాసేపైనా మరిపిస్తారు. న్యూక్లియర్ ఫ్యామిలీలకెలానూ బంధాల్ని నాన్నీలు, ఆయమ్మల పేరిట అద్దెకు తెచ్చుకునే అవస్థ తప్పదు. కానీ, ఇంట్లో మరో పెద్ద దిక్కు ఉన్నా.. డబ్బులు తగలేసి అనేక పాఠాలకు వేరే దిక్కుకు చూస్తున్న పేరెంట్స్ తిప్పలేంటో ఓ పట్టాన అర్థం కాదు. నేటితరానికి తగ్గట్టు ఇంట్లోని పెద్దలు తయారవ్వలేదనే సాకు అయితే ఉండనే ఉంది. కంప్యూటరే ఆపరేట్ చేయలేకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇంగ్లిష్‌నీ ఇరగదీసి మాట్లాడలేకపోవచ్చు.. పోటీతత్వాన్ని అరగదీసి ఎక్కించలేకపోవచ్చు.. కానీ, పిల్లలు మరింత రిమోట్‌గా, ఐసోలేట్‌గా కానీయకుండా.. నలుగురిలో ఎదిగేలా పదిమందిలో మెలగేలా చేయగలరు. ప్రతి సమస్యను, కష్టాన్ని పంచుకుంటూ, అర్థం చేసుకుంటూ చిన్ని హ ృదయాలకు జీవితం మీద ఆశ పెంచే ప్రయత్నమైతే చేస్తారు. టీనేజర్లకూ దిగులు రోగాలు, డిప్రెషన్లు, పోస్ట్‌మోడ్రనిజమ్ ఉనికిపోరు, సెలెబ్రెటీ సిండ్రోమ్‌లు చూస్తూనే ఉన్నాం. ఎన్నో బలవంతపు చావుల్ని దిగమింగలేకపోతున్నాం. వీటన్నింటికీ కారణం.. వందలాది సోషల్‌మీడియా స్నేహాల్లో ఒక్కరూ తమకు చాలా దగ్గరగా వచ్చింది లేదు. కనీసం బాధనైనా మాటల్లోనైనా పంచుకుంది లేదు. టీనేజ్ తరాన్ని రిపేర్ చేయడం అటుంచి… బాల్యం గురించి ఎంత ఎక్కువ పట్టించుకోవాలో అర్థం చేసుకోవాలి. తర్వాతి తరంవారైనా వాళ్లు మూడేళ్లైనా నిండకుండానే ఎంతటి ఒంటరితనంలోకి బలవంతంగా తోసేయబడుతున్నారో గమనించండి. ఇక్కడ అద్దెకు తీసుకునేది.. అ, ఆ, ఇ, ఈల్ని నేర్పే క్లాసుల్ని కాదు, ఇక్కడ కొనిచ్చేది పార్ట్‌టైం తోడుని కాదు… జీవితాంతం వెన్నంటే ఒంటరితనాన్ని, ఏకాకిభావనల్ని అని తెలుసుకోవాలి.
స్టేటస్ సింబల్స్, బ్రాండ్ మోడల్స్
సొసైటీలో బాగా బతుకుతున్నారని స్టాంప్ వేయించుకోవడానికి… తామెలాంటి బండి తీశారు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. ఎంత కాస్ట్లీగా లైఫ్‌స్టయిల్ ఉంటుందనేది.. స్టేటస్ సింబళ్లుగా వాడుకునేవాళ్లు. ఇప్పుడు పిల్లల్ని అందుకు వాడేస్తున్నారు. తమ ఉనికికి వారిని బ్రాండ్ మోడల్స్‌ని చేసేస్తున్నారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లినా, నలుగురితో ఓ విహార యాత్ర చేసినా… చివరకు ఏదో పని మీద రోడ్డు మీదకు వచ్చినా పిల్లల ఆహార్యం, చేష్టల మీద విపరీతమైన ఫోకస్ పెడుతున్నారు. నాలుగైదు పలుకుల ఇంగ్లిష్, అవాక్కయ్యే బ్రాండెడ్ బట్టలు, హుందాగా నడవడం, కూర్చోవడం, తిరగడం.. పిల్లలు ఇప్పుడు పిల్లల్లా ఉండటం లేదు. అల్లరల్లరిగా బాల్యం ఉండటం లేదు. పదుల కొద్దీ కామెంట్లు, వందలకొద్దీ లైకుల కోసం సోషల్ మీడియా గోడల నిండా వారిని అనేక రకాలుగా కుదించేసి, బాల్యాన్ని అందమైన బట్టల్లోకి దిగ్గొట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారంతే. పరుగులు తర్వాత కనీసం కదలకుండా ఓ మంచి పోజు కోసం సెలబ్రెటీ క్రేవింగ్‌తో నలిపేస్తున్నారంతే. కనీసం ఆఫొటో సెషన్లు సాగేంత సేపన్నా ఉండటం లేదు.. ఆతల్లిదండ్రుల దగ్గరితనం. పోస్ట్ పెట్టడం, కామెంట్లకు రిప్లైలు ఇవ్వడంతో బిజీ అయిపోతున్నారు. మూలమూలల్లో ఉన్నవారంతా ఫ్యామిలీ గ్రూప్ పేరిటో, ఇంటిపేరు గ్రూప్‌తోనో, స్కూల్ ఇయర్ గ్రూప్‌తోనో, కాలేజీ బడ్డీస్ గ్రూప్‌తోనో.. ఓచోట కలిసే చోట ఈపిచ్చి మరీ పీక్స్‌కు చేరింది. పోటాపోటీ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు ప్రతిరోజూ నడిచిపోతున్నాయి. తమ ప్రతిభ, నైపుణ్యం, విజయం, ప్రత్యేకత… వదిలేసి పిల్లల స్టేటస్‌తో తమ ఉనికిని చలామణీ చేయించుకోవాలనే ఉబలాటం చాలా ప్రమాదం. చైల్డ్ ప్రొడిగీ.. అదేనండి ఇప్పుడు బాలమేధావులే కాదు, పెద్దలకూ అసాధ్యమైన ఫీట్లని ఆటల్లోను, పాటల్లోనూ.. ఇంకా నానారకాల సరదాల్నీ సీరియస్సుగా బతుక్కి దిగ్గొట్టుకున్న పిల్లల శిక్షణ సంస్థలు ఎక్కువవుతున్నాయి. ఆకారాగారాలు, కర్మాగారాల్లోకి పిల్లల బాల్యాన్ని ముడిసరుకు చేసేసి లాభాల్ని తమ అకౌంట్లో వేసుకుంటున్నట్టే మనం దీన్ని చూడాలి. ఇప్పుడు ప్రతిచోట ప్రతి ఇంట్లో బాలకార్మికుడు కనిపిస్తున్నాడు. కానీ, వేర్వేరు రూపాల శిక్షణలతో, కొత్తకొత్త మోడల్ పేర్లతో పిలవబడుతున్న శిక్షణశిబిరాలకు తరలుతూ.
పిల్లలకు ఆటవస్తువు కావాలి, అందమైన బొమ్మ కొనాలి.. కానీ, పెద్దల తోడు, స్నేహం, ప్రేమ పక్కనే లేకుంటే బాల్యమే కాదు తర్వాతి జీవితమూ పరిస్థితులూ, ప్రభావాల చేత ఆటబొమ్మయి పోతుంది. బాల్యస్మ ృతుల నిండా ఒంటరితనపు రీలే తిరుగుతుంది. దారం కట్టిన తూనీగలు, రెక్కలు పట్టుకున్న సీతాకోకచిలుకలు, సంకెళ్లు వేసిన ఉడతలూ, గేలంకి చిక్కుకున్న చేప పిల్లలు… ఇప్పటి బాలలు. అవి వాటికి చిక్కుకుని గిజగిజ లాడుతున్నట్టే చిన్నారులూ అనేక పోటీ ప్రపంచపు శిక్షణలు, పెంపకపు ప్రయోగాలతో పిల్లల్లానే మిగిలే… గెలవలేని ప్రయత్నం చేస్తున్నారు. ఆ గేలాల్ని, సంకెళ్లనీ కొంటోంది పెద్దలు. బోనుల్లో జింకలు, ఫిష్‌ట్యాంక్‌లో తాబేళ్లు, పంజరంలో పిట్టలు…
ఇప్పటి పిల్లలు. అవి అక్కడక్కడే టపటపా కొట్టుకున్నట్టే చిన్నారులూ అనేక క ృత్రిమత్వాల మధ్య కష్టంగానే సహజాతాలకు, సహజత్వానికి దగ్గరగా ఉండే విఫలయత్నం చేస్తున్నారు. ఆ కృత్రిమత్వమంతా కొని వారి ప్రపంచంలో నింపేసేది పెద్దలే. నిజానికి బాల్యానందం కొంటే వచ్చేది కాదు, ప్రదర్శిస్తే పెరిగేది కాదు. అమ్మానాన్నలు ఆత్మీయంగా పంచాల్సింది.. ప్రేమా, స్పర్శలతో ప్రతి క్షణం పెంపొందించాల్సింది!
బాల్యం.. నాట్ ఫర్ సేల్.
ఇదీ పసిమిదనం
। ‘బాల్యమంటే, మనం తెలుసుకోలేం.. గొప్ప జ్ఞాపకాల్ని, మధుర స్మృతుల్నీ తయారు చేసుకునేదని. ఏదో సరదాగా దొర్లే ఓదశ మాత్రమే కాదది’.
। ‘మీ చిన్నారి ప్రేమించే సాధారణ హ ృదయాన్ని అలానే ఎప్పుడూ ఉండనీయండి.’
। మనం పెద్దోళ్లమైపోవాలని ఎప్పుడూ కోరుకుంటాం, కానీ చివరకి తెలుసుకుంటాం.. పగిలిన హ ృదయం కంటే.. విరిగిన పెన్సిళ్లు, పూర్తిచేయని హోమ్‌వర్క్‌లే ఉత్తమమని’.
। మీ జీవితంలో గొప్ప విషయమంటూ ఒకటుంటే అది ఆనందమయమైన బాల్యం, ప్రేమించే ఇల్లు.’
। ‘భర్తీ చేయలేనిదేదో బాల్యంలో ఉంది.’
। ‘ప్రతిమనిషిలో ఒకటిమాత్రమే ప్రత్యేకంగానిలిచే కథ బాల్యం.’
। ‘జీవిత రుతువుల్లో కన్నా బాల్యమే అత్యంత అందమైన రుతువు.’
। ‘ఎవరూ చనిపోని రాజ్యమంటూ ఉంటే అదే బాల్యం.’
। ‘ఒక్కోసారి కొన్ని చిన్నిచిన్ని సంగతులే మీ హృది గదినంతా ఆక్రమించేస్తాయి.’
। ‘ఓరోజుని ఉదయమోలా చూపిస్తుందో.. మనిషిని బాల్యమలా ఉదయిస్తుంది.’
। ‘ప్రతి వసంతంలో ప్రక ృతి విరిసినట్టే.. బాల్యం తిరిగిపూస్తే ఎంత బాగుండో కదా..!’
। ‘జీవితమంతా మనగలిగేది బాల్యమే..!’
। ‘సంగీతమని చెప్పలేని దానికి కూడా నాట్యం చేసేదే బాల్యం.’
। ‘మీ పాతింటికి తిరిగి వెళితే.. మీరు కోల్పోయిందని అనుకునేది ఆ కట్టడం కాదు, మీ బాల్యం.’
। ‘బాల్యానికంటూ దాని ప్రత్యేకమైన ద ృష్టి, ఆలోచన, భావన ఉంటాయి. మన (పెద్దల) విషయాలతో దాన్ని భర్తీ చేయా లను కునేంత మూర?త్వానికి మించింది మరొకటి లేదు.’
। ‘బాల్యమొక సంభ్రమాశ్చర్యాల ప్రపంచం.’
। ‘కొన్ని నిమిషాల బాల్యాన్ని కోల్పోతే నీ జీవితకాలమంతా ఆ విషయాన్ని మర్చిపోలేరు.’
। బాల్యాన్ని ప్రేమించే కొందరు పెద్దల మాటలివి.- అజయ్ కుమార్ వారాల