పచ్చని పొలాల్లో కాల్సైట్ చిచ్చు
‘‘ గిరిజనులకు ప్రధాన జీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ప్రతీ గిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’పచ్చని పొలాలపై కాల్సైట్ చిచ్చు రగులు తోంది. అగ్ని ఆరదూ..పురుగు చావదు చందంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్ కాంట్రాక్టర్ల(ఏపీఎం డీసీ)కాల్సైట్ మైనింగ్ ప్రభావిత గ్రామ రైతుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం జరుగుతోంది. రాజ్యాంగానికి విరుద్దంగా,పీసా చట్టం,సమత జడ్జిమెంట్లను ఉల్లంఘించి మైనింగ్ తవ్వకాలు చేపడితే సహించమని గిరిజన రైతులు ప్రతిఘటి స్తున్నారు. మరోపక్క మైనింగ్ కాంట్రాక్టర్ల మైనింగ్ ప్రభావిత గ్రామాల్లోని గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించి వారిలో వారికి వివాదాలు పెట్టి కాల్సైట్ తవ్వకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వివాదంపై ఇటీవల మూడు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన గ్రామసభ దీనికి తార్కాణం. విశాఖ జిల్లాలోని అనంతగిరి మం డలం కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామా ల గిరిజన ప్రజల మధ్య కాల్సైట్ మైనింగ్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తు న్నారు. ప్రభు త్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దుచేసి స్థానిక గిరిజన సొసైటీలకే మైనింగ్ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు గ్రామసభలో ప్రతిఘటించారు. తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతంగా అమలు చేయాలని గ్రామసభ సాక్షిగా కోరారు. మైనింగ్ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు. సమతజెడ్జిమెంట్, పీసా చట్టం,అటవీహక్కులచట్టం, నియమగిరి జడ్జెమెంట్ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగ బద్దమైన చట్టా లను వ్యతిరేకించి.. మైనింగ్ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసుల హక్కులు, మైనింగ్ తవ్వకాలపై పూర్వంనుంచి సమత పలు ఉద్య మాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం,అధికార యంత్రాంగాలు కంచెచేను మేసే చందంగా వ్యవహరింస్తోందని గ్రామసభ లో గిరిజనరైతులు ధ్వజమెత్తారు. ఈప్రాంతం లో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు, అమయక త్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయ కత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కాల్సైట్ లీజులపై ఏపీఎండీసీ కుటలనీతి ఏజెన్సీలో కరకవలస, రాళ్లగరువు, నిమ్మలపాడు పరిసరాల్లో సుమారు 125 ఎకరాల్లో మేలు రకం కాల్సైట్ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్ ఉంది. వీటిని చేజిక్కించుకోవడానికి ఐదు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగు తూనే ఉన్నాయి. 1990ల్లో బిర్లా కంపెనీ నిమ్మలపాడు పరిసరాల్లో కాల్సైట్ తవ్వకాలకు లీజులు పొందింది. స్థానిక గిరిజనుల ఉపాధి, వ్యవసాయం,జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజ నేతరులకు లీజులు ఇవ్వరాదని..ఇంకా గ్రామసభ తీర్మానం లేకుండా లీజులు ఇవ్వడం చెల్లదని సమత స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బిర్లాకు ఇచ్చిన లీజులు రద్దు చేసింది.తర్వాత 1995లో ఏపీఎండీసీ నిమ్మలపాడు పరిసరాల్లో 20 హెక్లార్ల వరకు లీజుకు తీసుకుంది. అప్పటి నుంచి వాటిని ఇతరులకు లీజుకివ్వడానికి ప్రయత్నిస్తోంది. 2015లో టెండర్ ఆహ్వానిస్తే స్థానికంగా ఉండే అభయ గిరిజన మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించడంతో రద్దు చేశారు. ఆ తర్వాత అదే సొసైటీ తమకే ఆ గనులు లీజుకి వ్వాలని నేరుగా ఏపీఎండీసీకి దరఖాస్తు చేసు కుంది. దానిని పక్కనపెట్టి 2016లో 5.6 హెక్టార్లలో కాల్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీ టెండర్లు ఆహ్వానించింది. అయితే బిడ్డింగ్‌లో ఎల్-1, ఎల్-2గా నిలిచినవారు గనులు తీసుకునేందుకు ముందుకురాలేదు. అభయ సొసైటీ ఎల్-3గా వచ్చింది. అయినప్పటికీ దానికి ఖరారు చేయలేదు. అప్పటి నుంచి గనుల కోసం ఈ సొసైటీ దరఖాస్తు చేస్తున్నా ఏపీఎండీసీ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత నిమ్మలపాడులో 8.725 హెక్టార్ల విస్తీర్ణంలో కాల్సైట్ తవ్వకాలకు బినామీల ముసుగులో రైజింగ్ లీజులు అప్పగించడంపై స్థానిక గిరిజన సొసైటీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
న్యాయబద్దమైన నష్టపరిహారం
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నిమ్మల పాడు ఖనిజ తవ్వకాల కోసం నిమ్మలపాడు నుంచి డముకు వరకు 25 కిలోమీటర్ల దూరం నిర్మించిన రోడ్డు కారణంగా గిరిజనుల భూములు కోల్పో యారని వాటికి న్యాయబద్దమైన నష్టపరిహారం చెల్లించాలని సమత మరోసారి పోరాటం చేసింది. రోడ్డు నిర్మాణం మూలంగా చాలా మంది గిరిజన రైతుల భూములు రోడ్డు నిర్మాణంలో కలసిపో గా, రైతులు పెంచిన పెద్దపెద్ద వృక్షాలు నేలమట్టమయ్యాయి. చట్టప్రకారం వాటి నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ తది తర ప్రభుత్వశాఖల ద్వారా భూములు,చెట్లు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇప్పిం చింది. ఈఉద్యమంలో సమతతో పోరాటం చేసిన వారిగ్రామాల్లో రోడ్డు వెడల్పు తగ్గించి నిర్మించారు.నష్టపరిహారం సంపూర్ణంగా లభిం చింది. పోరాటంలో పాల్గోనని గ్రామాల్లో రోడ్డు వెడల్పుపెంచారు.వారి నష్టపరిహారం లభిం చలేదు.ఈ నేపథ్యంలోనే సమత తీర్పుతో బిర్లాక ంపెనీ తన లీజులను ఉపసంహరించుకొని ఈ రెండు లీజులను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపీఎండీసీ)కి అప్పగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలీజులు ఏపీఎండీసీ వద్దనే ఉంచుకుందనిగానీ, సొంతంగా మాత్రం ఖనిజతవ్వకాలు చేపట్టలేదు. సమత తీర్పును అనుచరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం స్థానిక గిరిజన సొసైటీలకు మైనింగ్ చేసుకోవడానికి లీజులు ఇవ్వాలి. కానీ ఏపీఎండీసీ స్థానిక గిరిజన సొసైటీకి ఇవ్వడంలేదు.
రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలి
కాల్సైట్ మైనింగ్ తవ్వకాలు రాజ్యాంగ బద్దంగా చేపట్టాలి. పీసా,అటవీహక్కుల చట్టం,సమత జడ్జిమెంటును అనుసరించి గిరిజన రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వ్యవహరించాలని సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి గ్రామసభలో ఏపీఎండీసీ అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. తరతరాల నుంచి సాగుచేసు కుంటున్న వారి జీరాయితి భూముల్లో వారి అనుమతులు లేకుండా మైనింగ్ తవ్వకాలు చేపడితే చట్టాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. మైనింగ్ కాంట్రాక్టర్ గిరిజనులకు,భూమిగల రైతులకు ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే అవి లిఖిత పూర్వకంగా ఒప్పందాలు కుదుర్చు కోవాలి. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా మైనింగ్ తవ్వకాలు చేపట్టాలి. పర్యావరణం, నీటివనరులు,అటవీ జీవవైధ్యానికి నష్టం జరగకూడదు. గ్రామసభలో తీసుకున్న తీర్మాణాలకు అనుగుణంగానే ఏపీఎండీసీ, కాంట్రాకర్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజాభిష్టం లేకుండా మైనింగ్ తవ్వకాలు చేపట్టరాదని తెలిపారు. పచ్చని పంట పొలాలు నాశనం చేయొద్దు..ఇక్కడ మైనింగ్ తవ్వకాలు చేపడితే గిరిజన ప్రజల జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. మూడు గ్రామాల గిరిజనులంతా వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాంట్రాక్టర్ గిరిజనులకు ఏదైతే హామి ఇస్తామని అంటున్నారో ఆ అంశాలన్నీ లిఖిత పూర్వకంగా గ్రామసభలోనే గిరిజన రైతులకు చెప్పి ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కోన్నారు.-గునపర్తి సైమన్