నూతన మంత్రివర్గం..సరికొత్త సవాళ్లు

విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రి వర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్తమాత్రులుగా మార్చబడిన స్థితి.
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పుడు ఎడతెగని చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవుల చుట్టూ రాజకీయాలు, మీడియా కథనాలు పరిభ్రమించే ప్రస్తుత కాలంలో ఇది అనూహ్యమేమీ కాదు. తన మంత్రివర్గాన్ని సగం పదవీ కాలం తర్వాత మారుస్తానని జగన్‌ తమ మొదటి లెజిస్లేటివ్‌ సమావేశంలోనే ప్రకటించారు. కనుక మంత్రులుగా చేరిన వారంతా ఆ షరతుకు లోబడే చేరారన్నది స్పష్టం. నూటయాభై స్థానాలతో ప్రభంజనం సృష్టించిన ఆరంభ ఘట్టం అది. నాయకుడూ శాసనసభ్యులూ కూడా పాలనా పగ్గాలు చేపట్టాలనే ఉత్సుకతతో వున్న దశ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పరి స్థితి ఎలాగూ వుండదు. ప్రస్తుతం విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర విధానాల కారణంగా ధరల మంటలు, అప్పుల ఊబి, అమరావతి ప్రతిష్టంభన ఒకటేమిటి అనేకానేక సవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ను వెంటాడుతున్న స్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హుకుంలు వాటిని ప్రశ్నించకపోగా అత్యుత్సాహంగా సమర్థిస్తూ తనూ ఒక వేటు వేసే జగన్‌ ప్రభుత్వ విధానాలు ఇందుకు మూల కారణంగా వున్నాయి. అందుకే ముంచుకొచ్చిన కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేసినా అనివార్యంగా ఇప్పుడు ఆ పునర్యవస్థీకరణ ముందుకొచ్చి కూచుంది. ఇది నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి స్వీయకల్పితం. ఒక ముఖ్యమంత్రి సగం కాలానికే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తర్వాత మారుస్తానని చెప్పడం ఎప్పుడూ జరగలేదు. కనుక దీనికి ఇంతకు ముందు నమూనా ఏదీ దేశంలో లేదు. దాని ప్రభావాన్ని చెప్పడానికీ ఉదాహరణ లేదు.
మూడు దొంతరలు, విధాన ప్రశ్నలు
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వుండగా బడ్జెట్‌ లీకైందంటూ మొత్తం మంత్రివర్గాన్ని సామూహికంగా బర్తరఫ్‌ చేసి అందరి రాజీనామాలు తీసుకున్న ఉదంతంతో కొన్ని పోలికలున్నా అది వేరే తరహా సందర్భం. దాని ఫలితంగా ఆ పార్టీలో చీలిక వచ్చింది, అప్పటికే ఆ ప్రభుత్వంపై వున్న అసంతృప్తి మరింత పెరిగి ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఓటమితో సహా ఆ పార్టీ పరాజయం పాలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల తర్వాత రెండు మాసాల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయనేలేదు. కేవలం తనూ ఉప ముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ మాత్రమే ప్రభుత్వంగా నడిపించారు. కేంద్రంలో ప్రధానిమోడీ తన మంత్రివర్గ సహచరులలో దాదాపు 70శాతం మందిని దశలవారిగా తప్పించారు. అంతేగాక గతంలో కాంగ్రెస్‌ చేసినట్టే రాష్ట్రాలలో తమ ముఖ్యమంత్రులను వరుసగా మార్చేశారు. ఏతావాతా జాతీయ పాలకవర్గ పార్టీలలో ముఖ్యమంత్రులకూ ప్రాంతీయ పార్టీలలో మంత్రులకు పదవులు ఎప్పుడైనా ఊడిపో వచ్చనే భావం బలపడిరది. అయితే జగన్‌ నేరుగా అందరినీ మార్చేస్తానని ముందే ప్రకటించి మరీ పాలన ప్రారంభించడం కొత్త వ్యూహం. దాని అమలు ఎలా వుంటుంది, అనంతర ప్రభావాలు ఏమిటి అన్నదే ఇప్పుడు కీలక చర్చగా తయారైంది. ఏప్రిల్‌ 7న జరిగిన క్యాబినెట్‌లో పాత మంత్రులందరూ రాజీనామా చేయడం,వాటిని గవర్నర్‌ ఆమోదించడం జరిగిపోయింది. అయితే వారిలో కొనసాగే వారెవరు,ఎందరు అనే రసవత్తర కథనాలు మాత్రం నడుస్తూనే వున్నాయి. సామాజిక సమీకరణాల రీత్యా కొందరిని కొనసాగించడం తప్ప అత్యధికులను మార్చవలసి వుంటుందని ఆయన మొదట అన్నారు. అనుభవం కోసం కొందరు కొనసాగుతారన్నారు. చివరి సమావేశంలోనూ సంఖ్య చెప్పకపోయినా ఇలాంటి మాటలే మాట్లాడినట్టు మంత్రులు చెబుతున్నారు. అయిదారుగురు పాతవారు వుండొచ్చన్న లెక్క కాస్త పెరిగి పది పైన ఇప్పుడు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు ఆలస్యంగా చేరిన వారు కాగా ఒకరిద్దరు ఆ వర్గాలకు ఏకైక ప్రతినిధులుగా వున్నవారు. ఇవి కూడా ఊహాగానాలు తప్ప ఆధారం లేదు. పదిమందికి పైగా కొనసాగిస్తే అప్పుడు తప్పించబడే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం మరింత అధికమని అధినేతకూ సలహాదారులకు తెలుసు. తప్పించిన మంత్రు లను జిల్లాలకు లేదా ప్రాంతాలకు సమన్వ యకర్తలుగా పంపి వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యత అప్పగిస్తామన్నారు. మరి వారికి సంస్థాగత నాయకత్వం అప్పగిస్తే కొత్తమంత్రుల కాళ్లకు పగ్గాలు వేసినట్టు కాదా. ఈ రెండు తరహాలలో దేనికీ చెందకుండా ఏపదవీ బాధ్యతలు దక్కని మూడో తరహా నాయకుల పరిస్థితి ఏమిటి? ఈ విధంగా వైఎస్‌ఆర్‌సిపి లోనూ ప్రభుత్వంలోనూ మూడు దొంతరలు ఏర్పడే సూచనలున్నాయి. ఈ వైరుధ్యాలను సర్దుబాటు, సమన్వయం చేయడం తేలికేమీ కాదు. ఎన్నికల సన్నాహాలు, సమరం మొద లైనట్టే మాట్టాడుతున్న ముఖ్యమంత్రి తీరు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నది.తాము వచ్చేసినట్టే మాట్టాడుతున్నారు. కనుక కొత్త మంత్రులు లేదా మంత్రివర్గం ఆది నుంచి ఎన్నికల వేడిలోనే పని చేయవలసి వుంటుంది. ముందే చెప్పినట్టు ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించే ప్రచారం చేసుకుంటున్నా ప్రజలూ ప్రతిపక్షాలూ సమస్యల తీవ్రతపై ఉద్యమిస్తున్న నేపథ్యం. ఈ సమస్యలకు కారణమైన విధానాలు, పని విధానాలు మారకుండా కేవలం కొన్ని శాఖల మంత్రుల మొహాలు, విగ్రహాలు మార్చినంత మాత్రాన కలిగే ప్రయోజనం వుండదు. ప్రభావమూ వుండదు.
అసహనం, అవకాశవాదం
విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రివర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్త మాత్రులుగా మార్చబడిన స్థితి. నూటయాభై స్థానాలు గెలిచిన జగన్‌ ప్రభుత్వం వంటి వాటిలో ఇది మరింత ఎక్కువ. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి గురించి విమర్శించినవారే ఇప్పుడు ఆయన బలహీనపడ్డారనీ, ఆ విధంగా చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా తనపై విమర్శల గురించి కొన్ని ఆరోపణలు గురించి అసహనంతో విరుచుకు పడుతున్నారు.గత రెండు రోజులలో టిడిపి పైన దాన్ని బలపర్చే మీడియా పైన ఆయన వ్యాఖ్యలు ఇందుకు పరాకాష్టగా వున్నాయి. దీనికి ముందు ఢల్లీి వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలసి వచ్చిన జగన్‌ బిజెపిని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడం లేదు. బిజెపి మిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను కూడా టిడిపి దత్తపుత్రుడుగా విమర్శిస్తున్నారు! వామపక్షాలు మినహాయిస్తే ఈ ప్రాంతీయ పార్టీలేవీ మోడీ సర్కారు రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నించలేకపోవడం నష్టదాయకం. పైగా ఆ బిజెపినే ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వాధినేత మాట్లాడరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని భావించే జగన్‌… ఆయన, ఆయన పార్టీ టిఆర్‌ఎస్‌…కేంద్రంపై పోరాడుతున్న తీరును గమనించడం లేదా?
దిద్దుబాటుకు ఒక అవకాశం
మళ్లీ పునర్వవస్థీకరణకు వస్తే ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, ఎప్పుడూ తమ మాటే చెల్లుతుందనుకోవడం పొరబాటని ఈ మంత్రివర్గ వ్యవహారమే స్పష్టం చేస్తున్నది. లేకపోతే ఇంత కసరత్తు, ఇన్ని మల్లగుల్లాలు అవసరమై వుండేవి కావు. సామాజిక లెక్కలతో పాటు మంత్రులలో కొందరు అనుభవజ్ఞులు, బలాఢ్య ధనాఢ్య వ్యక్తులు, విశ్వసనీయత గలవారు కొనసాగడం సహజం. కేవలం నోరు జోరు బట్టి కొందరు వుంటారని, కొందరు వస్తారని వేసే లెక్కలు నిలవకపోవచ్చు. ఆ విధంగానే ప్రచారం చేసుకుంటున్న పేర్లు కూడా వున్నాయి. ఈ దెబ్బతో వైసిపి లో ముసలం పుడుతుందని, ముక్కలైపోతుందని ఎదురు చూసే రాజకీయ ప్రత్యర్థులూ వున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అంత భారీ నాటకీయ మార్పులు వుండకపోవచ్చు. పాలకులు ఎప్పుడూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తారు. వారిలో ఒకరు మూరు?లనీ మరొకరు దార్శనికులనీ చెప్పడం అనవసరం. వ్యక్తులను బట్టి తరతమ తేడాలున్నా రాజకీయాలలో వర్గ ప్రయోజనాలే శాసిస్తుంటాయి. నాలుగు వందల మంది ఎంపిలను తెచ్చుకున్న రాజీవ్‌గాంధీకి ఫిరాయింపుల నిరోధకచట్టం కావలసి వచ్చింది. నూట యాభై మంది ఎంఎల్‌ఎలు వున్న జగన్‌ మధ్యలో మార్పు ద్వారా ఎక్కువమందిని సంతృప్తిపర్చాలని తలపెట్టారు. వాస్తవంలో ఇది అసంతృప్తి పెరగడానికి కారణం కావచ్చు. తనే కీలకం, మిగిలిన వారు నిమిత్తమాత్రులనే సంకేతం కూడా ఇందులో వుండొచ్చు. తమ పార్టీలోనూ బయిటివారిలోనూ స్పందనలను తెలుసుకోవడం కోసం గత వారం రోజులూ రకరకాల లీకులతో ఊహాగానాలు నడిపిం చారు. దీన్ని కేవలం వ్యూహాత్మక చర్యగానూ ఎన్నికల ఎత్తుగానూ హడావుడి పెంచితే ఉప యోగం వుండదు. ఈ అవకా శాన్ని తమ తప్పు లు దిద్దుకోవడానికి ఉపయో గించుకుంటే ఈ కసరత్తుకు కాస్తయినా ప్రయోజనం వుంటుంది. ప్రజల స్పందనా దాన్ని బట్టే వుంటుంది. ఇక ఆశావహులు, నిరాశోపహతుల తదుపరి అడుగులు ఎలా వుండేది ఆచరణలో చూడ వలసిందే. ముందే ప్రకటించిన ఈతతంగం నుంచి అంత కన్నా ఆశించవలసిందీ అభిశం సించవలసిందీ మరేమీ వుండదు. ఎప్పుడైనా సరే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వా మిక పునాది కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు (ప్రజాశక్తి సౌజన్యంతో…)